సాధన చతుష్టయాన్నికలిగిన యోగ్యుడు శ్రవణ, మనన, నిదిధ్యాసలు చెయ్యాలని చెప్పబడింది.
శ్రవణము
వేదాంత శాస్త్ర జ్ఞానాన్ని స్వయంగా చదివి గాని, గురుముఖత గాని విని వేదాంత
శ్రవణం చెయ్యాలి. మహావాక్యాల అర్ధాన్ని చక్కగా తెలుసుకోవాలి. శ్రవణ మాత్రం చేతనే
యోగ్యుడైన వానికి మోక్షం కలుగుతుందని శ్రీ ఆదిశంకరులు చెబుతారు. కాని అట్టి వారు
అరుదుగా ఉంటారు.
మననం
విన్నవిషయాన్ని పలు మార్లు గుర్తుతెచ్చుకోవడాన్ని మననం అంటారు. వినిన
అర్ధంయొక్క సాధక బాధకాలను చక్కగా విచారించి, నిశ్చితమైన అభిప్రాయానికి
వచ్చి, దాన్ని అనేక మార్లు మననం చెయ్యాలని అర్ధం. నేను శరీరాన్ని గాని, ఇంద్రియాలను గాని, మనస్సును గాని, బుద్ధిని గాని, అహంకారమును గాని కాదని నిశ్చయానికి రావడం. తాను జనన మరణ రహితమైన
అత్మయేనని తెలిసికొని, ఆ విషయాన్ని ఎప్పుడూ మరువకుండా ఉండాలి. ఈ వాక్యాల భావం
మనస్సులోనిండి, శరీరంలో ప్రతీ అణువులోను ప్రవేశించాలని పెద్దలు అంటారు. ఇలా మననం చెయ్యడాన్ని నిదిధ్యాస కలిగే వరకు చెయ్యాలి.
నిదిధ్యాస
శ్రద్ధగా ఏకాగ్రచిత్తంతో మననం చెయ్యడం వల్ల నిదిధ్యాస సిద్ధిస్తుంది.
నిదిధ్యాస సమాధి స్థితికి ప్రారంభ దశ. క్రమంగా ఇది పరిపక్వం చెంది సమాధి
అనబడుతుంది. ఇది లభించడం చేత తత్వజ్ఞానం కలుగుతుంది. తత్వజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానమని అర్ధం.
ఈవిధంగా ముముక్షువై గురువును
ఆశ్రయించి, అత్మస్వరూపాన్ని గూర్చిన
ఉపదేశాన్ని పొంది, తాను విన్న విషయాన్ని
గూర్చి మననం చెయ్యాలి. తగిన యుక్తులచేత ఆవిషయం చక్కగా మనస్సుకు పట్టించుకొని
ఆత్మస్వరూపాన్నే నిరంతరమూ ధ్యానం చెయ్యడం వల్ల ఆత్మసాక్షాత్కారం పొందుతాడని బృహదారణ్యకోపనిషత్తు
బోధిస్తుంది. అంచేత ఆత్మజ్ఞానం కావాలనే కోరిక గలవాడు అనవసరమైన ఇతర వాగ్వివాదాలను
విడిచిపెట్టి ఆత్మను గురించే ధ్యానం చెయ్యాలని ముండకోపనిషత్తు కూడా చెబుతోంది.
No comments:
Post a Comment