Sunday, August 26, 2012

ప్రపంచము లేక జగత్తు ఏర్పడ్డ విధానం-3


2) రెండవ విధానం
స్థూల సూక్ష్మ శరీరములు ఏర్పడే విధానాన్ని వివరించడానికి వాటికి  కారణాలైన పంచ మహాభూతాల సృష్టి చెప్పబడుతోంది. ఈ పంచ మహాభూతాలనుంచే సకల జీవరాసులూ, వాటి శరీరములు, జగత్తు ఏర్పడుతున్నాయి.గుణరహితమైన  అత్మనుండి ఆకాశం కలిగింది. పంచమహాభూతాలు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృధివి అనే ఐదు. బ్రహ్మము నుండి ముందుగా ఆకాశ తన్మాత్ర కలిగినది. దాని యందు మిగిలిన వన్నీ సూక్ష్మ రూపంలో ఉన్నట్లు చెప్ప బడింది. ఈ తన్మాత్ర నుండి ఆకాశము కలుగగా ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృధివి అనే సూక్ష్మ భూతములు కలిగాయి. ఇలా పంచ భూతాలయొక్క తన్మాత్రలు ఏర్పడతాయి. తన్మాత్రాలంటే సూక్ష్మాంశాలుగా చెప్పుకోవచ్చు.
   
ఆకాశము ఇతర భూతములు ఉండటానికి అవకాశమును కలుగ జేస్తుంది. ఒక్కో సూక్ష్మ భూతమందూ సత్వ రజస్ తమో గుణాలు మూడూ ఉంటాయి. అంటే ఆకాశమునకు సత్వ, రజస్,తమో గుణాలుంటాయి. అలాగే వాయువుకూ, అగ్నికీ, జలమునకూ, పృధివికీ కూడ ఈ సత్వ, రజస్, తమో గుణాలు ఉన్నాయి.

ఆదిశంకరుల తర్వాత అద్వైతాన్ని బోధించిన ప్రముఖులైన శ్రీ విద్యారణ్యులు, వేదాంత పంచ దశిలో సృష్టిని గురించి చెప్పేటపుడు ప్రకృతిని ప్రతిపాదిస్తూ ప్రకృతికి బ్రహ్మము కన్న స్వతంత్రమైన ఉనికి లేదన్నారు. ప్రకృతి సత్వము, రజస్సు , తమస్సు అని మూడు గుణాల సామ్యావస్థ.  జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అనే వ్యవహారానికి కారణంగా ప్రకృతి ప్రతిపాదించ బదిండి. ప్రకృతిని తీసివేస్తే సృష్టికి కారణం లేదు/తెలియదు గనుక తత్వాని గ్రహించాలి. అంతే గాని అనవసర వాదాల వల్ల ప్రయోజనం ఉండదని విజ్ఞులు చెబుతారు.

ప్రకృతి సత్వ,రజ,స్తమో గుణాలతో కూడి సమతుల్యంలో ఉంటుంది. ఈ గుణాల పరస్పర కలయిక చేత మనకు కన్పించే జగత్తు ఏర్పడుతోంది. బ్రహ్మముకన్న భిన్నంగా ఉండే  ఉనికి ప్రకృతికి లేదు. జీవుడు,జగత్తు, ఈశ్వరుడు అనే వ్యవహారానికి  ప్రకృతి మూలకారణంగా ప్రతిపాదించ బడుతోంది. అంటే వీరు ప్రతిపాదించిన ప్రకృతికీ బ్రహ్మమునకూ తేడా ఏమీ లేదనుకోవచ్చు.

సాంఖ్య దర్శనంలో ప్రకృతి కూడ పురుషునిలాగానే సర్వ స్వతంత్రమైనదని చెబుతారు. అంచేత ఇక్కడ ప్రతిపాదించబడినది బ్రహ్మమున కన్న భిన్నము కాదని అనుకుంటే తత్వం అర్ధమవుతుంది. బ్రహ్మము యొక్క చిదానంద స్వరూపంతో కలసి ఉన్న ప్రకృతి రెండు విధములుగా చెప్పబడింది. అవి
అ) శుద్ధ సత్వము - మిగిలిన ఇతర గుణములతో చేరకుండా ఉండే  సత్వాన్ని శుద్ధ సత్వము అంటారు. దీన్నే మాయ అని కూడ అంటారు. దీన్లో ప్రతిబింబించిన  బ్రహ్మము ఈశ్వరుడు.
ఆ) మలిన సత్వము-  రజస్తమో గుణాలతో కలసి ఉండే  సత్వాన్ని మలిన సత్వము లేక అవిద్య అని అంటారు.దీన్లో ప్రతిఫలించిన బ్రహ్మము జీవుడు.

{ఆవిద్య యందు రజస్తమో గుణాల హెచ్చు తగ్గుల వలన దేవతలు, పశుపక్ష్యాది జీవులూ ఏర్పడుతున్నాయి. ఈ అవిద్యకే కారణ శరీరమని పేరు. ఈ కారణ శరీరంతో సంబంధ పడిన జీవుడే ప్రాజ్ఞుడు. ప్రాజ్ఞులు సుఖ దుఖములను అనుభవించుటకు ఈశ్వరుని ఆజ్ఞచే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృధివి అనే మహాభూతములు ఉద్భవించినవి.} ఇలా పంచభూతాల సూక్షాంశాల వరకే భేదం కనిస్తుంది. అక్కడ నుంచి ఈ ప్రతిపాదనలలో భేదమేమీ లేదు.

పంచ మహాభూతములూ తమఃప్రధానమైన ప్రకృతి నుండి ఏర్పడ్డాయి. వీటి సత్వగుణాంశల నుండి వరుసగా ఆకాశమునుండి శ్రవణేంద్రియము, వాయువు నుండి స్పర్శేంద్రియము, అగ్ని లేక తేజస్సు నుండి నేత్రేంద్రియము, జలము నుండి రసనేంద్రియము, పృధివి నుండి ఘ్రాణేంద్రియము ఇలా ఒక్కొక్క దాన్నుంచి ఒకో  అంతర్ జ్ఞానేంద్రియము ఏర్పడుతుంది. అంతర అని ఎందుకు అన్నామంటే ఇక్కడ చెప్పిన జ్ఞానేంద్రియాలు బాహ్యంగా ఉండే మాంస గోళాలు కాదు గనుక. ఇవి పంచభూతాలలో ఉండే గుణాలు.

ఈ ఐదు జ్ఞానేంద్రియాల సత్వాంశాలు మొత్తం కలసి అంతఃకరణం ఏర్పడుతుంది. అంతఃకరణం విమర్శాత్మకమైన మనస్సు, నిశ్చయాత్మకమైన బుద్ది అని రెండు రకాలుగా స్వీకరిస్తారు. పైన చెప్పుకున్న అంతర్ జ్ఞానేంద్రియాల్లో ఒక్కొక్క భూతాంశమే ఉంటుంది. అంచేత కన్ను వినలేదు. నాలుక చూడలేదు. ఈ పంచేంద్రియాలూ తెచ్చే విషయాలను గ్రహించడానికి వీలుగా ఐదు భూతాల సత్వాంశలూ కలసి అంతః కరణంగా ఏర్పడి వీటన్నిటినీ గ్రహించ గలుగుతుంది.

ఇప్పుడు సూక్ష్మభూతాల యొక్క రాజసికాంశల చేత (కర్మేంద్రియములైన)  వరుసగా ఆకాశమునుండి వాక్కు ( నోటిలో నుంచి వచ్చే మాట), వాయువు నుండి చేయి (పాణి ), అగ్ని నుండి పాదము, జలము నుండి గుదము(పాయువు), పృధివి నుండి ఉపస్థ (జననేంద్రియము/గుహ్యము ) ఏర్పడుతున్నాయి. ఇవి కూడ సూక్ష్మాంశములే. మాంస గోళములు కావు. అంతరింద్రియములే. ఈ ఐదు తన్మాత్రల రజోంశములూ కలసి ప్రాణము ఏర్పడుతుంది. ఈ ప్రాణానికే ముఖ్య ప్రాణమని పేరు. ముఖ్య ప్రాణము చేసే పనుల భేదాన్నిబట్టి ప్రాణమును వేర్వేరు పేరులతో పిలుస్తారు. ఈ పంచ ప్రాణాలనూ వివేచన చేసే టపుడు ముందుగా ప్రాణము నుంచే వివేచన చెయ్యాలి. ఇవి ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము అనేవి పంచ ప్రాణాలుగా పిలవబడు తున్నాయి. ఇవి కర్మేంద్రియాల ద్వారా శరీరాన్ని నడిపిస్తాయి.

ఇంతవరకూ అన్నీ పరిశుద్ధంగా ఉన్నాయి. అంటే ఇంతవరకూ చెప్పిన తత్వాలన్నీ పరిశుద్ధంగా ఎక్కడా మిశ్రమం ( ఒకదాంతో మరోటి సంయోగం చెంద లేదు) జరుగ లేదు. అంచేత అవి సూక్షాలుగా చెప్ప బడ్డాయి. ఇప్పుడు జీవులకు స్థూల శరీరాల్ని కల్పించడానికి ; పంచీకరణం అనే ప్రక్రియ ద్వారా  స్థూలమహా భూతాలైన  ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృధివి అనే స్థూల పంచ మహాభూతాలు  ఏర్పాటు చెయ్య బడ్డాయి. జీవులు సుఖదుఖాలను అనుభవించడానికి తమః ప్రదానమైన ప్రకృతి నుండి బ్రహ్మము యొక్క సంకల్పము చేత ఆకాశము, వాయువు, అగ్ని , జలము, పృధివి అనే మహాభూతాలు ఉద్భవించాయి. జీవులు అనుభవించడానికి అన్నపానాది భోగ్య విషయాలను, వాటిని అనుభవించడానికి తగ్గ శరీరాలను సృష్టించడానికి సూక్ష్మ ఆకాశాది మహా భూతాలను( పంచ తన్మాత్రలను) పంచీకరణము చేసి; స్థూలశరీరాలను ఏర్పరచడానికి  స్థూల భూతములను కల్పించ వలసి వచ్చింది.

ఈ పంచ మహాభూతాలూ, ఇంద్రియాలు, అంతఃకరణము, ప్రాణము ఇవన్నీ పరస్పరమూ కలిసి స్థూల భూతములు ఏర్పడుతున్నాయి. ఇలా వివిధ శరీరాలను జీవరాసులను సృష్టించి నట్లుగా చెప్ప బడింది. ఈ స్థూల భూతాలచేత బ్రహ్మాండము, అందలి పదునాల్గు భువనములు, వాటికి తగిన భోగ్య విషయాలు, వాటిని అనుభవించ డానికి తగ్గ శరీరాలను పంచీకృత భూతములచే ఏర్పరచెను.

No comments:

Post a Comment