Monday, August 27, 2012

ప్రపంచము లేక జగత్తు ఏర్పడ్డ విధానం-1


సృష్టికి పూర్వం ఆత్మ ఒక్కటే ఉందనీ అదే పరమాత్మఅని, ఆ పరమాత్మ సృష్టించాలని చూసినట్లును, చూపుతోనే సంకల్పముతోనే ఈ లోకాలన్నిటినీ సృష్టించినట్లు ఐతరేయోపనిషత్తు చెబుతోంది.
అత్మ (బ్రహ్మము) నుండే క్రమంగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, ఉర్వి, ఓషధులు అన్నము, దేహములు సంభవించాయనీ, బ్రహ్మమనెడి ఆ అత్మనుంచే లోకములన్నీ ఉద్భవించినట్లుగా తైత్తిరీయోపనిషత్తు చెబుతోంది.
సృష్టికి పూర్వము సత్త మాత్రమే ఉన్నదనీ, ఇది అనేకములు కావలెనని చూసి అగ్నిని, జలమును, అండజములు మొదలైన వాటినన్నిటిని సృష్టించెనని ఛాందోగ్యం చెబుతోంది.
ఉజ్వలంగా మండే  అగ్ని నుండి నిప్పురవ్వలు అనేకములుద్భవించు నట్లు, అక్షర బ్రహ్మము నుండి చేతనములు, జడములు, వివిధములై ఉద్భవించాయని ముండకోపనిషత్తు చెబుతోంది.
సృష్టికి పూర్వము బ్రహ్మమునందు జగత్తు అవ్యాకృత రూపమున ఉండెనని, అదే దృశ్యములైన నామ రూపములచే ఇపుడు విరాట్టు మొదలగు వానియందు స్పష్టముగా ఏర్పడినదనియు, ఆ విరాట్టు నుండే మనువు, మనుష్యులు, పశు పక్ష్యాదులు ఉద్భవించెనని బృహదారణ్యకం చెబుతోంది.

ఇలా వేదాలన్నీ సృష్టి ఈశ్వర కృతమేనని చెబుతున్నాయి. అంతేకాని అదృష్టంవల్ల గాని, స్వభావంవల్ల గాని, యాదృచ్చికంగా  కాదని స్పష్ట పరుస్తున్నాయి. బ్రహ్మము తనకు భిన్నమైన జీవరూపాన్ని ఏర్పరచుకొని దేహాలలో ప్రవేశించినట్లుగా శ్రుతులు చెబుతున్నాయి.

ప్రపంచ సృష్టి విధానాన్ని గురించి చెప్పేటపుడు కొన్ని అభిప్రాయ భేదాలు మనకు కన్పిస్తాయి. వేదాంతంలో కొన్నిచోట్ల త్రివృత్కరణం అనే ప్రక్రియ ద్వారా జరిగిందని ఛాందోగ్యోపనిషత్తు లోను, బ్రహ్మ సూత్రాల్లోను పేర్కొనడం జరిగింది. మరోచోట తైత్తిరీయోపనిషత్తు,శ్వేతాశ్వరోపనిషత్తులలో పంచభూతాలనుండే సృష్టి జరిగినట్లుగా చెప్ప బడింది. స్మృతి యందు అంటే మహాభారత పురాణాలలో మరో విధంగా చెప్ప బడింది. సాంఖ్యులు ప్రకృతినుంచి సృష్టి జరిగిందనగా, వేదాంతులు పరమాత్మ నుండి జరిగిందని చెబుతారు. దీని బట్టి చూస్తే మనకు సృష్టి యొక్క రచనా విధానంలో వివిధ అభిప్రాయాలున్నట్లు  తెలుస్తోంది. వాటిని గురించి క్లుప్తంగా తెలుసు కుందాం.

1. త్రివృత్కరణం
నామరూపాలతో ఉండే జగత్తు ఏర్పడడానికి ముందు బ్రహ్మము మాత్రమే ఉండెనని చెప్పబడింది. అతడు ముందుగా తేజస్సును(అగ్ని)సృష్టించగా, ఆ తేజస్సు నుండి జలము, జలము నుండి పృధివి( అన్నము) కలిగెనని చెప్పబడుతోంది. భూమికే అన్నమని మరొక పేరు. ఈ మూడూ ఇప్పుడు తన్మాత్రల రూపంలో అంటే సూక్ష్మ రూపంలో ఉన్నాయి. ఈ సూక్ష్మ రూపంలో ఉన్న భూతములను ఒక్కోటీ రెండర్ధ భాగములు చేయబడతాయి. వాటిలో ఒక భాగాన్ని వదలి, రెండవ అర్ధ భాగాన్ని మళ్ళీ రెండు అర్ధభాగాలుగా విభజించగా
అప్పుడు  ఒక్కొక్క భూతమునకు రెండవ అర్ధ భాగమునుండి రెండేసి చొప్పున భాగములేర్పడతాయి. ఇవి పావు భాగములు. ముందర్ధభాగమునకు రెండవ అర్ధభాగమునుండి ఏర్పడిన తక్కిన భూతముల ఒక్కొక్క పాతిక భాగమును కలిపితే ముందర్ధభాగం యొక్క స్థూల భూతం ఏర్పడుతుంది. 

       అగ్ని(తేజస్సు) 1/2
             జలము 1/2
            పృధివి 1/2
     జలము1/4+పృధివి 1/4
       పృధివి1/4+అగ్ని1/4     
   అగ్ని1/4+జలము1/4
                     !                                        !                                          !        
                     అగ్ని                                 జలము                                     పృధివి

అలా అగ్ని, జలము, పృథ్వి అనే స్థూల భూతములేర్పడతాయి. ఇలా ఈ మూడు భూతతన్మాత్రల పరస్పర కలయిక వల్ల ఏర్పడిన స్థూల భూతముల  ప్రక్రియను 'త్రివృత్కరణం' అని అంటారు. ఈ స్థూల భూతాలతోనే సమస్త సృష్టి జరుగుతోందని చెప్పబడుతోంది. ఇక్కడ ఆకాశము వాయువులు నిరవయవములు గా పరిగణించబడటం వల్ల, అవి వీటిలోనే అంతర్భూతములని చూసుకోవాలి.

సూక్ష్మ భూతాంశాలైన అగ్నియందలి ఎర్రని రూపం తేజస్సు, అలాగే తెల్లని రూపం  త్రివృత్కరణం కాని ఉదకానిది(జలం). నల్లని రూపం  త్రివృత్కరణం కాని పృథ్విది. ఇలా మూడు రూపాలుగా ఉన్న తేజస్సు, జలము, పృథ్వి అనే తత్వాలే సత్యము. ఎందుకంటే ఈ మూడు తత్వాలతోనే సమస్తమూ ఏర్పడుతోంది కాబట్టి. ఇలాగే బ్రహ్మము ఆత్మరూపంలో, భూజలాగ్నులనే మూడు భూతములలోను ప్రవేశించి సృష్టికి కారణమవుతున్నట్లు చెప్పబడింది.                                                                                                 
                                                                                           (ఇంకా ఉంది 


5 comments:

  1. మంచి విషయాలు అందించారు సూర్య చంద్ర గారు . ధన్యవాదములు

    ReplyDelete
  2. మీ అభిమానానికి ధన్యవాదములు.
    సుర్యచంద్ర గోళ్ల

    ReplyDelete
    Replies
    1. పంచీకరణ పటము(24 గళ్ళు)
      కూడా ప్రచురించ ప్రార్ధన.

      Delete
  3. ముందుగా మీ అమూల్యమైన సలహాకు ధన్యవాదములండి.
    మళ్ళీ కొన్నివిషయాలు సమీక్షించేటపుడు, మీ సలహాను పాటించడానికి ప్రయత్నం చేస్తాను.
    సూర్యచంద్ర గోళ్ళ

    ReplyDelete
  4. నమస్తే సూర్య చంద్ర గారు
    ఒక చిన్న విన్నపం,బిగ్ బ్యాంగ్ సిద్దాంతం ను ,వేద ప్రామాణికం అయిన స్రుశ్తి ఆవిర్భావం ను పోల్చి రాయడం వల్ల వేద ప్రసస్తి అందరికీ తెలిసే అవకాశం ఉందని నేను బావిస్తున్నను.అటు గా ఒకసారి ఆలోచించాల్సిoదిగ నా ప్రార్థన..
    మీరు అందిస్తున్న సేవకు కృతజ్ఞతలు..ఈ సమాచారం నాకు చాలా ఉపయుక్తంగా ఉంది.ధన్యవాదాలు.

    ReplyDelete