Friday, August 24, 2012

ప్రపంచము లేక జగత్తు ఏర్పడ్డ విధానం -2


త్రివృత్కరణం -----------------------------------  
తేజస్సు సంబంధం చేత వాక్కు, జల సంబంధం చేత ప్రాణము, పృధివి/ అన్నము యొక్క సంబంధం చేత మనస్సు ఏర్పడటం చేత, తేజోజలాన్నములు  మానవునికి ప్రధానములు. అన్నము యొక్క సూక్ష్మాంశము మనస్సుగాను, జలము యొక్క సూక్ష్మాంశము ప్రాణముగాను, అగ్ని యొక్క సూక్ష్మాంశము వాక్కులేక శబ్దంగాను తెలుస్తోంది.

అన్నము యొక్క మధ్యమాంశము చేత శుక్లము, జలము యొక్క మధ్యమాంశము నుండి రక్తము, పృధివి యొక్క మధ్యమాంశము వల్ల మజ్జ (bone marrow) ఏర్పడతాయని  చెప్పబడుతోంది.
అన్నము యొక్క కనిష్టికాంశము లేక స్థూలాంశము నుండి మలము, జలము యొక్క కనిష్టికాంశము మూత్రముగాను, అగ్ని యొక్క కనిష్టికాంశము ఎముకలుగాను ఏర్పడతాయి. ఇలా మనం భుజించే అన్నము, జలము, తేజస్వరూపమగు నేయి నూనె మొదలైన  పదార్ధాలు సూక్ష్మ, మధ్యమ, కనిష్టికాంశాలుగా విభజించబడి, జీవుల వికాసమునకు కారణమవుతుంది.
 
అన్నమునకు మూలము జలము. జలమునకు మూలము తేజస్సు. తేజస్సునకు మూలము సత్తు యందూ  ఉన్నాయి. ఆ సత్తే సూత్రాత్మగా వాగ్మనఃప్రాణ రూపమున బీజ రూపముగా తెలియబడుతోంది. మరణించు వాని వాక్కు మనస్సు నందు, మనస్సు ప్రాణమందు, ప్రాణము తేజస్సు నందు, తేజస్సు అత్మయందు లయమవుతాయని చెప్పబడింది. గనుక సర్వమూ బ్రహ్మ స్వరూపమై ఉంది. ఛాందోగ్యోపనిషత్తులో వాగ్మనఃప్రాణముల ఏకత్వానుసంధానము ప్రతిపాదించ బడింది. పరమాత్మ సృష్టికొరకు మనస్సు, వాక్కు, ప్రాణములను త్రివిధ అన్నములను సృష్టించెను. సమస్తమూ మనస్సు చేతనే తెలియ బడటం వల్ల సర్వము మనస్సుని చెప్ప బడింది. సర్వ శబ్దములూ వాక్కే. ఇది వస్తు నిర్ణయాన్ని బట్టి కలుగుతుంది. కనుక వాక్కు విజ్ఞాన స్వరూపము. ఇలా విజ్ఞాన స్వరూపమని తెలుసుకొనేది మనస్సు. ఇంద్రియ గోచర స్వరూపమైన అజ్ఞానమే ప్రాణముగా ఉంది. వాగ్మనఃప్రాణ స్వరూపుడైన  హిరణ్య గర్భుని తెలుసుకొను వాడు సర్వజ్ను డగుచున్నాడు.

సృష్టి నామరూపాత్మక మైనది. వాక్కు వల్లనే అన్ని నామములూ ఏర్పడటం వల్ల అన్ని నామములూ బ్రహ్మ స్వరూపమని చెప్పబడింది. అన్ని రూపములు నేత్రములచే తెలియబడి, నేత్రేంద్రియమే కారణంగా మనస్సు చేత తెలియబడటం చేత, ఇది బ్రహ్మ స్వరూపమని చెప్పబడుతోంది. సర్వ కర్మలకూ దేహమే కారణము. నామ రూప కర్మలు మూడూ దేహము నందే స్థితమై ఉన్నాయి. నామ రూపాత్మక కర్మలచే తెలియబడే దేహానికి ప్రాణము చైతన్యాన్ని ఇస్తుంది. అంచేత సమస్త భూతముల సారమైన మానవుని యందు, వాగ్మనఃప్రాణముల యందు  ఏకరూపమగు బ్రహ్మము తెలియ దగిన వాడు. అట్టి ఆత్మ స్వరూపము నందే సర్వ ప్రాణులు, సమస్త లోకములూ, సర్వ దేవతలు, సర్వ భూతములూ స్థితి కల్గి ఉన్నాయి. ఈ సమస్తమూ పృధివీవ్యాపస్తేజముల రూపములని ఎవడు తెలుసుకొను చున్నాడో అట్టివాడు, పరబ్రహ్మ స్వరూప నిశ్చయజ్ఞానము కలవాడగు చున్నాడు. ఆ ఆత్మయే పరబ్రహ్మ స్వరూపమని తెలియు చున్నది.


2 comments:

 1. Just to share more information from SriChinnajeeyar swamiji's pravachan's.
  నారములు అంటే సఖల చరాచర వస్తువులు అని అర్థం. అయణం అంటే ఆధారం అని అర్థం.సూర్యుడు మనకు ఉత్తరం నుండి ఆధారమైన కాలాన్ని మనం ఉత్తరాయణం, విడ దీస్తే ఉత్తర-అయణం అంటాం. నారాయణ శబ్దం లోని అయణ అనే పదాని అర్థం ఆధారం. ఈ సఖల చరాచర వస్తుజాతానికి ఆధారమైన వాన్ని నారాయణ అంటారు.సకల చరాచర వస్తువులకు లోపల బయట వ్యాపించి వాటికి ఆధారమైన వాడిని మనం నారాయణ అంటాం.అర్థాత్ ఆయన లోపన మరియూ బయట వ్యాపించి ఉంటాడని.అయణ అనే శబ్దంచే ఆయన అన్ని గుణములు కల్గి, చేయిచాస్తే చాలు అందేట్టు ఉంటాడు కాబట్టి ఆయనకు సౌలబ్యాది గుణాలు ఉంటాయి.లోపల ఉంటాడు కాబట్టి దగ్గరగా ఉంటాడు, పైన కూదా ఉంటాడు కనక అయన పరుడు- అందుచే పరత్వం సౌలబ్యం లాంటి గుణాలు కల్గినవాడు. మరి ఆ తత్వం మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవటం అవసరం. మనం ఇప్పుడు ఒక శరీరం ధరించి ఉన్నాం, ఒక భూమి మీద నివసిస్తునాం. ఈ భూమి సౌరమండలంలో ఉంది. ఇదంతా ఎవరు ఏర్పాటు చేసారో మనం ఆలోచించటం లేదు. ఒక చిన్నవిత్తనం నుండి ఒకపెద్ద వటవృక్షం వచ్చినట్లుగా ఇది ఒకనాడు ఎర్పడింది ఒకడిలోంచే అని మనకు వేదం చెబుతుంది.ఇవన్ని ఏవి లేనప్పుడు పరమాత్మ ఈ జీవులందరూ ఉన్నారే అతి చిన్నరూపం కలవారు, అతి విలక్షణమైన జ్ఞానం కలవారు, కర్మభారాలు మోసేవారు, తామంతట తాము దేహాలు ధరించలేనివారు మరినేను వీల్లకు ఉపకారం చేయకుంటే ఎలా! కర్మతోలగాలంటే దేహం కావాలి, దేహం ఉండే నేల కావాలి, దాన్ని భోగ స్తానం అంటారు. అందుకు అనుభవించే వస్తువులు కావాలి, వాటిని భోగ్యములు అని అంటారు. వీటిని అనుభవించే ఇంద్రియాలు కావలి వాటినే భోగ్య్ ఉపకరణములు అంటారు.ఇన్నింటిని తయారు చేనినవాడిని మనం నారాయణ అంటాం. మరి ఇవన్నీ తయారు చేయటానికి ఆయన ఏర్పాటు చేసుకొన్న స్తానాన్నే వ్యూహం అంటారు.అక్కడ ఆయన వాసుదేవ, అనిరుద్ద,ప్రత్ర్యుమ్న, సంకర్షన అనే నాలుగు పేర్లతో ఉంటాడు. సృష్టి, స్తితి, లయము ఈ మూడు కార్యాలు చేస్తాడు, ఆ స్తానాన్నే పాల్కడలి అని కూడా అంటారు.ఆయన కళ్యాణ గుణాలకు అది మూలస్థానం.అక్కడ వ్యూహ వాసుదేవ అనేరూపంతో సర్వం తన ఆదీనంలో పెట్టుకుంటాడు.అందులోంచి ఒక రూపం తీస్తాడు వ్యూహ అనిరుద్ద అని పేరు.
  సృష్టి పూర్వ దశ నుండి సృష్టి తరువాత దశ వరకు స్వామిని ఎట్లా ఉంటాడో చాందోగ్య ఉపనిషత్ వర్ణిస్తుంది. సృష్టి కి ముందు భగవంతుడు ఒక సంకల్పం చేస్తాడట. ఆసంకల్పం “తడైక్షత భహుష్యాం ప్రజాయేయేతి” నెనే నానుండి అనేకమందిని తీద్దును గాక అనుకుంటాడట.ఇక సృష్టి చేయడం ఎలా అంటే త్రివుత్కరణం అని చెబుతారు.
  త్రివుత్కరణం: ఒక అండం
  మొదట తనలోంచి తేజస్సుని తీస్తాడు, తేజస్సులోంచి జలాన్ని తీస్తాడు, జలంలోంచి పృథ్విని తీస్తాడు. ఈక వీటిని సగం సగం సగం భాగాలుగా చేస్తాడు. ప్రతి రెండో భాగాన్ని మల్లీ సగం సగం చేస్తాడు. ఇప్పుడు ప్రతీదీ ఒక పెద్ద భాగం గా రెండు చిన్న భాగాలుగా ఉంటాయి. ఇక అన్నీ భాగాలు ఒక్కో దానిలో వచ్చేట్లుగా పంచి మూడింటిని సిద్దం చేస్తాడు. అయితే ప్రతీదాంట్లో ఏదో ఒక భాగం ఎక్కువగా ఉండి మిగతావి రెండు తక్కువగా కల్గి ఉంటాయి. ఇవన్నీ కల్పి ఒక అండం క్రింద తయారు చేస్తాడు. దీన్నే బిగ్ బ్యాంక్ అని ఇప్పటి వాల్లు చెబుతున్నారే అది.“యుగప్పత్ సృష్టికార్యం” ఒక చిటికెలో సృష్టికార్యం జరిగి పోయింది, అనేక కోట్ల అండాలు బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చిన ఒక అండంలో ఒక గోళంలో మనం ఉన్నాం.ఈ బయటకు వచ్చిన ప్రతి అండంలో ఒక బ్రహ్మ ను పెడుతాడు.ఆ బ్రహ్మ శరీరంలోంచి పదకోండు ప్రజాపతులను బయటికి తీస్తాడు.ఇంతవరకు తాను నేరుగా చేస్తాడు. దీన్నే అద్వారక సృష్టి అంటారు.
  చతుర్ముఖుడైన బ్రహ్మకు నాలుగు వేదాలను ఉపదేశం చేసి, తిరిగి ఆయన వేదాలను పోగొట్టుకుంటే మల్లీ తెచ్చి ఇస్తుంటాడు.బ్రహ్మకు వేద ఉపడేశం చేసాక, ఇక పై బ్రహ్మ ద్వారా సృష్టి చేస్తాడు. ఇది సద్వారక సృష్టి.బ్రహ్మ గారి లక్ష్యం మనిషిని తయారు చేయటం, ఆయన ప్రయోగాలలో తయారైనవి ఇన్ని జీవ రాశులు.ఇక బ్రహ్మ సృష్టించాక అన్నీ వస్తువులలో అంతర్యామి అయ్యి తానుంటాడు.ఇక ఇన్నింటిని రక్షించటానికి వ్యూహ వాసుదేవ అనే రూపంలోంచి మరొక రూపం తీస్తాడు అది వ్యూహ ప్రత్యుమ్న అని పేరు.సృష్టించిన వాటిని రక్షించటానికి ఇంద్రుడిలో తానుండి చేస్తాడు.ఏదైన సరియైనదిగా రాకుంటే, అందులోంచి ఒక రూపం తీస్తాడు దానికి వ్యూహ సంకర్షణ అని పేరు, ఇది ప్రళయం చేయటానికి శివునిలో తానుండి చేస్తాడు.ఆర్తితో పిలిచేవారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.ఎప్పుడెప్పుడు అవసరం ఏర్పడుతుందో అక్కడినుండి లోకరక్షణకై వ్యూహ వాసుదేవ అనే రూపంలోంచి అవతారాలను పంపిస్తుంటాడు. ఆయా అవతారల్లో ఆయన గుణ సంపదలను లోకానికి చాటుతాడు. అందుకే అవతారాలను విభవములు అంటారు.ఒక సారి చేప లాగా, ఒకసారి తాబేలు లాగా,ఒక సారి మనిషిలా ఇలా ఎన్నో రకాలుగా ఆయా అవసరాలను బట్టి ఒక రూపం స్వీకరించి మనవద్దకు వస్తాడు.
  ఆయన కళ్యాణ గుణాలకు అది మూలస్థానం.అక్కడికి ఆయన మొట్టమొదటిగా అడుగు పెడతాడు, ఆదిశేశువు పైన ఆయన ఉంటాడు.అన్ని అవతారాలకు మూల స్థానం పాల్కడలియే.
  source:www.pravachana4u.info

  ReplyDelete
 2. Thanks for sharing the information.I look forward for suggestions to improve the content sincerely.
  Surya Chandra Golla

  ReplyDelete