Thursday, October 11, 2012

కుండలిని - 2

మూలాధారము


మూలాధారచక్రం  మధ్య భాగంలో కుండలినీ శక్తి ఉంటుంది. ఇది సర్పాకారంలో ఉంటుందని చెప్పబడింది. మూలాధారంలో ఉంటే అధోకుండలిని అనీ, భ్రూమధ్యమున ఉంటే ఊర్ధ్వ కుండలిని అనీ అంటారు. విషయాసక్తి ఉండే వారియందు కుండలిని యొక్క తల మూలాధారంలోనూ తోక భ్రూమధ్యమానా  ఉంటుందని, అదే జ్ఞానులకు కుండలినీ యొక్క తల భ్రూమధ్యమాన, తోక మూలాధారంలోను ఉంటుందంటారు. కుంభక ప్రాణాయామంచేత కుండలిని మేల్కొంటుంది. కర్రదెబ్బతిన్న, త్రాచుపాములా బుసకొట్టి లేస్తుందని చెప్పబడింది. చిత్తము సుషున్నూ యందు లీనమవుతుంది. అంటే, శక్తి మూడు గ్రంధులనూ భేదించి  శివస్థానమును పొంది, సహస్రారమున  శివునితో కూడి ఆనందించునని చెప్పబడినది. ఇదే పరమోత్కృష్టమైన స్థితి. ఇదే యోగ సిద్ది. ముక్తి అని చెప్పబడింది. 



మూలాధారము

స్థూల శరీరమునందు గుద స్థానమునకు రెండంగుళాల పైనా, లింగ స్థానమునకు రెండంగుళాల క్రింద చతురస్రాకారంలో ఎర్రని రంగును కల్గి నాలుగు దళములతో ఉంటుంది. ఇది పృధివీ భూత సంబంధమై ఉండటం చేత గంధమాత్రలతో సంబంధం ఉండి, సువాసన, దుర్వాసన, సువాసనా మిశ్రమము, దుర్వాసనా మిశ్రమము లని నాలుగు గంధ గుణములు తెలియబడు చుండగా ఇవే నాలుగు దళములుగా చెప్ప బడినవి. ఈ చతురస్రంలో క్రింది ముఖంగా కోణం ఉండే త్రిభుజంలో, కుండలినీ స్థానమైన మూలాధారం ఉంటుంది. ఈ కమలానికి అధిపతి గణపతి. అన్నమయ కోశానికిది స్థానము. ఇచ్చట చిణి అనే నాదం ఉంటుంది. లం' అనే బీజాక్షరాన్ని (శబ్దము) ధ్యానిస్తూ ఈ కేంద్ర రూపాన్ని చింతిస్తూండే వానికి దీన్లో రహస్యం బోధపడి, చక్రము మేల్కొని అందలి కుండలిని ఊర్ధ్వ ముఖమవుతుంది.
 
సౌందర్య కారణంగా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కల్గించి, దానివల్ల సంతతిని కల్గించటానికి  కారణ మవుతుంది. దీన్లో ఉండే త్రికోణంలో కామరూపమనే  మహాశక్తి, జీవియొక్క రూపురేఖలను నిర్ణయించి, జీవులందు కామము కల్పించి దేహనిర్మాణము చేయబడుతోంది. జీవునిలో అంతర్యామి ప్రజ్న; శిరస్సు నందు మేల్కొని, జీవునియందు ప్రవేశించి, వెన్నెముక చివర మూలాధార చక్రము ద్వారా శరీరమునందలి ధాతువులుగాను, ధాతు కణములుగాను స్థాపించ బడుతున్నాయి. సృష్టిలోని జీవులు కామమునకు వశులై పనిచేయవలసినదే గాని దానిని దాటలేరు. అవతార పురుషులు కూడ సృష్టి ధర్మమును గౌరవించి సంతానమును పొంది, గృహస్థాశ్రమమునకు ఆదర్శమైన వారే.  సంతానము కొరకు కామము అని తెలిసినవారు సంతానము పొందుట ద్వారా కామమును దాటు చున్నారు.

కుండలిని యందలి షడ్చక్రములూ జీవుని దేహకోశములకు కేంద్రములు.  ప్రజ్ఞ సృష్టియందు నిద్ర, స్వప్నము,  మెలకువ , పూర్తి మెలకువ అనే  నాలుగు స్థితులుగా వ్యక్తమవుతోంది. అచేతనమైన భౌతిక పదార్ధములలో ప్రజ్ఞ పూర్తిగా  నిద్రావస్థలో  ఉంటుంది. భౌతిక వ్యాపారములు (senses)ఉండవు . ఇది  గాఢనిద్రలో ఉండే వాని స్థితి. స్వప్నావస్థలో  ప్రాణ ప్రవృత్తులు మేల్కొని ఉంటాయి. ఉదాహరణకు వృక్షములు , మొక్కల లాగున . అనగా చైతన్యముంటుంది కాని ఇంద్రియ స్పర్శ ఉండదు. ఇక నిద్రిస్తున్నా బాహ్య ప్రపంచముతో సూక్ష్మ సంబంధముంటుంది. అంటే  కలగా ఉన్న స్థితి.  మెలకువ స్థితిలో ఇంద్రియ ప్రవృత్తులు కూడ మేల్కొనే ఉంటాయి. ఇంద్రియాలు ఉంటాయి కాని , మనస్సుండదు. ఇదే జంతు స్థితి. అనగా ఇంద్రియ ప్రవృత్తులను, ప్రాణ ప్రవృత్తుల ననుసరించి జంతువులు జీవిస్తాయి. పూర్తి మెలకువ స్థితిలో ఇంద్రియ ప్రవృత్తులతో బాటు మనస్సు కూడ పనిచేస్తుంటుంది. ఇది మానవుడున్న స్థితి.

ఈ స్థితులనే  సర్పాకారములో మూలాధార చక్రమున  సూచింప బడుతున్నాయి. మూడున్నర చుట్లు గల మూలాధారమందలి  సర్పముయొక్క మొదటి చుట్టు సుషుప్తావస్థ (నిద్ర). సర్పముయొక్క  రెండవ చుట్టు  స్వప్నావస్థ- వృక్ష స్థితిని, మూడవ చుట్టు- జంతు స్థితిని, అర్ధ చంద్రాకారముగా సగము చుట్టి పడగెత్తినది పూర్తి జాగ్రదావస్థను అనగా మనస్సు మేల్కొన్న మానవ స్థితిని సూచిస్తుంది. ఈ మూలాధార చక్రము వల్ల నిరంతర సంతృప్తి ,అకారణమైన ఆనందము కలుగుతాయి. ఇలాంటి స్థితిని, ఆమెయే జీవులయందు మేల్కొల్పి; సంఘటనలననుసరించి ఇతరులను ప్రేమింప జేసి జన్మల పరంపరలో అంచెలంచెలుగా ఎదిగించి, నిత్యానందమయ స్థితికి తీసుకొని పోయి  జన్మ మృత్యువు లనెడి ద్వంద్వాతీతమైన అమృతత్వమును పొందించేది.

మూలాధారం  బీజాక్షరం –‘లం’ . నాలుగు ఎర్రని రంగు గల పెటల్స్ కలిగి, దాని మధ్య పసుపు పచ్చని చతురస్రం ,  చతురస్రం మధ్యలో ఎర్రని inverted triangle ఈ త్రిభుజంలో బూడిద రంగు గల శివలింగం. శివలింగం చుట్టూ మూడున్నర చుట్లు కల్గి పడగ విప్పిన సర్పం ఉంటుంది. ఇదే కుండలినీ శక్తి.

                           

1 comment:

  1. Sir, did u experience kundalini awakening Pls tell if u have and in which method.. Tq

    ReplyDelete