మణిపూరకము
దారమున కూర్చబడిన మణివలె ఉండుటచే, దీనికి మణిపూరకమని పేరు. వాయుప్రేరణ కల స్వరూపము కల్గి, నాభి స్థానమున, దశదళములతో
నుండు పద్మముగా చెప్పబడినది. దీనియందు జీవుడు పాప పుణ్యములచేత నియమించ బడ్డవాడై, బ్రహ్మమును తెలుసుకోనంత వరకూ తిరుగుచునే ఉండును. లింగము యొక్క పైభాగమునను, నాభికి క్రిందను పక్షి గ్రుడ్డువంటి ఆకారమున నుండుదాని యందు , డబ్భైరెండు వేల
నాడులు పుట్టి, ఇవి ప్రాణ వాహినులై శరీరమంతా వ్యాపించి ఉన్నాయి. పది దళములతో కూడిన మణిపూరకము
పసుపు పచ్చని రంగు కలది. అగ్నికి స్థానమగుటచే నేత్ర సంబంధము చెప్పబడినది.
నేత్రేంద్రియ సంబంధముచే తెలియబడు రంగులూ, రూపములయిన పొట్టి, పొడుగు, లావు, సన్నము; పుట్టుట, చచ్చుట, క్షీణించుట, వృద్దిచెందుట, సుఖదుఃఖములు, బాల్య యౌవన కౌమార వార్ధక్యములను అవస్థలూ కలిపి దశ విధములైన రూపములని తెలియ
నగును. దీనికి అధిపతి లక్ష్మీదేవితో కూడిన విష్ణువు. అగ్ని సంబంధ మగుటచే, ఇచ్చట అగ్ని, భుజించిన సమస్త
పదార్ధములనూ జీర్ణము చేయును. చిత్తమునకు స్థానము. ఇచట ఘంటా నాదము వినదగును.
శరీర మందలి ద్రవములను , వాటి సాంద్రత, వాటి ప్రసరణలను నిర్వర్తించును. ఉద్రేకావేశములకు పర్యవసానముగా పరితపించుట, దుఃఖించుట , కోపము తెచ్చుకొనుట మున్నగు
మార్పులను కల్గించి వానివల్ల పరమాత్మ
జీవునికి మనోవికాసమును కల్గించు చున్నాడు. బాధ, కష్టము అనువాని వల్ల దుఃఖపడుట అను లక్షణమును మనస్సున కల్పించి, దానిని జాలి అను సంస్కారముగా ముద్రించును. ఇలా సంస్కారములేర్పడిన
పిదప, సాటివారికట్టి పరిస్థితి కలిగినపుడు తాను పడిన బాధ గుర్తుకు వచ్చి, వాని యందు సానుభూతి , దయ ఏర్పడును. ఇట్లు ఉత్తమ సంస్కారము లేర్పడు
చున్నవి. స్త్రీలయందు మాతృత్వమును చూచి ఆరాధించుట, పూజించుట అనువాటివల్ల
కామమను పశులక్షణమును జీవుడు దాటుచున్నాడు. స్వాధిష్టానమందలి శుక్ర తేజస్సు
ఊర్ధ్వగతమై మణి పూరకమందు ఆవేశముగా మార్పు చెంది, హృదయ పద్మమునందు ప్రేమగా మేల్కొని, భ్రూమధ్యమందు బుద్దియను మహాతేజస్సుగా ప్రకాశించు చున్నది. నిరంతర ఆలోచనలవల్ల
కల్గు మనోవ్యాకులత , సంఘర్షణల నుండి తాత్కాలిక
విముక్తి కలిగించుటకు మార్పును కూడ కల్పించుచున్నది. ఈ కేంద్రము వల్లనే
వాక్కు పుట్టుచున్నది.
ఇది నాభిమూలమున ఉండును. మణిపూరకము యొక్క బీజాక్షరము - రంగ్. పది దళములు కల్గిన పసుపు
పచ్చని పద్మం. దాని మధ్య ముక్కుపొడుం/ బ్రౌన్ రంగుతో తిరగబడినట్లున్న త్రిభుజమూ దాని
మధ్యలో పసుపు పచ్చనిరంగుతో కూడిన ఎర్రనిరంగు గల మంటతో మణిపూరకము ఉంటుందని చెప్పబడినది.
No comments:
Post a Comment