ఇంద్రియానుభావాలు చిత్తంలో సంస్కారాలుగా నిక్షిప్తమై ఉంటాయని తెలుసుకున్నాం. మనం ఒక అనుభవాన్ని పొందుతున్నపుడే సంస్కారం ఒక గుర్తులా ఏర్పడుతుంది. బాహ్యవస్తు ప్రేరణ వల్ల అయా సంస్కారం తిరిగి జాగృతం అవుతుంది. అపుడు అంతరంగంలో ఆలోచన ఏర్పడుతుంది. మనస్సులో వృత్తులన్నీ అణిగితే ఇక మిగిలేది అంతఃకరణం మాత్రమే. వృత్తులు అణిగిపోయేప్పుడు సంస్కారాలను మిగుల్చుతాయి. ఈ సంస్కారాలు అనుకూల పరిస్థితులు కలిగినపుడు మళ్ళీ తలెత్తుతాయి. ఇలాంటి సంస్కారాలను సంయమనంతో గమనించడం వల్ల, అలా మిగిలియున్న సంస్కారాలను గురించిన ఎరుక మనకు కలుగుతుంది.
ఈ ప్రపంచంలో పూర్తి అనుభవజ్ఞానం
పొందేవరకూ అనేక శరీరాలను ధరించవలసి వస్తుంది. అలా జన్మలను ఈ సంస్కారాల వల్ల
పొందుతూంటాం. లభించిన జన్మకుతగినట్లుగా సంస్కారాలు ప్రారబ్దముగా అనుభవంలోకి
వస్తాయి. ఇంకా మిగిలిన సంస్కారాలు బీజరూపంలో మనలో ఉంటాయి. ఇలా ప్రపంచంలో జీవించి
ఉండగా పొందిన అనుభవాల్లో ముఖ్యమైన వాటితో తిరిగి జన్మిస్తుంటాం. ఇలా జన్మ
తీసుకున్నపుడు గతజన్మలో మనం ఎంతవరకూ ఉన్నతిని చెందామో, అక్కడినుండి వాసనలు ప్రేరేపించబడి జీవయాత్ర
కొనసాగిస్తాం. ఇలా మన సంస్కారాలు, వాసనలే మనలను బందీలను
చేస్తున్నాయి. ఈ విధంగా గడచినా అనేక జన్మలనుంచి వాసనలను, కర్మలను
ప్రోగుచేసుకుంటూ వస్తున్నాం.
మూఢనమ్మకాలు, అనేకభావాలు మనలో గాఢంగా నాటుకొని ఉన్నాయి. సరైన
విచారణ ద్వారా వీటిని నిర్మూలించాలి. దురాకర్షణలకు దూరంగా ఉంటూ ధ్యానము, మంత్రజపము, సజ్జనసాంగత్యం మొదలైన వాటివల్ల
సంస్కారాలచే ఏర్పడ్డ పాతఅలవాట్లను మార్చవచ్చు. అలవాట్లు మారుతాయనేది మనందరకూ
తెలిసినదే. చూసుకుంటే చిన్నప్పుడు ఉన్న అలవాట్లు ఉప్పుడు ఉండవు. ఇప్పుడుండే అలవాట్లు కొంతకాలం
పిదప మరుగై, క్రొత్తఅలవాట్లతో బదిలీ చెయ్య బడుతుంటాయి. ఈ
విశ్లేషణ ఆధారంగా మనలో ఉండే వాసనలను కూడ మార్చుకోవచ్చుననేది సుస్పష్టం. అంటే మనలో
ఉండే మలిన వాసనలను శుభ వాసనలతో భర్తీ చెయ్యవచ్చును.
మనం ఏవిషయం గురించి ఆలోచిస్తే మనస్సు
ఆవిషయాకార వృత్తిని పొందుతుందని చెప్పుకున్నాం. ఆ విషయానుభవం తనదైన శైలిలో ఉపచేతన ( subconscious mind) లో ఏర్పరచి, తిరిగి
జ్ఞప్తికి తెచ్చుకోవడం కూడ జరుగుతుంటుంది. ఆ గుర్తు ఆలోచనా రూపాన్ని పొంది కర్మ
చెయ్యడానికి ప్రేరేపిస్తుంది. సాధనలో గత వాసనా చిహ్నాలను క్రొత్త అనుభవాలతో
పూరించడమే చెయ్యాలి. దీన్నే పురుషప్రయత్నంగా చెబుతారు. మహాత్ముల ఉపదేశానుసారం చేసే
మనోవాక్కాయ చేష్టలనే పురుషప్రయత్నంగా యోగవాశిష్టంలో చెప్పబడింది. మధ్యలో విరమించక,
పురుషప్రయత్నం కొనసాగిస్తే సాధకుడు తన ప్రయత్నంలో సఫలీకృతుడవుతాడు.
No comments:
Post a Comment