Friday, May 31, 2013

"ఓం" కారము -3



ఇక నాల్గవపాదంగా చెప్పబడే ప్రణవం నాదముఅని చెప్పబడుతోంది. ఇది తురీయావస్థ అనవచ్చు.  దీన్లో ఉండే తురీయుడు స్వప్నంలో అంతర పదార్ధాలను ఎరిగజేసే తైజసునికన్న భిన్నమైనవాడు. పై మూడు అవస్థలకన్నఇది భిన్నము. తురీయుడు ఇట్టివాడని చెప్ప శక్యంకాని వాడు. కర్మేంద్రియాలతోగాని , జ్ఞానేంద్రియాలతో  గాని గుర్తించే లక్షణం లేనివాడు. అన్ని వస్తువులలోను ఉండి వాటిని నియమించే వాడు. అనుమానప్రమాణం చేతనే ఎరుగదగిన వాడు. జ్ఞానమనే సారం తత్వంగా గలవాడు. అద్వితీయుడు. 
 
ఈ తురీయుడే దుఃఖకారణమైన సంసారాన్ని నిర్మూలించేవాడు. జాగ్రదావస్థలో అజ్ఞానంతో ఉండే జీవుడు నేను కాని శరీరాన్ని నాది నేను అనే భావాన్ని, నావి కాని బాహ్యపదార్ధాలను నావి అనే భావాలను కలిగించేది విశ్వుడు. స్వప్నావస్థలో భాసించే తాను కాని శరీరమందు తాననే అహంకార భావాన్ని , తనవి కాని స్వప్నపదార్దాలందు నావి అనే మమకార భావాన్ని కల్గించేది తైజసుడు.

సుషుప్తిలో ప్రాజ్నుడు జీవునకు అజ్ఞానంచేత కల్గే తాను, తనవి అనే భావాలు కలుగకుండా చేస్తాడు.

తురీయం అజ్ఞానం ఉండని బంధంలేని అవస్థ. దీన్లో తురీయుడు తక్కిన ముగ్గురు లాగ జీవునికి భ్రాంతిని గాని, అజ్ఞానాన్ని గాని కలిగింపడు. అప్పుడు ఉండేది యదార్ధ జ్ఞానమే. మిధ్యాజ్ఞానాన్ని నశింప జేస్తాడు. తురీయంలో జాగ్రత్తులో ఉండే బాహ్యవిషయజ్ఞానం గాని, స్వప్నంలో ఉండే అంతరవిషయ జ్ఞానం గాని ఉండదు. ఐతే సుషుప్తిలో స్వరూప విషయజ్ఞానం ఉండదు. తురీయుడు సత్యపదార్ధాన్నిగాని, భ్రాంతిజనిత పదార్ధాన్నిగాని ఎరుగకుండా చేయువాడు గాని కాదు.  ముక్తిదశలో భోగ్యములైన అన్ని పదార్దాలనూ జీవునకు ప్రకాశింప జేస్తాడు. ప్రాజ్ఞుడు సుషుప్తిలో జీవునకు తనను గూర్చినగాని, యితరుల గూర్చిన గాని ఎరుక కలిగేలా చేస్తాడు. అంతేగాక స్వరూప సుఖం తప్ప వేరొకటి తెలియకండా చేస్తాడు ప్రాజ్ఞుడు.  తురీయుడు అట్లు చెయ్యడు. తురీయమందలి బ్రహ్మస్వరూపం సుషుప్తిలోవలె అజ్ఞానంతో కూడినది కాదు. ప్రాజ్ఞునికి ఉండేది కేవలం స్వరూపజ్ఞానం మాత్రమే గాని విషయానుభవం కాదు. కాని తురీయుడు అట్టివాడు కాదు. ప్రాజ్ఞుడు జ్ఞానమే ప్రధానంగా గలవాడు. కాని తురీయుడు సర్వజ్ఞుడు. సమాధిలో నిరంతరము జ్ఞానాన్ని కలుగజేస్తాడు తురీయుడు. 

సుషుప్తి తురీయాల్లో ద్వైతభావము ఉండదు. ఇల్లు శరీరం మొదలైనవి తన యిష్టం వచ్చినట్లుగా వినియోగించ దగినవే అనేది ద్వైతభావం. జాగ్రత్తు స్వప్నాల్లో ఉండే భ్రాంతికి అజ్ఞానం కారణం. అజ్ఞానమే బంధకారణం. సుషుప్తిలో కేవలం అజ్ఞానం ఉంటుంది. జీవుడు అజ్ఞానం చేత తాను కాని శరీరాన్ని తానని, తనవి కాని వస్తువులను తనవని భ్రాంతి చెందుతాడు. వాస్తవం తెలియక పోవడమే నిద్రకు మూలమైన అవిద్యకు కారణం. నిద్రచే కల్గే భ్రమ తొలగితే జీవుడు ముక్తుడవుతాడు. దేహం నాది, ఇల్లు నాది అనే బంధమే ప్రపంచం. ప్రపంచానికి ఉనికి లేదు. అది భగవదధీనం. ఈ బంధం భగవదనుగ్రహం వల్లే పోతుంది. అట్టి అనుగ్రహంవల్ల బ్రహ్మము తప్ప రెండవ వస్తువు లేదని అనుభవము కల్గుతుంది. ఈ అజ్ఞానం మహాపురుషుల ఉపదేశం చేత తప్పకుండ నశిస్తుంది.








Friday, May 24, 2013

"ఓం" కారము -2


ప్రణవమందలి రెండవ పాదముగా స్వప్నావస్థ యందు అంతర్యామిగా ఉండు తైజసుడు కారముచే ఉపాసించ బడుచున్నాడు. ఈ అవస్థయందు ఆత్మతప్ప యితర అనుభవములు గోచరింపని పదార్ధములను ఎరిగించువాడుగా ఉండును. స్వప్నమందు శిరస్సు నేత్రము ప్రాణము నడుము మూత్రకోశము పాదములు అనువానితో కూడిన జీవుడు ఏడు అంగములతోను, పంచజ్ఞానేంద్రియములు  పంచకర్మేంద్రియములు పంచప్రాణములు  అంతఃకరణ చతుష్టయము కలసి పందొమ్మిది ముఖములు కలవాడై యుండును. బాహ్యవిషయములకన్న ప్రత్యేకమైన స్వాప్నిక పదార్ధములను అనుభవించు జీవునియందు అధిష్టాతగా వెలసిల్లుచుండును. స్వప్నమందు సూక్ష్మపదార్ధములను తేజస్సువలె ప్రకాశింపజేయు వాడగుటచే తైజసుడని పిలువబడు చున్నాడు. ఇతడు కంఠస్థానమున స్థితుడై వీటిని అనుభవించు చుండును. వైశ్వానరుడు బహిఃప్రజ్ఞుడు. తైజసుడు అంతఃప్రజ్ఞుడు. 

మూడవ పాదముగా ప్రణవంలోని కారమును  సుషుప్తియందలి ప్రాజ్ఞుడు ఉపాసించబడు చున్నాడు. సుషుప్తిలో గాఢనిద్ర ఉండటంచేత ఇంద్రియములు, మనస్సు పనిచెయ్యవు. ఒళ్ళు కూడా తెలియదు. ఆనందముగా ఉంటాడు. ఈ స్థితిలో ఒక వస్తువు కావాలని గాని, అక్కర్లేదని గాని ఉండదు. అందుకే బాహ్యమైన స్థూలపదార్ధాలు గాని, ఆంతరంగికమైన సూక్ష్మపదార్ధాలు గాని జీవునిచే అనుభవింప బడవు. జీవుడు పరమాత్మకన్న వేరుగాఉన్నట్లు తెలియనంత లీనమై ఉంటాడు. దీన్ని సంస్కృతంలో స్వపితి అంటే నిద్రించుచున్నాడని అంటారు. దీన్లో జీవస్వరూపం తప్ప ఇతరమైన బాహ్యపదార్దాలుగాని, అంతరపదార్ధాలు గాని ఎరుగడు గనుక ప్రాజ్ఞుడు అనబడుచున్నాడు. సుషుప్తిలో భ్రాంతి ఉండదు. కేవలం నిద్ర అనే అజ్ఞానమే ఉంటుంది. 

ఇలా వివిధ అవస్థల్లో వ్యవహరించే బ్రహ్మము సర్వజ్ఞుడుగా వాటిని నియమిస్తూంటాడు. ఇవన్నీ భిన్నరూపాలు గావు. అంతా ఒకే బ్రహ్మము. విశ్వుడు కుడి కన్నుయందును, తైజసుడు -  కంఠస్థానంలో మనస్సు నందునూ, ప్రాజ్ఞుడు హృదయ స్థానమున అధిష్టానులై ఉందురు. లోకంలో స్థూలమైన భోగ్యవస్తువులు వైశ్వానరునికి, యితరులకు కనిపించని స్వాప్నిక పదార్దములు తైజసునికి, సుషుప్తి యందలి ఆనందము ప్రాజ్ఞునికి త్తృప్తిని కలిగిస్తాయి. ఇలా అన్ని అవస్థల్లోను జీవుడు అనుభవించే ఆయా పదార్ధాలను అనుభవింప చేసేది ఆ సర్వేశ్వరుడే. ఈ అనుభవాలను పొందేది జీవుడు కాదు, ఆ సర్వేశ్వరుడే నని తెలిస్తే ఏ వికారము అంటదు. ఇలా ఏది అనుభవించబడుతుందో ఆ అనుభవించే వాడినీ, అనుభవింపబడెడు వాడినీ ఎవరు ఎరుగుదురో వాడు సర్వమునూ అనుభవించినా బంధమనేది ఉండదు. బ్రహ్మమే జడమైన ప్రకృతిగాను, చైతన్యవంతమైన జీవునిగాను పరిణమించేది. దీన్నే విభూతి అంటారు. విభూతి అంటే వివిధముగా అవ్వడం.





Thursday, May 16, 2013

"ఓం" కారము -1



ఈ చేతన అచేతనాత్మకమైన జగత్తంతా ఓంకారరూపమే. త్రికాలాలైన భూత భవిష్య ద్వర్తమాన కాలాల్లో ఉండేదంతా ఓంకారమే. ఈ చరచరాత్మకమైన జగత్తునకంతకూ ఓంఅను పదమే ఆత్మగా చెప్పబడుతోంది. ఇలా ఆత్మగా చెప్పబడే బ్రహ్మము నాలుగు రూపములని చెబుతారు. అవి “, “”, “”, నాదములని నాలుగు భాగములు  కలసి ఉన్నదిగా  ఓమ్అనే ప్రణవం చెప్పబడుతోంది. ఈ నాలుగూ కలసి ఉన్నపుడు సమస్తముగాను , విడి విడిగా ఉన్నపుడు వ్యస్తముగాను చెప్పబడింది. ఈ రెండువిధాలైన ఓంకారమూ బ్రహ్మమనే భావనతో ఉపాసించాలి.
 
చేతనాచేతనాత్మకమైన జగత్తు జాగ్రత్తు స్వప్నము సుషుప్తి అవస్థల్లోఉన్నపుడు, లేనపుడూ కూడ జీవుల శరీరాల్లో ఉండివాటిని నియమించే బ్రహ్మము నాలుగు రూపములుగా ఉంది. జాగ్రత్తులో విశ్వుడు లేక వైశ్వానరుడుగాను, స్వప్నావస్థలో తైజసుడుగాను, సుషుప్త్యావస్తలో ప్రాజ్ఞుడుగాను/ప్రజ్ఞ గాను, ఈ అవస్థలకు ఆవలిదశయందు అచేతనవికారమైన శరీరంలో ఉండే ఆత్మలో తురీయుడుగాను ఒకే బ్రహ్మము స్థితమై ఉండును. అంటే బ్రహ్మమే అన్ని అవస్థల్లోను నడిపించే ఆత్మగా ఉంటాడు. ఒక్కో అవస్థలోను ఒకో నామముచే వ్యవహరించబడటం చేత బ్రహ్మము నాలుగు పాదములని చెప్పబడింది. ఇలా జగత్తును తనలో చేర్చుకుని తనకన్న వేరుగా ఎరుగుటకు వీలుకానిది బ్రహ్మము. ఇలాంటి బ్రహ్మమును ప్రతిపాదించేదే ప్రణవము. బ్రహ్మమునకు, ఆ స్వరూపాన్ని ప్రతిపాదించే వాచకమైన ప్రణవానికీ భేదం లేదు. 

బ్రహ్మము అక్షరము. అంటే మార్పులేని ఏకరూపమైన సత్పదార్ధము. కారణముగా ఉన్నపుడు బ్రహ్మమని, కార్యముగా ఉన్నపుడు జగత్తని వాడుకలో చెబుతాం. అంచేత ఓంకారమును బ్రహ్మముగాను, జగత్తుగాను భావించి ఉపాసించాలి. జగత్తంతా చేతనులనే జీవులతో కూడిన అచేతనమైన ప్రకృతివికారం. దీనికి పరమాత్మే ఆత్మగా ఉండేది. అంచేత పరమాత్మకన్న చేతనాచేతనములు వేరుగా ఉండవు.

బ్రహ్మము యొక్క మొదటిపాదముగ కారముచే చెప్పబడుచున్నది. జాగ్రదావస్థలో చక్షుస్థానమున స్థితుడై రూపము మొదలగు వాటిని ఎరుగువాడును, ద్యులోకము  సూర్యుడు  వాయువు  ఆకాశము  జలము  పృధివి  జీవుడు అను  ఏడు అంగములు గలవాడును, పంచజ్ఞానేంద్రియములు  పంచకర్మేంద్రియములు పంచప్రాణములు  అంతఃకరణ చతుష్టయము కలసి పందొమ్మిది ముఖములు కలవాడై స్థూలమైన భోగములను అనుభవింప చేయువాడును  సకల జీవులను నడిపింప జేయువాడును అగుటచే వైశ్వానరుడని పిలువబడు చున్నాడు.








Wednesday, May 8, 2013

పురుష ప్రయత్నము-2

గతజన్మలో చేసిన పురుషప్రయత్నం ఈజన్మలో చేసే పురుషప్రయత్నంచేత జయించ బడుతుంది. శాస్త్రానుసారం చేసే ప్రయత్నం పరమార్ధంకోసమైతే, దానికి విరుద్ధమైన ప్రయత్నం అనర్ధాలకు దారితీస్తుందని విజ్ఞులు చెబుతారు. పూర్వపు అశుభప్రయత్నం శమించిపోనంత వరకూ ఇప్పటి శుభ పురుషప్రయత్నం చేస్తూండాలి. అంచేత సంసార సముద్రాన్ని దాటడానికి శమదమములు, శ్రవణ మననాది సంపత్తినీ సంపాదించే పురుషప్రయత్నం చెయ్యాలి. ఈ శరీరం శాశ్వతం కాదనే విషయాన్ని నిరంతరము చింతన చెయ్యాలి. విషయ సుఖాలయందు ఆసక్తి త్యజించాలి. శుభ ప్రయత్నంచేత శుభఫలితము, అశుభ ప్రయత్నంచేత అశుభ ఫలమూ కల్గుతాయి. నిన్నటి దుష్టాచరణం నేటి ఉత్తమాచరణతో శుభత్వం ఎలా పొందుతుందో అలా పూర్వకర్మ కూడ ఇప్పటి కర్మచేత శుద్ధత్వం పొందుతుంది. ఇప్పటి శుభప్రయత్నం విఫలమవుతుంటే పూర్వజన్మలో దోషం హెచ్చుగా ఉందని గ్రహించాలి.

ఆత్మజ్ఞానం చేత అజ్ఞానం తొలగి ఏ పరిపూర్ణమైన ఆనందం కల్గుతుందో దాన్ని విజ్ఞులు పరమార్ధమని అన్నారు. పూర్వపు దుష్కర్మలు ఇప్పుడు ప్రాయుశ్చిత్తం మొదలైన సత్కార్యాలతో శుభాలుగా మారుతాయి. పురుషప్రయత్నంతో ఆత్మజ్ఞానాన్ని పొందటమే ఈ జన్మయొక్క ఉద్దేశ్యం. గురుశుశ్రూష, శ్రవణ మననాది క్రియలు, సజ్జన సాంగత్యము, శాస్త్రము మొదలైన వాటితో తీక్షణం చెయ్యబడిన బుద్ధితో స్వయంగా ఆత్మ ఉద్ధరించ బడుతుంది. పరికించి చూస్తే జీవులందరూ వారికి సంభవించిన ఆపదలన్నిటినీ తమ పురుషప్రయత్నంతోనే దాట గలిగేరని తెలుస్తుంది. అంచేత అశుభ కార్యాల్లో ప్రవేశించే చిత్తమును స్వప్రయత్నంచేత శుభకార్యాల్లో లగ్నం చెయ్యాలి. ఇదే అన్ని శాస్త్రాల సారాంశం.

పూర్వజన్మ వాసనలు శుభములని, ఆశుభములనీ ఈ రెండిటిలో ఒకటై ఉంటాయి. పూర్వపు శుద్ధవాసనలచే ప్రేరేపించబడితే ఇప్పటి శుభప్రయత్నంచేత క్రమంగా మోక్షం లభిస్తుంది. కాని ఆశుభవాసనలచేత కష్టాలు, ప్రయత్నానికి ఆటంకాలు కల్గుతుంటే వాటిని ఇప్పటి అధిక శుభప్రయత్నంతో బలవంతంగా జయించాల్సి ఉంటుంది. చిత్తమును బలాత్కారంగా ఆశుభమార్గం నుండి నివారించి శుభ మార్గంలో నిలపాలి. అభ్యాసంచేత వాసనలు ఘనీభవిస్తాయి. కాబట్టి శుభవాసనలనే మరల మరల అభ్యసించాలి. విషయాసక్తితో ఉండే ఇంద్రియాలను పురుష ప్రయత్నంతో నియంత్రించి మనస్సును సమత్వంగా ఉంచాలి. సంసార వాసనను పూర్తిగా త్యజించాలి.




Thursday, May 2, 2013

పురుష ప్రయత్నము -1


ఇంద్రియానుభావాలు చిత్తంలో సంస్కారాలుగా నిక్షిప్తమై ఉంటాయని తెలుసుకున్నాం. మనం ఒక అనుభవాన్ని పొందుతున్నపుడే సంస్కారం ఒక గుర్తులా ఏర్పడుతుంది. బాహ్యవస్తు ప్రేరణ వల్ల అయా సంస్కారం తిరిగి జాగృతం అవుతుంది. అపుడు అంతరంగంలో ఆలోచన ఏర్పడుతుంది. మనస్సులో వృత్తులన్నీ అణిగితే ఇక మిగిలేది అంతఃకరణం మాత్రమే. వృత్తులు అణిగిపోయేప్పుడు సంస్కారాలను మిగుల్చుతాయి. ఈ సంస్కారాలు అనుకూల పరిస్థితులు కలిగినపుడు మళ్ళీ తలెత్తుతాయి. ఇలాంటి సంస్కారాలను సంయమనంతో గమనించడం వల్ల, అలా మిగిలియున్న సంస్కారాలను గురించిన ఎరుక మనకు కలుగుతుంది.
 
ఈ ప్రపంచంలో పూర్తి అనుభవజ్ఞానం పొందేవరకూ అనేక శరీరాలను ధరించవలసి వస్తుంది. అలా జన్మలను ఈ సంస్కారాల వల్ల పొందుతూంటాం. లభించిన జన్మకుతగినట్లుగా సంస్కారాలు ప్రారబ్దముగా అనుభవంలోకి వస్తాయి. ఇంకా మిగిలిన సంస్కారాలు బీజరూపంలో మనలో ఉంటాయి. ఇలా ప్రపంచంలో జీవించి ఉండగా పొందిన అనుభవాల్లో ముఖ్యమైన వాటితో తిరిగి జన్మిస్తుంటాం. ఇలా జన్మ తీసుకున్నపుడు గతజన్మలో మనం ఎంతవరకూ ఉన్నతిని చెందామో, అక్కడినుండి వాసనలు ప్రేరేపించబడి జీవయాత్ర కొనసాగిస్తాం. ఇలా మన సంస్కారాలు, వాసనలే మనలను బందీలను చేస్తున్నాయి. ఈ విధంగా గడచినా అనేక జన్మలనుంచి వాసనలను, కర్మలను ప్రోగుచేసుకుంటూ వస్తున్నాం. 

మూఢనమ్మకాలు, అనేకభావాలు మనలో గాఢంగా నాటుకొని ఉన్నాయి. సరైన విచారణ ద్వారా వీటిని నిర్మూలించాలి. దురాకర్షణలకు దూరంగా ఉంటూ ధ్యానము, మంత్రజపము, సజ్జనసాంగత్యం మొదలైన వాటివల్ల సంస్కారాలచే ఏర్పడ్డ పాతఅలవాట్లను మార్చవచ్చు. అలవాట్లు మారుతాయనేది మనందరకూ తెలిసినదే. చూసుకుంటే చిన్నప్పుడు ఉన్న అలవాట్లు ఉప్పుడు ఉండవు. ఇప్పుడుండే అలవాట్లు కొంతకాలం పిదప మరుగై, క్రొత్తఅలవాట్లతో బదిలీ చెయ్య బడుతుంటాయి. ఈ విశ్లేషణ ఆధారంగా మనలో ఉండే వాసనలను కూడ మార్చుకోవచ్చుననేది సుస్పష్టం. అంటే మనలో ఉండే మలిన వాసనలను శుభ వాసనలతో భర్తీ చెయ్యవచ్చును. 

మనం ఏవిషయం గురించి ఆలోచిస్తే మనస్సు ఆవిషయాకార వృత్తిని పొందుతుందని చెప్పుకున్నాం. ఆ విషయానుభవం  తనదైన శైలిలో ఉపచేతన ( subconscious mind) లో ఏర్పరచి, తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడం కూడ జరుగుతుంటుంది. ఆ గుర్తు ఆలోచనా రూపాన్ని పొంది కర్మ చెయ్యడానికి ప్రేరేపిస్తుంది. సాధనలో గత వాసనా చిహ్నాలను క్రొత్త అనుభవాలతో పూరించడమే చెయ్యాలి. దీన్నే పురుషప్రయత్నంగా చెబుతారు. మహాత్ముల ఉపదేశానుసారం చేసే మనోవాక్కాయ చేష్టలనే పురుషప్రయత్నంగా యోగవాశిష్టంలో చెప్పబడింది. మధ్యలో విరమించక, పురుషప్రయత్నం కొనసాగిస్తే సాధకుడు తన ప్రయత్నంలో సఫలీకృతుడవుతాడు.