Friday, May 31, 2013

"ఓం" కారము -3



ఇక నాల్గవపాదంగా చెప్పబడే ప్రణవం నాదముఅని చెప్పబడుతోంది. ఇది తురీయావస్థ అనవచ్చు.  దీన్లో ఉండే తురీయుడు స్వప్నంలో అంతర పదార్ధాలను ఎరిగజేసే తైజసునికన్న భిన్నమైనవాడు. పై మూడు అవస్థలకన్నఇది భిన్నము. తురీయుడు ఇట్టివాడని చెప్ప శక్యంకాని వాడు. కర్మేంద్రియాలతోగాని , జ్ఞానేంద్రియాలతో  గాని గుర్తించే లక్షణం లేనివాడు. అన్ని వస్తువులలోను ఉండి వాటిని నియమించే వాడు. అనుమానప్రమాణం చేతనే ఎరుగదగిన వాడు. జ్ఞానమనే సారం తత్వంగా గలవాడు. అద్వితీయుడు. 
 
ఈ తురీయుడే దుఃఖకారణమైన సంసారాన్ని నిర్మూలించేవాడు. జాగ్రదావస్థలో అజ్ఞానంతో ఉండే జీవుడు నేను కాని శరీరాన్ని నాది నేను అనే భావాన్ని, నావి కాని బాహ్యపదార్ధాలను నావి అనే భావాలను కలిగించేది విశ్వుడు. స్వప్నావస్థలో భాసించే తాను కాని శరీరమందు తాననే అహంకార భావాన్ని , తనవి కాని స్వప్నపదార్దాలందు నావి అనే మమకార భావాన్ని కల్గించేది తైజసుడు.

సుషుప్తిలో ప్రాజ్నుడు జీవునకు అజ్ఞానంచేత కల్గే తాను, తనవి అనే భావాలు కలుగకుండా చేస్తాడు.

తురీయం అజ్ఞానం ఉండని బంధంలేని అవస్థ. దీన్లో తురీయుడు తక్కిన ముగ్గురు లాగ జీవునికి భ్రాంతిని గాని, అజ్ఞానాన్ని గాని కలిగింపడు. అప్పుడు ఉండేది యదార్ధ జ్ఞానమే. మిధ్యాజ్ఞానాన్ని నశింప జేస్తాడు. తురీయంలో జాగ్రత్తులో ఉండే బాహ్యవిషయజ్ఞానం గాని, స్వప్నంలో ఉండే అంతరవిషయ జ్ఞానం గాని ఉండదు. ఐతే సుషుప్తిలో స్వరూప విషయజ్ఞానం ఉండదు. తురీయుడు సత్యపదార్ధాన్నిగాని, భ్రాంతిజనిత పదార్ధాన్నిగాని ఎరుగకుండా చేయువాడు గాని కాదు.  ముక్తిదశలో భోగ్యములైన అన్ని పదార్దాలనూ జీవునకు ప్రకాశింప జేస్తాడు. ప్రాజ్ఞుడు సుషుప్తిలో జీవునకు తనను గూర్చినగాని, యితరుల గూర్చిన గాని ఎరుక కలిగేలా చేస్తాడు. అంతేగాక స్వరూప సుఖం తప్ప వేరొకటి తెలియకండా చేస్తాడు ప్రాజ్ఞుడు.  తురీయుడు అట్లు చెయ్యడు. తురీయమందలి బ్రహ్మస్వరూపం సుషుప్తిలోవలె అజ్ఞానంతో కూడినది కాదు. ప్రాజ్ఞునికి ఉండేది కేవలం స్వరూపజ్ఞానం మాత్రమే గాని విషయానుభవం కాదు. కాని తురీయుడు అట్టివాడు కాదు. ప్రాజ్ఞుడు జ్ఞానమే ప్రధానంగా గలవాడు. కాని తురీయుడు సర్వజ్ఞుడు. సమాధిలో నిరంతరము జ్ఞానాన్ని కలుగజేస్తాడు తురీయుడు. 

సుషుప్తి తురీయాల్లో ద్వైతభావము ఉండదు. ఇల్లు శరీరం మొదలైనవి తన యిష్టం వచ్చినట్లుగా వినియోగించ దగినవే అనేది ద్వైతభావం. జాగ్రత్తు స్వప్నాల్లో ఉండే భ్రాంతికి అజ్ఞానం కారణం. అజ్ఞానమే బంధకారణం. సుషుప్తిలో కేవలం అజ్ఞానం ఉంటుంది. జీవుడు అజ్ఞానం చేత తాను కాని శరీరాన్ని తానని, తనవి కాని వస్తువులను తనవని భ్రాంతి చెందుతాడు. వాస్తవం తెలియక పోవడమే నిద్రకు మూలమైన అవిద్యకు కారణం. నిద్రచే కల్గే భ్రమ తొలగితే జీవుడు ముక్తుడవుతాడు. దేహం నాది, ఇల్లు నాది అనే బంధమే ప్రపంచం. ప్రపంచానికి ఉనికి లేదు. అది భగవదధీనం. ఈ బంధం భగవదనుగ్రహం వల్లే పోతుంది. అట్టి అనుగ్రహంవల్ల బ్రహ్మము తప్ప రెండవ వస్తువు లేదని అనుభవము కల్గుతుంది. ఈ అజ్ఞానం మహాపురుషుల ఉపదేశం చేత తప్పకుండ నశిస్తుంది.








No comments:

Post a Comment