Friday, May 24, 2013

"ఓం" కారము -2


ప్రణవమందలి రెండవ పాదముగా స్వప్నావస్థ యందు అంతర్యామిగా ఉండు తైజసుడు కారముచే ఉపాసించ బడుచున్నాడు. ఈ అవస్థయందు ఆత్మతప్ప యితర అనుభవములు గోచరింపని పదార్ధములను ఎరిగించువాడుగా ఉండును. స్వప్నమందు శిరస్సు నేత్రము ప్రాణము నడుము మూత్రకోశము పాదములు అనువానితో కూడిన జీవుడు ఏడు అంగములతోను, పంచజ్ఞానేంద్రియములు  పంచకర్మేంద్రియములు పంచప్రాణములు  అంతఃకరణ చతుష్టయము కలసి పందొమ్మిది ముఖములు కలవాడై యుండును. బాహ్యవిషయములకన్న ప్రత్యేకమైన స్వాప్నిక పదార్ధములను అనుభవించు జీవునియందు అధిష్టాతగా వెలసిల్లుచుండును. స్వప్నమందు సూక్ష్మపదార్ధములను తేజస్సువలె ప్రకాశింపజేయు వాడగుటచే తైజసుడని పిలువబడు చున్నాడు. ఇతడు కంఠస్థానమున స్థితుడై వీటిని అనుభవించు చుండును. వైశ్వానరుడు బహిఃప్రజ్ఞుడు. తైజసుడు అంతఃప్రజ్ఞుడు. 

మూడవ పాదముగా ప్రణవంలోని కారమును  సుషుప్తియందలి ప్రాజ్ఞుడు ఉపాసించబడు చున్నాడు. సుషుప్తిలో గాఢనిద్ర ఉండటంచేత ఇంద్రియములు, మనస్సు పనిచెయ్యవు. ఒళ్ళు కూడా తెలియదు. ఆనందముగా ఉంటాడు. ఈ స్థితిలో ఒక వస్తువు కావాలని గాని, అక్కర్లేదని గాని ఉండదు. అందుకే బాహ్యమైన స్థూలపదార్ధాలు గాని, ఆంతరంగికమైన సూక్ష్మపదార్ధాలు గాని జీవునిచే అనుభవింప బడవు. జీవుడు పరమాత్మకన్న వేరుగాఉన్నట్లు తెలియనంత లీనమై ఉంటాడు. దీన్ని సంస్కృతంలో స్వపితి అంటే నిద్రించుచున్నాడని అంటారు. దీన్లో జీవస్వరూపం తప్ప ఇతరమైన బాహ్యపదార్దాలుగాని, అంతరపదార్ధాలు గాని ఎరుగడు గనుక ప్రాజ్ఞుడు అనబడుచున్నాడు. సుషుప్తిలో భ్రాంతి ఉండదు. కేవలం నిద్ర అనే అజ్ఞానమే ఉంటుంది. 

ఇలా వివిధ అవస్థల్లో వ్యవహరించే బ్రహ్మము సర్వజ్ఞుడుగా వాటిని నియమిస్తూంటాడు. ఇవన్నీ భిన్నరూపాలు గావు. అంతా ఒకే బ్రహ్మము. విశ్వుడు కుడి కన్నుయందును, తైజసుడు -  కంఠస్థానంలో మనస్సు నందునూ, ప్రాజ్ఞుడు హృదయ స్థానమున అధిష్టానులై ఉందురు. లోకంలో స్థూలమైన భోగ్యవస్తువులు వైశ్వానరునికి, యితరులకు కనిపించని స్వాప్నిక పదార్దములు తైజసునికి, సుషుప్తి యందలి ఆనందము ప్రాజ్ఞునికి త్తృప్తిని కలిగిస్తాయి. ఇలా అన్ని అవస్థల్లోను జీవుడు అనుభవించే ఆయా పదార్ధాలను అనుభవింప చేసేది ఆ సర్వేశ్వరుడే. ఈ అనుభవాలను పొందేది జీవుడు కాదు, ఆ సర్వేశ్వరుడే నని తెలిస్తే ఏ వికారము అంటదు. ఇలా ఏది అనుభవించబడుతుందో ఆ అనుభవించే వాడినీ, అనుభవింపబడెడు వాడినీ ఎవరు ఎరుగుదురో వాడు సర్వమునూ అనుభవించినా బంధమనేది ఉండదు. బ్రహ్మమే జడమైన ప్రకృతిగాను, చైతన్యవంతమైన జీవునిగాను పరిణమించేది. దీన్నే విభూతి అంటారు. విభూతి అంటే వివిధముగా అవ్వడం.

No comments:

Post a Comment