Wednesday, May 8, 2013

పురుష ప్రయత్నము-2

గతజన్మలో చేసిన పురుషప్రయత్నం ఈజన్మలో చేసే పురుషప్రయత్నంచేత జయించ బడుతుంది. శాస్త్రానుసారం చేసే ప్రయత్నం పరమార్ధంకోసమైతే, దానికి విరుద్ధమైన ప్రయత్నం అనర్ధాలకు దారితీస్తుందని విజ్ఞులు చెబుతారు. పూర్వపు అశుభప్రయత్నం శమించిపోనంత వరకూ ఇప్పటి శుభ పురుషప్రయత్నం చేస్తూండాలి. అంచేత సంసార సముద్రాన్ని దాటడానికి శమదమములు, శ్రవణ మననాది సంపత్తినీ సంపాదించే పురుషప్రయత్నం చెయ్యాలి. ఈ శరీరం శాశ్వతం కాదనే విషయాన్ని నిరంతరము చింతన చెయ్యాలి. విషయ సుఖాలయందు ఆసక్తి త్యజించాలి. శుభ ప్రయత్నంచేత శుభఫలితము, అశుభ ప్రయత్నంచేత అశుభ ఫలమూ కల్గుతాయి. నిన్నటి దుష్టాచరణం నేటి ఉత్తమాచరణతో శుభత్వం ఎలా పొందుతుందో అలా పూర్వకర్మ కూడ ఇప్పటి కర్మచేత శుద్ధత్వం పొందుతుంది. ఇప్పటి శుభప్రయత్నం విఫలమవుతుంటే పూర్వజన్మలో దోషం హెచ్చుగా ఉందని గ్రహించాలి.

ఆత్మజ్ఞానం చేత అజ్ఞానం తొలగి ఏ పరిపూర్ణమైన ఆనందం కల్గుతుందో దాన్ని విజ్ఞులు పరమార్ధమని అన్నారు. పూర్వపు దుష్కర్మలు ఇప్పుడు ప్రాయుశ్చిత్తం మొదలైన సత్కార్యాలతో శుభాలుగా మారుతాయి. పురుషప్రయత్నంతో ఆత్మజ్ఞానాన్ని పొందటమే ఈ జన్మయొక్క ఉద్దేశ్యం. గురుశుశ్రూష, శ్రవణ మననాది క్రియలు, సజ్జన సాంగత్యము, శాస్త్రము మొదలైన వాటితో తీక్షణం చెయ్యబడిన బుద్ధితో స్వయంగా ఆత్మ ఉద్ధరించ బడుతుంది. పరికించి చూస్తే జీవులందరూ వారికి సంభవించిన ఆపదలన్నిటినీ తమ పురుషప్రయత్నంతోనే దాట గలిగేరని తెలుస్తుంది. అంచేత అశుభ కార్యాల్లో ప్రవేశించే చిత్తమును స్వప్రయత్నంచేత శుభకార్యాల్లో లగ్నం చెయ్యాలి. ఇదే అన్ని శాస్త్రాల సారాంశం.

పూర్వజన్మ వాసనలు శుభములని, ఆశుభములనీ ఈ రెండిటిలో ఒకటై ఉంటాయి. పూర్వపు శుద్ధవాసనలచే ప్రేరేపించబడితే ఇప్పటి శుభప్రయత్నంచేత క్రమంగా మోక్షం లభిస్తుంది. కాని ఆశుభవాసనలచేత కష్టాలు, ప్రయత్నానికి ఆటంకాలు కల్గుతుంటే వాటిని ఇప్పటి అధిక శుభప్రయత్నంతో బలవంతంగా జయించాల్సి ఉంటుంది. చిత్తమును బలాత్కారంగా ఆశుభమార్గం నుండి నివారించి శుభ మార్గంలో నిలపాలి. అభ్యాసంచేత వాసనలు ఘనీభవిస్తాయి. కాబట్టి శుభవాసనలనే మరల మరల అభ్యసించాలి. విషయాసక్తితో ఉండే ఇంద్రియాలను పురుష ప్రయత్నంతో నియంత్రించి మనస్సును సమత్వంగా ఉంచాలి. సంసార వాసనను పూర్తిగా త్యజించాలి.




No comments:

Post a Comment