ప్రపంచంలో ఉండే వస్తువులు, విషయాలపై ఆకర్షణ ఉంటుంది. ఇవన్నీ శాశ్వతంకావని గ్రహించడంచేత, వాటిపై అనురక్తి పోయి, విరక్తి కలుగుతుంది. అలాంటిభావన వైరాగ్యానికి దారితీస్తుంది. సాధనచతుష్టయం వల్ల మనోనిగ్రహం కలుగుతుంది. అప్పుడు సాధకుడు సర్వాన్నీ ఆత్మగానే చూస్తాడు. శ్రవణ,మనన,నిదిధ్యాసనాలవల్ల సమాధిస్థితి లభిస్తుంది. ఆత్మ స్వరూపాన్నే ధ్యానించడంవల్ల, ఆత్మసాక్షాత్కారమై, తనే బ్రహ్మమవుతాడనేది క్రమంగా సాధనవల్ల కలిగే ఫలమని చెప్పబడింది.
దీనికోసం ముందుగా సద్గురువునుండి
ఆత్మవిద్య నేర్చుకోవాలి. నేర్చినదాన్ని మనస్సుకు పట్టించుకొని, దాన్ని ఆచరణలో
పెట్టగలగాలి. ఇదివరలో మనస్సు గురించిన విశేషాలు చెప్పుకున్నపుడు, అదెలా
మలినమవుతుందో తెలుసుకున్నాం. మనస్సు మలినంగా ఉండటంవల్ల ఎప్పుడూ చలిస్తూ చంచలంగా
ఉంటుంది. అలాంటి మలినమైన మనస్సులో ఏదీ సరిగా ప్రతిబింబం చెందదు. అంటే దేన్నీ, సరైన
దృష్టితో చూడలేం. అందుచేత ముందుగా భక్తిద్వారా మనస్సును ఏకాగ్రం చెయ్యాలి. పిదప ఆమాలిన్యాన్ని/మురికిని వదిలించుకోవాలి. దానికోసం శాస్త్రసమ్మతమైన కర్మలను
చేస్తూండటం వల్ల, క్రమంగా చిత్తంశుద్ధమై నిర్మలంగా ఉండగల్గుతుంది. అలా నిర్మలము,
ఏకాగ్రము అయిన మనస్సులో అన్నివిషయాలూ స్పష్టంగా కనిపిస్తాయి. ఇలా, సాధనక్రమం
తప్పకుండా కొనసాగిస్తూంటే, ఆ సాధనే తర్వాత మార్గాన్ని సాధనచతుష్టయం
నిర్దేశిస్తుంది.
మనస్సుయొక్క స్థితి, సత్వరజస్తమోగుణాల
కలయిక ఎలాఉందో, దాన్నిబట్టి ఉంటుంది. వర్ణాశ్రమధర్మమంటే, తను పుట్టిన కులంగాక,
వాసనలచేత ఏర్పడ్డ మనస్సుయొక్క గుణాధిక్యతనుబట్టి వర్ణం అనేది నిర్ణయించ బడుతోందని
శాస్త్రం. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం,
వానప్రస్థం, సన్యాసం అనేవి నాలుగూ ఆశ్రమాలుగా చెప్పబడ్డాయి. ఒకవ్యక్తి యొక్క
మానసికస్థితి, ఈ ఆశ్రమాల జీవనవిధానంపై ఆధారపడి ఈ వర్ణాశ్రమధర్మాలు నిర్ణయించ
బడుతాయి. దానికి అనుగుణంగానే సాధన జరగాలి.
కర్మానుష్టానమూ జరగాలి. మనస్సును అదుపులో ఉంచుకొని, సాధనచతుష్టయంలో
అడుగిడాలి.
No comments:
Post a Comment