Saturday, August 31, 2013

జ్ఞానయోగము- సాధన (5)


విషయనిందను గురించి చెప్పే సందర్భంలో శంకరులు వివేకచూడామణి( 78 ) లో
“శబ్దాదిభిః పంచభిరేవ పంచ
పంచత్వమాపుః స్వగుణేన బధ్ధాః
కురంగ మాతంగ పతంగ మీన
భృంగా నరః పంచభిరంచితః కిమ్”
అంటే శబ్దాది విషయాలమీద ఉండే జీవులు ఎలా బంధానికి గురవుతున్నాయో చెబుతూ, లేడి అతివేగంగా పరుగుతీయగలిగేదైనా, స్వభావసిద్ధంగా దానికున్న శబ్దప్రీతిచేత, వేణువు శబ్దానికి తన్మయత్వంతో నిశ్చలంగా ఉండిపోతుంది. అందుకే వేణువును ఊది, ఈ ఉపాయంతో బోయవాడు లేడిని బంధిస్తాడు. ఇలా లేడి శబ్దప్రీతితో బంధానికి చిక్కుకుంటోంది.

ఏనుగు బలమైనదే. అరణ్యంలో స్వేచ్ఛగా తిరుగుతూంటుంది. అంతటి బలమైన ఏనుగూ స్పర్శప్రీతివల్ల, ఆడ ఏనుగును ఎరగా చూపి ప్రలోభపెట్టి దాన్ని బంధించడం చేస్తుంటారు.
మిడుత అగ్నియొక్క ప్రకాశానికి రూపప్రీతివల్ల, అగ్నివేపుకి ఆకర్షించబడి అగ్నికి ఆహుతి అవుతుంది.
చేప రుచికి ప్రలోభపడి రసప్రీతిచేత గాలానికి గ్రుచ్చే మాంసానికి ఆకర్షించబడి ఎరకు చిక్కుకుంటుంది.
భ్రమరం (తుమ్మెద) సంపంగి పుష్పపు (చంపక పుష్పం) సువాసనకు, దానికిగల స్వభావసిద్ధమైన గంధప్రీతిచేత ఆకర్షించబడి, పుష్పాన్ని చేరాలనే కఠినతాపత్రయంలో సాటి భ్రమరములతో ఉండే పోరాటంలో ఇది నశిస్తుంది. **
దీన్నే కొన్నిచోట్ల ఇలా విశ్లేషించారు. భ్రమరం పూర్తిగా విచ్చుకున్న తామరపుష్పపు సువాసనకు ఆకర్షించబడి, దానిపైనే కూర్చుండి పోతుంది. సూర్యాస్తమయ సమయానికి పుష్పం ముడుచుకుంటుంది. ఆ సుగంధపు మత్తులో గంధప్రీతిచేత పుష్పంమీదే ఉండిపోడంవల్ల దాన్లో చిక్కుకుంటుంది.

ఇలా శబ్దాదివిషయాల్లో పైన పేర్కొన్నట్లుగా  ఒక్కొక్క ఇంద్రియం మీద మాత్రమే ప్రీతి ఉంటే అవన్నీ ఆపదల్లో చిక్కి, తమ నాశనాన్ని తెచ్చుకుంటుంటే,  ఈ ఐదు ఇంద్రియవిషయాల  మీదా  అనురక్తితో ఉండే మానవుడి విషయంలో ఏమి చెప్పగలం? అంటారు. అంచేత కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించకపోతే, ఈ ప్రపంచంలోనే గాకుండా మరుజన్మలోనూ దుఖాన్ని అనుభవించాలి గదా! అందుకే శమదమాలను ఆచరిస్తూ మనస్సును, ఇంద్రియాలను జాగరూకతతో ఎప్పటికప్పుడు నియంత్రించడమే దీన్లో సాధన అంటారు.


 

Friday, August 23, 2013

జ్ఞానయోగము- సాధన (4)

శమాది షట్క సంపత్తి  

దీన్లో  శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము  అని ఆరుఅంగాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే  జ్ఞానం  కలుగుతుందని విజ్ఞులు చెబుతారు. గతజన్మ వాసనలవల్ల  శబ్ద స్పర్శ రూప రస గంధాలనే ఇంద్రియ విషయాలకోసం, మనస్సు  తహతహ లాడుతుంటుంది. ఈ విషయాలను వివేక వైరాగ్యాలతో  పరిశీలిస్తే, ఇవి  దోషపూరితాలని తెలుస్తుంది.  వీటికై వెంపర్లాడటం ఆత్మజ్ఞానానికి  ఆటంకమని  గ్రహిస్తాడు. అప్పుడు  వీటిని విసర్జించి, అంటే  వీటికి  దూరంగాఉంటూ సాధన కొనసాగిస్తాడు. ఆత్మయే  సుఖశాంతులకు నిలయమని  తెలిసి, మనస్సును  అట్టివాసనలనుండి పుట్టేకోరికలను  నియమిస్తూ, సాధనాభ్యాసాన్ని చేస్తుంటాడు. మనస్సును  నియమించడం శమంలోకి వస్తుంది.

ఇక్కడ మనస్సును, ఇంద్రియాలనూ  ఒకేసారి నిగ్రహించాలి. శమం  మనస్సును నియమించడం  ఐతే దమం  ఇంద్రియాలను  నియమించడం. అంటే  శమ దమాలను  ఒకేమారు  నిగ్రహించాలి. అంటే  ఒకదాని పిదప మరొకటిగా  గాక  రెండిటినీ  కలిపే,  సాధన ఉండాలి. జ్ఞానేంద్రియాలు  తమంత  తాము  పనికి పూనుకోకపోయినా, కర్మేంద్రియాలు  వాటి పనిని, అవి చేస్తూనే ఉంటాయి. జ్ఞానేంద్రియాలు  ప్రాపంచిక విషయాలను గ్రహించి  అనుభవిస్తుంటాయి. వీటివల్లే  జీవుడు మాయా సంసారంలో  చిక్కుకుంటున్నాడు. సాధనలో ఇంద్రియాలను  నియమించే  దమము అవుసరం అందుకే.

కళ్ళూ చెవులూ  మూసుకొని, కాళ్ళూ  చేతులూ బంధించి ఉంచినా, ఇంద్రియాలు  ఏ విషయాన్నీ అనుభవించక పోయినా, మనస్సు  ఏవేవో ఊహించుకొంటూనే ఉంటుంది. అంటే  మనస్సే ఇంద్రియాలను  ప్రేరేపించేదని  తెలుస్తోంది. అందుకే  శమము  ముందుగాను, దమము తర్వాత వస్తాయి. ఐనా రెండిటినీ  ఒకేసారిగా  అభ్యసిస్తూ నిగ్రహించాలి. శమదమాలవల్ల  మనస్సు  ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు  ఆగిపోతే ఆత్మ ప్రకాశిస్తుంది. శమదమాలున్నవాణ్ని  సన్యాసి  లేక యతి అంటారు.

మనస్సులో  ఉత్పన్నమయ్యే  కోరికలను  ఎప్పటికప్పుడు నిరసిస్తూ, త్యజిస్తూ జాగరూకతతో  ఉండటం శమాన్ని, ఇంద్రియాల ద్వారా  విషయాలు లోపలికి  ప్రవేశించకుండా నిగ్రహించడం దమాన్ని సూచిస్తాయి. అంటే  బాహ్యాభ్యంతర  విషయాలవల్ల మనస్సు చలించకుండా జాగ్రత్త పడటం శమదమాలని  చెప్పబడింది. 




Thursday, August 15, 2013

జ్ఞానయోగము- సాధన (3)


వైరాగ్యము 

ఇంద్రియాలెప్పుడూ విషయసుఖాలను అపేక్షిస్తాయి. కోరికలను కలుగ జేస్తుంటాయి. మనం చెయ్యాల్సిన పనులెన్నో ఉంటాయి. ముందుగా మనం చెయ్యకూడని పనులను వదిలెయ్యాలి. వైరాగ్యంఅంటే ఎలాంటి కోరికా లేకుండా ఉండటం. అంటే కోరికలను విడిచిపెట్టడం.

బ్రహ్పదవి మొదలుకొని గడ్డిపోచ దాకా ఉండే  సృష్టి అంతటమీదా, ఎలాంటి కోరికాలేకుండా ఉండటం వైరాగ్యం. అంటే ఈలోకంలో ఉండే సుఖాలనుండి పరలోకసుఖాల  పర్యంతమూ,  ఏవిధమైన కోరికా లేకుండటమే గాక  ఏహ్యభావం /జుగుప్స/రోత కలిగి ఉండటాన్ని వైరాగ్యం తెలియజేస్తుంది. ఈ ఏహ్యభావం ఎలాంటి దంటే కాకిరెట్ట మీద ఎట్టి ఏహ్యభావం ఉంటుందో, అలా అన్నివిషయాల పట్లా ఎంతమాత్రమూ  ఆకర్షణలేకుండా ఉండట
మన్నమాట. అంటే చూసే వస్తువులన్నిటినీ విడిచిపెట్టాలనే భావనకలిగి ఉండటం.

మనస్సు మనకు తెలియకుండానే విషయాలవేపుకి పోతుంటుంది. అప్పుడు బుద్దిచేత  అట్టివిషయాల  వ్యర్ధత్వాన్ని, వాటి  మిధ్యత్వ, అశాశ్వతత్వాన్ని గుర్తుచేసుకుని, మనస్సును వాటినుంచి మళ్ళిస్తూ ఉండాలి. దీనికే వైరాగ్యం  అవుసరం. వైరాగ్యంతోఉన్న మనస్సు,  విషయవాంఛలవేపుకి  పరుగులు తీయదు. అలాంటి మనస్సే  ఉన్నతమైన  ధ్యానంలో  నిశ్చలంగా  ఉండగల్గుతుంది.

కర్మమార్గంలో  ఉండేవారు  కూడా  యజ్ఞయాగాదులు చేసి  సంపాదించే  స్వర్గసుఖంకూడ అనిత్యమని తెలిసి,  వారు వైరాగ్యాన్ని అభ్యసిస్తారు. అప్పుడే బ్రహ్మజిజ్ఞాసకు పూనుకుంటారు. సాధకుడు  కోరికచేత  చంపబడని వాడు  కావాలి. ఎలాంటి కోరికైనా  మనస్సును  ఆక్రమిస్తే, దాన్ని త్యజించటమే వైరాగ్యం. వైరాగ్యంవల్ల  చిత్తము  యొక్క  చంచలత్వం  అదుపులోకి  వస్తుంది.

మనం  వింటున్నదానిమీద గాని, విన్నదానిమీదగాని, వినబోయే దానిమీద గాని  కోరిక ఉండకూడదు. అలాగే  చూస్తున్న  దానిమీద గాని, చూసిన దానిమీదగాని , చూడబోయే  దానిమీదగాని ఎలాంటి కోరికా  ఉండకూడదు. ఇలా యివన్నీ కలిపితే, దాన్ని  వైరాగ్యమని  చెప్పవచ్చు. దేనిమీదైనా  అనురాగం కలిగితే,  అది కోరికగా  మారుతుంది. అంటే  కోరికకూ, అనురాగానికీ  కార్యకారణసంబంధం ఉంటుంది.

అందుకే  వివేకవైరాగ్యాలు  కలిసే  ఉండాలి. ఏది  నిత్యం, ఏది అనిత్యం  అనేది  గ్రహించి  వైరాగ్యంతో  అనిత్యమైన వాటిని  గెంటివెయ్యాలి. అలా  సమబుద్ధి  కలిగి ఉండటం  సాధనకు  తొలిమెట్టు. సాధనచతుష్టయంలో  అంగాలను  మనకు  తెలియడానికి  ఒకదాని తర్వాత  మరొకటిగా  ఒక క్రమపద్ధతిలో  చెబుతున్నా, అన్నిటినీ కలిపి  ఒకేమారు సాధనలో  కొనసాగించాలి. అంటే  ఒకదానిపై  ఎక్కువఏకాగ్రత, మరొకదానిపై కొంచెం తక్కువ  ఏకాగ్రతా  ఉంచుతూ అభ్యాసం  ముందుకు సాగాలి.







Thursday, August 8, 2013

జ్ఞానయోగము- సాధన (2)

సాధనచతుష్టయంలో ముందుగా ఉండేది నిత్యానిత్య వస్తువివేకము.
  
గురువునుండి ఆత్మవిద్య నేర్చుకున్నవాడు, ఆత్మయే శాశ్వతమైనదని, అసలుసుఖం ఆత్మజ్ఞానం వల్లనే కలుగుతుందని తెలుసుకుంటాడు. నిష్కామకర్మలాచరిస్తూ సాధనచతుష్టయంలోకి అడుగు పెడతాడు. ఈ దృశ్య ప్రపంచంలో ఎన్నో వస్తువులూ, విషయాలూ ఆకర్షణీయంగా కనిపిస్తాయి, మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించేవిగా కూడా అనిపిస్తాయి. మనస్సు ఏకాగ్రమై, కొంతవరకూ నిర్మలంగా ఉంది గనుక నిత్యానిత్య వస్తువివేకం చెయ్యాలి. ఇదీ ఇక్కడసాధన. ఇక్కడ బుద్ధికి పదునుపెట్టాలి. మనకు తెలిసేజ్ఞానమంతా బుద్దిబలం వల్లనే కలుగుతుంది. ఈ ఆకర్షించే వస్తువులూ విషయాలన్నీమనోరంజకంగా అనిపిస్తుంటాయి. ఎందుకంటే ఇంకా తొలిమెట్టులోనే సాధకుడున్నాడు. ఇపుడు వివేచనవల్ల, వీటివలన కలిగేది తాత్కాలికానందమేనని గ్రహిస్తాడు. అపుడు నిత్యమూ, సత్యము ఐనదానికోసం అన్వేషించడం ఆరంభిస్తాడు.

అలా శాశ్వతమైనదేదో, క్షణికము అనిత్యమైనదేదో, అని విచారణచెయ్యడంవల్ల అనిత్యమైనదేదో తెలుస్తుంటుంది. అపుడు అనిత్యమైనవాటిని తననుండి గెంటివేస్తుండాలన్నమాట. ఇలా అభ్యాసం సాగుతుంటే మామూలు సుఖాలకి వెంపర్లాడటం జరుగదు. క్రమంగా మనస్సుయొక్క చంచలత్వం పోతుంది. శాశ్వతమైన వాటిగురించి శాస్త్రాలు చెబుతాయి. మహాత్ములబోధలు, పురాణాలు, తీర్థయాత్రలు అశాశ్వతమైనవేనైనా  అవి శాశ్వతమైన దాన్ని( ఆత్మను) చేరడానికి పరోక్షంగా దోహదం చేస్తాయి. అందుకే వివేకంతో ఏది ఆత్మను చేర్చుతుంది, ఏది చేర్చదో తెలుసుకొని, అశాశ్వతమైన దాన్నల్లా వదిలేస్తుండాలి.

మామూలుగా మనంచేసే పనులను సమర్ధించుకుంటాం. అలాంటి సమర్ధన సబబో, కాదో వివేకంతో గ్రహించాలి. అపుడపుడు ఆత్మవిచారణ నుండి దూరమవ్వడం జరుగుతుంది. ఇంద్రియాలను తృప్తిపరచడం కూడా ఉంటుంది. జాగరూకతతో ఉండి, తిరిగి ఆత్మవిచారణలో నిమగ్నమవుతూ అనిత్యము, క్షణికము ఐనవాటిని వివేకాన్ని ఉపయోగించి గెంటివేయాలి. ఇదంతా బ్రహ్మసత్యం, జగన్మిధ్య అనేది ఒంటబట్టించుకొని దృఢనిశ్చయం కలిగినప్పుడే సాధ్యమవుతుంది. ఇలా పరిమితిగల, అనిత్యమైనవాటిని విసర్జిస్తూ, అనంతమైన ఆత్మను అన్వేషించాలని  ఉపనిషత్తులు చెబుతున్నాయి. నిత్యవస్తువును కనుక్కున్నవానికే శాశ్వతమైన శాంతి లభిస్తుందని చెబుతాయి.



Thursday, August 1, 2013

జ్ఞానయోగము- సాధన (1)


ప్రపంచంలో ఉండే వస్తువులు, విషయాలపై ఆకర్షణ ఉంటుంది. ఇవన్నీ శాశ్వతంకావని గ్రహించడంచేత, వాటిపై అనురక్తి పోయి, విరక్తి కలుగుతుంది. అలాంటిభావన వైరాగ్యానికి దారితీస్తుంది. సాధనచతుష్టయం వల్ల మనోనిగ్రహం కలుగుతుంది. అప్పుడు సాధకుడు సర్వాన్నీ ఆత్మగానే చూస్తాడు. శ్రవణ,మనన,నిదిధ్యాసనాలవల్ల సమాధిస్థితి లభిస్తుంది. ఆత్మ స్వరూపాన్నే ధ్యానించడంవల్ల, ఆత్మసాక్షాత్కారమై, తనే బ్రహ్మమవుతాడనేది క్రమంగా సాధనవల్ల కలిగే ఫలమని చెప్పబడింది.
 
దీనికోసం ముందుగా సద్గురువునుండి ఆత్మవిద్య నేర్చుకోవాలి. నేర్చినదాన్ని మనస్సుకు పట్టించుకొని, దాన్ని ఆచరణలో పెట్టగలగాలి. ఇదివరలో మనస్సు గురించిన విశేషాలు చెప్పుకున్నపుడు, అదెలా మలినమవుతుందో తెలుసుకున్నాం. మనస్సు మలినంగా ఉండటంవల్ల ఎప్పుడూ చలిస్తూ చంచలంగా ఉంటుంది. అలాంటి మలినమైన మనస్సులో ఏదీ సరిగా ప్రతిబింబం చెందదు. అంటే దేన్నీ, సరైన దృష్టితో చూడలేం. అందుచేత ముందుగా భక్తిద్వారా మనస్సును ఏకాగ్రం చెయ్యాలి. పిదప ఆమాలిన్యాన్ని/మురికిని వదిలించుకోవాలి. దానికోసం శాస్త్రసమ్మతమైన కర్మలను చేస్తూండటం వల్ల, క్రమంగా చిత్తంశుద్ధమై నిర్మలంగా ఉండగల్గుతుంది. అలా నిర్మలము, ఏకాగ్రము అయిన మనస్సులో అన్నివిషయాలూ స్పష్టంగా కనిపిస్తాయి. ఇలా, సాధనక్రమం తప్పకుండా కొనసాగిస్తూంటే, ఆ సాధనే తర్వాత మార్గాన్ని సాధనచతుష్టయం నిర్దేశిస్తుంది.

మనస్సుయొక్క స్థితి, సత్వరజస్తమోగుణాల కలయిక ఎలాఉందో, దాన్నిబట్టి ఉంటుంది. వర్ణాశ్రమధర్మమంటే, తను పుట్టిన కులంగాక, వాసనలచేత ఏర్పడ్డ మనస్సుయొక్క గుణాధిక్యతనుబట్టి వర్ణం అనేది నిర్ణయించ బడుతోందని శాస్త్రం.  బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం అనేవి నాలుగూ ఆశ్రమాలుగా చెప్పబడ్డాయి. ఒకవ్యక్తి యొక్క మానసికస్థితి, ఈ ఆశ్రమాల జీవనవిధానంపై ఆధారపడి ఈ వర్ణాశ్రమధర్మాలు నిర్ణయించ బడుతాయి. దానికి  అనుగుణంగానే సాధన జరగాలి. కర్మానుష్టానమూ జరగాలి. మనస్సును అదుపులో ఉంచుకొని, సాధనచతుష్టయంలో అడుగిడాలి.