విషయనిందను గురించి చెప్పే సందర్భంలో శంకరులు వివేకచూడామణి( 78 ) లో
“శబ్దాదిభిః పంచభిరేవ పంచ
పంచత్వమాపుః స్వగుణేన బధ్ధాః
కురంగ మాతంగ పతంగ మీన
భృంగా నరః పంచభిరంచితః కిమ్”
అంటే శబ్దాది విషయాలమీద ఉండే జీవులు ఎలా బంధానికి
గురవుతున్నాయో చెబుతూ, లేడి అతివేగంగా పరుగుతీయగలిగేదైనా, స్వభావసిద్ధంగా
దానికున్న శబ్దప్రీతిచేత, వేణువు శబ్దానికి తన్మయత్వంతో నిశ్చలంగా ఉండిపోతుంది.
అందుకే వేణువును ఊది, ఈ ఉపాయంతో బోయవాడు లేడిని బంధిస్తాడు. ఇలా లేడి శబ్దప్రీతితో
బంధానికి చిక్కుకుంటోంది.
ఏనుగు బలమైనదే. అరణ్యంలో స్వేచ్ఛగా
తిరుగుతూంటుంది. అంతటి బలమైన ఏనుగూ స్పర్శప్రీతివల్ల, ఆడ ఏనుగును ఎరగా చూపి
ప్రలోభపెట్టి దాన్ని బంధించడం చేస్తుంటారు.
మిడుత అగ్నియొక్క ప్రకాశానికి
రూపప్రీతివల్ల, అగ్నివేపుకి ఆకర్షించబడి అగ్నికి ఆహుతి అవుతుంది.
చేప రుచికి ప్రలోభపడి రసప్రీతిచేత
గాలానికి గ్రుచ్చే మాంసానికి ఆకర్షించబడి ఎరకు చిక్కుకుంటుంది.
భ్రమరం (తుమ్మెద) సంపంగి పుష్పపు (చంపక
పుష్పం) సువాసనకు, దానికిగల స్వభావసిద్ధమైన గంధప్రీతిచేత ఆకర్షించబడి, పుష్పాన్ని
చేరాలనే కఠినతాపత్రయంలో సాటి భ్రమరములతో ఉండే పోరాటంలో ఇది నశిస్తుంది. **
దీన్నే కొన్నిచోట్ల ఇలా విశ్లేషించారు.
భ్రమరం పూర్తిగా విచ్చుకున్న తామరపుష్పపు సువాసనకు ఆకర్షించబడి, దానిపైనే
కూర్చుండి పోతుంది. సూర్యాస్తమయ సమయానికి పుష్పం ముడుచుకుంటుంది. ఆ సుగంధపు
మత్తులో గంధప్రీతిచేత పుష్పంమీదే ఉండిపోడంవల్ల దాన్లో చిక్కుకుంటుంది.
ఇలా శబ్దాదివిషయాల్లో పైన
పేర్కొన్నట్లుగా ఒక్కొక్క ఇంద్రియం మీద
మాత్రమే ప్రీతి ఉంటే అవన్నీ ఆపదల్లో చిక్కి, తమ నాశనాన్ని తెచ్చుకుంటుంటే, ఈ ఐదు ఇంద్రియవిషయాల మీదా
అనురక్తితో ఉండే మానవుడి విషయంలో ఏమి చెప్పగలం? అంటారు. అంచేత కర్తవ్యాన్ని సరిగ్గా
నిర్వర్తించకపోతే, ఈ ప్రపంచంలోనే గాకుండా మరుజన్మలోనూ దుఖాన్ని అనుభవించాలి గదా!
అందుకే శమదమాలను ఆచరిస్తూ మనస్సును, ఇంద్రియాలను జాగరూకతతో ఎప్పటికప్పుడు
నియంత్రించడమే దీన్లో సాధన అంటారు.
🙏
ReplyDelete