Tuesday, October 29, 2013

జ్ఞానయోగము- సాధన (14)



సగుణ నిర్గుణాలు
ఉపనిషత్తులు నిర్గుణం గురించే చెప్పాయనే మాటను ప్రమాణంగా తీసుకుని దాన్నే చింతిస్తూ శ్రద్ధతో ముందుకు సాగిపోతే నిర్గుణ బ్రహ్మానుభవం కలుగుతుంది. మనస్సు పనిచేస్తున్నంత వరకూ అప్పుడపుడు ఈశ్వరుడు జ్ఞప్తికి వస్తుంటాడు. అసలు హృదయంలో ఉన్నది నిర్గుణుడే. ఐనా అలా గుర్తుకువచ్చినప్పుడు ఓ భగవంతుడా! నీ దయవల్ల అద్వైతంలో అడుగు పెట్టి , కొద్ది కొద్దిగా పురోగమిస్తున్నాను. నీ కృప కటాక్షాలతో నన్ను అద్వైతానికి చేర్చమని ప్రార్ధించాలి. జ్ఞానమార్గంలో ఇలా అప్పుడపుడు కల్గే భక్తి కొద్ది సమయానికే ఉన్నా , అది సజీవంగా తొణికిసలాడేదిగా ఉంటుంది. కృతజ్ఞతతో ఉండే భక్తి నిత్యమూ ఉరే ఊట వంటిదని చెప్పబడింది. మన ధ్యేయం నిర్గుణం కాబట్టి, సగుణం నుంచి మనస్సును మళ్లించాలి. ప్రేమ ఎటువెళ్ళాలో సూచించే ఏ సగుణమూర్తి ఐనా గురువే. అతడే ప్రేమను నిర్గుణం వేపు మళ్లించి ఉద్ధరించేవాడు. ప్రేమ, భక్తి ఒకదానితో మరోటి అనుబంధం కలిగే ఉంటాయి. ఇప్పుడు ఆత్మనే వరించాలనే తపనతో అనుబంధం కలిగి ఉన్నాం. జీవాహంకారం లేదు. పరమైన వస్తువు పట్ల చూపే, ప్రేమయే భక్తి అనబడుతోంది.

జీవుడికి అనుబంధమనేది జీవం ఉన్నవాటితోనే ఉంటుంది. ఇప్పటి వరకూ సాధన జడంగానే సాగుతోంది. ప్రాణం ఇంకా మహాప్రాణంతో అనుసంధానమవ్వ లేదు. అంటే బౌద్ధులు చెప్పే శూన్యం మాదిరిగానే ఇంతవరకూ ఉంది. కాని వేదాంతంలో చెప్పే బ్రహ్మం శూన్యం కాదు. అది సచ్చిదానందమయం. ఆనంద స్వరూపంగా భావించి ఆ పరిపూర్ణతలో మునిగి పోవడమే ఇందులో జరిగేది. దీనికి ప్రేమతో కూడిన భక్తి అవుసరం. ఇప్పటి వరకూ సాధన శుష్కంగా జరిగినా, ఇకనుండి శ్రవణ మననాదులను భక్తితోను ప్రేమతోను కొనసాగించాలి. బాహ్యప్రపంచాన్ని విడచిన సన్యాసం ప్రేమామృతంతో తడిసినదిగా ఉంటుంది. 

ఇక్కడినుండే మలయమారుతం వీస్తుంది. 
అంచేత సాధకుడు శుష్కప్రాయంగా జీవించడం మానాలి.



           
         
         

Friday, October 25, 2013

జ్ఞానయోగము- సాధన (13)

ఈవిధంగా వేరై,  అహంకారంతో "నేను నేననే" జీవుడు –ఈ “అబద్ధపు నేను”   వస్తుప్రపంచంలో వస్తువులను విషయాలను గ్రహించి, గ్రహించి బాగా బలిసిపోయి మనోబుద్ధులను నియంత్రిస్తోంది. ఇలా మనో బుద్ధులతోను అహంకారంతోను ఉన్న అంతఃకరణాన్ని, ఈ ద్వైత ప్రపంచంనుంచి మళ్లించి పరమాత్మ స్థానాన్ని చేరేటట్లు చెయ్యాలి. అనేకరూపాలతో ఉన్న ప్రాపంచిక వస్తువులను, విషయాలను స్వంతం చేసుకోవాలనే తహతహవల్ల, అసలైన నేనుపై అనేక పొరలు పొరలుగా ఏర్పడి, చాల మందంగా తయారయ్యిందీఅహంకారం. ఇలా బలిసి మందంగా ఐన అహంకారం బాగా కృశించి బక్కచిక్కితేనే; హృదయద్వారం వద్దనున్న చిన్నరంధ్రంలో ప్రవేశించి ఆత్మనుచేరి, అద్వైతానందాన్ని జీవుడు పొందగలడు. ఈ తెచ్చిపెట్టుకున్న పొరలు కరిగించు కోవడమే గాక, అహంకారంతో తాను భిన్నుడననే జీవభావం పూర్తిగా కృశించి, బక్కచిక్కాలంటే  ప్రేమ వల్లే అది సాధ్యపడుతుంది.
    
అంటే ఇంతవరకూ అది కావాలి, ఇది కావాలనే “నేను”, ఇప్పడు ఇవ్వడాన్ని అభ్యసిస్తే ఆ పొరలు క్రమంగా పల్చబడి గమ్యస్థానాన్ని  చేరుకోగల్గుతుంది.  ఇది ప్రేమను అభ్యసించడంవల్లనే సాధ్యమవుతుంది. నేను అనే అహంకారం చిక్కిపోయినా ఇంకా సూక్ష్మంగా ఉంటూ మనకు తెలియకుండానే విషయాలవేపుకు లాగుకుని పోతుంటుంది. అంచేత ఇప్పుడు సాధనలో గడించిన, లాభాలను వ్యక్తిత్వంతో బాటుగా; ఆత్మలో విలీనం చెయ్యాలి. ఇలా చెయ్యాలంటే హృదయాంతరాళాలలో ప్రేమ కలగాలి. ప్రేమే అహంకారాన్ని పొగొట్ట గల్గుతుంది. వైరాగ్య శమ దమాలు అంతఃకరణాన్ని శుభ్రం చేశాయి. దృఢ నిశ్చయంతో ఏమీ ఆశించకుండా పంచియిచ్చే ప్రేమ అహంకారాన్ని లొంగదీసుకుని /వశపరచుకోడం చేత ఆత్మసాక్షాత్కారం సాధ్యమవుతుంది. 

ప్రస్తుతం సాధకుడున్న స్థితిలో  ఏ జీవినీ హింసించడం గాని , ద్వేషించడం గాని ఉండదు.  ఐనా ప్రేమకూడా ఉండదు. ఈ ద్వేషంలేనితనాన్ని, ప్రత్యేకంగా ప్రేమగా బాహ్యప్రపంచానికి చూపనవుసరం లేదు. కాని ప్రేమ తన హృదయాంతరాళాల్లో  పెల్లుబికినపుడు, ఈ ప్రేమామృతాన్ని పంచాల్సిందే. ఈ ప్రేమను అర్పించుకునే భావం అహంకారాన్ని కృశింపజేసుకోడానికి తోడ్పడి, హృదయ ద్వారంలోకి ప్రవేశించేలా చెయ్య గల్గుతుంది. ప్రేమను ఎవరికో అర్పించడం కాదు. మనం ఆత్మనే వరించాలి. అదే లక్ష్యం కూడా. ఆత్మకే శరణాగతితో అర్పించు
కోవాలన్నమాట. అంటే తనకో వ్యక్తిత్వమనేది లేకుండా ఆత్మయే మిగిలేంతగా జీవాహంకారం శూన్యమవ్వాలి. అదే ప్రేమంటే. ఆత్మసాక్షాత్కారానికి ముందు సాధకుడు పరీక్షకు కూడా లోనవుతుంటాడు. అప్పుడా సాధకుని భావన ఎలా ఉంటుంది అంటే, నీకు అర్పించుకోకుండా నేనేదైనా ఉంచుకున్నానా అనేట్లు; సర్వ సమర్పణ భావముంటుంది. ఇలా ఆత్మతో శరణాగతిగల ప్రేమే భక్తి.  మహోన్నతుడైన నిర్గుణ ఆత్మపై చూపే ప్రేమయే భక్తి.






Thursday, October 17, 2013

జ్ఞానయోగము- సాధన (12)



ఆత్మకు నిలయమని చెప్పే హృదయం మన ఛాతీకి ఎడమవేపున ఉండే భౌతికంగా చెప్పే హృదయం కాదు. ఆధ్యాత్మిక హృదయం జీవులకు కుడివేపున ఉంటుందని రమణమహర్షి చెప్పేవారు. ఆత్మమీద మనస్సును లగ్నం చేసేప్పుడు, మానసికంగా ఒకచోటున ఉన్నట్లు భావించుకోవాలి. అంటే అంతఃకరణం ఆత్మస్థానంలోకూడుకునేటట్లు చెయ్యాలి. అంతఃకరణం తాను కల్పించుకున్న జీవభావాన్నిబట్టి ఉంటుంది. ప్రాణులకు ప్రాణదానం చేసే ప్రాణశక్తి కూడా ఆ స్థానంలోనే ఉంటుంది. ఆ ఏకాగ్రమైన స్థానమునందే ఆత్మబోధ కూడా జరుగుతుంది. ఈ స్థానం ఎంత సూక్ష్మం అంటే అది నివ్వరిధాన్యపు/ధాన్యపుగింజ కొనముల్లులా సూక్ష్మంగా ఉంటుంది. అక్కడే ఆత్మ ప్రకాశిస్తూంటుంది. ఆ ఏకాగ్రమైన స్థానమే ఆత్మస్థానం.
 
ఈ ఆధ్యాత్మిక హృదయం అధోముఖమైన తామరపూ మొగ్గలా ఉంటుంది. దాన్లో ఉండేఖాళీ స్థలాన్ని (space) సూక్ష్మాకాశం అంటారు. హృదయాన్ని దహరం అని కూడా అనడం చేత దీన్ని దహరాకాశమని  చెబుతారు. దీని నుండి ప్రాణాగ్నిజ్వాల శరీరమంతా వ్యాపించి ఉంటుంది. దహరాకాశంలో ఉండే అగ్నిజ్వాల మధ్యలో దేదీప్యమానంగా , మెరుపులా ప్రకాశించే ప్రాణాగ్ని ఉంది. ఇది ఒక సూక్ష్మస్థానం వద్ద వడ్లగింజపై కొనముల్లంత సూక్ష్మంగా ఉండే ప్రదేశంలో అంతమవుతుంది/ కేంద్రీకరింపబడి ఉంటుంది. అందే ఆత్మ భాసిస్తూంటుందని నారాయణ సూక్తం చెబుతుంది. ఈ ఆత్మస్థానం ఎలాఉంది అంటే, దహరంలో దహరం ఉన్నట్లుగా చెప్పబడింది. ఇక్కడ దహరం అంటే స్వల్పమనే అర్ధంలో వాడబడింది. అంటే సర్వ వ్యాపకమైన ఆత్మ జీవశరీరంలోఅంత సూక్ష్మంగా ఉన్నట్లుగా భావించాలన్నమాట.

త్రిప్పిన తామరపూమొగ్గలా ఉండే హృదయంలో గల సూక్ష్మాకాశం సమీపాన  బిందుమాత్రంగా సూక్ష్మమైన ద్వారం ఉంది. బయటివాడు లోపలకు రావాలన్నా , లోపలివాడు బైటకు పోవాలన్నా ఈ ద్వారం నుండే రాకపోకలు జరగాలి. సాధనలో పరిపక్వత చెందిన జీవుడు, ముడుచుకుని, ముడుచుకుని ఈ ద్వారంలోపలికి ప్రవేశించి ఆత్మస్థానంలో లీనమవుతాడు. ఇట్టి స్థితి జీవుడు శివుడైనప్పుడే ప్రాప్తిస్తుంది. అలాగే సత్ స్వరూపం/శివుడు దేహేంద్రియాలు అంతఃకరణంతోను అవతరించేప్పుడు అహంకారం అంకురించి జీవభావంతో ఆ హృదయద్వారం గుండానే బయటకు రాగా; తాను బ్రహ్మమునకన్న భిన్నుడననే భావం కల్గుతుంది. ఇదే శివుడు జీవుడిగా అవతరించడమంటే. జీవుడు ముక్తి పొందినప్పుడు తన గుర్తింపును శాశ్వతంగా కోల్పోయి హృదయం మధ్యలో ఉండే ఆత్మస్థానంలోనే ఐక్యం చెందుతాడు. ఇలా శివుడు జీవుడవ్వాలన్నా, జీవుడు శివుడవ్వాలన్నా దానికి హృదయమే మూలకారణం. 


Thursday, October 10, 2013

జ్ఞానయోగము- సాధన (11)



ముముక్షుత్వంతో సాధన చతుష్టయం పూర్తయింది.
భారతీయ తత్వచింతనకు తలమానికాలైన ప్రస్థానత్రయంలో ఒకటైన బ్రహ్మసూత్రాలు “అధాతో బ్రహ్మజిజ్ఞాస “ అనే సూత్రంతో మొదలవుతుంది. సాధన చతుష్టయం సమకూరిన తర్వాత బ్రహ్మజిజ్ఞాస చెయ్యాలి అని సూత్రార్ధం. అంటే బ్రహ్మజ్ఞానంకోసం విచారణ చెయ్యాలన్నమాట. వైరాగ్య ముముక్షుత్వాలు తీవ్రంగా లేకపోతే ఆత్మ తెలియబడదు. తీవ్రసాధన ఉన్నపుడే మనస్సు నియమించబడి, ఉన్నతస్థితిని చేరుకోగలం. 
   
ఆత్మజ్ఞానం కలగాలంటే సాధనచతుష్టయం తోబాటు అంతరంగ సాధనాలైన శ్రవణ మనన నిదిధ్యాసనలు ఉండాలి. సాధన చతుష్టయం పూర్తిగా అంతరంగ సాధనం కాపోయినా దీన్లోకే చేరుతుంది. సాధన చతుష్టయం పూర్తిచేసుకున్న ముముక్షువుకు ఈ సందర్భంలో శ్రవణ మననాలను గాకుండా శంకరులు భక్తి ప్రస్తావన చెబుతారు. జ్ఞానమార్గంలో అడుగు పెట్టడానికి ముందే మనస్సు ఏకాగ్రమవ్వడానికి నిష్కామ కర్మ , భక్తి చెప్పబడ్డాయి. అవి  పరోక్షంగా ఉపకరించే బాహ్యాంగ సాధనాలని చెబుతారు.  సాధనచతుష్టయంలో అడుగు పెట్టడానికి ముందు  ఏకాగ్రతకోసం చెప్పబడ్డ భక్తి క్రింది స్థాయికి చెందినది. ఇది బాహ్య సాధనంగా చెప్పబడింది. అలాగే జ్ఞానానికి, జ్ఞానోదయం అయ్యాకా కూడా పుట్టే  ఉన్నత స్థాయికి చెందిన భక్తిదశలు ఉన్నాయి. ప్రస్తుతం అంతరంగ సామాగ్రి గురించి చెప్పుకునే సందర్భంలో భక్తి ముఖ్యమైన అంతరంగ సాధనంగా పేర్కోవడం జరిగింది.

క్రిందిదశలో  సాధకుడు సగుణాకారంపై దృష్టిపెట్టి ఏకాగ్రత పొందుతాడు. సాధన చతుష్టయం పూర్తయ్యాకా, నిరాకార నిర్గుణ వస్తువుపై దృష్టిపెట్టి భక్తిని చూపుతాడు. ఈ దశలో నిరాకార నిర్గుణ వస్తువుపై భక్తిని చూపెట్టడం కూడా సులువే. అంటే ఈ దశలో ప్రేమ చూపడానికి వస్తువు అవుసరం లేదు. తనంత అదే పెల్లుబికి వస్తుంది. ఇలాంటి అవ్యాజమైన  ప్రేమ లేకపోతే, సాధకుడికి ఈ దశలోనూ అహంకారానికి లోనయ్యే /దారితీసే ప్రమాదము ఉంటుంది. సృష్టిలో జీవులన్నిటినీ కలిపి ఉంచేది ప్రేమ. ప్రేమలో తనకు తాను అర్పించుకోవడమే ఉంటుంది. అంటే యితరులకు తృప్తి కలిగిస్తూ తృప్తిని పొందటం. కోరిక అనేది పొందటాన్ని సూచిస్తే, ప్రేమ పంచి ఇవ్వడాన్ని సూచిస్తుంది. ఐతే ఇలాంటి ప్రేమ కలగాలంటే అంతఃకరణం శుద్ధమవ్వాలి. అప్పుడు మనస్సు బుద్ధీ అహంకారం వేపుకు లాగబడితే, అంతఃకరణం దానికి శాశ్వత నిలయమైన హృదయంవేపు పరుగుతీసి అది హృదయస్థానం నుండే పనిచేస్తుందన్నమాట.

మనస్సును ( అదే  అంతఃకరణాన్ని) ఆత్మలో లీనం చెయ్యాలని గదా చెప్పుకున్నాం. ఆత్మ అంతటా వ్యాపించి ఉంది. ఆత్మలేని చోటే లేదు. ద్వైతభావంతో ఉండే మనం మనస్సుని ఆత్మపై లగ్నం చెయ్యడానికి ; నిర్గుణము నిరాకారము ఐన ఆత్మను మానసికంగా ఒకచోటున ఉన్నట్లుగా ఊహించుకోవాలి. వాస్తవంగా బ్రహ్మమునకు/ఆత్మకు  ఒక ప్రదేశమంటూ చెప్పలేపోయినా , ఉపాధి విశేషం చేత జీవుల హృదయాన్ని స్థానం కల్పించినట్లుగా బుధజనులు చెబుతారు.