ఇక మూడవ దశలో శ్రవణ మనన నిదిధ్యాసనలనే అంగములు ఉన్నాయి.
అన్నిటినీ వదలటమే సన్యాసం. ఇలా
సాధనచతుష్టయం తర్వాత సన్యాస స్వీకారం ఉంటుంది. జీవన్ముక్తి లభించేదాకా సాధకుడు
ముముక్షువుగానే చెప్పబడతాడు. గురువుపట్ల శరణాగతి ఉండాలి. అప్పుడే తన ప్రయత్నంతో
బాటు గుర్వనుగ్రహం తోడై సాధనలో పురోగతి చెందుతాడు. శాస్త్రజ్ఞానంతో అనుభవజ్ఞానమూ
కలుగుతుంది. వైరాగ్యము, ముముక్షుత తీవ్రంగా లేకపోతే ఆత్మ తన రూపాన్ని చూపదు. ఈ
దశలో మనస్సు ప్రశాంత స్థితిలో ఉన్నా, అది భ్రాంతి అనే అనుకోవాలి. సాధనలో
ముముక్షుత, వైరాగ్యమూ తీవ్రతరం చేస్తే మనస్సు నియమించబడి, ఉన్నత స్థితిని చేరుకో
గల్గుతాడు.
ఈ సందర్భంలో శ్రవణ మననాలను గాకుండా
శంకరులు భక్తి ప్రస్తావన తెస్తారు. జ్ఞానమార్గంలో అడుగు పెట్టడానికి ముందు మనస్సు
ఏకాగ్రమవ్వడానికి నిష్కామ కర్మ , భక్తి చెప్పబడ్డాయి. అవి పరోక్షంగా ఉపకరించే బాహ్యాంగ సాధనాలని
చెబుతారు. సాధకుడికి ముందునుంచీ భక్తి ఉంటుంది. ఇలా సాధనచతుష్టయం అభ్యసించాకా సన్యాసము, మహావాక్యోపదేశము అవుతాయి. శ్రవణ
మనన నిదిధ్యాసనాలతో మార్గం పూర్తవుతుంది. ఆ తర్వాత ఆత్మ సాక్షాత్కారము, జీవన్ముక్త స్థితీ ఉంటాయి. బ్రహ్మ సాక్షాత్కారం
కలిగేదాకా సాధకుడు ముముక్షువే.
ఇలా మొదటిదశలో – కర్మయోగంద్వారా
చిత్తశుద్ధి, భక్తియోగంతో మనస్సు ఏకాగ్రతను పొందడమనేవి జ్ఞానయోగంలో ప్రాధమికాలు.
అప్పుడు ఆత్మవిచారణకు పూనుకునే అర్హత వస్తుంది.
రెండవ దశలో – సాధనచతుష్టయం సాధించాలి.
దీనివల్ల దుష్టవాసనలు చాలామట్టుకు పెకలించ బడుతాయి.
మూడవ దశలో – సన్యాస స్వీకారము, ఉపదేశము,
శ్రవణ మనన నిదిధ్యాసనలు ఉంటాయి. ( విద్యా గురువు వేరు, దీక్షాగురువు వేరుగాను
ఉండవచ్చు. లేదా పూర్వాశ్రమంలో గురువే దీక్షాగురువు కావచ్చు).
చివరిదశలో – ఆత్మసాధన. దీన్లో
కర్మపరిత్యాగము, బ్రహ్మవిచారణ, ఆత్మసాక్షాత్కారము ఉంటాయి.
క్రింది స్థాయిలో ఏ యోగాన్ని అభ్యసించేవానికైనా
భక్తి అవుసరమే. ఈశ్వరుడిపై భక్తినిచూపే భక్తుడే, అంటే క్రింది స్థాయిలో ఉండే
భక్తుడే కర్మఫలాలను ధారపోయ్యాలి. అద్వైతజ్ఞానం అందరికీ ఉండాల్సిందే ఐనా అద్వైత
సాధన మాత్రం జ్ఞానులకనే చెప్పబడింది.
No comments:
Post a Comment