ఆత్మకు నిలయమని
చెప్పే హృదయం మన ఛాతీకి ఎడమవేపున ఉండే భౌతికంగా చెప్పే హృదయం కాదు. ఆధ్యాత్మిక
హృదయం జీవులకు కుడివేపున ఉంటుందని రమణమహర్షి చెప్పేవారు. ఆత్మమీద మనస్సును లగ్నం
చేసేప్పుడు, మానసికంగా ఒకచోటున
ఉన్నట్లు భావించుకోవాలి. అంటే అంతఃకరణం ఆత్మస్థానంలోకూడుకునేటట్లు చెయ్యాలి. అంతఃకరణం తాను కల్పించుకున్న జీవభావాన్నిబట్టి ఉంటుంది. ప్రాణులకు
ప్రాణదానం చేసే ప్రాణశక్తి కూడా ఆ స్థానంలోనే ఉంటుంది. ఆ ఏకాగ్రమైన స్థానమునందే
ఆత్మబోధ కూడా జరుగుతుంది. ఈ స్థానం ఎంత సూక్ష్మం అంటే అది నివ్వరిధాన్యపు/ధాన్యపుగింజ కొనముల్లులా సూక్ష్మంగా ఉంటుంది. అక్కడే
ఆత్మ ప్రకాశిస్తూంటుంది. ఆ ఏకాగ్రమైన స్థానమే ఆత్మస్థానం.
ఈ ఆధ్యాత్మిక హృదయం అధోముఖమైన తామరపూ
మొగ్గలా ఉంటుంది. దాన్లో ఉండేఖాళీ స్థలాన్ని (space) సూక్ష్మాకాశం అంటారు. హృదయాన్ని దహరం అని కూడా అనడం చేత దీన్ని
దహరాకాశమని చెబుతారు. దీని నుండి
ప్రాణాగ్నిజ్వాల శరీరమంతా వ్యాపించి ఉంటుంది. దహరాకాశంలో ఉండే అగ్నిజ్వాల మధ్యలో
దేదీప్యమానంగా , మెరుపులా ప్రకాశించే ప్రాణాగ్ని ఉంది. ఇది ఒక సూక్ష్మస్థానం వద్ద
వడ్లగింజపై కొనముల్లంత సూక్ష్మంగా ఉండే ప్రదేశంలో అంతమవుతుంది/ కేంద్రీకరింపబడి
ఉంటుంది. అందే ఆత్మ భాసిస్తూంటుందని నారాయణ సూక్తం చెబుతుంది. ఈ ఆత్మస్థానం
ఎలాఉంది అంటే, దహరంలో దహరం ఉన్నట్లుగా చెప్పబడింది. ఇక్కడ దహరం అంటే స్వల్పమనే
అర్ధంలో వాడబడింది. అంటే సర్వ వ్యాపకమైన ఆత్మ జీవశరీరంలోఅంత సూక్ష్మంగా ఉన్నట్లుగా
భావించాలన్నమాట.
త్రిప్పిన తామరపూమొగ్గలా ఉండే హృదయంలో గల
సూక్ష్మాకాశం సమీపాన బిందుమాత్రంగా
సూక్ష్మమైన ద్వారం ఉంది. బయటివాడు లోపలకు రావాలన్నా , లోపలివాడు బైటకు పోవాలన్నా ఈ
ద్వారం నుండే రాకపోకలు జరగాలి. సాధనలో పరిపక్వత చెందిన జీవుడు, ముడుచుకుని,
ముడుచుకుని ఈ ద్వారంలోపలికి ప్రవేశించి ఆత్మస్థానంలో లీనమవుతాడు. ఇట్టి స్థితి
జీవుడు శివుడైనప్పుడే ప్రాప్తిస్తుంది. అలాగే సత్ స్వరూపం/శివుడు దేహేంద్రియాలు
అంతఃకరణంతోను అవతరించేప్పుడు అహంకారం అంకురించి జీవభావంతో ఆ హృదయద్వారం గుండానే
బయటకు రాగా; తాను బ్రహ్మమునకన్న భిన్నుడననే భావం కల్గుతుంది. ఇదే శివుడు జీవుడిగా
అవతరించడమంటే. జీవుడు ముక్తి పొందినప్పుడు తన గుర్తింపును శాశ్వతంగా కోల్పోయి
హృదయం మధ్యలో ఉండే ఆత్మస్థానంలోనే ఐక్యం చెందుతాడు. ఇలా శివుడు జీవుడవ్వాలన్నా, జీవుడు శివుడవ్వాలన్నా దానికి హృదయమే మూలకారణం.
No comments:
Post a Comment