ముముక్షుత్వంతో సాధన చతుష్టయం
పూర్తయింది.
భారతీయ తత్వచింతనకు తలమానికాలైన
ప్రస్థానత్రయంలో ఒకటైన బ్రహ్మసూత్రాలు “అధాతో బ్రహ్మజిజ్ఞాస “ అనే సూత్రంతో
మొదలవుతుంది. సాధన చతుష్టయం సమకూరిన తర్వాత బ్రహ్మజిజ్ఞాస చెయ్యాలి అని
సూత్రార్ధం. అంటే బ్రహ్మజ్ఞానంకోసం విచారణ చెయ్యాలన్నమాట. వైరాగ్య ముముక్షుత్వాలు తీవ్రంగా లేకపోతే
ఆత్మ తెలియబడదు. తీవ్రసాధన ఉన్నపుడే మనస్సు నియమించబడి, ఉన్నతస్థితిని చేరుకోగలం.
ఆత్మజ్ఞానం కలగాలంటే సాధనచతుష్టయం తోబాటు
అంతరంగ సాధనాలైన శ్రవణ మనన నిదిధ్యాసనలు ఉండాలి. సాధన చతుష్టయం పూర్తిగా అంతరంగ
సాధనం కాపోయినా దీన్లోకే చేరుతుంది. సాధన చతుష్టయం పూర్తిచేసుకున్న ముముక్షువుకు ఈ
సందర్భంలో శ్రవణ మననాలను గాకుండా శంకరులు భక్తి ప్రస్తావన చెబుతారు. జ్ఞానమార్గంలో
అడుగు పెట్టడానికి ముందే మనస్సు ఏకాగ్రమవ్వడానికి నిష్కామ కర్మ , భక్తి చెప్పబడ్డాయి. అవి పరోక్షంగా ఉపకరించే బాహ్యాంగ సాధనాలని
చెబుతారు. సాధనచతుష్టయంలో అడుగు
పెట్టడానికి ముందు ఏకాగ్రతకోసం చెప్పబడ్డ
భక్తి క్రింది స్థాయికి చెందినది. ఇది బాహ్య సాధనంగా చెప్పబడింది. అలాగే
జ్ఞానానికి, జ్ఞానోదయం అయ్యాకా కూడా పుట్టే
ఉన్నత స్థాయికి చెందిన భక్తిదశలు ఉన్నాయి. ప్రస్తుతం అంతరంగ సామాగ్రి
గురించి చెప్పుకునే సందర్భంలో భక్తి ముఖ్యమైన అంతరంగ సాధనంగా పేర్కోవడం జరిగింది.
క్రిందిదశలో సాధకుడు సగుణాకారంపై దృష్టిపెట్టి ఏకాగ్రత పొందుతాడు.
సాధన చతుష్టయం పూర్తయ్యాకా, నిరాకార నిర్గుణ
వస్తువుపై దృష్టిపెట్టి భక్తిని చూపుతాడు. ఈ దశలో నిరాకార నిర్గుణ వస్తువుపై
భక్తిని చూపెట్టడం కూడా సులువే. అంటే ఈ దశలో ప్రేమ చూపడానికి వస్తువు అవుసరం లేదు.
తనంత అదే పెల్లుబికి వస్తుంది. ఇలాంటి అవ్యాజమైన
ప్రేమ లేకపోతే, సాధకుడికి ఈ దశలోనూ అహంకారానికి లోనయ్యే /దారితీసే ప్రమాదము
ఉంటుంది. సృష్టిలో జీవులన్నిటినీ కలిపి ఉంచేది ప్రేమ. ప్రేమలో తనకు తాను
అర్పించుకోవడమే ఉంటుంది. అంటే యితరులకు తృప్తి కలిగిస్తూ తృప్తిని పొందటం. కోరిక
అనేది పొందటాన్ని సూచిస్తే, ప్రేమ పంచి ఇవ్వడాన్ని సూచిస్తుంది. ఐతే ఇలాంటి ప్రేమ
కలగాలంటే అంతఃకరణం శుద్ధమవ్వాలి. అప్పుడు మనస్సు బుద్ధీ అహంకారం వేపుకు లాగబడితే,
అంతఃకరణం దానికి శాశ్వత నిలయమైన హృదయంవేపు పరుగుతీసి అది హృదయస్థానం నుండే
పనిచేస్తుందన్నమాట.
మనస్సును ( అదే అంతఃకరణాన్ని) ఆత్మలో లీనం చెయ్యాలని గదా
చెప్పుకున్నాం. ఆత్మ అంతటా వ్యాపించి ఉంది. ఆత్మలేని చోటే లేదు. ద్వైతభావంతో ఉండే
మనం మనస్సుని ఆత్మపై లగ్నం చెయ్యడానికి ; నిర్గుణము నిరాకారము ఐన ఆత్మను మానసికంగా
ఒకచోటున ఉన్నట్లుగా ఊహించుకోవాలి. వాస్తవంగా బ్రహ్మమునకు/ఆత్మకు ఒక ప్రదేశమంటూ చెప్పలేపోయినా , ఉపాధి విశేషం చేత
జీవుల హృదయాన్ని స్థానం కల్పించినట్లుగా బుధజనులు చెబుతారు.
No comments:
Post a Comment