Wednesday, December 25, 2013

జ్ఞానయోగము- సాధన (21)


నిదిధ్యాసన

తొట్రుపడకుండా శ్రద్ధాభక్తులతో సాధన కొనసాగించాలి. శ్రవణ మననాలచేత నిస్సందేహంగా దృఢపడిన అర్ధంపై మనస్సును స్థాపించడాన్ని నిదిధ్యాసనం అంటారు. తత్వం తెలుసుకునే మార్గానికి , శృతి- శ్రవణానికి,
యుక్తి - మననానికీ , అనుభవం - నిదిధ్యాసనకూ ప్రమాణాలని చెబుతారు. సాధనలో గమ్యం చేరడానికి కర్మవాసనలు పూర్తిగా నశించాలి. అవి బలీయంగా ఉంటే సాధనకు ఆటంకం ఏర్పడుతుంది. 

ఇంతకాలం నుండి సాధన చేస్తున్నా, లక్ష్యం చేరుకోగలనా లేదా అని భావన కలగడాన్ని సంశయం లేదా అసంభావన అనబడుతుంది. ఈ ఆటంకం వల్ల అద్వైతసిద్దిమీదే సందేహాన్ని కల్గించి, లక్ష్యం చేరలేనేమో అని, ద్వైతమే సత్యమేమో అనే భావనను కలిగించి, తాను బ్రహ్మమునకన్న భిన్నుడనని అనుకునే విపరీతభావన రెండో ఆటంకంగా ఏర్పడుతుంది. అసంభావన తొలగడానికి మననము, విపరీతభావన తొలగడానికి నిదిధ్యాసనమూ చేస్తూండాలి. వేదాంత వాక్యాలను నిరంతరం మననం చెయ్యడం వల్ల బ్రహ్మ సాక్షాత్కారానికి మార్గం సుగమమవుతుంది. నిదిధ్యాసనం నిరంతరం కొనసాగించడం వల్ల విపరీతభావన తొలగుతుంది.






Tuesday, December 17, 2013

జ్ఞానయోగము- సాధన (20)

సస్వరూప అనేదానికి అర్ధం ఒక దానియొక్క సహజరూపం అని. అంటే మాయతో కలియని సహజమైన సత్యమైనది ఆత్మ. జీవుడంటే మాయతో కూడినట్లుగా చెప్పుకోవాలి. రూపం అంటే మనస్సు. ఈ పదం ఎక్కడ వాడినా ఆ వస్తువు జీవంతో ఉన్నట్లుగా భావించాలి. అంటే అట్టి జీవంతో కూడిన దానితో అనుసంధానం చెయ్యాలని చెబుతారు. ఇలా భక్తితో అనుసంధానం చేసిన ముముక్షువుకు గురువే అతనిలో ఉన్న వివేక వైరాగ్యాలు, శమాదిషట్క సంపత్తినీ చూసి, సన్యాసస్వీకారం మహావాక్యోపదేశమూ ఉంటాయి. అదే శ్రవణం. యిదివరలో ఆత్మజ్ఞానం కోసం సన్యాసాన్ని అర్హతగా చెప్పగా, ఇప్పుడు జ్ఞానం కలిగాక సన్యాసమని చెప్పబడుతోంది.  భక్తిలో పరిణతి చెందినప్పుడు సన్యాసాశ్రమం స్వీకరించి, భక్తితో అహంకారాన్ని క్రమంగా లీనంచేస్తూ ఉండగా శ్రవణ మనన నిదిధ్యాసనాలను చేస్తాడు.
ఇంతదాకా బుద్దివల్ల తాను విన్నదీ , చదివినదీ ఒంటబట్టించుకొని, కోరికలన్నిటినీ త్యజించి సన్యాసి అవుతాడు. కర్మలన్నీ జ్ఞానంతో పరిసమాప్తి అవుతాయి. ఇక శ్రవణ మనన నిదిధ్యాసలన్నమాట.

శ్రవణం
అంటే గురువు నుండి మహావాక్యోపదేశాన్ని వినడం శ్రుతిలోనికి వస్తుంది. ఇదేగాక, గురుసాంప్రదాయం గురించీ, జీవ బ్రహ్మములను ఐక్యం చేసే పద్ధతులను గురించీ కూడా గురువు చెప్పవచ్చు. ఇదంతా శ్రవణం లోకే వస్తుంది. ఇచ్చట గమనించ వలసిందేమంటే, పూర్వాశ్రమంలో గురువూ, ఇప్పటి గురువూ ఒక్కరే కావచ్చు లేదా వేర్వేరుగాను ఉండవచ్చు.

తత్వమసి మొదలైన మహావాక్యాల అర్ధం తెలుసుకోవడం శ్రవణమని చెబుతారు. తనంత తాను శాస్త్రాలనుండి పఠనం వల్ల నేర్చినదీ జడంగానే ఉంటుంది. కాని ఆ విషయాలే గురుముఖతా ఉపదేశరూపంలో వచ్చినప్పుడు సజీవంగా అవుతుంది. గురువుకన్న తాను తక్కువవాడిననే భావనవల్ల  అహంకార  నిర్మూలన , వినయమూ, విధేయత కలుగుతాయి. అప్పుడు గురువు చెప్పినదాన్ని ఆచరణలో పెట్టడం, గౌరవంతో కూడిన వినయము ఏర్పడి గురుసేవ చెయ్యడానికి బుద్ధిని పుట్టిస్తుంది. అలాంటి సేవనే శుశ్రూష అంటారు. గురువు సాక్షాత్ భగవంతుడే అనే భావనవల్ల గురువు అనుగ్రహం కల్గి, సాధకుడిని గమ్యం చేర్చుతుంది.

మననం
సన్యాసి గురూపదేశం పొంది, అద్వైత బ్రహ్మభావనపైనే లక్ష్యం ఉంచాలి. శ్రవణంలో తెలుసుకున్న అర్ధాన్ని విచారణతో ఇదే సరైనదని నిర్ధారించుకోవడం మననం అనబడుతోంది.
లోకంలో ఏ విషయం మీదైనా నిర్ణయానికి రావలసినప్పుడు యుక్తిని ఉపయోగిస్తాం. శ్రద్దాభక్తులున్న మనో బుద్దులతో, ఒక విషయాన్ని విశ్లేషించడం యుక్తి అనబడుతోంది. యుక్తి అనుభవంతో గాని, హేతువాదంతో గాని చేసే తర్కం కాదు. విచారించడం వల్ల మనస్సుతో కలిగే అనుభవం అనవచ్చు. అట్టి యుక్తివల్ల అహంకారం నిర్మూలనమై మనస్సు శుభ్రం చెయ్యబడుతుంది. శాస్త్రీయమైన సత్యం, వివేకంతో కూడినప్పుడు, మనస్సుకు విశ్రాంతి కలుగుతుంది. శాంతం యొక్క తటస్థస్థితిని సాత్వికమని చెబుతారు. ఈ దశలో సాధకుడి అనుభవం అంతరాత్మతో సంబంధించి ఉంటుంది. ఉపదేశాన్ని నిత్యమూ మననం చేయడం వల్ల మనస్సు చలించదు. అవిద్యనుంచి బయట పడేదాకా ధ్యానాన్నీ, మననాన్నీ అదే భావనతో కొనసాగించాలి. మననం చేస్తుండగా ఆత్మను గురించిన అనేక భావాలకు పరిష్కారం లభిస్తుంది. అపుడది నిదిధ్యాసనకు దారి తీస్తుంది.




Thursday, December 5, 2013

జ్ఞానయోగము- సాధన (19)

శమదమాలను అభ్యసించి మనస్సును నియంత్రించాడు గనుక సాధకుడిక మానసిక వృత్తులపై దృష్టి పెట్టడు. అంచేత భక్తి ఎలా వికసించిందో కూడా గమనించని స్థితి. ఇలాంటి భక్తి జీవుడిని లయం చేస్తూ , అదీ లయమైపోతుంది. దీన్లో తీవ్ర త్యాగం ఉంటుంది. ఈ స్థితిలో నిర్గుణ పరమాత్మతో బాంధవ్యం ఎలా ఉంటుందంటే పిడుగు పడినా చలించని గ్రహించని స్థితిలో సమాధినిష్టుడై అతనితో ఐక్యం చెంది ఉంటాడు. ఒకదానితో కలవడాన్ని సంధానం అంటాం. నిరంతరం కలసి ఉండటాన్ని అనుసంధానం అంటారు. ఇక్కడ జరిగేది పరమాత్మతో అనుసంధానం. ఏ కొద్దిపాటి ద్వైతానికీ తావులేదు. ఆత్మ నిశ్చలంగా తన సహజరూపంలోనే ఉంటుంది. జరిగేదల్లా ఏది జీవుణ్ణి పరమాత్మతో కూర్చలేక పోయిందో , అట్టి అంతఃకరణం మ్రింగ బడాలన్నమాట. అంటే చిత్తము ఆత్మయొక్క నిరంతర స్మరణలో మునిగి ఉండాలన్న మాట. ఇలా ఆత్మకు సంబంధించిన భావనలపై చిత్తం ఉండటమే అనుసంధానమని చెప్పబడింది. 

ఎప్పుడైతే  అహంకారం నిర్మూలమై జీవభావం తొలగుతుందో, అప్పుడు  ఆత్మే స్వయం ప్రకాశంగా ఉంటుంది. ఇదే సమాధి స్థితి. ఐతే ఈ స్థితిలో జీవభావం మ్రింగ బడటం, బయటకు రావడం వంటివి అంటే సమాధి స్థితిలోకి వెళ్ళడమూ, సమాధి స్థితినుండి బయటకు రావడమూ మాటి మాటికీ జరుగుతూ ఉంటాయి. ఇలా సమాధి స్థితిలోకి పోవడం, బయటకు రావడం అనేవి అనేకసార్లు జరుగుతుండగా క్రమంగా జీవభావం కరిగి ఇక లేశమాత్రంగా మిగులుతుంది. ఇక్కడ భక్తితో ఇంకా లీనమవ్వడానికి అనుసంధానం చెయ్యాలి.

ముముక్షుత గురించి చెప్పేటపుడు సస్వరూప అవబోధం అన్నాం. అవబోధం అంటే మేల్కోవడం. ముముక్షతలో  బంధం నుంచి విముక్తి మాత్రమే సరిపోదు, తన అసలు స్వరూపాన్ని తెలుసుకోనేట్లుగా సాధన ఉండాలి. అంటే తీవ్ర తపనతో తన నిజ రూపాన్ని తెలుసుకుని (అవబోధేన), బంధం నుండి విముక్తి పొందాలి. ఆత్మను మేల్కొలపాలనే ఆలోచన వచ్చిందీ అంటే మనం ఉన్నట్లే. అలా ఆత్మప్రబోధం భావనామాత్రంగా ఉండేప్పుడు, ఆ స్థితిని ఫలానా అని చెప్పలేం. కాకపోతే ఆత్మను గురించిన ఆలోచన అది అనంతమని, శుద్ధమని, సచ్చిదానందామని ఇలా ఆలోచన అంతఃకరణం ఉన్నంతవరకూ ఏదో ఆలోచన కొనసాగుతుంది. 
  
భక్తిని గురించి చెప్పేప్పుడు సస్వరూప అనుసంధానం అంటున్నాం. ఆత్మప్రబోధాన్ని భావించేపుడు దాన్ని సజీవంగా భావించాలి. జీవాహంకారాన్ని ఆ తత్ పదార్ధంపై ఉండేట్లుగా అంటే అదే భావనలో ఉండటమే భక్తి అనబడుతోంది. అదే అనుసంధానమంటే. ఈ అనుసంధానం అవబోధం తర్వాతే. అంటే బోధ కలిగిన తర్వాత ఆ తత్ పదార్ధంతో బాంధవ్యం కొనసాగాలి. అప్పుడు తాదాత్మ్యస్థితి ఏర్పడుతుంది. దానికి గుణాలను అంటగట్టడం గాని, పేరుపెట్టడం గాని చెయ్యకుండా కేవలం సాక్షి మాదిరిగా ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడాలి. కాపోతే గుర్తుంచు కోవలసినదల్లా అది శూన్యం మాత్రం కాదని. జీవంతో ఉందని భావిస్తే,  దాంతో బాంధవ్యం ఏర్పడి ప్రేమ పుడుతుంది. దాన్ని నిజమైన ప్రేమగా మలచుకోవాలి . అంటే ఇది పోయి, దానితో ఐక్యమవ్వాలి/ లేక అది దీన్ని హరించాలి.



Thursday, November 28, 2013

జ్ఞానయోగము- సాధన (18)


భక్తి పండితే హృదయమంతా ప్రేమతో నిండిఉంటుంది. అంటే సూక్ష్మాహంకారమున్న హృదయం లోకే ప్రేమ చొచ్చుకు పోతుంది. అలా సగం భౌతికంలా ఉండే హృదయంలో అహంకారం  ప్రేమతో కరిగి, బాగా సూక్ష్మమైనపుడు, దాన్లో భగవానుడు హృదయకమలవాసిగా విరాజిల్లుతున్నాడని అంటారు. అంటే ప్రేమ అత్యున్నత శిఖరాల్లో ఉన్నప్పుడు అహంకారం కరిగిపోగా హృదయకమలవాసిగా ఆ భగవానుడే విరాజిల్లుతుంటాడు. ఇలా ప్రేమకు సంబంధించిన విషయాలే గాక ఈశ్వరుని మాయాశక్తివల్ల అనేక ఇతర విషయాలు హృదయం నుండే జీవాహంకారం వల్ల జరుగుతుంటాయ. యిదివరలో చెప్పుకున్న నాడులే జీవుని వ్యక్తిగత విషయాలను నియంత్రిస్తూ, అవయవాలన్నిటికీ ప్రాణశక్తిని ఇస్తాయి. హృదయం నుంచి బయలుదేరే అనేక నాడులలో ; కొన్ని మన శరీరంలో నవద్వారాల్లో అంతమవుతాయి. ఎవరైతే మరోజన్మ పొందాలో, వారి ప్రాణం ఈ నవ ద్వారాలనుండే పోతుంది. ఈ తొమ్మిది నాడులే గాకుండా మరొక ముఖ్యమైన శీర్షనాడి (మూర్ధ నాడి) తలవరకూ వ్యాపించి ఉంటుంది. ఎవరికి మరుజన్మ లేదో అట్టి కర్మయోగి ప్రాణం ఈ శీర్షద్వారం నుండే పోతుందని చెబుతారు. ఐతే జ్ఞానికి మాత్రం సాక్షాత్కారం కాగానే అతని ప్రాణం ఎక్కడికీ పోదు. అంతఃకరణం మాయనుండి విడువడి, అదృశ్యమవుతుందని చెబుతారు. అందుకే జ్ఞాని మరణించాడని గాక సిద్ధిని పొందాడని చెబుతారు. అంటే జీవన్ముక్తుడవుతాడన్న మాట. ఇలా ఇక్కడ చెప్పబడిన శీర్షనాడి యోగశాస్త్రంలో చెప్పే సుషున్నూనాడి కాదు. ఉపనిషత్తులలో చెప్పబడిన ఈ పది నాడులూ జీవంతోను, ప్రాణం పోకడలతోనూ సంబంధం కలిగి ఉంటాయి.

జ్ఞానమార్గంలోఅడుగిడిన వ్యక్తి  సాధనా శిఖరాన్ని చేరాకా భక్తిని ఆశ్రయిస్తాడు.  మనస్సు, బుధ్ధి అహంకారానికి నిలయమైన హృదయంలోకి రాగా, హృదయం సూక్ష్మంగా ప్రేమతో నిండుతుంది. అహంకారం పలుచబడి  ముడుచుకొని ,ముడుచుకొని హృదయ ద్వారంలోకి ప్రవేశిస్తుంది. ఇదంతా అతడికి తెలియకుండానే జరిగిపోతుంది. ఎలాగంటే అది ఆలోచనకు, ప్రాణానికీ మూలమైన స్థానమని గురువు చెప్పగా, అక్కడే తన దృష్టినంతా కేంద్రీకరిస్తాడు. ఆ స్థానం హృదయానికి మధ్యలో ఉంటుందని గురువు చెప్పియుండవచ్చు. వాస్తవానికి ఈ స్థితిలో సాధకుని చిత్తము /అంతఃకరణం పూర్తిగా ఆ స్థానంలోకి పోదు. అంటే సాధకుడు ఆ స్థానాన్ని కనుక్కున్నాడంతే. అతని చిత్తం ఆ స్థానంలో క్షణకాలం నిలిచిందని చెప్పాలి.

వాసనలు, అహంకారమూ పూర్తిగా నిర్మూలమైతేనే అంతఃకరణం అక్కడ నిలుస్తుంది. అంటే అది అక్కడ ఆగి, దానితో సంబంధించి ఉంటుంది. యిదంతా అతడికి తెలియకుండానే జరిగిపోతుంది. అతడి దృష్టి అంతా ఆత్మస్ఫురణపైనే ఉండటం వల్ల ఈ నాడుల గురించిగాని, హృదయంలో జరిగేదిగాని ఏమీ తెలియవు. తెలియవలసిన అవసరమూ అద్వైత సాధనలో లేదు. అంచేత తను పయనించిన మార్గం గురించి ఏమీ చెప్పలేడు. యోగశాస్త్రంలో సాధనాపద్ధతులు, నాడులలో ప్రాణశక్తి మొదలైనవి ప్రస్తావించబడుతాయి. కాని వేదాంతపద్ధతిలో హృదయనాడులూ, హృదయ ద్వారము తెలియక్కర లేదు. ఆత్మవిచారణ మాత్రమే ఉంటుంది. సాధకుడి జీవన విధానము, ఉపాసన, ఆత్మాన్వేషణలకు అనుగుణంగానే,  జీవభావం నాడులతో కలసి ఆత్మస్థానం చేరుతుంది. ఇదంతా సాధకుడి ప్రమేయం లేకుండానే అప్రయత్నంగా జరిగిపోతుంది. యోగశాస్త్రంలో పురోగతి ఒక్కొక మెట్టూ నిచ్చెన ఎక్కేటట్లు ఉంటుంది. ఇక్కడ ఒక్కసారిగా అకస్మాత్తుగా ఒక elevator లాగ అప్రయత్నంగా హృదయనాడులు లక్ష్యాన్ని చేర్చుతాయి. జీవభావం అనంతచైతన్యంలో కరిగిపోవడమే జ్ఞానమార్గంలో జరిగేది. 



Thursday, November 21, 2013

జ్ఞానయోగము- సాధన (17)


ఇక్కడ ఏ హృదయం చెప్పబడింది?

శరీరానికి రక్తప్రసరణను చేసేది మాంసమయమైన హృదయం. ఇక్కడ మనం చెప్పుకునే హృదయం పూర్తిగా భౌతికం అనుకోకూడదు. భౌతికంలా అనిపించే హృదయం అని అందాం ప్రస్తుతానికి. యోగులు చెప్పే చక్రాలు, నాడులూ ఆధునిక పరికరాలచేత కూడా తెలియబడవు. అలాగే మనం చెప్పే హృదయం కూడా కంటికి కనపడదు. అలాగని సూక్ష్మమూ కాదు. భౌతిక , సూక్ష్మభౌతికాలకు మధ్య దశలో ఉంటుందని అనుకోవాలి. దీని నుండి వెలువడే నాడుల ద్వారా హృదయం నుండి రక్తప్రసరణని, మిగిలిన యితరమైన పనులనూ నియంత్రిస్తుంది. ఉదాహరణకు ప్రాణశక్తినీ, రక్తప్రసారాన్నినియంత్రించే మాంసమయమైన భౌతిక హృదయాన్నేగాక, శ్వాసకు మూలమైన ఊపిరి తిత్తులను, జీర్ణ శక్తినీ, మెదడు నిర్వహించే సర్వ కార్యకలాపాలనూ మనం చెప్పుకునే హృదయమే దాని నుండి వెలువడే నాడుల ద్వారా నియంత్రిస్తోంది. నేననే జీవభావమే(అహంకారమే)  లేకపోతే, శరీరంలో ఏదీ జరుగదు. అందుకే అహంకారానికి నిలయమైన హృదయానికి అట్లాంటి శక్తి యివ్వబడింది. ఇలా జీవుడికి సంబంధించిన సమస్త వ్యాపారాలను చేస్తోంది గనుక కేవలం భౌతికం అని గాకుండా సగం భౌతికంలా ఉండే హృదయమని అంటున్నాం. 
 
ఐతే వైరాగ్య శమదమాలవల్ల మనస్సుకున్న క్రొవ్వు కరిగి, మధించబడటం చేత తగ్గించబడింది. అంటే శుభ్రం చెయ్య బడింది. యిదివరలో చెప్పుకున్నట్లుగా అహంకారం మనకు తెలియకుండానే విషయాల వేపుకు లాగుకొని పోతుంటుంది.  నాకు శమదమాలు ఉన్నాయనే అహంకారం దాగి ఉండి, మనకు తెలియకుండానే గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. అంచేత సాధనలో గడించిన లాభాలతో బాటు వ్యక్తిత్వాన్ని కూడా ఆత్మలో విలీనం చెయ్యాలి. అంటే సాధన అంతా  అహంకారాన్ని పోగొట్టుకోడానికన్న మాట.  సాధనలో అహంకారాన్ని సగం భౌతికంలాఉండే హృదయంలో లీనం చెయ్యాలనే  భావనతో ఉన్నప్పుడు , అది సూక్ష్మమై చిన్న ఖాళీ ప్రదేశంగా అవుతుంది. ఆత్మస్థానం ఇంతకన్నా సూక్ష్మంగా ఈ హృదయానికి మధ్య కారణాకాశంగా ఉంటుంది. అహంకారాన్ని సూక్ష్మతరం చెయ్యగా చెయ్యగా, అది కారణాకాశంలో చేరగలుగుతుంది. ఇలా అహంకారాన్ని కారణాకాశంలో చేరేంతగా కృశింప చెయ్యడం భక్తివల్లనే సాధ్యమవుతుంది. 



Thursday, November 14, 2013

జ్ఞానయోగము- సాధన (16)


ప్రేమ, బాంధవ్యాలకు ఇద్దరు జీవులు ఉంటేనే సాధ్యం. అద్వైత సాధనలో దయ చూపించ కూడదని, ప్రేమను క్రియారూపంలోకి తీసుకు రాకూడదని అనుకుంటాం. సాధన బాగా సాగుతున్నకొద్దీ అసలైన ప్రేమ తెలుస్తుంది. చివరి దశలో దేన్ని పొందదలుచుకున్నామో దాన్ని చేరి, అందు లీనమైతే ఇక సాధకుడు మిగలడు గనుక అది అద్వైతమే. అహంవృత్తి అణిగితే అపుడు సాక్షాత్కారమే. ఇలా లీనమవ్వడానికి తనను తాను త్యాగం చేసుకోవడమే ఉంటుంది. అదే పరాభక్తి. జీవాహంకారం పోగొట్టుకోడం అంత తేలికైన పనేమీ కాదు. వాసనలన్నీ నశిస్తేనే అది తొలగుతుంది. జీవాహంకారాన్ని జీవాహంకారం తోనే పోగొట్టాలి. అన్ని ప్రయత్నాలూ, ఫలాలూ జీవునిపైనే ఆధారపడి ఉంటాయి. అంచేత ఇది అహంకారంతో కూడిన పనే. సాధన మొదట్లో అహంకారం మన పురోగతిని, చేసే తప్పులను కూడా చూపి, పతనం గాకుండా చేస్తుంది. సాధన అంతా అహంకారంతో కూడిన జీవునికే. ఆత్మ నిష్క్రియం గనుక అది ఆత్మగానే ఉంటుంది. 

జీవుడి పనులన్నీ అహంకారం మీదే అధారపడుతాయి. అంచేత నేను అనేది పూర్తిగా లేదనుకో కూడదు. అలా అనుకుంటే ప్రయత్నమే ఉండదు గదా! సాధన చెయ్యగా చెయ్యగా మనస్సు దానిపై అంటే బ్రహ్మంపైనే ఉంటుంది. ఏవేవి విడచిపెట్టాలో వాట్ని విడిచే దశకు చేరుకున్నాడు. కాబట్టి ఇకనుంచీ అంతా భగవదనుగ్రహం మీదే ముందుకు సాగుతుంది. అంటే ప్రయత్నమని, ఫలమని విడిగా చెప్పలేం. ఇప్పటి వరకూ సాధనతో శుద్ధమైన అంతఃకరణం అనుభవ దశకు చేరుకోవాలి. చేరుకోడం అనేదానికన్నా ఇక ఇవ్వడమే/ అర్పణభావమే ఉంటుంది. అందుకే శమాదిషట్కసంపత్తిని పొందాకా నిన్ను నీవు ఖాళీ చేసుకోడానికే, భక్తి ఉద్దేశించ బడింది. భక్తివల్ల ప్రేమ, వినయమూ అబ్బుతాయి. అలాంటి ప్రేమ, వినయములతో గల భక్తిలో సాధన ముందుకు సాగుతూంటే, ఇంతవరకూ సాధనవల్ల తేలికైన మనస్సు, బుధ్ధీ  అహంకారం చేత లాగబడి హృదయంలోకి ప్రవేశపెట్ట గలగాలి. భక్తిలో ఆత్మనివేదనం ఉంటుంది. అంతా నీ సంకల్పమే అనే స్థితి యిది.  అంటే ఇక సంకల్ప వికల్పాలుండవు. అంచేత మనస్సుకు, బుద్ధికీ ఇంకేమీ పని లేదు. 


అసలైన భక్తి అహంకారం నుండే పుడుతుంది. ఇలాంటి భక్తి అహంకారాన్ని వృద్ది చెయ్యదు సరికదా , అహంకారాన్ని ఆత్మలో లీనమయ్యేట్లు చేస్తుంది. లీనం చెయ్యాలన్నప్పుడు లీనం చెయ్యాలని కోరేవాడు ఒకడు ఉండాలి. అలా ఆత్మలో లీనమవ్వాలని కోరేదే  ఇక్కడి అహంకారం. అంటే ఇక్కడ భక్తితో ఉన్నాననే అహంకారాన్ని ప్రేమతో లీనం చెయ్యడమే లక్ష్యం. భక్తియే ఇక్కడ అహంకారాన్ని బాగా పలుచబడేటట్లు చేసి, అది పలుచబడగా పలుచబడగా ఇక అహంకారం  తనకు నిలయమైన హృదయం చేరగా, హృదయమే భక్తికి నిలయమవుతుందన్న మాట. ఇలా భక్తిలో పరిణతి చెందినప్పుడు సన్యాసం స్వీకరించి, భక్తితో  అహంకారాన్ని క్రమంగా లీనం చేస్తుండగా శ్రవణ మనన నిదిధ్యాసనలను అభ్యసిస్తాడు. ఈ దశలో భక్తి శీఘ్రంగా మొలకెత్తుతూ హృదయమంతా నిండినప్పుడు అహంకారం పూర్తిగా నిర్మూలించ బడుతుంది. అహంకారం పూర్తిగా నిర్మూలించబడే ముందు ఈ స్థానం అణువుల రూపంలో , భక్తితో నిండియున్న భౌతిక హృదయం వలె ఉంటుందని అంటారు.



Thursday, November 7, 2013

జ్ఞానయోగము- సాధన (15)

ఇక్కడినుండే మలయమారుతం వీస్తుంది. సాధకుడు శుష్కప్రాయంగా జీవించడం మాని, అహంకారం యొక్క దురభిమానానికి దూరంగా ఉంటూండాలి. నేను నేనేది అహంకారం. దురహంకారం/ దురభిమానం అనేది అహంకార భావనకే చెందినా అది విర్రవీగే తనాన్ని చూపుతుంది. ఉదాహరణకు నేను సాధనలో ఎన్నో మెట్లను అధిరోహించి ప్రస్తుతం జ్ఞానమార్గంలో ఉన్నానని చెప్పడం వంటిది. ఐతే అహంకారం పూర్తిగా చిట్ట చివరి దశలోనే నిర్మూలించ బడుతుంది. అందుకే ఈ స్థాయిలో వినయము, సమర్పణ భావమూ పెంపొందాలి. ఈ గర్వ,ఆహంకారాలకు దూరంగా ఉండటానికి భక్తి తప్పనిసరి అని శంకరులు ప్రతిపాదించారు. ఇంతవరకూ గడించినదంతా పరమాత్మ దయవల్లనే లభించినదని ఎప్పుడూ అణకువతో ఉండాలి. ఆయన దయలేందే మోక్షం రాదు. అంచేత సన్యాసం స్వీకరించడానికి ఈ దురభిమానాన్ని త్యాగం చెయ్యాలి.

మనం దేనితోనైనా అనుబంధం ఏర్పరచుకోవాలంటే అది జీవం ఉన్నవాటితోనే సాధ్యం. ఇలా అనుబంధంతో బాంధవ్యంతో ఉన్నప్పుడు బాంధవ్యంతో బాటు జీవుడూ కరిగిపోయి అదే అవుతాడు. ఇలా కరిగిపోవడమే , అదే ప్రేమ అని చెబుతారు. బాంధవ్యం యొక్క సౌరభం ఒక జీవుడు మరో జీవుడికి  సర్వస్వాన్నీ ప్రేమలో అర్పించుకోవడమే ఉంటుంది. ఇంతదాకా నిత్యానిత్యవస్తు వివేకం నుంచి శమాదిషట్క సంపత్తి దాకా వీటిని పొందినా, సాధన జడం గానే సాగింది. ఇంకా ప్రాణం మహాప్రాణంతో సంధానించ బడలేదు. అందుకే బౌద్ధులు చెప్పే శూన్యం వలె ఉంది. కాని వేదాంతులు చెప్పే బ్రహ్మం సచ్చిదానందమయం. చిదానంద స్వరూపం ఆనందఘనం. అలా పరిపూర్ణదశను ఆనందస్వరూపంగా భావించి, ఆ పరిపూర్ణతలో మునిగిపోడమే దీన్లో జరిగేది. అందుకే ఈ స్థితిలో భక్తి యొక్క ఉద్దేశ్యం జీవుడు ఆ పరిపూర్ణతను పొందటం. దాంతో బాంధవ్యాన్ని కలిగి ఉంటూ ఆ పరిపూర్ణ సచ్చిదానందంలో కరిగిపోవటమే. ఇలా జడంగా జరిగే సాధన అనే మ్రోడును భక్తితో తడిపి, చల్లబరచి చిగురించేట్లు చేస్తాడన్నమాట.

మనస్సుకు ఆలోచనలు, బుద్ధికి అనుభూతులు, అహంకారానికి నిశ్చయ జ్ఞానము ఎప్పుడూ ఉంటుంటాయి. అంచేత మనో బుద్ధ్యహంకారాలను వాటి పనులనుండి ఎండింపచెయ్యాలి. అప్పుడే ప్రేమ మొలకెత్తుతుంది. భక్తి పరమాత్మ వేపుకి మళ్ళినప్పుడు  అహంకారం ఆత్మలో లయమవ్వడానికి సిద్ధమవుతుంది. సాధనచతుష్టయం తర్వాత సన్యాస స్వీకారము, మహావాక్యాల ఉపదేశము ఉంటాయి. నేర్చుకున్న శాస్త్రాలు వాక్యాలు సజీవంగా భావించుకొని ప్రేమగా  వాటితో అనుబంధం ఏర్పరచుకొని వాటిలో కరిగిపోవాలి. సన్యాసంలో అన్నీ విడవడమే ఉండటంవల్ల బయటివారికి శుష్కంగా అనిపిస్తుంది. కాని అలా విడచిపెట్టడంతో అసలైన చల్లని ప్రేమామృతం మొదలవుతుంది.






Tuesday, October 29, 2013

జ్ఞానయోగము- సాధన (14)



సగుణ నిర్గుణాలు
ఉపనిషత్తులు నిర్గుణం గురించే చెప్పాయనే మాటను ప్రమాణంగా తీసుకుని దాన్నే చింతిస్తూ శ్రద్ధతో ముందుకు సాగిపోతే నిర్గుణ బ్రహ్మానుభవం కలుగుతుంది. మనస్సు పనిచేస్తున్నంత వరకూ అప్పుడపుడు ఈశ్వరుడు జ్ఞప్తికి వస్తుంటాడు. అసలు హృదయంలో ఉన్నది నిర్గుణుడే. ఐనా అలా గుర్తుకువచ్చినప్పుడు ఓ భగవంతుడా! నీ దయవల్ల అద్వైతంలో అడుగు పెట్టి , కొద్ది కొద్దిగా పురోగమిస్తున్నాను. నీ కృప కటాక్షాలతో నన్ను అద్వైతానికి చేర్చమని ప్రార్ధించాలి. జ్ఞానమార్గంలో ఇలా అప్పుడపుడు కల్గే భక్తి కొద్ది సమయానికే ఉన్నా , అది సజీవంగా తొణికిసలాడేదిగా ఉంటుంది. కృతజ్ఞతతో ఉండే భక్తి నిత్యమూ ఉరే ఊట వంటిదని చెప్పబడింది. మన ధ్యేయం నిర్గుణం కాబట్టి, సగుణం నుంచి మనస్సును మళ్లించాలి. ప్రేమ ఎటువెళ్ళాలో సూచించే ఏ సగుణమూర్తి ఐనా గురువే. అతడే ప్రేమను నిర్గుణం వేపు మళ్లించి ఉద్ధరించేవాడు. ప్రేమ, భక్తి ఒకదానితో మరోటి అనుబంధం కలిగే ఉంటాయి. ఇప్పుడు ఆత్మనే వరించాలనే తపనతో అనుబంధం కలిగి ఉన్నాం. జీవాహంకారం లేదు. పరమైన వస్తువు పట్ల చూపే, ప్రేమయే భక్తి అనబడుతోంది.

జీవుడికి అనుబంధమనేది జీవం ఉన్నవాటితోనే ఉంటుంది. ఇప్పటి వరకూ సాధన జడంగానే సాగుతోంది. ప్రాణం ఇంకా మహాప్రాణంతో అనుసంధానమవ్వ లేదు. అంటే బౌద్ధులు చెప్పే శూన్యం మాదిరిగానే ఇంతవరకూ ఉంది. కాని వేదాంతంలో చెప్పే బ్రహ్మం శూన్యం కాదు. అది సచ్చిదానందమయం. ఆనంద స్వరూపంగా భావించి ఆ పరిపూర్ణతలో మునిగి పోవడమే ఇందులో జరిగేది. దీనికి ప్రేమతో కూడిన భక్తి అవుసరం. ఇప్పటి వరకూ సాధన శుష్కంగా జరిగినా, ఇకనుండి శ్రవణ మననాదులను భక్తితోను ప్రేమతోను కొనసాగించాలి. బాహ్యప్రపంచాన్ని విడచిన సన్యాసం ప్రేమామృతంతో తడిసినదిగా ఉంటుంది. 

ఇక్కడినుండే మలయమారుతం వీస్తుంది. 
అంచేత సాధకుడు శుష్కప్రాయంగా జీవించడం మానాలి.



           
         
         

Friday, October 25, 2013

జ్ఞానయోగము- సాధన (13)

ఈవిధంగా వేరై,  అహంకారంతో "నేను నేననే" జీవుడు –ఈ “అబద్ధపు నేను”   వస్తుప్రపంచంలో వస్తువులను విషయాలను గ్రహించి, గ్రహించి బాగా బలిసిపోయి మనోబుద్ధులను నియంత్రిస్తోంది. ఇలా మనో బుద్ధులతోను అహంకారంతోను ఉన్న అంతఃకరణాన్ని, ఈ ద్వైత ప్రపంచంనుంచి మళ్లించి పరమాత్మ స్థానాన్ని చేరేటట్లు చెయ్యాలి. అనేకరూపాలతో ఉన్న ప్రాపంచిక వస్తువులను, విషయాలను స్వంతం చేసుకోవాలనే తహతహవల్ల, అసలైన నేనుపై అనేక పొరలు పొరలుగా ఏర్పడి, చాల మందంగా తయారయ్యిందీఅహంకారం. ఇలా బలిసి మందంగా ఐన అహంకారం బాగా కృశించి బక్కచిక్కితేనే; హృదయద్వారం వద్దనున్న చిన్నరంధ్రంలో ప్రవేశించి ఆత్మనుచేరి, అద్వైతానందాన్ని జీవుడు పొందగలడు. ఈ తెచ్చిపెట్టుకున్న పొరలు కరిగించు కోవడమే గాక, అహంకారంతో తాను భిన్నుడననే జీవభావం పూర్తిగా కృశించి, బక్కచిక్కాలంటే  ప్రేమ వల్లే అది సాధ్యపడుతుంది.
    
అంటే ఇంతవరకూ అది కావాలి, ఇది కావాలనే “నేను”, ఇప్పడు ఇవ్వడాన్ని అభ్యసిస్తే ఆ పొరలు క్రమంగా పల్చబడి గమ్యస్థానాన్ని  చేరుకోగల్గుతుంది.  ఇది ప్రేమను అభ్యసించడంవల్లనే సాధ్యమవుతుంది. నేను అనే అహంకారం చిక్కిపోయినా ఇంకా సూక్ష్మంగా ఉంటూ మనకు తెలియకుండానే విషయాలవేపుకు లాగుకుని పోతుంటుంది. అంచేత ఇప్పుడు సాధనలో గడించిన, లాభాలను వ్యక్తిత్వంతో బాటుగా; ఆత్మలో విలీనం చెయ్యాలి. ఇలా చెయ్యాలంటే హృదయాంతరాళాలలో ప్రేమ కలగాలి. ప్రేమే అహంకారాన్ని పొగొట్ట గల్గుతుంది. వైరాగ్య శమ దమాలు అంతఃకరణాన్ని శుభ్రం చేశాయి. దృఢ నిశ్చయంతో ఏమీ ఆశించకుండా పంచియిచ్చే ప్రేమ అహంకారాన్ని లొంగదీసుకుని /వశపరచుకోడం చేత ఆత్మసాక్షాత్కారం సాధ్యమవుతుంది. 

ప్రస్తుతం సాధకుడున్న స్థితిలో  ఏ జీవినీ హింసించడం గాని , ద్వేషించడం గాని ఉండదు.  ఐనా ప్రేమకూడా ఉండదు. ఈ ద్వేషంలేనితనాన్ని, ప్రత్యేకంగా ప్రేమగా బాహ్యప్రపంచానికి చూపనవుసరం లేదు. కాని ప్రేమ తన హృదయాంతరాళాల్లో  పెల్లుబికినపుడు, ఈ ప్రేమామృతాన్ని పంచాల్సిందే. ఈ ప్రేమను అర్పించుకునే భావం అహంకారాన్ని కృశింపజేసుకోడానికి తోడ్పడి, హృదయ ద్వారంలోకి ప్రవేశించేలా చెయ్య గల్గుతుంది. ప్రేమను ఎవరికో అర్పించడం కాదు. మనం ఆత్మనే వరించాలి. అదే లక్ష్యం కూడా. ఆత్మకే శరణాగతితో అర్పించు
కోవాలన్నమాట. అంటే తనకో వ్యక్తిత్వమనేది లేకుండా ఆత్మయే మిగిలేంతగా జీవాహంకారం శూన్యమవ్వాలి. అదే ప్రేమంటే. ఆత్మసాక్షాత్కారానికి ముందు సాధకుడు పరీక్షకు కూడా లోనవుతుంటాడు. అప్పుడా సాధకుని భావన ఎలా ఉంటుంది అంటే, నీకు అర్పించుకోకుండా నేనేదైనా ఉంచుకున్నానా అనేట్లు; సర్వ సమర్పణ భావముంటుంది. ఇలా ఆత్మతో శరణాగతిగల ప్రేమే భక్తి.  మహోన్నతుడైన నిర్గుణ ఆత్మపై చూపే ప్రేమయే భక్తి.