Friday, September 7, 2012

శరీరము - ఆత్మ


మనల్ని మనం చూసుకొనేపుడు ముందుగా కన్పించేది భౌతిక శరీరం. ఒకచోటు నుంచి మరోచోటుకి పోవాలన్నా, జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే ప్రాపంచిక  విషయాలను గ్రహించాలన్నా చైతన్యం ఉంటేనే సాధ్యమవుతుంది. మన దైనందిత జీవితంలో జాగ్రదావస్థలోనే గాకుండా, గాఢ నిద్రలో ఉన్నపుడు మనస్సు , ఇంద్రియాలు పనిచెయ్యవు. ఐనా ఊపిరి పీల్చుకోడం, గుండె కొట్టుకోవడం అనే ప్రక్రియలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు మనలను జీవింప జేసేది ప్రాణము. అది శ్వాస రూపంలో ప్రాణశక్తిగా శరీరాన్ని, అవయవాలను నడిపిస్తుంది. ఈ ప్రాణ శక్తి మనలో ఉండే సూక్ష్మ శక్తి. దేహంలో ఉండే చేతనమంతా ప్రాణము యొక్క వ్యాపారమే నని చెప్తారు.

జీవం అంటే శరీరానికీ  ప్రాణానికీ ఉండే సంబంధమని చెప్పుకోవచ్చు. ఈ సంబంధం తెగిపోతే ప్రాణం పోయిందని అంటాం. అప్పుడీ  భౌతిక శరీరాన్ని మృతదేహమంటాం. వాస్తవానికి శరీరం గాని, ప్రాణం గాని స్వతఃగా చైతన్యం లేనివే. మరి వీటికి చైతన్యాన్ని కలిగించే దేదో తెలుసుకోవాలి. ఒక విషయం గాని, వస్తువుగాని మనకు తెలియాలంటే అక్కడ చూసే వాడొకడు ఉండాలి. చూడబడే వస్తువు లేక విషయం ఉండాలి. ఈ రెండిటినీ కలిపే చూడటం అనే ప్రక్రియ జరగాలి. అంటే చూసేవాడు, చూడబడే వస్తువు, చూడడం అనే క్రియ ఉండాలి. ఆ వస్తువుతో భౌతిక సంబంధం లేకపోయినా మనస్సు జ్ఞానేంద్రియాల ద్వారా; ఆ జ్ఞానాన్ని కల్గించేది చైతన్యమే. మనస్సు, ఇంద్రియాలు అన్నీ ప్రకృతి నుంచే ఏర్పడ్డాయి. ప్రకృతి జడము. అంచేత ఇవి  చైతన్యవంతములు కావు. చూసే వస్తువుకు, చూసే వాడికి  చూడడం అనే ప్రక్రియలకు వెనుక ఎరుక ఉన్నపుడే ఆ వస్తువు తెలియ బడుతోంది. ఆ ఎరుకే(awareness) చిత్త వృత్తి ద్వారా విషయానుభవం కలిగించేది.

స్వప్న జాగ్రదావస్థలలో సహితం  శరీరాన్ని ఆశ్రయించి ఉండే ప్రాణం కూడ ఇంద్రియాలూ, మనస్సుల లాగ శాశ్వతం కాదు. కాని వీటన్నిటికీ  చైతన్యాన్ని ఇచ్చేది, చిత్త వృత్తుల ద్వారా విషయానుభవం కలిగించేదీ, చూసే వాడి వెనుక ఉండే  చైతన్యమనే ఎరుకను ఆత్మ అంటారు. అదే అన్ని భూతాల అంతరాత్మగా చెప్పబడే బ్రహ్మము, లేక క్షేత్రజ్ఞుడు.

ఇదే విషయాన్ని ప్రశ్నోపనిషత్తులో ప్రాణం ఆత్మ నుంచే అంటే బ్రహ్మము నుండే ఉద్భవించి నట్లుగా చెప్ప
బడింది. ప్రాణానికీ ఆత్మకూ గల సంబంధం మనిషికీ నీడకూ ఉండే సంబంధం వంటిదని అంటోంది. అంటే నీడను మనిషి నుంచి విడదీయలేం. అలాగే ప్రాణానికీ ఆత్మకూ ఉండే  సంబంధం కూడా విడదీయలేనిదే. శరీరంలో ఆత్మ ఉన్నదంటే ప్రాణము ఉంటుంది. ఛాందోగ్యోపనిషత్తులో ప్రాణము ముఖ్య ప్రాణముగా చెప్పబడింది. ఆత్మ దేన్లో  అద్దమునందు వలె ప్రతిబింబము చెందుతుందో, అదే ప్రాణమని చెప్పబడింది. రాజువద్ద ముఖ్యాధికారి పనులన్నిటినీ ఎలా చేసి పెడుతుంటాడో, అలా ఆత్మ క్రింద, సర్వాధికారాన్నీ ప్రాణము జరుపుతుంది. ఇది పరమాత్మను నీడలా అంటి ఉంటుందని చెప్ప బడింది. 

మనస్సు ఆత్మకు అనుభవాలను కలిగించే పని ముట్టు లాంటిది. మనస్సు ద్వారా బాహ్యవిషయాలను అనుభవంలోకి  తెచ్చుకొని, తిరిగి కర్మేంద్రియాల ద్వారా పనులను చేయిస్తుంది. ఇలా ప్రాణమే మనలో సమస్తాన్ని నడిపిస్తూ, ఆత్మ వల్ల చైతన్యం కలిగి ఉంటుంది. ఆత్మ ప్రాణ వాయువూ కాదు, మనస్సూ కాదు. అది శుద్ధమైనదని వేదాలు చెబుతున్నాయి.

రమణ మహర్షి వారు ఆత్మను గురించి ఇలా అంటారు. "చూడబడేది, చూసేది, చూపు అన్నీఅదే. 
ఆత్మ సాక్షాత్కారంలో చూడబడేదేమీ ఉండదు. ఎరుకయే దాని సస్వరూపం. దాని వెలుగులోనే శరీరము, అహంకారము, ప్రపంచమూ ప్రకాశిస్తాయి. మనస్సెంత ఉరకలు వేస్తున్నా అది అత్మవల్లనే. మనస్సు, శరీరం, ప్రపంచం వీటికి ఆత్మను విడిచి ఉనికి లేదు.  చూసేవాడు ఆత్మ. కాని ప్రజలది తెలిసికోక, చూడబడే దానివెంట పరుగులు పెడుతుంటారు. తానున్నాని తెలిసినా, తానెవరో మాత్రం తెలియదు. అతడు ప్రపంచాన్ని చూస్తాడు. కాని అది బ్రహ్మమేనని గ్రహించడు". 

"తెంపులేని ఎరుకయే ఆత్మ. మనిషి అంటే దేహము, ఆత్మ, మనస్సుల కలయిక. ఆత్మే చైతన్యవంతమైన శక్తి. దాన్నుంచే పుట్టి ; మనస్సు జడమైన దేహంతో కలసి ఇది నేను, అది నేను అంటుంది. అదే దేహాత్మ బుద్ది. ఆత్మ లేకుండా మనస్సు నిలువలేదు. మనస్సు ప్రాణం సహాయంతో దేహానికి కదలికను ఇచ్చి, తను చక్రవర్తిలా దేహేంద్రియాలతో ఇష్టం వచ్చినట్లు పనులు చేయించు కుంటుంది".


No comments:

Post a Comment