త్రిగుణాలు--------------------------
తమోగుణం
తమోగుణం
ఒక వస్తువును
మరొక వస్తువుగా గ్రహించే ఆవరణ శక్తి తమోగుణం వల్ల కలుగుతుంది. ఇదే జననమరణ రూపమైన
సంసారానికి మూల కారణం. ఈ ప్రపంచ వ్యవహారమైన మాయయొక్క విక్షేప శక్తికి ఇదే
కారణమవుతోంది. ఎంతటి పండితుడైనా తమోగుణ గ్రస్తుడైనప్పుడు ఒక వస్తువును చూచి
దానియందు తాను కల్పించుకొన్న వస్తువే సత్యమని తలుస్తాడు. దాని గుణాలనే
ఆశ్రయిస్తాడు. సత్యమది కాదని ఎన్ని విధాలుగా బోధించ ప్రయత్నించినా అతని చెవికి
ఎక్కదు. తమోగుణం యొక్క ఆవరణశక్తి అంత బలమైనది.
(మాయ ఆవరణ శక్తి,
విక్షేప శక్తి అని రెండు విధములు. విక్షేప శక్తి అంటే – లేని వస్తువును ఉన్నట్లుగా
కల్పించటం. ఆవరణ శక్తి అంటే – ఉన్న వస్తువును లేదనుకొనేలా చేసేది).
అభావన ( అంటే
బ్రహ్మము లేదను భావన), విపరీత భావన ( శరీరమే నేను అనే భావన), అసంభావన ( ఏదైనా ఉన్నదని
కలిగే సందేహము ), విప్రతిపత్తి (ఉందా , లేదా అనే సంశయ వృత్తి ). ఈ నాలుగూ తమోగుణం
యొక్క శక్తులు. ఇవి తమోగుణము యొక్క ఆవరణ శక్తితో సంబంధపడిన వ్యక్తిని విడిచి
పెట్టవు. అలాగే విక్షేప శక్తి కూడ మానవుడిని ఎప్పుడూ నిలకడగా ఉండనియ్యదు.
తమోగుణము
అజ్ఞానమే స్వభావముగా గల్గి నిద్ర, సోమరితనము,
పరాకులను కల్గించి దేహిని
బంధిస్తుంది. అజ్ఞానము, అలసత్వము, జడత్వము, నిద్ర, ప్రమత్తత , మూఢత్వము తమోగుణ
లక్షణములు. దీనివల్ల మానవుడు ఏమీ తెలిసుకోలేడు. ఇది సత్వగుణం ఉన్నవాళ్ళని కూడ
భ్రమింప జేస్తుంది. ఈ గుణము పెంపొందితే
కళావిహీనత, పరాకు, భ్రమ, సోమరితనము విపరీత
జ్ఞానము కలుగుతాయి. ఈ గుణాధిక్యత ఉండగా మరణిస్తే అధోలోకములందు జంతువులుగా జన్మిస్తుంటారు.
తామసిక శ్రద్ధ
గలవారు భూత ప్రేతాలను ఆరాధిస్తారు.
ఆహారవిషయమున వండి చల్లారిపోయినది , సరిగా
పక్వముకానిదీ, రుచిలేనిదీ, పాసిపోయినది, ఎంగిలిది అపవిత్రమైన పదార్దములు తామసునకు ఇష్టము. ఇది సోమరితనం, కోపం మొదలైన చెడు లక్షణాల్ని కల్గ జేస్తుంది.
మాంసం, మద్యం, పొగాకు మొదలైన ఘాటైన పదార్ధాలు, మత్తు కల్గించేవి తామసిక ఆహారం లోకి వస్తాయి. డైరీ
గ్రుడ్డు నిర్జీవమే అయినా దాన్లో తామసిక ప్రవృత్తి ఉంటుంది.
సత్వగుణం
సత్వగుణము
స్వచ్చమైనది నిర్మలముగా ప్రకాశించునది. అయినా రజో తమోగుణాలతో కూడి సంసారబంధానికి
కారణమవుతుంది. ఈ సత్వగుణమందు ఆత్మ ప్రతిబింబము చెంది సూర్యునిలా సమస్త
జడపదార్దాలనూ ప్రకాశింప జేస్తుంది. యమనియమాదులను, భక్తి , శ్రద్ధ , మోక్షాపేక్ష ,
దైవీ సంపద, అసత్తయిన దానిని విడవడం అనేవి మిశ్రితమైన సత్వగుణ లక్షణాలు.
ప్రసన్నత,
ఆత్మానుభవం, పరమశాంతి, తృప్తి, ప్రహర్షము, పరమాత్మ యందు నిష్ఠ అనేవి, విశుద్ధ
సత్వగుణ లక్షణాలు. శుద్ధసత్వగుణం వల్ల ముముక్షువు నిత్యానంద రసాన్ని
పొందుతాడు. ఉపద్రవములు
లేనిది. జ్ఞానముచేతను, సుఖములందు ఆసక్తిచేత దేహిని బంధిస్తుంది. సత్వగుణము వృద్ధిలో
ఉన్నపుడు జ్ఞానము కలగుతుంది. తేజస్సుతో
దేహము కాంతివంతముగా ఉంటుంది. సుఖాన్ని జ్ఞానాన్ని కలిగింప జేస్తుంది. జీవరాశులందు
కరుణ, మైత్రి కలిగిస్తుంది. త్యాగమును కలిగిస్తుంది.
సత్వగుణ పోషణ ముముక్షువునకు అవుసరము.
సత్వగుణము హెచ్చు గా ఉన్నపుడు మరణించిన వాడు, ఉత్తమ జ్ఞానులు
పొందే నిర్మలమైన పుణ్య లోకాన్ని పొందుతాడు.
సత్వగుణమునందు శ్రద్ధ ఉండే వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు.
రసవంతములు, చమురు గల్గినవి, చాల కాలమువరకు ఆకలిని కలుగ జేయని ఆహార పదార్దములు సాత్వికులు ఇష్ట పడతారు. ఇవి దీర్ఘాయుస్సు , దేహబలము , బుద్ది బలమునూ ఇస్తాయి. ఆరోగ్యాన్ని, సంతోషాన్నికల్గిస్తాయి. మనస్సును నిర్మలం చేసి శాంత స్వభావాన్ని కలుగజేసే కూరగాయలు, పళ్ళు , గోరువెచ్చని పాలు, పెరుగు, వెన్న, నెయ్యి , జున్ను, వంటి పాలనుండి తయారైన పదార్దములు, తేనె, బాదం పప్పు, గోధుమలు, పప్పు ధాన్యాలు వంటివి సాత్విక ఆహారంలోకి వస్తాయి. తేలికైన కొద్ది మోతాదులో తీసుకునే వన్నీ సాత్విక ఆహారంలోకి వస్తాయి. ఏ ఫలమూ ఆశించకుండా కర్తవ్యతా బుద్ధితో చేసే పనిని సాత్విక యజ్ఞం అంటారు.
రసవంతములు, చమురు గల్గినవి, చాల కాలమువరకు ఆకలిని కలుగ జేయని ఆహార పదార్దములు సాత్వికులు ఇష్ట పడతారు. ఇవి దీర్ఘాయుస్సు , దేహబలము , బుద్ది బలమునూ ఇస్తాయి. ఆరోగ్యాన్ని, సంతోషాన్నికల్గిస్తాయి. మనస్సును నిర్మలం చేసి శాంత స్వభావాన్ని కలుగజేసే కూరగాయలు, పళ్ళు , గోరువెచ్చని పాలు, పెరుగు, వెన్న, నెయ్యి , జున్ను, వంటి పాలనుండి తయారైన పదార్దములు, తేనె, బాదం పప్పు, గోధుమలు, పప్పు ధాన్యాలు వంటివి సాత్విక ఆహారంలోకి వస్తాయి. తేలికైన కొద్ది మోతాదులో తీసుకునే వన్నీ సాత్విక ఆహారంలోకి వస్తాయి. ఏ ఫలమూ ఆశించకుండా కర్తవ్యతా బుద్ధితో చేసే పనిని సాత్విక యజ్ఞం అంటారు.
మన మానసిక
ప్రవృత్తి ఈ గుణాల మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే సాత్విక ఆహారం వల్ల మనస్సు
ప్రశాంతంగా ఉంటుందని అంటారు. రజస్తమో గుణాలు మోక్షానికి ప్రతిబంధకాలుగా చెప్పబడ్డాయి.
ప్రకృతిని జయించాలంటే రజస్తమో గుణాలను అణగ త్రొక్కి, సత్వగుణం వృద్ది చేసుకోవాలి. ఒక్క
ఆహారంలోనే గాకుండా గ్రహించే విషయాల్లోనూ, నివశించే పరిసరాల్లోనూ, మనం కలిసే
వ్యక్తులూ సత్వగుణాన్ని వృద్ది చేసుకొనేవిగా ఉండాలని పెద్దలు చెబుతారు.
No comments:
Post a Comment