Tuesday, September 11, 2012

ఆత్మ-2


ఆత్మ భగత్ సముద్రానికి చెందిన బిందువు. పరమాత్మ నుంచి భౌతిక శరీరాల్లోకి దిగుతూ అంధకారమనే పొరలతో ఆవరించబడి తానెవరో, ఎక్కడనుంచి వచ్చిందో మరచిపోతుంది. అపుడు ద్వైతభావమేర్పడి, నేను, నాది అనడం మొదలుపెడుతుంది. ఇదే ఆహంకారమంటే.  తన మూలాన్ని మరచి, శరీరమే తానని భ్రమలో పడుతుంది. మనస్సు చంచలమైనది. ఇంద్రియాల ద్వారా బయటకు, లోపలకు తిరుగాడుతూనే ఉంటుంది. విషయాలతో ఐక్యం చెంది, కోర్కెలతో జీవుడిని ఉర్రూతలూగిస్తుంటుంది. ఇలా మనస్సుతో పెట్టుకున్న సంబంధం వల్ల, శరీరానికే యజమానిగా ఉండవలసిన ఆత్మ, మనసు చేయించే పనులయొక్క కర్మ ఫలాన్ని, అనుభవించ వలసి వస్తుంది. ఇదే బంధాన్ని కల్గించేది, మనలను ఈ జనన మరణ సంసార చక్రంలో బందీలను చేసేదీను. అందువల్ల ఆత్మకు తానెవరో, ఎక్కడనుండి వచ్చిందో తెలుసుకొని తన స్వంతమైన ధామాన్ని చేరే వరకూ ఈ బాధలు తప్పడంలేదు.

మనశరీరంలో ఉండే సత్పదార్ధమే ఆత్మ. మిగిలినవన్నీ నాశనమయ్యేవే. ఇదే శరీరాన్ని, ఇంద్రియాలనూ, మనస్సునూ, బుద్దినీ , ప్రాణాన్నీ నడిపించే చైతన్యం. ఇది లేకుండా మన శరీరంలో ఏ కార్యమూ జరుగదు. అందుకే ఆత్మను యజమాని అనేది. 
   
భగవద్గీతలో మన శరీరము  రధముగా పోల్చబడింది.
బుద్ది- దీన్ని నడిపే సారధిగా
జ్ఞానేంద్రియాలు - పరుగిడే గుర్రాలుగా
మనస్సును - పగ్గములుగా
జ్ఞాన విషయాలు - మార్గాలుగానూ
జీవుడు / ఆత్మ - దీన్లో ప్రయాణం చేసేది గాను చెప్పబడింది.

జీవితం గురించి, గమ్యం గురించి సరైన అవగాహన లేకపోతే మనస్సు అదుపులోలేక, ఇంద్రియాలు తమ ఇష్టంవచ్చినట్లు ప్రవర్తిస్తాయి. మనస్సును సరిగ్గా నియంత్రించే బుద్దియొక్క  అదుపాజ్ఞలలో ఉంటే  శరీరమనే రధం సరిగ్గా నడుస్తుంది. మనస్సనే పగ్గాన్ని బిగించడం అంటే కోర్కెలను అదుపులో పెట్టుకుని వైరాగ్యాన్ని అభ్యసిస్తే సాక్షిగా ఉండే ఆత్మ మనకు లభ్యమవుతుంది.  

  
   

No comments:

Post a Comment