Wednesday, September 26, 2012

పంచ కోశములు-1

పంచ కోశములు-1                   

కోశము అంటే ఒర అని అర్ధం. కత్తి ఒరయందున్నట్లు, ఆత్మ కోశములనే గుహల్లో ఉంటుంది. ఈ కోశములన్నీఒకదాన్లో మరొకటి ఉండటం వల్ల,  గుహ అనబడుతోంది. వీటన్నిటికి లోపల ఆత్మ ఉంటుంది.  అంటే ఇవి ఆత్మను ఆవరించి ఉంటాయి. స్థూల దేహమే అన్నమయ కోశం. దీని లోపల ప్రాణమయ కోశము, దీనికంటె లోపల మనోమయ కోశము, దీనిలోపల విజ్ఞానమయ కోశము ఉంటాయి. ఈ విజ్ఞానమయ కోశమే 'కర్త'. విజ్ఞానమయ కోశమునకు లోపల ఆనందమయ కోశము ఉంటుంది. ఇదే 'భోక్త'. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశమనేవి పంచ కోశాలుగా చెప్పబడ్డాయి.

అన్నమయ కోశము:

ఇది తల్లితండ్రులు భుజించిన అన్నపు రసము; శుక్ల శోణితములై, అట్టి శుక్ల శోణితముల వల్ల   పుట్టి, అన్నరసముచే వర్ధిల్లు స్థూల శరీరమే అన్నమయ కోశమని చెప్పబడింది. పంచీకృతం చెయ్యబడ్డ మహా భూతములతో, స్థూల దేహం ఏర్పడుతుంది. అందుకే శరీరము పంచ భూతాత్మకం అనబడింది. చర్మము, మాంసము, రక్తము , ఎముకలు, మెదడు, మజ్జ, శుక్లము అనే సప్త ధాతువులతో ఉండేదే స్థూల శరీరం అనబడుతోంది. అన్నమే అన్ని భూతముల యొక్క జన్మ స్థితి లయములకు కారణమవడం  వల్ల సమస్త భూత సృష్టికీ హేతువని చెప్పబడింది. 
  
తైత్తిరీయోపనిషత్తులో; అన్నమువలననే భూతజాతములు జనించు చున్నవి. అన్నము వలననే  జీవించు చున్నవి. తుదకు అన్నము నందే (భూమి) నశించు చున్నవి లేక లయించు చున్నవని చెప్పబడుటచే- కొందరు దేహాత్మ వాదులు ఈ అన్నమయ  కోశముగా కనబడు స్థూలశరీరమునే పరమాత్మ అనుకొనుచున్నారు. దీనికి ప్రాణమయ కోశము వల్ల చలనము కలుగు చున్నది. ప్రాణము లేకపోతే , ఈ కోశము నశించి పోతుంది కాబట్టి ఈ అన్నమయ కోశము ఆత్మ కాదు. దీనియందున్న ప్రాణము అన్నమయమునకు ఆత్మ.  అన్నమయ కోశము తమః ప్రధానమైనది. క్రియాశక్తి కనబడదు, జనన మరణాది వికారములు గలది. ప్రాణశక్తి చేత ప్రేరేపించబడి కార్యములు చేయబడు తున్నాయి. ఇది శరీరమని తెలియుచున్నది గనుక తెలుసుకొనేది  దేహమునకన్న వేరుగా నుండవలెను. అందువలన ఈ అన్నమయ కోశము ఆత్మ కాదు. దీనిని బ్రహ్మమని ఉపాశించు వారికి పుష్కలముగా అన్నము లభించును. 
   
నేను మనుష్యుడను , నేను బ్రాహ్మణుడను , నేను గృహస్థుడను మొదలైన కుల గోత్ర నామాది వికార ధర్మములచే అన్నమయ కోశమును; ఆత్మయందు వ్యవహారికముగా  అధ్యాసమొనర్చు చున్నాము.

ప్రాణమయ కోశము :

సూక్ష్మ భూతముల రాజసాంశములతో ఏర్పడిన పంచ ప్రాణాలు, పంచ కర్మే౦ద్రియములూ ఈ పదీ కలసి ప్రాణమయ కోశం ఏర్పడుతుంది. ఇది సూక్ష్మ శరీరంలో(లింగ శరీరం) భాగం. శరీరమంతా నిండి, ఇంద్రియములకు శక్తినిచ్చి వాటిని నడిపించే ప్రాణ వాయువే ప్రాణమయ కోశము. ఇది అన్నమయ కోశమునకు ఆత్మ. ఈ కోశము ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము లనే ఐదు రూపాలుగా ఉంది. ఇది రజోగుణ రూపమగుటచే క్రియాత్మకమైనది. ఇంద్రియవ్యాపారము లన్నీ దీని వల్లనే కలుగుతున్నాయి. అన్నమయ కోశానికన్న సూక్ష్మమైనది. ఆకలిదప్పులను కలిగిస్తూ, శరీరంచేత సకల కర్మలూ దీనిచేత  నిర్వర్తించబడు తున్నాయి. తెలివి లేదు  గనుక, ఇది ఆత్మకాదు. దీన్ని బ్రహ్మమని ఉపాసించే  వారికి దీర్ఘాయువు కలుగునని చెప్పబడింది. 
  
ప్రాణం నుంచే అన్ని భూతములూ పుట్టి, ప్రాణము చేతనే జీవిస్తూ, చివరకు ఆ ప్రాణమునందే మరణమున ప్రవేశిస్తున్నాయి. దేహమందు ప్రాణమున్నంత వరకే జీవమున్నదని చెప్పిననూ, ఈ ప్రాణమయ కోశము మనోమయ కోశము వల్ల స్థితమైనదని తెలియు చున్నది.

నేను ఆకలిగా ఉన్నాను, నేను భుజించితిని, నేను క్రియావంతుడను, నేను వెళ్ళు చున్నాను మొదలగు వికార ధర్మములచే ప్రాణమయ కోశమును ఆత్మ యందు వ్యవహారమున అధ్యాస మొనర్చు చున్నాము.
    

5 comments:

  1. చక్కటి విషయాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.

    ReplyDelete
  2. మీ అభిమానానికి కృతజ్ఞతలు.
    సూర్యచంద్ర గోళ్ల.

    ReplyDelete
  3. వీలైనప్పుడు తప్పకుండా రివ్యూ వ్రాసి మీ మెయిలు అడ్రెస్సుకు పంపిస్తాను.
    సూర్యచంద్ర గోళ్ల.

    ReplyDelete
  4. సూర్యచంద్ర గారూ అన్నమయకోశము గూర్చి బాగ వివరించారు.అందులో మరి కొన్ని నాకు విషయాలు తేలియచేయలనుకున్నాన.
    .ఈ స్థూలదేహమే అన్నమయాత్మ అని చాలమంది భావిస్తారు.కానీ సకలవస్తువులు భూమిలో లయం అవుతాయి.కావున ఇక్కడ సకలవస్తువులు భూమికి అన్నము.భూమి అన్నాదం(అన్నాన్ని తినేది).ఈ భూమి జలము లో లయం (కరుగుతుంది)అవుతుంది.కావున ఇక్కడ భూమి జలానికి అన్నము.జలము అన్నాదం.జలము అగ్ని లో లయం అవుతుంది కావున ఇక్కడ జలము అగ్నికి అన్నము.అగ్ని అన్నాదము.అగ్ని వాయువులో లీనమవుతుంది.కాన అగ్ని వాయువు కి అన్నము.వాయువు అన్నాదము.వాయువు ఆకాశంలో విలీనంమవుతుంది.ఇక్కడ వాయువు ఆకాశానికి అన్నము.ఆకాశం అన్నాదము.ఆకాశం ఆత్మలో లీనంమవుతుంది.అంటే ఆకాశం ఆత్మకి అన్నము.ఆత్మ అన్నాదము.నీ శరీరం తో సహా పాంచభౌతికమైన విశ్వమంతా అన్నమయాత్మ అని మాత్రమే ఈ తైత్తీరియోపనిషత్ అంటుంది.

    ReplyDelete
  5. సూర్యచంద్ర గారూ అన్నమయకోశము గూర్చి బాగ వివరించారు.అందులో మరి కొన్ని నాకు విషయాలు తేలియచేయలనుకున్నాన.
    .ఈ స్థూలదేహమే అన్నమయాత్మ అని చాలమంది భావిస్తారు.కానీ సకలవస్తువులు భూమిలో లయం అవుతాయి.కావున ఇక్కడ సకలవస్తువులు భూమికి అన్నము.భూమి అన్నాదం(అన్నాన్ని తినేది).ఈ భూమి జలము లో లయం (కరుగుతుంది)అవుతుంది.కావున ఇక్కడ భూమి జలానికి అన్నము.జలము అన్నాదం.జలము అగ్ని లో లయం అవుతుంది కావున ఇక్కడ జలము అగ్నికి అన్నము.అగ్ని అన్నాదము.అగ్ని వాయువులో లీనమవుతుంది.కాన అగ్ని వాయువు కి అన్నము.వాయువు అన్నాదము.వాయువు ఆకాశంలో విలీనంమవుతుంది.ఇక్కడ వాయువు ఆకాశానికి అన్నము.ఆకాశం అన్నాదము.ఆకాశం ఆత్మలో లీనంమవుతుంది.అంటే ఆకాశం ఆత్మకి అన్నము.ఆత్మ అన్నాదము.నీ శరీరం తో సహా పాంచభౌతికమైన విశ్వమంతా అన్నమయాత్మ అని మాత్రమే ఈ తైత్తీరియోపనిషత్ అంటుంది.

    ReplyDelete