Saturday, September 15, 2012

స్థూల,సూక్ష్మ,కారణ శరీరములు-2

సూక్ష్మశరీరం --------------------------

సూక్ష్మశరీరం స్థూలశరీరానికి లోపల ఉంటుంది. కంటికి కన్పించదు. శరీరం ఏర్పడటంలో ముందుగా కారణశరీరము, పిదప సూక్ష్మశరీరము, ఆ తర్వాత స్థూలశరీరము ఏర్పడతాయి. ఒకదాని కొకటి లోపలగా స్థూలశరీరంలో సూక్ష్మ శరీరమూ, సూక్ష్మశరీరంలో కారణ శరీరమూ ఉంటాయి. ప్రాణమే పంచప్రాణాలుగా సూక్ష్మ శరీరాన్ని స్థూల శరీరంతో అనుసంధానం చేస్తుంది. 
        
తైజసుడు దీని అభిమాని. స్వప్నావస్థలో వ్యక్తమవుతుంది. స్వప్నావస్థలో ఇంద్రియాలు పనిచెయ్యవు. ఈ స్వప్నావస్థలో తైజసుడు 17 తత్వాలతోను అనేక క్రియలను జరుపుతూంటాడు. జాగ్రత్తులో చూసినదీ, చూడనిదీ, విన్నవీ, విననివీ, అనుభవించినవీ, అనుభవించనివీ, నిజమైనవీ, నిజంకానివీ, గత జన్మల అనుభవాలనూ  స్వప్నంలో చూస్తుంటాడు. కంఠస్థానము ఆశ్రయం. ఇది వాసనలతో కూడి ఉండటం వల్ల, కర్మ ఫలాలను అనుభవింప జేస్తుంది.  ఆత్మ, సంగ రహితమైనది. ఈ సూక్ష్మ శరీరం/లింగ శరీరం చిదాత్మ రూపుడైన పురుషుని వ్యాపార సాధనకు కరణమై ఉంటుంది(అంటే సాధనము).
      
మరణానంతరం వివిధ లోకాల్లోకి, శరీరాల్లోకి ఇదే ప్రయాణం చేసేది. స్థూల శరీరం పడిపోగానే జీవుడు ఈ సూక్ష్మ శరీరంతో యాతాయాతాలు చేస్తుంటాడు. వాస్తవంగా ఇవి జీవుడికి లేవు. ఇవి సూక్ష్మ శరీరానికే.  సూక్ష్మ శరీరం ఎక్కడికి వెడితే అక్కడ ఆత్మ ఉంటుంది. అక్కడ ఆ శరీరంతో సంబంధపడుతుంది. దేశ , కాల , మాన , పరిస్థితులను అధిగమించి  ఈ సూక్ష్మ శరీరం పయనించ గల్గుతుంది. ఇది మరణానికి ముందు చేసిన తప్పొప్పులను బేరీజు వేసుకొని, చేసిన పనులకు పశ్చాత్తాపం పడి, తనంత తానే ఒక నిర్ణయానికి వస్తుందని అంటారు. స్వచ్చందంగా; తానెలాంటి తల్లితండ్రులకు పుడితే  ఉద్ధరించ బడుతుందో, ఎలాంటి జీవితాన్ని గడపాలో , ఎలాంటి శరీరాన్ని పొందాలో ఇవన్నీనిర్ణయించు కొంటుంది. తిరిగి జన్మించగానే తాను తీసుకున్న నిర్ణయాలు మరచి , దృశ్య ప్రపంచం వేపు అనురాగంతో ఈ జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూంటుంది. అంటే మన తల వ్రాతను మనమే వ్రాసుకొంటున్నామన్న మాట.       

కారణ శరీరము

జాగ్రదావస్థ యందు ఇంద్రియములతో చేసే కర్మల ఫలితాలను, వాసనారూపంలో కారణ శరీరంలో  పొందు పరచబడి ఉంటాయి. ఇవి మరు జన్మకు కారణమవుతాయి. అలా మరుజన్మకు కారణమయ్యే వాసనలు దీన్లో ఉండటం వల్ల దీన్ని, కారణ శరీరమంటారు. కాని ఇది ఆత్మ కాదు.

కారణశరీరం అవ్యక్తము. దీన్లో సత్వరజస్తమములనే  మూడు గుణాలూ ఉంటాయి. ఆత్మకు కారణ శరీరమిది.  శరీర పతనానంతరం కారణ శరీరం, ఆత్మతో శరీరాన్ని వదలి పోతుంది.  నిష్క్రియుడైన ఆత్మ ఈ కారణశరీరంలో ఉంటుంది. సుషుప్త్యావస్థలో ఇంద్రియాలు మనస్సులో లీనమై ఉంటాయి. అంచేత అవి పనిచెయ్యక బాహ్య అనుభవాలు మనకు రావు. ప్రాణ శక్తులు మాత్రమే పనిచేస్తుంటాయి. ఈ ప్రాణమే  గాఢనిద్రలో శరీరం యొక్క సమస్త వ్యాపారాలనూ నడిపిస్తుంది. ఇంద్రియవృత్తులు, మనస్సూ తనలో (ఆత్మలో) లీనమై ఉంటాయి. అలాంటి సుషుప్తిలో ఈ కారణ శరీరం మాత్రమే భాసిస్తుంది/ ఉంటుంది. సుషుప్తిలో ఏమీ తెలియదు. సుషుప్తి నుంచి లేచాక, నేను బాగా నిద్రపోయాను అని తెలుసుకొనేది మనస్సు. దీనికి అభిమాని ప్రాజ్ఞుడు. ప్రాజ్నుడిది హృదయ స్థానం. ఏమీ తెలియని స్థితి అయిన సుషుప్తిలో కేవలం అవిద్యయే ఉంటుంది. అంటే అవిద్యచేత కారణ శరీరం ఏర్పడుతుంది. ఇది వాస్తవమైనది కాదు గనుక , బ్రహ్మజ్ఞానం వల్ల అజ్ఞానం (అవిద్య) నశించగా ఇదీ నశిస్తుంది.

ఈ మూడు శరీరాలకూ ఆత్మే సాక్షి. దేనితోనూ తాదాత్మ్యం చెందదు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు భిన్నంగా; స్వప్రకాశ రూపమై కర్తగా గాని , భోక్తగా గాని కాకుండా అన్నిటికీ చైతన్యాన్ని ఇచ్చే ఆత్మయే మహాకారణ శరీరంగా చెప్పబడింది. ఇది గాఢనిద్రలో అనుభవంలోకి వచ్చే స్థితి. ఇదే తురీయావస్థ. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తీ  స్థూలశరీర ధర్మాలు. స్థూలశరీరం- క్రియాశాక్తికీ , సూక్ష్మశరీరం- ఇచ్ఛాశక్తికీ , కారణశరీరం- జ్ఞానశక్తికీ ఆశ్రయాలుగా చెప్పబడ్డాయి.                   



8 comments:

  1. మరణించిన తర్వాత అత్మ మళ్లీ ఇంకో శరీరంలోకి వెల్తే ఈరోజు ఈ భూమిమీద ఇంత జనాభ ఎలా వున్నారు? అంటే అత్మలు కూడ కొత్తగా పుట్టుకొస్తాయా?

    ReplyDelete
    Replies
    1. ఒక వ్యక్తి మరణించిన తరువాత అతనిలోనుండి వెళ్ళిపోయిన ఆత్మ మరల మనిషి జన్మనే ఎత్తాలనిఋలేదు. కర్మఫలానుసారముగా 84 లక్షల జీవరాశులలో ఏ జన్మయినా ఎత్తవచ్చును. అందువలన జనాభా సంఖ్యలో కూడ తేడాలు వుంటూనే వుంటాయి.

      Delete
    2. ఒక వ్యక్తి మరణించిన తరువాత అతనిలోనుండి వెళ్ళిపోయిన ఆత్మ మరల మనిషి జన్మనే ఎత్తాలని లేదు. కర్మఫలానుసారముగా 84 లక్షల జీవరాశులలో ఏ జన్మయినా ఎత్తవచ్చును. అందువలన జనాభా సంఖ్యలో కూడ తేడాలు వుంటూనే వుంటాయి.

      Delete
  2. చనిపోయిన చెట్టులు ,అంతరించి పొయిన జాతులు కూడా కావచ్చు కదా...కోపగించుకొకండి మణికంఠ గారు.

    ReplyDelete
  3. శ్రీ మణికంఠ గార్కి,
    జీవుల సంఖ్య అనంతమనే చెప్పబడింది. అంతే గాక వీరు అగోచరులు,నిత్యులనీ అణువుగాను చేతనులు గాను ఉండటం జీవుల లక్షణమనీ చెబుతారు. అనంతమని చెప్పబడే దాన్ని మనం లెక్క పెట్టలేమని అనుకుంటున్నాను.
    ఇక జనాభా పెరుగుతోందని అనేదానికి నాకు తోచిన వివరణ ఇదీ. అనేకమైన ఆత్మలుంటే ఇష్టానుసారంగా మనం చేసే కర్మలను బట్టి వాటి ఫలితాలను అనుభవించాలి.కొన్ని ఆత్మలు స్వతంత్రంగాను, కొన్ని భక్తిమార్గంలో ఉండి పరమాత్మ అనుగ్రహంతో ముక్తి పొందుతాయనీ, మిగిలినవన్నీ బద్దమై సంసారంలో చిక్కుకుంటాయనీ చెప్పబడింది. యుగాలు మారాయి. కాలం మారుతోంది. అనుచితమైన కర్మల వల్ల బద్దమై ఉండే ఆత్మలే ఎక్కువేమో.
    సూర్యచంద్ర గోళ్ల

    ReplyDelete
  4. బాగుంది వివరణ. ధన్యవాదములు.

    ReplyDelete
  5. కర్మ వల్లనే మల్లి జన్మ వుంటే మరి నా మొదటి జన్మ ఎక్కడి నుంచి వచ్చింది. తెలియజేయగలరు.

    ReplyDelete
  6. మీ మొదటి జన్మ బ్రహ్మము నుండి వచ్చింది. మనం గుప్పెడు గింజలు చల్లితే పుట్టెడు పండినట్లు మూల పదార్ధం సృష్టికి కారణం ఎవడో వాడినుంచి వచ్చింది ఆభరణాలుఅన్నిటికి బంగారం మూలపదార్ధం అందులోనుంచి విడిపడి ఒక రూపాన్ని పొందితే అదే దాని మొదటి జన్మ అలా ఎన్నోసార్లు మార్పులు చెందుతుంది కానీ మూలపదార్ధం బంగారమేకదా అలాగే మన మూలం కూడా మొదట సృష్టి కర్త

    ReplyDelete