Monday, July 30, 2012

జ్ఞానమార్గం-(1)


జ్ఞానమార్గం లేక జ్ఞానయోగం అనేది ; క్షణికమైన ఇహపర సౌఖ్యాల యందు వాంఛను పోగొట్టి, రాగాది ద్వేషాలను నశింప జేసి మనశ్శుద్ధిని కలిగిస్తుంది.  బ్రహ్మైక్యజ్ఞానాన్ని కలిగించే సులభమైన మార్గంగా చెప్పబడింది. పరమాత్మను గురించిన జ్ఞానమే జ్ఞానమంటే. ఈ జ్ఞాన యోగాన్ని శ్రద్ధ, భక్తి , ధ్యానములతో ఆచరించ లేక మాయచే మోహించ బడిన జనులు దారేషణ , పుత్రేషణ , ధనేషణలనే ఈషణత్రయం చేత సంసారంలో తిరుగాడుతూ ఉన్నారు. అన్ని విద్యలూ అహంకారాన్ని పెంచేవిగా ఉంటె , బ్రహ్మ విద్య బ్రహ్మత్వాన్ని పొందించి , శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుంది. జ్ఞాన యోగం మహోత్కృష్ట  మైనది. అంచేత ఇది అనేక జన్మల సంచిత కర్మలను భస్మం చేసి ఆత్మజ్ఞానాన్ని కల్గిస్తుంది. తనే బ్రహ్మమని తెలిసికోవడం జ్ఞానానికి పరాకాష్ఠ . అజ్ఞానమంటే నేను, నాది,ఈ శరీరమే నేను అనుకోవడం వంటివి.  జ్ఞానప్రాప్తి అనేది భక్తి , కర్మ మార్గాలలో  కుశలత సంపాదించిన తర్వేతే లభిస్తుంది. మనస్సు శుద్ధి ఐన తర్వేతే జ్ఞానానికి అర్హత వస్తుంది. ఇది బుద్ది కుశలత గలవారికి మార్గంగా చెప్పుకోవచ్చు.  శ్రవణ, మనన , నిదిధ్యాసనలనేవి జ్ఞాన సాధనాలు. వీటిని నిరంతరమూ అభ్యాసం చేస్తే జ్ఞానయోగం నిరతిశయ సుఖాన్ని కలిగించి శాశ్వతమైన మోక్షాన్ని కలిగించే రాచ బాటగా చెబుతారు.

భగవద్గీతలో, మోక్షమార్గమైన భగవద్భక్తి యందు శ్రద్ధ కలిగి , ఎల్లపుడూ స్వామిని కీర్తిస్తూ శమ, దమాది నియమాలతో ఆ పరాత్పరుడిని సేవిస్తుంటారో, ఎవరు శ్రవణ మనన నిదిధ్యాసనలందు సమర్ధులో అట్టి ఉత్తమ, మధ్యమ, మందాధికారులందరికీ ఈజ్ఞాన యోగము ఆచరణీయంగా చెప్పబడింది. మానవుడు  అజ్ఞానంచేత; ఇంద్రియ లోలుడై , దృశ్య ప్రపంచమందలి విషయాలూ , కన్పించే వస్తువులూ వాస్తవంగా తోచి , సుఖాలకోసం మార్గాలను వెదుకుతు౦టాడు. ఒకటి లభించిన తర్వాత మరొకటి ఇలా కోర్కెలకు అంతులేక , సంతృప్తి లభిస్తుందని ఆశతో, జీవితంలో పరుగులు పెడుతుంటాడు. చేదు అనుభవాలు ఎదురౌతూనే ఉంటాయి. ఐనా సంతుష్టి కల్గుతుందనే ఆశ మాత్రం చావదు. ఇలా మోసపోయి  జవసత్వాలుడిగి మరణిస్తాడు. ఇదే మాయ. జ్ఞానమనే శబ్దం చేత బ్రహ్మమును , బుద్ది వృత్తినీ కూడ చెప్పడానికి ఉపయోగించడం జరుగుతోంది. ఆత్మ బుద్ది యందు ప్రసరించడం వల్ల , బుద్ధిలో కలిగే ధర్మాన్ని జ్ఞానం అంటాం. అజ్ఞానం ప్రకాశింప బడేదైతే జ్ఞానం ప్రకాశించేది. బ్రహ్మమును తెలుసుకొనే వివేకమే బ్రహ్మ జ్ఞానం. వేదాంత గ్రంధాలలో ముఖ్యంగా భగవద్గీతలో జ్ఞాన అనే శబ్దం అనేక మార్లు ఉపయోగించబడింది.

ప్రతీ ప్రాణి సత్వరజస్తమో గుణాలతో కూడి ఉంటుంది. రజస్తమో గుణాలు అణగి, సత్వ గుణం వృద్ది చెందితే సాత్విక జ్ఞానం కలుగుతుంది. దాని వల్ల వేర్వేరుగా ఉండే సర్వ భూతముల యందూ అవిభక్తమై, నాశరహితమై, ఏకమై ఉండే పరమాత్మ తత్వాన్ని చూడకల్గుతాం. ఆత్మ స్వరూపమందు ఎల్లపుడూ మనస్సును నిల్పి , మోక్షమందే దృష్టి కలిగి ఉండటం జ్ఞానమని , దీనికి విరుద్ధమైనది అజ్ఞానం అనీ భగవద్గీతలో చెప్పబడింది. జ్ఞానమనే అగ్ని ఆగామి సంచిత కర్మలను కూడ దగ్ధం చేస్తుందని చెప్పబడింది. అంచేత అజ్ఞానమనే సంసారాన్ని జ్ఞానం చేత తొలగించు కోవాలి. బ్రహ్మ మొదలుకొని సూక్ష్మమైన జీవరాసుల వరకు ఉండే,అన్ని జీవులలోను బుద్ది సాక్షికి స్థానమైన ఆత్మగా ప్రకాశించే కూటస్థ చైతన్యమే అంతర్యామి. ఎనుబదినాలుగు లక్షల జీవరాసులలోనూ చైతన్య స్వరూపమైన ఆత్మ ఏకరూపంగానే ప్రకాశిస్తోంది. బ్రహ్మచైతన్యరూపమైన ఆత్మ, కర్మరూప విశేషమగు జీవుడూ ఒక్కటే అని తెలుసుకునే విద్వాంసుడు ఆత్మయందే క్రీడిస్తూ ఆత్మయందే ఆసక్తి గలవాడై; సుఖదుఃఖానుభవాల
నుండి , సంసారమునుండీ విడువబడు చున్నాడు.

Saturday, July 28, 2012

యోగ మార్గము (4)


5) ప్రత్యాహారం
అలవాటుగా బయట సంచరించే మనసును అరికట్టి, అంతర్గతంచేసి ఇంద్రియాల నుంచి విముక్తి కలిగించటం. అంటే మనస్సును నిగ్రహించి చిత్తము స్వస్వరూపాన్ని పొందటమే. అంటే మనస్సుతో ఐక్యమవ్వడం అన్నమాట. దీన్నే  ప్రత్యాహార మంటారు.

6)  ధారణ
మనస్సుని నిగ్రహించి  వశంచేసుకున్న  చిత్తాన్ని ఒక లక్ష్యంమీద నిల్పి ఉంచాలి. అలా లక్ష్యాన్ని౦చి చెదిరి పోకుండా చిత్తాన్ని ఉంచడాన్ని ధారణ అంటారు.

7) ధ్యానము
చిత్తాన్ని లక్ష్యం మీదనుంచి  చెదరి పోకుండా ఉంచటం వల్ల, అహం అనేది పోయి మనసు నశించి ధ్యేయ వస్తువే మిగిలి, అదే అవుతాడు. మనస్సును ఏకభావ ప్రవాహంగా కొంతకాలం నిలప గలగటం- ధ్యానం. ధ్యానం గురించి విపులంగా తర్వాత తెలుసుకుందాం.

8) సమాధి
ఈ స్థితిలో ఏలక్ష్యమూ లేకుండా చిత్తాన్ని ఉంచినపుడు జ్ఞాన స్వరూపమూ, శాశ్వతమూ, సర్వవ్యాప్తమై వెలిగే
స్వస్థితిని సాధకుడు పొందుతాడు. అంటే అర్ధం మాత్రమే భాసిస్తుంది. ఇదే యోగుల గమ్యమైన సమాధిస్థితి.
సమాధులు సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అని రెండు రకాలు.   
సంప్రజ్ఞాత సమాధి - దీన్లో చిత్తవృత్తులు శాంతించే ఉంటాయి కాని బీజరూపంలో సంస్కారాలు మిగిలి, సమయం వచ్చినపుడు తిరిగి మొలకెత్తడానికి అనువుగా ఉంటాయి. కాబట్టే దీన్ని సబీజ సమాధి అంటారు. ధ్యాన, ధారణా, సబీజ సమాధులను పొందిన యోగికి  సర్వశక్తులు, సర్వజ్ఞత్వము కలుగుతాయి గాని ముక్తుడు కాలేడు. ఇంకా పునర్జన్మను కలిగించే కర్మబీజాలు ఉంటాయి. అణిమాది సిద్ధులు కలుగుతాయి.
అసంప్రజ్ఞాత సమాధి – దీన్లో నేను అనే అహంకారం ఉండదు. బీజరూపంలో ఉండే చిత్త వృత్తులు నశిస్తాయి. కర్మబీజం దగ్ధమై ఉండటంవల్ల నిర్బీజ సమాధి అని అంటారు. దీన్లో వాసనలు నశించి, మనోనాశనము కూడ కలగటం వల్ల, యోగి పరమాత్మను తెలిసికొని ముక్తిని పొందుతాడు. 

యోగదర్శనం, సాంఖ్యదర్శనం  అనే శీర్షికలలో వివరంగా ఉన్నదాన్నికూడ, దీనితో జతపరచి చదివితే సరైన అవగాహన లభిస్తుంది. రాజయోగి వైరాగ్యం – తనకు ప్రకృతితో ఉండే సంబంధం కేవలం తాత్కాలికం అని , తాను శాశ్వతమైన  ఆత్మయే గాని  ప్రకృతిని గానని స్వానుభవంతో గ్రహిస్తాడు. 

Thursday, July 26, 2012

యోగ మార్గము (3)



4) ప్రాణాయామం 
శ్వాసను నియంత్రించటం వల్ల మనస్సు వికారం చెందక ప్రశాంతంగా ఉండి, ధ్యేయ సాధనకు ఉపకరిస్తుంది. ప్రాణాయామానికి  శ్వాస నియంత్రణ కేవలం ఒక సాధన. మన శరీరంలో జరిగే ప్రతి చిన్నపనీ ప్రాణశక్తి/జీవశక్తి వల్లనే. మనోవృత్తి కూడా సూక్ష్మమైన ప్రాణవ్యాపారమే.  ఊపిరితిత్తులను ఈ ప్రాణశక్తి కండరాల చలనరూపంలో కదిలిస్తుంది. నాడులనుంచి కండరాల్లోకి వెళ్లి, కండరాలనుంచి ఊపిరితిత్తులకు చేరి వాటిని కదలించే స్నాయుశక్తే  ప్రాణశక్తి. ప్రాణాయామంలో ఈప్రాణాన్నే నిరోధించి  ప్రాణవ్యాపారాలన్నిటిని  మనవశ౦ చేసుకుంటాం. మనిషి తన శక్తులన్నిటినీ ఏకాగ్రం చేస్తే, శరీరంలో ప్రాణశక్తి వశమవుతుంది. ఇలాంటి చిత్త ఏకాగ్రతను ఎలా పొందాలో చెప్పేదే రాజయోగం. సత్యం తెలుసుకొని అత్మసాక్షాత్కారాన్ని కలిగించే అత్యున్నత స్థితే సమాధిస్థితి.  మానసికశక్తి రూపంలో వ్యక్తమయ్యే ప్రాణాన్ని, మానసిక సాధనతో నిరోధించే ప్రాణాయామ భాగాన్ని రాజయోగం అంటారు.

శ్వాస నియంత్రణ శరీరచలనానికి ఒక క్రమమైన పద్ధతిని ఏర్పాటు చేస్తుంది. దీని వల్ల సంకల్ప బలం కలుగుతుంది. ఈ సంకల్పబల ప్రవాహాన్ని వెన్నుపూస మధ్యలో ఉండే సుషున్నూ నాడిద్వారా కుండలినీశక్తిని మేల్కొలిపి , పైకి ప్రవహించేలా చేస్తే , అతీంద్రియజ్ఞానం కల్గి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. కుండలినీశక్తి ఒకో చక్రాన్నీదాటుకుంటూ పైకి వెళుతున్నపుడు మనస్సులో పొరలు తొలగిపోతాయి.

ప్రాణాయామం – చేసే విధానం గురించి 
మేరు దండంలో(వెన్నెముక మధ్యలో) మూలాధారం మొదలుకొని బ్రహ్మరంధ్రం వరకు సుషున్నూనాడి వ్యాపించి ఉంటుంది. దీన్లో కుండలినీ శక్తి ఉంటుంది. సుషున్నూనాడికి  ఎడమప్రక్క ఇడానాడి(చంద్ర నాడి), కుడిప్రక్క పింగళనాడీ(సూర్య నాడి) ఉంటాయి. ముక్కుకు  ఎడమప్రక్క ఇడానాడి , కుప్రక్క పింగళనాడీ అంతమవుతాయి. కాని సుషున్నూనాడి (బ్రహ్మ నాడి) బ్రహ్మరంధ్రాంతం వరకూ వ్యాపించి ఉంటుంది. వెన్నెముక యందు గుద స్థానము మొదలు సహస్రారము వరకు మూలాధారము, స్వాధిష్టానము , మణిపూరకము, అనాహతము, విశుద్ధము , ఆజ్ఞేయము, సహస్రారము అనే ఏడు చక్రాలు ఉన్నాయి. చక్రము అంటే, ఇక్కడ నాడీ కూటమి అనే అర్ధం చేసుకోవాలి. వీటిని గురించి కుండలినీ యోగంలో విపులంగా తెలుసుకుందాం.

విధానం ముందు కుడి ముక్కును బొటన వ్రేలితో మూసి, ఎడమవేపు ముక్కుతో గాలిని మెల్లగా  పీల్చాలి. ఇపుడు చిటికెన వ్రేలు లేదా చూపుడు వ్రేలుతో ఎడమవేపు ముక్కును కూడ  మూసి , లోపల ఉన్న గాలిని క్రిందిభాగాన ఉన్న మూలాధార చక్రాన్ని తడుతున్నట్లుగా భావిస్తూ అక్కడ కొంతసేపు నిలపాలి. తర్వాత బొటన వ్రేలును కుడి ముక్కుపుటం మీద నుంచి తీసి గాలిని మెల్లగా  వదలాలి. ఇపుడు ఎడమవేపు ముక్కును చిటికెన వ్రేలుతో మూసి , కుడి ముక్కు నుంచి గాలిని మెల్లగా  పీల్చాలి. పైన చెప్పినట్లు రెండు ముక్కు పుటాలనూ మూసి లోపలగల గాలి క్రిందనున్న మూలాధారంపై ఒత్తిడి కలుగజేస్తున్నట్లు భావిస్తూ అక్కడ గాలిని కొంతసేపు నిలపాలి. పిదప ఎడమ ముక్కుపై నున్న వ్రేలును తీసి వేసి గాలిని ఎడమ ముక్కు ద్వారా మెల్లగా వదలాలి. ఇలా లోపలికి  పీల్చినపుడు దాన్ని పూరకము అని, లోపల బంధించి నపుడు కుంభకమనీ, బయటకు వదిలేటపుడు రేచకమనీ అంటారు. ఇలా ఎడమ వేపునుంచి గాలి పీలిస్తే దాన్ని కుడి వేపునుంచి బయటకు వదలాలి. అట్లే కుడి వేపునుంచి గాలి పీలిస్తే దాన్ని ఎడమ వేపు నుంచి వదలాలి. పూరకము, కుంభకము, రేచకమూ ఈ మూడు కలసి ఒక ప్రాణాయామం అవుతుంది. పూరించిన వేపునుంచి మరల పూరించ కూడదు. రేచించిన వేపునుంచే పూరించాలి. 

ఈ సాధనకు కాల  నియమాన్నిపాటించాలి. పూరక , కుంభక , రేచకముల నిష్పత్తి 1:4:2 గా ఉండాలని చెబుతారు. అంటే  4 క్షణాలు పూరకమైతే , 16 క్షణాలు కుంభకము , 8 క్షణాలు రేచకము అవుతాయి. అభ్యాసం చేస్తూ ఈ కాల  పరిమితిని పెంచుకోవాలి. ఇప్పటిదాక మనం చెప్పుకున్న దాన్లో గాలిని లోపల కుంభించడం జరిగింది. ఇలా కుంభించడం వల్ల మనలో ఉన్న నాడులన్నీ వాయువుతో నింపబడి దశవిధ వాయువుల చలనాన్ని ప్రేరేపిస్తాయి. అపుడు హృదయ కమలం వికసిస్తుందని విజ్ఞులు చెబుతారు.
ఈ నిష్పత్తినే పాటిస్తూ  పైన చెప్పిన విధంగా శ్వాసనుఒక వేపు నుండి  మెల్లగా పీల్చి మరో వేపు నుండి మెల్లగా వదలి గాలిని స్థంబింప చెయ్యాలి. అంటే రేచించిన పిదప కొంత సమయం పూరించకుండా ఉండటం అన్నమాట. దీన్నే బాహ్య కుంభకం అంటారు. 

నాడీశోధన, ప్రాణయామంలో బాహ్యకుంభకము, మామూలు ప్రాణయామం ఈమూడూ చెయ్యడం వల్ల నాడీశుద్ది కలుగుతుంది. ప్రాణాయామం అభ్యాసం చేసేటపుడు చెమటలు పడుతుంటే అది అధమ ప్రాణాయామంగాను, దేహంలో చలనం కలుగుతున్నట్లయితే అది మధ్యమమనీ , దేహం పైకి లేస్తున్నట్లు అనుభవం చెందితే అది ఉత్తమ ప్రాణయామమని  చెబుతారు. ప్రాణాయామం వల్ల చిత్తవృత్తి నిరోధం కలిగి పర్యవసానంగా కుండలినీశక్తి జాగృతం అవుతుంది. అసలు రాజయోగం అనే పేరు వినగానే మనకు ప్రాణాయామమే  అనేంత ప్రాచుర్యంలోకి వచ్చినది.

ప్రాణాయామంలో కుంభకాన్ని ఎవరంతట వారు చెయ్యకూడదు. యోగపరిజ్ఞానం  తెలిసిన నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే అభ్యాసం చెయ్యాలి అని పెద్దలు అంటారు. ఎడమ వేపునుంచి గాలి పీలిస్తే దాన్ని కుడి వేపునుంచి బయటకు వదలాలి. అట్లే కుడి వేపునుంచి గాలి పీలిస్తే దాన్ని ఎడమ వేపు నుంచి వదలాలి.  పూరించిన వేపునుంచి మరల పూరించ కూడదు. రేచించిన వేపునుంచే పూరించాలి. ఇలా గాలిని మెల్లగా ఒకవేపునుంచి  పీల్చి, పీల్చిన సమయానికి రెట్టింపు సమయాన్ని తీసుకొంటూ, మెల్లగా వదలాలి.  దీన్నీ, నాడీశోధననూ, శ్వాసను గమనించడం వంటివాటిని  ఎవరైనా చెయ్యవచ్చును.





Tuesday, July 24, 2012

యోగ మార్గము (2)


సత్యాన్ని గ్రహించి , అంతరాత్మలో దాని అనుభవాన్ని పొంది , సత్య దర్శనం చేసినపుడు సంశయాలు తొలగి, అజ్ఞానం నశించి సమస్త కర్మలూ నశిస్తాయని వేదాలు చెబుతున్నాయి. ఏకమైనప్పటికీ  ఏది  అనేకంగా ప్రకాశిస్తుందో , దేన్లోనించి అనేకమైనవి  నిర్మాణమౌతున్నాయో , అలాంటి ఏకత్వాన్ని కనుక్కోటమే అన్ని శాస్త్రాల పరమావధి.  అంతరంగాన్ని బట్టే మన బాహ్య ప్రపంచముంటుంది. అంతశ్శక్తులను నేర్పుతో నడిపి , ప్రకృతిని స్వాధీనం చేసుకుంటే  ప్రకృతి నియమాలను అతిక్రమించ కలుగుతాం . 

ఈ యోగ సాధన ఎనిమిది అంగాలుగా విభజించబడింది. అందుచేతనే దీన్ని అష్టాంగ యోగమని అంటారు.
అష్టాంగ యోగంలో  ఎనిమిది అంగాలూ - యమము , నియమము, ఆసనము, ప్రాణా యామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అనేవి.
1) యమంలో 
అహింస       -  మనసుచేత , మాట చేత , లేదా మన చర్యల వల్ల కాని  ఏ ఒక్కరికీ హాని కల్గించకుండా ఉండటం.
సత్యం          -  ఉన్నది ఉన్నట్లుగా తెలుపటం . అంటే అబద్ధం ఆదకుండటం.
అస్తేయం      -  ఇతరుల సొత్తు దొంగిలించ కుండటం.   
బ్రహ్మచర్యం - సర్వ కాల సర్వావస్థల్లోనూ మనో వాక్కాయ కర్మలా పరిశుద్ధంగా ఉండటం .    
అపరిగ్రహం  - ఏ దుస్థితిలో ఉన్నా ఇతరులనుండి ఏదీ తీసుకొకుండటం . ఎందుకంటే ఏదైనా పరులనుంచి తీసుకుంటే  దాత యొక్క పాపాల్లో కొంత పాపం తీసుకున్నట్లే నని శాస్త్రాలు చెబుతున్నాయి. అదీగాక పరిగ్రహణం వల్ల అల్పులమై   హృదయ శుద్ధిని కోల్పోతాం.  
ఇవి యమం లోకి వస్తాయి. వీటిని పాటించటం వల్ల మనస్సు శుద్ది అవుతుంది.

2) నియమం 
శౌచం   - బాహ్య శౌచం అంటే తన శరీరాన్నిశుభ్రం చేసుకోడము, శుభ్రమైన వస్త్రాలను ధరించడం, నివసించే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమూ వంటి బాహ్య పరిశుభ్రత. అంతర శౌచం అంటే మనస్సులో కామ క్రోధాలకు తావివ్వక మలిన వాసనలను వదలి శుద్ధ వాసనలు కలిగి ఉండటం.     
సంతోషం – అన్ని ప్రాణులకు సంతోషం అవుసరమే. ముఖ్యంగా యోగాభ్యాసికి సంతోషం లేకుండా సాధన కొనసాగించ లేడు. అంచేత సంతోషం సాధన క్రమం తప్పకుండా చేస్తూ పురోగతిని పొందటానికి తోడ్పడుతుంది.
తపస్సు – ఏకాదశి మొదలైన పర్వ దినాలయందు ఉపవాసాలు, జాగరణ చెయ్యడం వంటి వాటి వల్ల ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది .
స్వాధ్యాయం -- శాస్త్ర అధ్యయనం ,మంత్ర జపం వంటివాటి వల్ల సత్వ శుద్ది కలుగుతుంది. అధ్యయనం చేసి ఇతరులకు కూడ వినిపించడం వంటివి స్వాధ్యాయం లోనికి వస్తాయి.
ఈశ్వర ప్రణిధానం - సంకీర్తనలు, భక్తిభావంతో భగవంతుని  ఆరాధన , ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చెయ్యటం, యోగం నిర్విఘ్నంగా పొందటానికి భాగావతుడిని శరణు పొందటం వంటివి ఈ కోవలోకి వస్తాయి.  ఇవి నియమం లోకి వస్తాయి. యమ నియమాలు యోగ సిద్ధికి ఉపకరిస్తాయి.
తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అనే ఈ మూడూ కలసి క్రియాయోగం అనబడుతోంది.
                                        

3) ఆసనం --ఏ ఆసనంలో సాధకుడు స్థిరంగా, సుఖంగా ఎక్కువ కాలం కూర్చోగలడో అలాంటి ఆసనంలో అభ్యాసం కొన సాగించాలి. పద్మాసనం గాని, అర్ధ పద్మాసనం గాని, వజ్రాసనం గాని ఎన్నుకోవచ్చు. తల , మెడ , వక్షం ,వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి. శరీరం స్థిరంగా ఉన్నపుడే చిత్తము కూడ స్థిరంగా నిలుస్తుంది. తూర్పు లేక  ఉత్తర ముఖంగానే ఆసనం ఏర్పరచుకోవాలి అని పెద్దలు చెబుతారు. కొద్ది రోజులు అభ్యాసం చేస్తే స్తిరాసనం సిద్ధిస్తుంది. ఆసనం సిద్ధించాక నాడీశౌచం అనే క్రియను చెయ్యాలని కొందరి రాజయోగుల అభిప్రాయం.

కుడిచేతి  బొటనవ్రేలుతో కుడి ముక్కుపుటాన్ని మూసి , ఎడమ ముక్కురంధ్రముతో మెల్లగా గాలిని పీల్చి ; కుడిచేతి  చూపుడువ్రేలు లేక  మధ్య వ్రేలుతో   ఎడమ ముక్కుపుటాన్ని మూసి, కుడి బొటనవ్రేలును వదలి, గాలిని వెంటనే  మెల్లగా విడిచి పెట్టాలి. అలాగే పిదప ఎడమవేపు ముక్కుపుటాన్ని మూసిఉంచుతూ  కుడి వైపు నుంచి గాలిని పీల్చి  గాలిని ఎడమ వైపు నుంచి వదలి పెట్టాలి . ఈ విధంగా మార్చి, మార్చి  రోజుకు ఐదు సార్లు వరకు , పదిహేను రోజుల నుండి నెల రోజుల వరకు చేస్తే నాడీశౌచం లభిస్తుందని అంటారు. దీన్నే నాడీ శోధన  అని కూడా అంటారు. ఆ తర్వాత ప్రాణాయామం చెయ్యాలి.


Sunday, July 22, 2012

యోగ మార్గము (1)


యోగ మార్గము లేక రాజ యోగము
ఈ రాజయోగాన్ని పతంజలి మహర్షి సూత్ర రూపం లో శాస్త్రీకరి౦చాడు. రాజయోగానికి "యోగ" అని , అష్టాంగ యోగమని,  క్రియా యోగమనీ పిలుస్తారు.  జ్ఞానానికంతా ప్రత్యక్షానుభూతే పునాది. ఈ అనుభూతిని కలిగే విధానాన్ని బోధించేదే యోగశాస్త్రం.  బాహ్య విషయాలను  గ్రహించటానికి ఆత్మకు మనస్సే సాధనం . మనస్సే సంకల్ప వికల్పాలకు  కేంద్రం. ఒక ఇంద్రియ విషయంతో సంయోగం చెందటానికి గాని, సంయోగం చెందకుండా ఉండటానికి గాని సమర్దవంత మైనది ఈ మనస్సే. అంతరంగంలోని విషయాలను పరిశీలించటానికి సాధనలను చూపడమే రాజయోగం ఉద్దేశించబడింది.   

మనసు యొక్క వృత్తి అలోచి౦చటమేకదా. అసలు మనసంటేనే ఆలోచనల సముదాయం. చిత్తవృత్తులను అరికట్టి  మనసును అంతర్ముఖం చేసి , మనస్సుతోనే దాని స్వభావాన్ని గ్రహించాలి. శోధించాలి. అపుడు ప్రత్యక్షానుభూతి కలుగుతుంది. మనస్సు,బుద్ది , అహంకారాలను కలసి యోగులు చిత్తము అంటారు. ఒక వస్తువును గ్రహించాలంటే జ్ఞానేంద్రియాల ద్వారా మనస్సు ఆ వస్తువుయొక్క ఆకారాన్ని పొందాలి . అట్టి ఆకారాలను చిత్త వృత్తులు అంటారు. యోగం అంటే చిత్త వృత్తులను నిరోధించడం అని అంటారు.

దీన్లో సాధన ప్రధానంగా బోధించ బడుతుంది. ఈ  యోగం వల్ల సరైన జ్ఞానం కలిగి తన నిజ స్వరూపాన్ని తెలుసుకొని ప్రకృతి బంధం నుంచి విముక్తి, తద్వారా ముక్తిని  పొందటం ముఖ్యమైన ఆశయం. అతీంద్రియ జ్ఞానము , అద్భుత శక్తులూ కలుగుతాయి. చిత్త వృత్తులన్నీ నిరోధించ బడటం వల్ల మనస్సుకు శాంతి లభిస్తుంది. మనం ఆస్తిక దర్శనాలలో యోగ దర్శనం గురించి  మూడు భాగాలలో విపులంగా తెలుసు కున్నాం. ఇప్పుడు క్లుప్తంగా మళ్ళీ చూద్దాం.

సాంఖ్యులు  ప్రకృతి, పురుషుడు (జీవుడు) అనే రెండే మూల తత్వాలను అంగీకరిస్తే, యోగ దర్శనంలో వీటితో బాటు ఈశ్వరుడిని కూడ అంగీకరిస్తారు.   సత్వరజస్తమో గుణాలతో సామ్యావస్థలో  ఉండే ప్రకృతి , పురుష సంయోగంతో ఈ గుణాలలో హెచ్చు తగ్గులు ఏర్పడి, సృష్టికి నాంది పలుకుతుంది. ముందు బుద్దితత్వం ఏర్పడి, అది అహంకారంగా రూపు దిద్దుకొని ఆ అహంకారం  నుంచి  పంచ జ్ఞానేంద్రియాలు , పంచ కర్మేంద్రియాలు, మనస్సూ పుడతాయి. అహంకారం యొక్క తమో గుణం ప్రధానంగా పంచ భూతతన్మాత్రలు ( సూక్ష్మ భూతాలు), పంచ మహా భూతాలు జనిస్తాయి. ఇలా ప్రకృతితో కలిపి ఇరువది నాలుగు తత్వాలను సాంఖ్యులు అంగీకరిస్తారు. యోగ మార్గం  వీటితో బాటు ఈశ్వరుడిని అంగీకరిస్తుంది. అన్ని దర్శనాలూ కూడ దుఖాన్ని తొలగించుకొని కైవల్య పదాన్ని పొందడానికే ఉద్దేశించ బడ్డాయి.

బుద్ధికి పురుషుని చైతన్యం వల్ల  విచక్షణా జ్ఞానం కలుగు తోంది. ఇలా చైతన్యవంతమైన బుద్ధి, అహంకార రూపంగా రూపు దిద్దుకొని నేను, నాది అనేది ఏర్పడి అవిద్యకు కారణం అవుతుంది. అవిద్యచేత  జీవుడు రాగ ద్వేషాలకు, సుఖ దుఖాలకూ లోనవుతుంటాడు. ఇలా అవిద్యకు లోనైన జీవుడు కర్మలచేత , జనన మరణాల సంసారమనే చక్రంలో బంధింపబడి  తిరుగుతూ ఉంటాడు. ఇలా, ప్రకృతివిషయాలతో తాదాత్మ్యం చెందటం వల్ల అవిద్యచేత కప్పబడినవాడై  ప్రకృతి, పురుషుల వివక్షత కోల్పోవడం జరుగుతుంది.

ఈ ఇరవైనాలుగు తత్వాలనూ అవగాహన చేసుకుని , తనను ప్రకృతి తత్వాల నుండి వేరుచేసు కోగల్గితే , విచక్షణా జ్ఞానం కల్గి ప్రకృతికంటే  తాను భిన్నుడని తెలుస్తుంది. ప్రకృతి యొక్క సంబంధం తొలగడమే విముక్తి చెందటం. ప్రకృతి సంయోగం బంధమైతే, దాని నుంచి విముక్తి పొందటమే  మోక్షం లేక కైవల్యం.  ప్రతి జీవునిలోను పురుషుడు  నిక్షిప్తమై  ఉన్నాడు. ఆ ఉన్నత పురుషుని స్వభావం; జాగరూకత /ఎరుకతో చూడగలిగితే బంధం తొలగి సత్యం అవగతం అవుతుంది. 

Saturday, July 21, 2012

కర్మ మార్గం (4)


మనస్సులో మాలిన్య దోషాలు, దేహాది అహంకారము పోతే చిత్త శుద్ది కలుగుతుంది. అప్పుడు సాధనలో పురోగతి లభిస్తుంది. విహిత కర్మలను అంటే చెయ్యవలసిన  పనులను కర్తవ్యతా బుద్ధితో చెయ్యడమే కర్మయోగమంటే. మనస్సు అంతర్ముఖమై, పరమాత్మ ఆశ్రయమైనపుడు, ఇంద్రియాల చేత చెయ్యబడే పనులవల్ల; మనోవృత్తులు ఉదయించవు.  గనుక కామ వాసనలూ ఉండవు కాబట్టి అది నిష్కామ కర్మ అవుతుంది. అట్టి మనోవృత్తులు ఉదయించని స్థితినే ఆకర్మము అని అంటారు. అందుకే కర్మకు ఫలము కూడ ఉండదు. సంకల్పంతో కలసి అంతః కరణంలోవృత్తులు జనించినపుడే ఆ కర్మ బంధకారణం అవుతుంది.

కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, అంతరింద్రియ సంబంధమైన పనులన్నీ శరీరంతో చేయబడుతున్నాయి. ఈపనులలో ఆసక్తి లేకుండా గనుక చెయ్యగల్గితే , అవి కర్మఫలాలను  కలిగించ లేవు. అట్టి వాడే అన్ని శాస్త్రముల యందూ అధికారి. జ్ఞానికి  ఫలాపేక్ష, దేహేంద్రియాభిమానము, కర్తృత్వాభిమానమూ లేకుడటం వల్ల కర్మలు చేసినా ; కొంచెమైనను కర్మము చెయ్యని వాడే. అట్టి వాడు లోకసంగ్రహార్ధం/ శరీర యాత్రకోసం  కర్మలను చేసినా దోషం లేదు. సమస్త కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యడం వల్ల దోషముండదు. జ్ఞాన సిద్ధికి కర్మమార్గము  సాధనమని చెప్పబడింది. నిష్కామ కర్మయోగంతో కూడిన విహిత కర్మలను చెయ్యటం అందరికి యోగ్యమే.

కర్మయోగి ఏ సిద్ధాంతాన్నీ నమ్మనక్కర లేదు. స్వార్ధ రాహిత్యాన్ని మాత్రం కర్మాచరణ ద్వారా స్వయంగా సాధించాలి. అహంకారం  వదలుకొన్నపుడే నిష్కామ కర్మాచరణం సాధ్యం. నేను , నా వారు అనే భావం లేకుండా ఉండాలి. 
అహంకారంతో చేసే పనులు ప్రవృత్తి. 
అహంకార మమకారాలను వదలి చేసే పనులు నివృత్తి ; ఈ పనులకు కర్మత్వం ఉండదు. 
ప్రవృత్తి వల్ల సంసారము, నివృత్తి వల్ల మోక్షమూ లభిస్తాయి. 

తామరాకు పై నీటి బిందువు నిలిచి ఉన్నా అది తామరాకును అంటనట్లు ; కర్మయోగి ఎట్టి పనిచేసినా ఏ కర్మనూ చెయ్యనివాడే. కోరికలను జయించక సన్యసించిన వాడు ఏకాంతవాసములో ఉండి ఏకర్మనూ చెయ్యకున్నను , సమస్త కర్మలూ చేసిన వాడే అవుతున్నాడు. కర్మయోగులకూ, కోర్కెలు లేని వారికీ భగవదనుగ్రహం వల్ల హృదయ గ్రంధి క్షీణించి అహంకార మమకారాలు నశిస్తాయి. జనన మరణ సంసార చక్రం నుంచి విముక్తి కలుగుతుంది. కర్మయోగం వల్ల చిత్త శుద్ది , చిత్త శుద్ది వల్ల తత్వ జ్ఞానము, తత్వజ్ఞానం వల్ల ముక్తీ కలుగుతాయి.




Thursday, July 19, 2012

కర్మ మార్గం (3)


కాబట్టి వాంఛలు లేకుండ కర్మలను చెయ్యి. ఇంద్రియాలనీ తమ వ్యాపారాలను చెయ్యనీ . కాని ఏ కెరటానికీ నీ మనస్సును లొంగ నీయకు. బధ్దుడవు కాకు. ప్రేమతో చేసే ప్రతీ పనీ ఆనందాన్ని కలుగ జేస్తుంది. ఎలాంటి బాధ, అసూయ, స్వార్ధమూ లేని విధంగా కుటుంబ సభ్యులను, లోకాన్నీ ప్రేమించ కలిగినప్పుడు , నీవు అసంగుడవు కాదగ్గ స్థితిని పొందినట్లు గ్రహిస్తావు. ఇలా ప్రేమ పరమావధిని పొందితే , ప్రకృతి బంధాల నుంచి విముక్తులమై ప్రకృతిని యదార్ధ స్వరూపంలో చూడ గలుగుతాం. ప్రతి వస్తువునూ ఫలాపేక్ష లేకుండా లోకానికి సమర్పించ గల్గితే కర్మలు బంధాన్ని కలిగించవు.

ఈ లోకానికి మనం సుఖాన్ని గాని , దుఖాన్ని గాని పెంచలేం. భూమి మీద సుఖ, దుఖాల శక్తుల మొత్తం ఎప్పుడూ ఒక్కటే . కాకపోతే మనం చేసేది అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటూ దాన్ని తోస్తాం. ఈ ప్రపంచమంతా దుఖంతో కూడుకున్నదే. పరోపకారం చెయ్యడమే మనం చెయ్యగల ఘన కార్యం. ప్రపంచం మంచిది కాని , చెడ్డది కాని కాదు.  ప్రతీ వ్యక్తీ తనకు తానే ఒక లోకాన్ని నిర్మించుకుంటాడు. మన మనోస్థితిని బట్టి జీవితం మంచిదిగా గాని చెడ్డదిగా గాని కన్పిస్తుంది. మనకి కలిగే ఉపయోగాన్ని బట్టి మంచి అని గాని చెడు అని గాని చెబుతాం. వాస్తవానికి ఈ ప్రపంచం పరిపూర్ణంగానే ఉంది. నిస్సంగత్వాన్నిఅలవరచుకొని కర్మలు చేస్తే,  ఏ పాప పుణ్యమూ అంటదు. ఈ విశ్వంలో దేన్నైనా నీవు లోబరచుకొంటే తప్ప , దానికి నీ మీద ఎలాంటి ప్రభావమూ ఉండదు. మనో  నిగ్రహం కలిగితే ఏదీ మంచి చెడులుగా అనిపించదు. అహంకారం తొలగి జీవ భ్రాంతి పోతే దుఃఖ మయంగా తోచిన ప్రపంచం ఆనందమయంగా తోస్తుంది. ఏ యోగమైన పట్టుదలతో సాధించాలి . సంసార మోహాన్ని వదలడం ఎంతో కష్టమైన పని. విషయాలను తెలిసికొని , వాటిని అనుభవించి , మనస్సుతో వాటిని క్రమంగా సంగరహితం అయ్యేవరకూ విడవాలి. దేనితోనూ తాదాత్మ్యం చెందకుండా మనస్సును స్వతంత్రంగా ఉంచుకోవాలి.

అనేక  మార్గాలచే  ఒక  గమ్యాన్ని చేరగలమనేది  వేదాంతంలో అంశం . కర్మ, భక్తి , జ్ఞాన , యోగ  మార్గాలని  వేర్వేరుగా నిర్దేశించబడినా ఒకయోగం  మరొక  దానితో  కలిసేఉంటుంది . ఏది ప్రధానంగాఉందో  దానికా పేరుపెడతారు . అన్నిటి  గమ్యమూ  మోక్షమే . అలాంటి  గమ్యాన్ని  స్వార్ధరహిత కర్మ  మూలంగా  పొందటమే  కర్మయోగం  . స్వార్ధ  రాహిత్యాన్ని   స్వయంగానే  సాధించుకోవాలి . అపుడు  ప్రతి  క్షణమూ  అనుభూతిగానే  ఉంటుంది . ఇదే  కర్మ  యోగ  రహస్యం . కర్మయోగి వైరాగ్యం కర్మ ఫలాలలో అనాసక్తత, ఇహపరాలలో ఎలాంటి ఫలభోగ వాంఛలేకుండా ఉండటం.

దేహం ఉన్నంత వరకు చేసే అన్నపాన, స్నానాది కర్మలు నిత్య కర్మలు. ఇవి స్వాభావికాలవడం చేత దోషాలు కాదు. అలాగే అనారోగ్యానికి ఔషధాలు తీసుకోడం కూడ దోషాలు కావు. ఎందుకంటే వీటి వల్ల రాబోయే కాలంలో ఫలం కలుగదు కాబట్టి. వీటిని నైమిత్తిక కర్మలు/ శాంతి కర్మలు అంటారు. నిత్య నైమిత్తిక కర్మలు దోషాలు కావు. నిషిద్ధ కర్మలే త్యజించవలసినవి.

సకామకర్మలు ఇవి ఫలాన్ని ఆశించి చెయ్యబడతాయి. ఆ ఫలాన్ని అనుభవించడానికి మరొక జన్మ అవుసరమై  సంసారంలో చిక్కుకోవాలి. అంటే జనన మరణాలు, ఈ సంసారమూ తొలగాలంటే సకామ కర్మలు చెయ్యకూడదు. కాని ముందు సకామ బుద్దితోనే కార్మలు చేస్తుండాలి. కాని ఫలాన్ని భగవంతుడికే అర్పించాలి. అలా చేస్తుండగా క్రమంగా ఫలాసక్తి నశించి నిష్కామ కర్మయోగం లభిస్తుంది. అపుడు ఈశ్వరేచ్చానుసారంగా పనులు జరుగుతూంటాయి. కర్తృత్వ భావం లేనపుడు రజస్తమస్సులు అణిగి సత్వంకూడా శుద్ధ సత్వమై ఈశ్వరేచ్చానుసారంగా వర్తిస్తుంది. జ్ఞానోదయం అయ్యేవరకూ విహితమైన కర్మలు చేస్తూ , తర్వాత వాటిని వదిలెయ్యాలి.


Tuesday, July 17, 2012

కర్మ మార్గం (2)


గుణాలను బట్టి కర్మ సాత్వికము, రాజసికము, తామసికము అని  మూడు విధాలుగా ఉంది.
సాత్విక కర్మ ఇది అకర్మ . దీన్లో అహంకార మమకారాలు ఉండవు.
రాజసిక కర్మ –  ఇది వికర్మ. ఫలాశ,అహంకారాలతోను; ప్రయాస తోను చేయబడేది.
తామసిక కర్మ ఇది అజ్ఞానంతో తన సామర్ధ్యం తెలియక మొహంతో ప్రారంభించబడేది. ఇవి హింస, నాశనాలకు దారి తీస్తాయి. ఇవి పాప హేతువులు.

అజ్ఞానం చేత సుఖాన్నే అత్యున్నత ప్రాప్తి అనుకోడంవల్ల మనం కష్టాల్ని అనుభవిస్తున్నాం.  సంసారంలో సుఖ దు:ఖాలని అనుభవించిన తర్వాతే వైరాగ్యమూ , ప్రశాంతతా కలుగుతాయి. ఎందుకంటే సంసారంలోని  విషయాలన్నీ  తుచ్చ మైనవని విషయానుభవం తర్వాతే  గ్రహించ గల్గుతా౦ .  అపుడే ఆత్మ సమర్పణ భావం వస్తుంది. సన్యసించ కుండా సంసారంలో ఉంటూ  భగవంతుడిని కొలవటం కొంచెం కష్టమే. ఐనా గృహస్థుడు తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూ , జీవనోపాధికి  సక్రమంగా ధనార్జన చేసి ; కుటుంబాన్నీ, తనపై ఆధారపడి జీవించే  బంధువర్గాన్నీపోషిస్తూ తన పరిస్థితిని బట్టి , అర్ధించిన వారికి సహాయ పడాలి. దరిద్రులు , దుర్బలులూ , పనిచెయ్యని బిడ్డలూ, వృద్ధులైన తల్లి తండ్రులూ,  స్త్రీలు  వీరంతా గృహస్తుడిపై ఆధారపడతారు. అంతే గాక ముముక్షువులకు భిక్షను ఇచ్చి పోషించేది కూడ గృహస్థుడే. అంటే సంఘానికంతకూ అతడే ఆధారం. ఆర్జించే వారిలో ముఖ్యుడు. ముందుగా విద్యకు, పిదప ధనార్జనకూ శ్రమపడి ప్రయత్నించాలి . ధర్మ మార్గంలో సంపాదించి , దాన్లో కొంత భాగాన్నిసేవా భావంతో ధర్మ కార్యాలకు వినియోగించాలి .  కాబట్టి నిస్స్వార్ధంగా కర్మల ఫలాన్నిఈశ్వరార్పణ చేస్తూ సాధనచెయ్యాలి.

ప్రతీ  పనిలోనూ  మంచి , చెడుల  కలయిక  ఉంటుంది . అందువల్ల  వాటిఫలితాన్ని  ఇచ్చి తీరుతాయి . ఫలితాలు  మంచివైనా,చెడు వైనా,వాటిని అనుభవించటానికి మరల జన్మనెత్త వలసి ఉంటుంది . అందుచేత  కర్మఫలములందాసక్తి  లేకుండా  కర్మలుచేయడం వల్ల , అవి మనలను బంధించవు. దుష్ట సంస్కారాలను  మంచి సంస్కారలచేత మార్చడం  వల్ల , మన  మనస్సును స్వాధీనం చేసుకోగల్గుతాం. నిష్కామకర్మ చేసే నైపుణ్యం సంపాదించుకో గల్గుతాం. ఇలా  నిష్కామ కర్మలు చేయడం అలవాటయ్యాక  మంచి  సంస్కారాల్నీ  వదిలెయ్యాలి . అపుడే  ఆసక్తుడల్లా   అనాసక్తు డవుతాడు . కావున  కర్మచెయ్యి . కాని  నీవుచేసే  పనిచేతకాని  , ఆలోచన  చేతకాని  మనసులో  సంస్కారం  కలుగకూడదు . కోర్కెలు  విడచిపెట్టి , ఏకర్మను చేస్తున్నా నీకోసం చేయడంలేదని  గ్రహించు . అపుడు  దాని  ఫలితం  నీకు చెందదు . ఇలా  జీవిత  వ్యాపారమేది  చేసినా , వాటిమీద  ఆసక్తి  లేకుండట౦వల్ల , సాక్షిగా  ఉండి కర్మను కర్మకోసమే చేయబడి, అదొక ఆరాధనగా మారుతుంది. అత్మానుభవం లభిస్తుంది.

కర్మయోగం మనలను నేను అనేది లేకుండా చేసి , సర్వం నీవే  అనే భావాన్ని కలిగించి అహంకార త్యాగాన్ని  కలుగజేస్తుంది . ఈలోకంలో  కనిపించే  సుఖదుఖ్ఖాలన్నీ  సంసారంలోని అనివార్య పరిస్థితులు . కాని  అవి  క్షణికములే . దుఖ్ఖం కర్మచేత రాదు. సంగం (మమకారం) చేత కల్గుతుంది. అన్ని యోగాలకూ  వైరాగ్యమే మూలం. నేను , నాది అనేవి మానసిక పాశాలు. స్వార్థచింతన , మమకారమూ లేకుండా నీకర్మను నిర్వర్తిస్తే  ఏదోషమూ ఉండదు . కాబట్టి  దేన్నిచూసినా  , దేన్నిఅనుభవించినా  , దేన్నివిన్నా  , దేన్నిచేసినా సర్వమూ  భగవదర్పిత  భావంతో  చెయ్యి .  ఏమీ ఆశించక  , కర్మఫలాన్ని భగవంతుడికే  సమర్పించు . ఏపనినైనా  నిర్బంధంతో  చేస్తే  అది  సంగాన్ని  కల్గిస్తుంది .


Monday, July 16, 2012

కర్మ మార్గం (1)


మనం చేసే ప్రతీ పనీ కర్మగానే చెప్పవచ్చు . మన ఇప్పటి స్థితి గతించిన జన్మ యొక్క కర్మల ఫలితమైతే , భవిష్యత్తులో పొందే స్థితి ; ప్రస్తుత కర్మల ఫలితాన్ని బట్టి ఉంటుంది . కాబట్టి మనమెలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి . కర్మ యొక్క ఉద్దేశ్యం  ఆత్మను మేల్కొల్పడానికే . శరీరం ద్వారా మనసును స్వాధీనపరచుకొనే పద్ధతినే కర్మ మార్గం అంటారు. ఇహలోక దృష్టి, దేహంమీద అభిమానమూ ఉండేవారికి కర్మయోగమే  చెప్పబడింది. మోక్ష సాధనాల్లో ఒకటిగా కర్మయోగాన్ని భగవద్గీత ప్రతిపాదించింది. ఇది స్వయంగా మోక్షాన్ని కల్గించ లేదని కొందరు అంటారు. కర్మయోగం మొదట చిత్త శుద్ధిని కల్గించి , తద్వారా జ్ఞానం కల్గి మోక్షాన్ని పొందిస్తుందని  చెబుతారు. పాప పుణ్యాలను దగ్గరకు రానీయక ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చెయ్యడమే దీన్లో చాతుర్యం లేదా యుక్తి.

వివిధ సంకల్పాలతో మానవులు కర్మలను చేస్తారు. కీర్తికోసమో , ధనాశతోనో , అధికార వాంఛతోనో ఇలా అనేక  కోర్కెలతో పనులను చేస్తారు.  ఎలాంటి కోరికలూ లేకుండా కూడ , కర్మలు చేసే మహనీయులూ ఉన్నారు.  కర్మ చేయడానికి మనలను ప్రేరేపించేది స్వార్ధమే. సాధనతో ఈ స్వార్ధపరత్వాన్ని నశింప చేస్తే , నిస్స్వార్ధంగా కర్మ చేయ కలిగే సమయం వస్తుంది . ఇలాంటి స్థితి రాగానే మన శక్తులన్నీ ఏకమై జ్ఞానం కలుగుతుంది .

మనం చేసే ప్రతీ పనీ , యజ్ఞం అనే విశాల దృక్పధంతో గీతలో చెప్పబడింది. చతుర్విధ వర్ణోచిత కర్మలూ యజ్ఞంగా చెప్పబడ్డాయి. యజ్ఞం చేసేవాడు యజమాని. యజ్ఞం యొక్క స్వభావం త్యాగం. అంటే యజమాని తనకున్న దాన్లో కొంత పరులకోసం త్యాగం చెయ్యడమే యజ్ఞకర్మలో ఇమిడి ఉండే భావం. అన్ని ప్రాణులలో ఈశ్వరుడు ఉన్నాడు. ప్రాణులను /భూతములను తృప్తి పరిస్తే , ఈశ్వరుడిని తృప్తి పరచినట్లే. అదే మానవ సేవయే మాధవ సేవ అని చెప్పడమంటే.

శాస్త్రోక్త కర్మలు కొన్ని ఈలోకంలో ఫలితాన్ని ఇస్తాయి. కొన్ని కర్మలను ఆచరించడం వల్ల మరణానంతరం ఫలితాన్ని ఇస్తాయి. ఈ లోకంలో  ఇంద్రాది దేవతలను గురించి యజ్ఞ యాగాలు చేసే వారు కూడ   పరమాత్మను కర్మ మార్గము చేత ఉపాసిస్తున్నట్లే. ఇలాంటి కర్మల వల్ల , శీఘ్రమే కర్మల ఫలితాన్ని పొందుతారు. ఇలా శీఘ్రమే ఫల ప్రాప్తిని కల్గించే కర్మలు ; జ్ఞాన సాధకాలు  కాకపోయినా , చిత్త శుద్ది కోసం పండితులు సైతం ఈ మార్గాన్నే అనుసరిస్తుంటారు. ఎందు చేతనంటే చిత్త శుద్ది లేకుండా పరమాత్మను పొందే జ్ఞాననిష్ఠ లభించదు కాబట్టి. కర్మ యోగాన్ని అందరూ పాటించ వచ్చు. కర్మలు కాయిక, వాచిక , మానసికములని మూడు విధాలు. 

కాని కర్మ సిద్ధాంత ప్రకారం వీటిని కర్మలని అనరు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఏ పనులు చెయ్యడం వల్ల కాని, చెయ్యకపోడం వల్ల గాని ; చేసే వాడికి పాప పుణ్యాలు కల్గుతాయో , అలాంటి బంధ కారణమైన పనులను కర్మ అంటారు.

అకర్మ అంటే ఏ పనీ చెయ్యకుండా ఉండటం కాదు. కర్మ ఫలాన్ని ఆశించకుండా, నేను చేస్తున్నాను అనే అహంభావం వదలి , కర్మలు చేస్తే ; కర్మలు చేసే వాడికి కర్మఫలం అంటదు. ఫలాన్ని ఇవ్వడానికి శక్తిలేని కర్మను అకర్మ అంటారు. కర్మ సిద్ధాంతం ప్రకారం స్వర్గ, నరకాలను గాని ; పునర్జన్మను గాని కలిగించే శక్తి లేకపోడం వల్ల ఇట్టిది కర్మ కాదు. అంటే కర్మ కానిది అకర్మ. 

వికర్మ స్వర్గాది ఫలాలను కోరి చేసే ఏపనైనా వికర్మ అనబడుతోంది. వికర్మ అంటే విపరీతకర్మ లేక నిషిద్ధ కర్మఅని అర్ధం. పుణ్యకర్మలు సైతం నిషిద్దాలే. వాటి ఫలితాలను అనుభవించడానికి మరో జన్మ నెత్తవలసి ఉండటం వల్ల. అంచేత వేదాంత శాస్త్ర దృష్టిలో గాని , ముముక్షువు యొక్క దృష్టిలో గాని ఇట్టి కర్మ నిషిద్ధ కర్మ గానే భావించబడు తోంది.

ఏది వికర్మగా చెప్పబడినదో , దాన్నే ఫలాపేక్ష లేకుండ ఈశ్వరార్పణ బుద్ధితో గాని, లోక కళ్యాణం కోసం గాని చేస్తే అప్పుడది ఆకర్మగా అవుతుంది. దీన్నే కర్మయోగం అంటారు. అకర్మ వికర్మల కార్యాచరణంలో భేదం లేదు. భేదం కేవలం సంకల్పం లోనే.