Thursday, July 12, 2012

భక్తి మార్గం (4)


భక్తియోగం పరాత్పరుడిని ప్రేమించమనే చెబుతుంది. ఫలాపేక్ష ఉన్నచోట నిజమైన ప్రేమ ఉండలేదు. సహజంగా ప్రేమించడమే ప్రేమకు ప్రధాన లక్షణం. భక్తి అభ్యాసం చేతనే లభిస్తుంది. భవ బంధాలనుండి విడివడటానికే మానవ జన్మ ఉద్దేశించబడింది.  ప్రతి జీవిలోనూ భగవంతునిపట్ల కొంత భక్తిభావం స్వతః గా ఉంటుంది. నియమాలను పాటిస్తుండగా, భగవంతునితో మరికొంత అనుబంధమేర్పడి , క్రమంగా తను చేసే ఉపచారాలను సహజమైన ప్రేమతో చేస్తాడు. భగవత్ప్రేమపూర్వకంగా ఏది చేసినా, అది భజనే . అసలు భక్తి , భజనా కలిసే ఉంటాయి. భజన బాహ్య వ్యవహారమైతే, భక్తి అంతరంగికం . సాధనలన్నీ మనశ్శుద్దికే . భగవంతుణ్ణి  ప్రేమతో ఉపాసిస్తూ  సమస్త కర్మలనూ భగవదర్పితం చేస్తే , ప్రారబ్ద మలిన వాసనలు బలహీనమై  మనస్సు భగవంతుని అధీనమవడానికి దోహదమవుతుంది.  భక్తిమార్గం లో త్యాగమంటే ఉన్నవాటిని భగవంతునివేపుకు మరల్చడమే భక్తుని పని.  విషయాలవల్ల కలిగే ప్రీతి మిధ్యయేగాని సత్యము కాదనేభావ౦తో, ప్రాప్తించిన వాటిని మమకారం లేకుండా అనుభవించడమే విషయ త్యాగమంటే.

మన మనస్సు యొక్క స్థితి మనం తినే ఆహారం పై ఆధారపడి ఉంటుంది. సాత్వికాహారం వల్ల సత్త్వగుణాలు అభివృద్ది చెందుతాయి. అందుకని సాత్త్వికాహారం తీసికోవాలి. మంచి ఆలోచనల ద్వారా చెడు ఆలోచనలను మార్చటానికి కావలసిన మనోబలం సత్త్వగుణం వల్ల కలుగుతుంది. సాధనలన్నీదీర్ఘకాలం, ప్రీతితో చెయ్యాలి . దైవానుగ్రహం భక్తివల్ల కలుగుతుంది . భక్తి భగవత్తత్వం బోధపడినపుడు కలుగుతుంది . భగవత్తత్వం సంశయాలు తొలగినపుడు బోధ పడుతుంది .  ఆత్మ సమర్పణమంటే అహంకార మమకారాలను వదలి నీవే గతి అని భగవానుని శరణువేడి , ఆయన అనుగ్రహానికి ఎదురుచూడటం. కర్మలన్నీ జ్ఞానానికి సాధనాలుగా ప్రతిపాదించబడ్డాయి. ఆర్తులకు సహాయం చేసేటపుడు అది భగవత్కై౦కర్యమని , అలాంటి  అవకాశమిచ్చిన ఆర్తులకు కృతజ్ఞతలు చెప్పాలి . ఇలా చేయటం వల్ల గర్వము , అభిమానము క్రమంగా పోతాయి. వైరాగ్యమంటే  ఇంద్రియాలు  ఐహిక సుఖాలచే ఆకర్షించ బడకుండుట౦ . అనగా ఆకర్షణల మధ్య జీవిస్తూ , భవబంధాలతో కట్టుబడకుండట౦.

సంతాపానికి,కోపానికి వశుడయ్యేవాడి హృదయంలో భగవత్సాక్షాత్కారం కల్గే అవకాశముండదు. భక్తునికి అన్య దేవతలపట్ల అగౌరవం లేకుండ , అన్ని ప్రాణులను దయతో తన బిడ్డలలా చూసేవారి హృదయం  విశుద్ధమై, వారికి  భగవదనుగ్రహ౦ త్వరలోనే లభిస్తుంది.  భక్తుడు వృక్షానికన్నఎక్కువ సహనము, గడ్డి మొక్క కంటే ఎక్కువ అణకువ కల్గి ఉండాలి . అందరిని గౌరవిస్తూ , తను మాత్ర౦ ఎట్టి గౌరవమూ ఆశించ కూడదు. ప్రారంభ౦లో  భక్తుడు, గురువు విధించే  నియమాలను విధిగా పాటించాలి. 

ఒక వ్యక్తి శరీరక౦గా తన పనులు  చేయలేకు౦టే,ఆ ధర్మాలను భావంతో నిర్వర్తించినా వాస్తవ౦గా నిర్వర్తించిన ఫలితాన్నే పొందుతాడు.  అంటే  భగవత్ కైంకర్యం ధ్యాన రూపంలో కూడ చెయ్యవచ్చును. ఐహిక జీవితం అంటే యాతనలని , కర్మ ఫలితాలనూ అనుభవించడమే కాబట్టి  బద్ధ జీవుడెవరైనా , ఈ యాతనల కతీతుడు కాదు. వేద విహితమైన కర్మలను , జీవనోపాధికి అవసరమైన కర్మలనూ చేస్తుండాలి. భగవంతునిపై సహజంగా ఆకర్షణ కలిగే వరకే వర్ణాశ్రమ ధర్మాలను పాటించాలి . ఈ ధర్మాలు ఆర్ధికాభివృద్ది , ఇంద్రియతృప్తి , మోక్షానికీ ఉపయోగపడే  కర్మకాండలు.  వైదిక విజ్ఞానం  చివరకు దైవాన్ని అర్ధం చేసుకోడానికే. 
              
భగవంతుడు మనలో ఆత్మగా ఉంటాడనే విషయం మరచి నేను భగవంతునికన్న వేరు అనే భావంతో ఉంటాం. ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకొని సత్యం అనుభవం చెందటమే మన పరమావధి. భగవత్ప్రాప్తి స్వతస్సిద్ధమైనా ; అహంకారం , అజ్ఞానం అనే పొరలచేత కప్పబడి ఉండటం చేత, అనుభవం లోకి రావడం లేదు. దాని తత్వం తెలిసికోడమే దాన్ని పొందటం అని నారద మహర్షి అంటారు.  భక్తికీ ఆత్మానందానికీ తేడా లేదు. భక్తి  ప్రేమలో పుట్టి , ప్రేమలో వికసించి , ప్రేమలోనే  లయిస్తుంది.  ఇలాంటి  భక్తి కలిగిన వ్యక్తి సమస్తాన్నీ ప్రేమిస్తూ నిత్య సంతుష్టుడై ఉంటాడు. కోరికలున్నంత వరకు ఇలాంటి ప్రేమ కలుగదు. ఇట్టి భక్తి లభిస్తే, సంశయాలన్నీతొలగి భవబంధాలన్నీపటాపంచలవుతాయి. అన్ని స్థితుగతులలోనూ భగవానుడిని మరువకుండా , సేవిస్తూ ఆ రూపానందాన్ని అనుభవిస్తుండటమే భక్తుని కోరికగా ఉంటుంది. మరి దేన్నీ ఆశి౦చడు. ప్రారబ్ద కర్మ పూర్తిగా  నశించినపుడు అబేధస్థితి కల్గుతుంది . అపుడు దైవానుగ్రహ౦ వల్ల ముక్తి లభిస్తుంది. ఇలా జీవ బ్రహ్మముల బేధ భావముతో మొదలైన భక్తి, అద్వైత సిద్ధిని కలిగించిజీవన్ముక్తిని / లేక మోక్షాన్ని కలుగచేస్తుంది .



No comments:

Post a Comment