భక్తిభావాలు - శ్రవణం ,
కీర్తనం , స్మరణం , పాదసేవనం , అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం , ఆత్మార్పణం
వాత్సల్యం, మధురభావం అనేవి . ఆఖరుకి శిశుపాలుడు శత్రుభావంతో ఉన్నప్పటికీ , శ్రీకృష్ణుని దివ్యమంగళ
రూపాన్ని చూస్తూ మరణించడం వల్ల కైవల్యం లభించింది. అంటే ఆ పరాత్పరునితో ఎలాంటి సంబంధం ఉన్నా
తరించగలరని విశదమవుతోంది. భక్తిభావం ఎన్ని విధాలు అనేది పక్కకు పెడితే అన్నీ; స్థూలంగా కాయికము, వాచికము, మానసికము అని మూడు రకాలకే చెందుతాయి. కాయిక భక్తి అంటే పారవశ్యంతో నృత్యం చేయటం ,
ఉత్సవాలు జరిపించటం ,
ఆలయాలు నిర్మించటం వంటివి. వాచిక భక్తి అంటే జపం, కీర్తనలు రచించి పాడటం, పురాణ పఠనం, స్తోత్రాల్ని పాడటం వంటివి. మనస్సు పని
చేయకుండా పైరెండూ ఉండలేవు. అంటే మనస్సు ఈ మూడింట వర్తిస్తుంది. భక్తికి ఆత్మానందం
ముఖ్యం. భగవద్వియోగాన్ని సహించ లేకుండటం, ఆత్మసమర్పణ భావాన్ని కలిగి ఉండటం వంటివి మానసిక భక్తి అంటారు.
ప్రతీకను లేక ఒక
విగ్రహాన్ని ఏదేవతాభావంతో పూజిస్తే , భక్తునికి వారి వారి యోగ్యతనుబట్టి ఫలం
ఇచ్చేవాడు ఆ పరమాత్మయే. సర్వభూతాల్లోను అంతరాత్మను తెలియక , కేవలం విగ్రహారాధన చెయ్యడం
వల్ల ప్రయోజనం లేదు. ఏదొక విగ్రహమూర్తినే మనసులో స్థిరంగా ఉంచుకోవాలి. కొంతకాలం
విష్ణువును , మరికొంతకాలం మరో మూర్తిని
ఇలా మార్చుకోవడం అంత మంచిదికాదు.
మనసు కెపుడూ ఒక
ఆధారం కావాలి. కాబట్టి దాన్ని మనన , స్మరణలలో వర్తింప జేస్తే దాన్లో ఉంటుంది. అవకాశం దొరికినపుడల్లా , శాస్త్రపఠనమో మంత్ర జపమో చేస్తుండాలి.
మంత్రం అంటే అది ఒక అక్షరం గాని, ఒక పదం గాని , వాక్యం గాని ,
శ్లోకం గాని అవ్వవచ్చు .
ఈ మంత్రాన్ని పదే పదే ఉచ్చరించడం జపమవుతుంది. అంతరంగంలోనే జపం చెయ్యడం మంచిదంటారు.
అలా చేసేటపుడు శబ్దం యొక్క అర్ధం మనస్సులో ఉంచుకోవాలి. అపుడే ఫలితముంటుంది. ఈ
బాహ్యాచారాలన్నీ చిత్తశుద్ది కోసమే. ఏవిధంగా భక్తి సిద్ధించినా మనస్సు
ఏకాగ్రమవ్వటం ముఖ్యం. భగవదనుగ్రహం సర్వకాల సర్వావస్థలలోనూ ఉంటుంది . దానికోసం
ప్రయత్నించిన వారికే అది దొరుకుతుంది.
భక్తుడు భగవంతుడిని
ప్రేమించగల్గే స్థితికి రావాలంటే అనేక సోపానాలను దాటాలని అనుకున్నాం. వాట్లోమొదటి మెట్టు శ్రవణం – భగవత్కధలను వినడం. ఎప్పుడు ఎలాంటి అవతారాలను
ధరించినదీ , వాట్లో ఎలాంటి లీలలను చూపించనదీ అనే విషయాలను తెలుసుకోడం వల్ల
భగవంతుని యందు ప్రేమ కలుగుతుంది.
కీర్తనం రెండవ
మెట్టు – శ్రవణ సంకీర్తనాలవల్ల చిత్తం పరిశుద్ధమై భగవల్లీలను, ఆయన కల్యాణ గుణాలను
లోలోపల చింతించడం మొదలవుతుంది.
స్మరణం- మూడవ
మెట్టు.
పాద సేవనం –
నాల్గవ మెట్టు.
అర్చనం – అయిదవ
మెట్టు. దీన్లో పత్రాలతోను , పుష్పాలతోను ఇష్ట దైవాన్ని అర్చిస్తారు.
వందనం – ఆరవ
మెట్టు. ప్రదక్షిణ చెయ్యడం , సాష్టాంగ నమస్కారం చెయ్యడం వంటివి.
దాస్యం –ఏడవమెట్టు.
దేవాలయం శుభ్రం చెయ్యడం లాంటివి. ఇప్పటికి దాసుడను అనే భావం కలుగుతుంది.
సఖ్య భక్తి – ఇది
ఎనిమదవ మెట్టు. దీన్లో భక్తుడు భగవంతునికి అంతరంగ మిత్రుడనని భావిస్తాడు.
తొమ్మిదవ మెట్టు-
ఆత్మ నివేదనం లేక ఆత్మార్పణం . దీన్లో తనను తానే భగవంతునికి అర్పించుకుంటాడు. ఇదే
శరణాగతి . ఇదే ఆఖరి మెట్టుకూడా. శరణాగతిలో భక్తుడు నేను, నాది అనడానికి బదులు
నీవు, నీది అని అహంకార మమకారాలను వదలుకొని దాసుడను అనే భావం పొందుతాడు. సర్వాత్మ సమర్పణ వల్ల దైవానుగ్రహం పొందటానికి
అడ్డు తొలగిపోతుంది.
మనస్సు భగవంతుడి
వేపుకు మరలడానికి పూర్వవాసనలే కారణం.
ఆర్తులైనా,అర్ధార్తులైనా, ముముక్షువులైనా భగవదనుగ్రహానికి పాత్రులు
కావలసిందే. ఇంద్రియాలను విషయాలవేపు పోకుండా నిగ్రహించి వశం చేసుకోడమే సాధనలో
ప్రధానాంశం. తర్వాత మనోనిగ్రహం ,
స్వార్ధరాహిత్యమూ అలవర్చు
కోవాలి. అభ్యాస వైరాగ్యాలతో మనోనిగ్రహం కల్గుతుంది. కోర్కె మొదలవగానే దాన్ని వెంటనే త్రుంచెయ్యాలి. సాధన మొదటి దశలో
మనస్సునాకర్షించి, ఉద్వేగాన్ని
కలిగించే వాటిని తుచ్చమనే భావంతోవదిలేస్తూ
రావాలి. ఈ త్యాగం స్వతస్సిద్ధంగా
రావాలి. వస్తువులపట్ల ప్రీతిని మానసికంగా త్యజిస్తేనే సంగత్యాగమవుతుంది. అంతర త్యాగం కల్గితే బాహ్యత్యాగమూ కల్గుతుంది. మొత్తం మీద అహంకారం నశిస్తే గాని త్యాగం
సంపూర్ణం కాదు. ఒక వస్తువు ఆకర్షణ ,
వస్తుజ్ఞానం అనేవి దాని
స్పర్శ , దర్శన , శ్రవణాల వల్ల
కల్గుతుంది. అంచేత అలాటి వాటకి దూరంగా ఉండాలి. మనస్సును ఏకాగ్రంచేసి
జ్ఞానేంద్రియాలను,కర్మేంద్రియాలను భగవదార్పణ౦ చేసి ఫలాపేక్ష లేకుండా ఉండాలి
No comments:
Post a Comment