Thursday, July 5, 2012

భక్తి మార్గం (1)

వేదాల్లో చెప్పబడిన కర్మకాండ, ఉపనిషత్తులలో జ్ఞానము అందరికీ అందుబాటులో ఉండదు. అంచేత అందరికీ సులభమైనదీ , అందుబాటులో ఉండేదైన భక్తిమార్గాన్నిఅధికంగా ప్రాచుర్యంలోకి తెచ్చినది నారద మహర్షే. భక్తిమార్గాన్ని  అందరూ అవలబించ వచ్చును. భగవదనుగ్రహం పట్ల విశ్వాసముభవబంధాలనుంచి విముక్తీ , కల్గుతాయనే నమ్మకము౦టే చాలు . బుద్ధి భగవల్లీనం కావడం ప్రధానం.  ప్రతి వ్యక్తికీ మొదట ఇష్టవస్తువుపట్ల ఒకరకమైన ఇష్టం  ఏర్పడి , క్రమంగా అది  రాగముగా మారుతుంది .  అది క్రమంగా తన్మయత్వంగా రూపు  చెందుతుంది. దీన్నే భక్తి అంటారు .
  
భగవంతుని పట్ల పరమ ప్రేమయే భక్తి. ప్రేమ అంటే అనుభవంలోకి వచ్చేదే కాని , దాన్ని నిర్వచించలేం. కాని అనేకులు భక్తి అంటే ఇలా చెప్పడం జరిగింది. ఎలాంటి ఫలితాన్నీ కోరక భగవంతుని సేవ చెయ్యడమే భక్తి. భగవంతుడు నావాడు అనే మమకారమే భక్తి అని నారద పంచరాత్రంలో చెప్పబడింది. అవిచ్చిన్నంగా తైలధారలా భక్తుని మనస్సు భగవంతుని వేపు నిరంతరమూ పోవడమే భక్తి. స్వస్వరూపానుసంధానమే భక్తి అని శంకరులు  వివేక చూడామణిలో అంటారు. ఎవరు ఎన్ని చెప్పినా భక్తి అనేది మాటలకు, మనస్సుకూ అతీతమైనది.  భక్తి కేవలం అనుభూతిచెందేదే.

ఒకసారి శ్రీ కాళహస్తీశ్వర శతకం గుర్తు తెచ్చుకుంటే దాన్లో సాలెపురుగు, సర్పము , ఏనుగు వాటిస్థాయికి తగినట్లు ఈశ్వరుడిని కొలిచి ధన్యమయ్యాయి. అలాగే తిన్నడు అనే భక్తుడుకూడా తనకు తోచినట్లు శివుడిని సేవించి ధన్యత చెందేడు. అంచేత భక్తి మార్గానికి అన్ని జీవులూ అర్హులే. ఏవిధమైన యోగ్యతలూ అక్కరలేదని , భావమే ప్రధానమని విజ్ఞులు చెబుతారు. ఈ విధంగానే భక్తిని ఆచరించాలనే నిబంధన ఏమీ లేదు. ప్రపంచంలో ఎక్కువ మంది ఈ భక్తి మార్గాన్నే అనుసరిస్తున్నారు. భక్తి దానంత అదే కలుగుతుంది లేదా పూర్వజన్మ సంస్కారం వల్ల, ఈశ్వరానుగ్రహం వల్ల కలుగుతుంది. అంతేగాకుండా భక్తుల సహచర్యము, జపమూ భక్తికి దోహదం చేస్తాయని పెద్దలు అంటారు. భక్తిని విడిచి ముక్తి లేదని , అంచేత ఎంతటి వారైనా భక్తి లేకుండా ఆధ్యాత్మిక సాధనలో పురోగమించ లేరని కూడ చెబుతారు. 

ఉపనిషత్తులు ఏ వస్తువును అంతర్యామి అని చెప్పాయో అదే భక్తికి ధ్యేయం. ఈధ్యేయ సత్పదార్ధన్నిగురించి చేప్పేటపుడు అనేకమైన పేర్లు కల్పి౦చబడ్డాయి.  సగుణాకారమైనపుడు ఆ విభూతులను ఈశ్వరుడనీ, శివుడనీ ,రాముడనీ ,కృష్ణుడనీ, కేశవుడనీ అనేక నామములతో పిలుస్తారు. అలాగే స్త్రీరూపంగా ఉపాసన చేసే శాక్తేయులు  ఉన్నారు.  వాస్తవానికి ఆత్మకు లింగభేదం లేదు. నిరాకారమైనపుడు బ్రహ్మమనీ , పరామత్మ అనీ చెబుతారు. సగుణ  బ్రహ్మమూ నిర్గుణ బ్రహ్మమూ ఒక్కడే . అంతా అద్వితీయమైన బ్రహ్మమే. నిర్గుణ బ్రహ్మం అతి సూక్ష్మమవ్వడం చేత మనస్సు కందదు. కావున అలాంటి బ్రహ్మాన్ని ప్రేమించి ఉపాసి౦చలేము. అందుచేత భక్తుడు సాకారుడైన ఈశ్వరుణ్ణి ఉపాసిస్తాడు . బ్రహ్మాన్ని గురించిన ఎరుకలో మానవ మనస్సు ఊహించగల గొప్ప స్థాయినే ఈశ్వరుడని చెప్పవచ్చు. భక్తియోగము యొక్క ఆశయం బ్రహ్మానుభవమే.  జపవిధానమంతా సగుణమే. సాధకుడి సంకల్పము , మనస్స్తత్వాన్నిబట్టీ ధ్యేయం ఉంటుంది . ధ్యేయాకారాలన్నీ మనోకల్పితాలే కాబట్టి వాటన్నిటి పట్ల సమదృష్టి కల్గి ఉండాలి. ప్రతిమ అంటే విగ్రహం. ప్రతీకోపాసన అంటే బ్రహ్మం కాని దాన్ని బ్రహ్మంగా భావించి భక్తితో దాన్లో మనస్సు లగ్నం చెయ్యడం. బ్రహ్మమే ఉపాసకుని లక్ష్యమై , ప్రతీకం కేవలం ప్రతిగా ఉండి సర్వవ్యాపకమైన  బ్రహ్మం ప్రతీకమూలంగా ఉపాసించబడితే , అది అందరికీ ప్రాధమిక దశలో అవసరమే. ఒకవేళ అవతారాలనుగాని, గురువును గాని ధ్యేయంగా గ్రహిస్తే వారి ప్రారబ్ద దోషాన్ని పట్టించుకోకుండా వారు సాక్షాత్ భగవత్స్వరూపులనే భావంతో సాధన చెయ్యాలని చెబుతారు.

No comments:

Post a Comment