భక్తి గురించి ,
ధ్యేయాకారాలను గురించి మొదటి భాగంలో చెప్పుకున్నాం. భక్తి జ్ఞానపూర్వకమైనది. ఈ
జ్ఞానపూర్వకమైన భక్తిమార్గాన్ని వాసుదేవ భక్తిగా మొదట్లో భగవంతుడు సూర్యునికి ,
సూర్యుడు వైవస్వత మనువుకు, మనువు ఇక్ష్వాకునకు ఉపదేశించగా ఇలా పారంపర్యంగా వచ్చే ఈ
విద్యను రాజర్షులు తెలుసుకున్నారు. కాలక్రమంలో ఈ విద్య నశించింది. దీన్ని
శ్రీకృష్ణావతారంలో గీతా రూపంలో తిరిగి ఉద్ధరించ బడింది అని చెబుతారు.
భక్తుడికి
శ్రద్ధ, ప్రేమ, భావబలమూ కావాలి. ఇవన్నీ మనస్సుకు సంబంధించినవే. సాత్విక బుద్ది
జ్ఞానాన్ని కల్గిస్తుంది. భగవంతునియందు శ్రద్ధాభక్తులుండి, బుద్ది శుద్ధంగా
లేకపోతే అతడికి భగవంతుడు ఇలాంటి వాడు అనేది తెలియదు. అలాంటి వాళ్ళలో కొందరు సరైన
అవగాహన లేక క్షుద్రదేవతలనో, యక్ష, రాక్షసులనో ఆరాధిస్తారు. అంచేత భక్తునికి
కొంతైనా బ్రహ్మమును గురించిన జ్ఞానం ఉండాలి. దీనితో బాటు సత్వగుణం పెంపొందించు
కోవాలి. భగవానుడు గీతలో నిత్యయోగియై ముఖ్యభక్తి కల్గిన జ్ఞాని అధికుడని చెప్పారు. దీన్నిబట్టి
గీత జ్ఞానంతో కూడిన భక్తిమార్గాన్నే బోధించిందని చెప్పాలి. భక్తీ, జ్ఞానమూ భిన్న మార్గాలైనా వాటి గమ్యం
ఒక్కటే. వీటిలో ఏఒకటి ఎక్కువని గాని , తక్కువని గాని చెప్పలేం.
భక్తి పరాభక్తి , అపరాభక్తి లేక గౌణభక్తి అని ముఖ్యంగా రెండు విధములు. అపరాభక్తి నుంచి
పరాభక్తికి పురోగమించడం జరుగుతుంది. ఈ అపరాభాక్తికీ పరాభాక్తికీ మధ్య ముఖ్యభక్తిని
, ఏకాంత భక్తినీ కూడ కొందరు అంగీకరిస్తారు.
పరాభక్తి – ఇది
భక్తియొక్క సిద్దావస్థ లేక చరమావస్థ అనవచ్చు. ఈ స్థితిలో మనస్సు పూర్తిగా నశించి ఆత్మానుభూతి
కలుగుతుంది. అపుడిక సంకల్పాలు ఉండవు. సాధన కొనసాగిస్తుండగా అహంకార నాశనము,
చిత్తశుద్ది కలిగి ఆత్మ ప్రకాశానికున్న అడ్డుగోడలన్నీతొలగి పోతాయి. ఈ అనుభూతి ఏకరూపము, అవిచ్చిన్నము అవడం వల్ల
ఇంద్రియాలన్నీ తమ పనులు మాని ఈ అనుభూతిలో ఏకమై ఉంటాయి. ఇట్టి అనుభవం
వర్ణించలేనిది. అంచేత అనిర్వచనీయం అనబడుతోంది. భక్తుడు ఈ స్థితిలో సమస్తంలోనూ
భగవత్స్వరూపాన్నే దర్శిస్తాడు. సమస్తాన్నీ ప్రేమిస్తాడు. ఎపుడూ భక్తిరసంలోనే పొంగి
పొర్లాడుతూంటాడు. ఈశ్వరేచ్చానుసారంగా
కర్మలను చేస్తుంటాడు. పరాభక్తివల్ల ద్వైతభావంతో ఉండే భక్తుడు,తనలో ఉండే ఆత్మయే భగవంతుడని గ్రహిస్తాడు. ప్రారబ్ద కర్మ నశిస్తేనే అభేద స్థితి
కలుగుతుంది. అపుడు దేశ, కాల, కారణ భేదం నశించి పరమ ప్రేమానుభవం పొందుతూ నిత్యమూ
సంతోషంగా ఉంటాడు. ఇదే జీవబ్రహ్మైక్య స్థితి. ఇలా ఆత్మానుసంధానం చేసి బ్రహ్మైక్య
స్థితిని పొందినపుడే అది పరాభక్తి అవుతుందని అంటారు. భగవంతుడు , భక్తుడు అనే
భేదభావం పూర్తిగా నశిస్తుంది. ఇలాంటి పరాభక్తి ఈశ్వరానుగ్రహం వల్ల, పురుష ప్రయత్నం
వల్ల లభిస్తుంది. దీన్నే ముక్తి లేక కైవల్యం అని అంటారు.
ముఖ్యభక్తి – ఇది
భక్తి సాధనలన్నిటినీ దాటగా దాని పర్యవసానంగా లభిస్తుంది. దీన్లో భగవంతుడికీ
భక్తునికీ మధ్యలో సూక్ష్మంగా భేదభావం
నామమాత్రంగా ఉంటుంది. ఈ భేదాన్ని భక్తుడే బ్రహ్మానుభవం కోసం
కల్పించుకుంటాడని అంటారు. ఇదికూడా అనిర్వచనీయమే అంటారు. అకారణమైన కరుణ ,
ప్రేమానుభూతి భక్తునిలో పొంగిపొర్లుతుంది.
హృదయాంతరాళంలో మనం పొందే అనుభూతే సాక్షాత్కారమంటే.
ఏకాంతభక్తి –
సాధన పురోగతి చెందుతుండగా చిత్తవృత్తులు అన్నీ స్తంభించినపుడు అది ఏకాంత భక్తి అని
అంటారు. దీన్నే జ్ఞానం అంటారు. ఈ స్థితిలో భక్తునికీ , జ్ఞానికీ తేడా ఏమీ ఉండదు. ఎవరు కేవలం ప్రేమకోసం భగవంతుడిని ప్రేమిస్తారో
వారే ఏకాంత భక్తులు. సత్వగుణ ప్రధానులై ఏ అపేక్షా లేకుండా ఆత్మయందే స్థితుడై
ఉండేవారిని ఏకాంత భక్తులు అంటారని కొందరు చెబుతారు. భక్తులు ముక్తిని కూడ
కోరరు.
గౌణ భక్తి – ఇది
సాధనావస్థ మొదట్లో ఉండేది. సాధన తొలి దశలో ఒక విగ్రహాన్ని గాని లేదా ఒక ప్రతీకను
గాని ఆలంబనం చేసుకొని , భక్తిని సలుపుతారు. వీరు స్తోత్రాలను, కీర్తనలను గానం చేస్తారు.
నామసంకీర్తనం చెయ్యడం, భగవత్కధలను వినడం వినిపించడం, ఆయన లీలలను స్మరించుకోడం,
ప్రార్ధన చెయ్యడం లాంటివి చేస్తుంటారు. ఈ క్రియలనే భజించటం అంటారు. ఇవన్నీ
ఉత్తమమైన పరాభాక్తికి సాధనలవ్వడం చేత దీన్ని అపరాభక్తి లేక గౌణభక్తి అని చెబుతారు.
గౌణభక్తి అంటే
గుణాలకు సంబంధించినది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని మూడు గుణాలున్నాయి. వీటిని
బట్టి , మనస్సు సత్వగుణ సంబంధమైనపుడు సాత్విక భక్తి కల్గి స్వార్ధమైన కోరికలు
లేకుండా భగవంతుని ప్రీతి కొరకే
ఆరాధిస్తాడు. సాధ్య సాధక జ్ఞానం
పూర్తిగా ఉంటుంది. అలాగే మనస్సు రాజసిక యుక్తమైనపుడు,
రాజసిక భక్తి కల్గి కేవలం స్వప్రయోజనం
కోసం భక్తి కల్గి ఉంటాడు. వీరికి సాధ్య సాధక జ్ఞానం కొంతవరకే ఉంటుంది. అదేవిధంగా
తామస ప్రవృత్తి కలిగినవారి భక్తి తామసికమై , మూఢాచారములు మూఢవిశ్వాసములు కలదై ఉంటుంది. వీరికి సాధ్య సాధక జ్ఞానం సంగ్రమగా
ఉండదు.
(అ) ఆర్తుడు –
ప్రాణ రక్షణ కోసమో , బాధా నివారణం కోసమో , మాన భంగం కలుగకుండానో భగవంతునికి మొర
పెట్టుకునేవాడు ఆర్తుడు. ఇలాంటి వాడు, రజస్తమో గుణములు అధికంగా ఉండటంవల్ల తనకు, తనవారికీ కలిగే కష్టాన్నే తీర్చమని
కోరుతాడు. ఉదాహరణకు గజేంద్ర మొక్షంలో తనను కాపాడమని ఏనుగు, మానం కాపాడమని కురుసభలో ద్రౌపది కోరుతారు. కాని సత్వగుణాధిక్యత గలవాడు లోకాలకు కల్గిన
కష్టాలని తీర్చమని ప్రార్ధిస్తాడు.
(ఆ) జిజ్ఞాసువు –
భగవంతుడిని పొందాలనే లేక తెలిసికోవాలనే
కోరిక కల్గి దానికోసమే తపిస్తూ , మిగిలినవాటిపై ఆపేక్ష లేనివాడు
జిజ్ఞాసువు. ఇది సత్వగుణాధిక్యత వల్ల, సాత్విక శ్రద్ధ వల్ల కలుగుతుంది.
ఇలాంటి వారికి తనతో బాటు ఇతరులు కూడ
భగవంతుని తెలిసికొందురు గాక అనే అభిలాష కలవారై ఉంటారు. ఉదాహరణకు గోపికలు. ఈ
జిజ్ఞాస తామస భక్తులకు ఉండదు. రాజసిక భక్తులకు కొద్దిగానే ఉంటుంది.
(ఇ) అర్ధార్ది –
రజస్తమో గుణములతో కూడిన బుద్ది గలవాడవటం వల్ల స్వలాభం కోసం ధనాన్ని కోరుతాడు. అదే సాత్విక
బుద్దిగలవాడైతే లోకులకోసం కోరుతాడు.
(ఈ) జ్ఞాని –
ఆత్మజ్ఞానం గలవాడు.
తామసిక భక్తికన్న
రాజసిక భక్తి, దానికన్న సాత్విక భక్తీ ఉత్తమములు.
Thanks for the comment.
ReplyDelete