Tuesday, July 3, 2012

ప్రార్ధన - విధానము


ముక్తి మార్గాలను గురించి చర్చించుకునే ముందు ప్రార్ధన ఎలాచేయ్యాలో చూద్దాం. ప్రతి వారికీ తమ ఇష్టదైవం 
అనేది ఉండే ఉంటుంది. ఈ జగత్తుకు సృష్టి, స్థితి , లయాలు ఎవరి మూలంగా కల్గుతున్నాయో , అతడే ఈశ్వరుడు.  ఉపనిషత్తులు ఏ సత్పదార్ధాన్ని గురించి చెప్పాయో అదే ధ్యేయ వస్తువు. ఆ సత్పదార్ధాన్ని గురించి చెప్పేటపుడు చెప్పేవారి రుచిని బట్టి, వినేవారి మనస్తత్వాన్ని బట్టి నామరూపాలు కల్పించ బడుతున్నాయి. అలాంటి కల్పన సాకార సగుణ పరమైనపుడు ఆ వస్తువు విభూతులను ఈశ్వరుడనీ , రామ , కృష్ణ , శివ , కేశాదులనీ అంటారు. ఇలా ఆస్తికులకు ఇష్ట దైవం అనేది  ఏర్పడుతుంది. 

మనం మొదట్లో దైవచింతన  ఒకఆలోచన అనే  బ్లాగులో  చెప్పుకున్నట్లు అందరికీ సమస్యలుంటాయి. 
ఆ సమస్యలూ , మన బాధ్యతలూ తీరడానికి మనవంతు ఎంత ప్రయత్నం చేసినా మనవల్ల కానపుడు ; 
వాటిని  భగవదనుగ్రహానికి వదిలేస్తాం.  దీనికి ప్రార్ధన తోడ్పడుతుంది. 
 
ప్రార్ధన :-సాధారణంగా మన ప్రయత్నాలన్నీ విఫలమై , ఏమీ దిక్కు తోచనపుడే మనం ఆ పైవాడి అనుగ్రహం
కోసం అర్దిస్తాం. ప్రార్ధన అంటే అడగటం.  ప్రార్ధన  ఎప్పుడైనా చెయ్యవచ్చు . అతిముఖ్యమైన సమస్య అంటే 
ఆ సమస్య తీరితేనే గాని మనుగడ లేదు అనిపించేది.  అలాంటి దానికోసం  ఐతే అర్ధరాత్రికి పావుగంట ముందు,పావుగంట తర్వాత   లేదా ఉదయం ఉజ్జాయింపుగా  సూర్యోదయానికి ఒక గంటముందు  గాని ప్రార్ధన  చేస్తే మంచిదని విజ్ఞులు చెబుతారు.  ఆ సమయంలో ప్రకృతి నిర్మలంగా ప్రశాంతంగా  ఉండి  ఎవరిని ప్రార్దిస్తామో ఆయనకు మన సమస్యచేరి ; కోరిక సఫలమవడానికి దోహదపడుతుంది .

మామూలుగా ఉండే కోరికలైతే , సంధికాలంలో చెయ్యాలి. అంటే పగలు రాత్రిగా మారేటపుడు, రాత్రి పగలుగా మారేటపుడు ( ప్రొద్దు క్రుంగే టపుడు , ప్రొద్దు పొడిచే టపుడు). ఆరాధన - అంటే దీప, ధూప, నైవేద్యాలు సమ ర్పించటం. నువ్వు తప్ప నాకిక వేరే ఈ సమస్యను తీర్చే దిక్కు లేరని చెప్పడాన్ని శరణాగతి అంటారు. అపుడు నిస్సహాయ స్థితి వస్తుంది. ఎవరిని ప్రార్ధించి అర్ధిస్తున్నామో ఆ దైవం మన సమస్యను తీరుస్తాడనే నమ్మకం ఉండాలి. సాధారణంగా భక్తులు ఇష్ట దైవంతో తండ్రిగానో , తల్లిగానో, స్నేహితుడుగానో, ప్రియుడుగానో,బిడ్డగానో  గురువుగానో, సేవకుడుగానో బాంధవ్యం ఏర్పరచుకుంటారు. ఆయనతో అలాంటి  బంధముంటే పని సులువవుతుంది.

సమస్యను విన్నవించుకునేందుకు  మనస్సు నిశ్చలంగా  ఉండాలి . అంటే ప్రార్ధనకు ముందు రెండు నిమిషాలు శ్వాసను గమనిస్తే మనస్సు కుదుట పడుతుంది. మనస్సులో ఒక కోరిక మాత్రమే ఉండాలి.  ఆ సమస్య పట్ల మనకు పూర్తిగా అవగాహన ఉండాలి. నీ సమస్యపై నీకు అవగాహన లేకపోతే , తీర్చడానికి ఆయన దేన్నని తీరుస్తాడు.

  సమస్య తీరడం ఎంత ముఖ్యమో, అది తీరకపోతే కలిగే దుఃఖ తీవ్రత ఏమిటో అనుభవించాలి . ఆ బాధలో
ఉంటూ నిస్సహాయ స్థితిలో దీనంగా దోసిలి పట్టి ఆయన మనకు దగ్గరలో (హృదయంలో) ఉన్నట్లు భావించి, సమస్యను విన్నవించుకోవాలి . నా సమస్య నీకు విన్నవించుకున్నాను. ఇపుడు దాన్ని, నీ సంకల్పానికి వదిలేస్తున్నానని సమర్పిచు.  అలా కొద్ది సేపు నిరీక్షిస్తే నీ హృదయం తేలికపడుతుంది.

అప్పుడు సమస్య తీరినట్లు ఊహించుకొని , సంతోషంతో ఆనందంగా ఉన్నట్లు భావించి ఆ ఆనందాన్ని
అనుభవించు. సమస్యను తీర్చినందుకు భగవంతుడికి హృదయ పూర్వకంగా  కృతజ్ఞతలు చెప్పాలి. అపుడు ప్రార్ధన ముగుస్తుంది.ఏ భగవంతుడి సహాయం అర్దిస్తున్నామో , ఆయనతో ఆ ఘడియలో మన హృదయాన్ని కలపడమే ప్రార్ధన. అది సరిగా చేస్తే కార్యం సఫలమవుతుంది. గుర్తుంచుకోండి; మనకు అపకారం జరగని కోరికలే తీర్చబడతాయి. నీ వ్యక్తిగత సమస్య అయితే నువ్వే ప్రార్ధన చెయ్యి. కుటుంబ సమస్య అయితే కుటుంబ సభ్యులు అంతా కలసి ప్రార్ధన చెయ్యండి.

ఇలా ప్రార్ధన ద్వారా కూడ , మీ బాధ్యతలను కొంతవరకు తీర్చుకొనే అవకాశం ఉంది. అపుడు మీకు పరమార్ధాన్ని గురించి యోచించే  సమయం లభిస్తుంది. 


No comments:

Post a Comment