సత్యాన్ని
గ్రహించి , అంతరాత్మలో దాని
అనుభవాన్ని పొంది , సత్య దర్శనం
చేసినపుడు సంశయాలు తొలగి, అజ్ఞానం నశించి
సమస్త కర్మలూ నశిస్తాయని వేదాలు చెబుతున్నాయి. ఏకమైనప్పటికీ ఏది
అనేకంగా ప్రకాశిస్తుందో , దేన్లోనించి
అనేకమైనవి నిర్మాణమౌతున్నాయో , అలాంటి ఏకత్వాన్ని కనుక్కోటమే అన్ని శాస్త్రాల
పరమావధి. అంతరంగాన్ని బట్టే మన బాహ్య
ప్రపంచముంటుంది. అంతశ్శక్తులను నేర్పుతో నడిపి , ప్రకృతిని స్వాధీనం చేసుకుంటే ప్రకృతి నియమాలను అతిక్రమించ కలుగుతాం .
ఈ యోగ సాధన
ఎనిమిది అంగాలుగా విభజించబడింది. అందుచేతనే దీన్ని అష్టాంగ యోగమని అంటారు.
అష్టాంగ యోగంలో ఎనిమిది అంగాలూ - యమము , నియమము, ఆసనము, ప్రాణా
యామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అనేవి.
1) యమంలో
అహింస -
మనసుచేత , మాట చేత , లేదా మన చర్యల
వల్ల కాని ఏ ఒక్కరికీ హాని కల్గించకుండా
ఉండటం.
సత్యం -
ఉన్నది ఉన్నట్లుగా తెలుపటం . అంటే అబద్ధం ఆదకుండటం.
అస్తేయం -
ఇతరుల సొత్తు దొంగిలించ కుండటం.
బ్రహ్మచర్యం -
సర్వ కాల సర్వావస్థల్లోనూ మనో వాక్కాయ కర్మలా పరిశుద్ధంగా ఉండటం .
అపరిగ్రహం - ఏ దుస్థితిలో ఉన్నా ఇతరులనుండి ఏదీ
తీసుకొకుండటం . ఎందుకంటే ఏదైనా పరులనుంచి తీసుకుంటే దాత యొక్క పాపాల్లో కొంత పాపం తీసుకున్నట్లే
నని శాస్త్రాలు చెబుతున్నాయి. అదీగాక పరిగ్రహణం వల్ల అల్పులమై హృదయ శుద్ధిని కోల్పోతాం.
ఇవి యమం లోకి
వస్తాయి. వీటిని పాటించటం వల్ల మనస్సు శుద్ది అవుతుంది.
2) నియమం
శౌచం - బాహ్య శౌచం అంటే తన శరీరాన్నిశుభ్రం చేసుకోడము,
శుభ్రమైన వస్త్రాలను ధరించడం, నివసించే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమూ వంటి బాహ్య
పరిశుభ్రత. అంతర శౌచం అంటే మనస్సులో కామ క్రోధాలకు తావివ్వక మలిన వాసనలను వదలి
శుద్ధ వాసనలు కలిగి ఉండటం.
సంతోషం – అన్ని
ప్రాణులకు సంతోషం అవుసరమే. ముఖ్యంగా యోగాభ్యాసికి సంతోషం లేకుండా సాధన కొనసాగించ
లేడు. అంచేత సంతోషం సాధన క్రమం తప్పకుండా చేస్తూ పురోగతిని పొందటానికి
తోడ్పడుతుంది.
తపస్సు – ఏకాదశి
మొదలైన పర్వ దినాలయందు ఉపవాసాలు, జాగరణ చెయ్యడం వంటి వాటి వల్ల ఇంద్రియ నిగ్రహం
కలుగుతుంది .
స్వాధ్యాయం --
శాస్త్ర అధ్యయనం ,మంత్ర జపం
వంటివాటి వల్ల సత్వ శుద్ది కలుగుతుంది. అధ్యయనం చేసి ఇతరులకు కూడ వినిపించడం
వంటివి స్వాధ్యాయం లోనికి వస్తాయి.
ఈశ్వర ప్రణిధానం
- సంకీర్తనలు, భక్తిభావంతో
భగవంతుని ఆరాధన , ఈశ్వరార్పణ బుద్ధితో
కర్మలు చెయ్యటం, యోగం నిర్విఘ్నంగా పొందటానికి భాగావతుడిని శరణు పొందటం వంటివి ఈ
కోవలోకి వస్తాయి. ఇవి నియమం లోకి
వస్తాయి. యమ నియమాలు యోగ సిద్ధికి ఉపకరిస్తాయి.
తపస్సు,
స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అనే ఈ మూడూ కలసి క్రియాయోగం అనబడుతోంది.
3) ఆసనం --ఏ ఆసనంలో
సాధకుడు స్థిరంగా, సుఖంగా ఎక్కువ కాలం కూర్చోగలడో అలాంటి ఆసనంలో అభ్యాసం కొన
సాగించాలి. పద్మాసనం గాని, అర్ధ పద్మాసనం
గాని, వజ్రాసనం గాని
ఎన్నుకోవచ్చు. తల , మెడ , వక్షం ,వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి. శరీరం స్థిరంగా ఉన్నపుడే చిత్తము కూడ
స్థిరంగా నిలుస్తుంది. తూర్పు లేక ఉత్తర
ముఖంగానే ఆసనం ఏర్పరచుకోవాలి అని పెద్దలు చెబుతారు. కొద్ది రోజులు అభ్యాసం చేస్తే
స్తిరాసనం సిద్ధిస్తుంది. ఆసనం సిద్ధించాక నాడీశౌచం అనే క్రియను చెయ్యాలని కొందరి
రాజయోగుల అభిప్రాయం.
కుడిచేతి బొటనవ్రేలుతో కుడి ముక్కుపుటాన్ని మూసి , ఎడమ
ముక్కురంధ్రముతో మెల్లగా గాలిని పీల్చి ; కుడిచేతి చూపుడువ్రేలు లేక మధ్య వ్రేలుతో ఎడమ ముక్కుపుటాన్ని మూసి, కుడి బొటనవ్రేలును
వదలి, గాలిని వెంటనే మెల్లగా విడిచి
పెట్టాలి. అలాగే పిదప ఎడమవేపు ముక్కుపుటాన్ని మూసిఉంచుతూ కుడి వైపు నుంచి గాలిని పీల్చి గాలిని ఎడమ వైపు నుంచి వదలి పెట్టాలి . ఈ విధంగా
మార్చి, మార్చి రోజుకు ఐదు సార్లు వరకు ,
పదిహేను రోజుల నుండి నెల రోజుల వరకు చేస్తే నాడీశౌచం లభిస్తుందని అంటారు. దీన్నే
నాడీ శోధన అని కూడా అంటారు. ఆ తర్వాత
ప్రాణాయామం చెయ్యాలి.
No comments:
Post a Comment