ఈశావాశ్యోపనిషత్తు
ఆధ్యాత్మిక సాధకులకు ముఖ్యంగా రెండు మార్గాలను చూపుతుంది. మొదటిది జ్ఞానమార్గాన్ని
అనుసరించే వారికి - యజ్ఞాది కర్మలు చేయవలసిన పని లేదు. శాస్త్రాధ్యయనం ,
అత్మస్వరూపాన్ని గురించి మనన , నిదిధ్యాసనలను చేస్తుండాలి. అంటే జ్ఞాని సన్యాసితో
సమానుడు.
ఇక రెండవ మార్గం – కోర్కెలను త్యజించి పైన చెప్పిన కఠినమైన జ్ఞానమార్గాన్ని అనుసరించే మానసిక యోగ్యత లేనివారికి ఇది చెప్పబడింది. భగవంతుడిని సాకారుడుగా
ఆరాధించి అతని అనుగ్రహంచేత ఇహలోక సౌఖ్యాన్ని , మొక్షానందాన్నీ కోరేవారికి యజ్న
యాగాది కర్మలు, శాస్త్ర విహిత కర్తవ్యాలను ఆచరిస్తూ వివిధ దేవతలను, పరబ్రహ్మాన్ని
గూర్చిన , విజ్ఞానాన్ని ఆర్జించు కోవాలి. ఇట్టి సాధన ద్వారా వారు మరణానంతరం
స్వర్గాలోకాలలో అత్యున్నతమైన బ్రహ్మలోకం చేరుకుంటారు.
ఇలా జ్ఞాన మార్గము
, కర్మమార్గమూ పరస్పరం విరుద్దాలైన రెండు ప్రత్యేక మార్గాలని శ్రీ శంకరుల మౌలిక
సిద్ధాంతం. ఎందుకంటే కర్మ, అహంబుద్దీ కామనలపై ఆధారపడి ఉంటుంది. జ్ఞానం వాటి వినాశనంపై ఆధారపడి ఉంది. కామనాసహితంగా
చేసే కర్మలు ఈలోకంలో గాని, స్వర్గలోకంలో గాని భోగాలను పొందటానికి అర్హతను ఇస్తాయి.
కామనారహితంగా అంటే ఫలితాన్ని ఆశించక భగవదర్పణంగా చేస్తే అవి చిత్తశుద్ధికి దారి
తీస్తాయి. జ్ఞానానికి , ఆత్మ సాక్షాత్కారానికి చిత్త శుద్ది అవసరం. చిత్తశుద్ధి
కల్గిన తర్వాత కర్మావస్యకత లేదు. ఇక శాస్త్రోపదేశాలను విని వానిపై ధ్యాననిమగ్నుడు
కావడమే అతని పని. దీనికి అవుసరమైన సామర్ధ్యాన్ని నిష్కామకర్మ ద్వారా మనస్సును
పరిశుద్ధం చేసి సంపాదిస్తాడు. మనస్సు పరిశుద్ధ స్థాయిని చేరుకోనంత వరకూ భగవదార్పణ బుద్ధితో నిష్కామ కర్మ చేస్తూ
ఉండవలసినదే. ఇట్టివాడు క్రమంగా జ్ఞానాన్ని సంపాదిస్తాడు కాని ఈ ప్రపంచంలో మాత్రం
కాదు. తన కర్మల , ఉపాసనల ఫలితంగా
అత్యున్నతమైన స్వర్గానికి పోయి కల్పాంతం వరకు అక్కడ నివసించి అప్పుడు జ్ఞానాన్ని,
మోక్షాన్ని పొందుతాడు. దీనినే క్రమ ముక్తి అంటారు. ఈ శరీరంతో ఉండేటపుడే మోక్షం
పొందటాన్ని జీవన్ముక్తి అంటారు.
దుఖం : -కోరికలే
ఆలోచనలుగా ఒకదాని వెంట మరొకటి వచ్చి, మనస్సుకు ఆరాటం కల్గిస్తాయి. దాంతో అసంతృప్తి
వస్తుంది. అసంతృప్తి అనేది ముఖ్యంగా పరమాత్మతో మనం వేరవ్వడంవల్ల కల్గుతుంది.
యాంత్రిక జీవనం, ఒంటరితనం, ప్రేమలేనితనం ,ఆత్మీయతకోసం తహతహ లాడటంవల్ల కల్గుతుంది. ఈ
అసంతృప్తే ముక్తిమార్గానికి దారితీస్తుంది. దుఖమనేది శారీరకము , మానసికము , ఆధ్యాత్మికము అని మూడు విధాలు. శారీరకమైన
దుఖమంటే , ఇది భౌతికమైనది . అనారోగ్య కారణాలవల్ల గాని , ఆర్ధిక సమస్యలవల్ల
గాని కలిగే దుఖానుభవం . మానసిక దుఖమనేది భయమో, ప్రేమలేనితనంవల్లనో వస్తుంది. ఒక్కొక సారి కారణ
మనేదే ఉండదు కూడా. ఆధ్యాత్మిక
దుఖమనేది అసంతృప్తి వల్ల కల్గుతుంది. ఈ కారణాలను అల్లా
ఉంచితే అసలు ఈప్రపంచంలోనే దుఖమనేది ఉంది. అంచేత అందరికీ ఎంతో కొంత దుఖానుభవం ఉండనే
ఉంటుంది. కాకపోతే వారి దుఖానుభవాలలో హెచ్చు తగ్గులుంటుంటాయి. గుర్తుంచుకోవలసినది
ఒక్కటే. ఎప్పుడూ మనం మోయలేనంతగా మాత్రం దుఖం ఉండదు. కాకపోతే ఎవరికి వారు అనుకునేది , వాళ్ళే ఎక్కువ
దుఖాన్ని అనుభవిస్తున్నట్లు భావిస్తారు. ఇది వారి వారి భావనను బట్టి ఉంటుంది. వాస్తవానికి
దుఖం సంఘటనలో ఉండదు. పరిస్థితిలోనూ లేదు. ఆ సంఘటన వల్ల మనస్సులో ఏర్పడ్డ భావంలోనే
ఉంది. దీనికి కారణం మనకున్న అభిప్రాయమే. ఈ దుఖం పోవాలంటే మనకు ముక్తి రావాలి.
దుఖంనుంచి దూరమవ్వాలంటే మన ఆలోచనా విధానం మారాలి. ముక్తి లభిస్తే దుఖం దూరమై , ఉన్నతమైన మానసిక
స్థితిలో ఉండి అంతా సమానమే అనిపిస్తుంది. నా అనేదిగాని , తనకు స్వంతమనేది గాని
ఉండదు.
బాహ్యాంతర ప్రకృతినంతా
నిరోధించి అంతర్గతంగా ఉండే దివ్యత్వాన్ని వ్యక్తం చెయ్యడమే జీవిత పరమావధి.
దీనికోసం 1) భక్తి మార్గం .
2) జ్ఞాన మార్గం.
3) కర్మ మార్గం.
4) యోగ మార్గం అని ఉన్నాయి.
వీటిలో ఒకటి గాని ,
కొన్నిటిని గాని అవలంబించి ముక్తిని సాధించాలి. మోక్షం పొందగోరేవాడికి వాదాలు, సిద్ధాంతాలు,
కర్మకలాపాలు, గ్రంధాలు, దేవాలయాలు , విధులు ఇవన్నీ అప్రధానాంశాలు . ఈ మార్గాలలో ఏ
ఒక్కదానిలో ప్రావీణ్యత సంపాదించినా అది మిగిలిన వాటితో కలుస్తుంది. అంచేత ఎవరికి
అనువైన మార్గాన్ని వారు ఎన్నుకొని సాధన చేస్తూ గమ్యాన్ని చేరవచ్చునని విజ్ఞులు
చెబుతారు.
No comments:
Post a Comment