Thursday, August 30, 2012

పంచ మహాభూతములు


పంచ మహాభూతములు 
గుణరహితమైన  అత్మనుండి ఆకాశం కలిగింది. సాంఖ్యుల ప్రకారం త్రిగుణాత్మకమైన ప్రకృతిలో, తమో గుణప్రధానమైన ప్రకృతి నుండి పంచ మహాభూతాలు కలిగాయని చెబుతారు. పంచమహాభూతాలు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృధివి అనే ఐదు.

ఆకాశము ఇది శబ్దము లేక ప్రతిధ్వని కలగడానికి ఆధారమైనది. అంటే దీన్లో శబ్దమనే గుణం ఉంది. ఇతర వస్తువులు ఉండటానికి అవకాశం ఇచ్చేది కాబట్టి, దీన్ని ఆకాశం అని అంటారు.
వాయువు దీన్లో బీసీ అనే ధ్వని, స్పర్శను కలిగించే విషయము/ తత్వము ఉంటాయి. అంటే దీన్లో రెండు గుణాలున్నాయి.
అగ్ని దీన్లో భుగ భుగ మనే శబ్దము, వేడిమిని కలిగించే స్పర్శ, కాంతిని కల్గించేదిగాను ; ఇలా మూడు గుణాలను కల్గి ఉంటుంది.
జలము దీన్లో బులు బులు మనే శబ్దము, చల్లని స్పర్శ, తెల్లని రంగు, రుచిని కలిగించే గుణము ; ఇలా నాల్గు గుణాలుంటాయి.
పృధివి దీన్లో కట కట మనే శబ్దము, కఠిన స్పర్శ, అనేకమైన రంగులు, అన్ని రుచులూ, సువాసన దుర్వాసనలనే గంధగుణమూ; ఇలా ఐదు గుణాలున్నాయి.

తమః ప్రధానమైన ప్రకృతి  నుండి ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి పుట్టాయి. శబ్దం, స్పర్శ, రూపము, రసము, గంధము  అనేవి ఈ పంచ మహాభూతాల గుణాలు. బ్రహ్మమును ఆధారంగా చేసుకుని ఏర్పడిన ఆకాశమే ప్రధమ వికారము. ఇది ముందు ఏర్పడ్డ భూతమవడంచేత బ్రహ్మలక్షణాలు ఉన్నట్లు చెబుతారు. ఇది జడమైనా ఏకము, అనంతము, సర్వగతమై యితర భూతములు ఉండటానికి అవకాశము కల్గిస్తుంది.

బ్రహ్మము సర్వ వ్యాపి. దీన్లో మాయ యొక్క వ్యాప్తి చాల తక్కువ. మాయా కార్యమైన ఆకాశము వ్యాప్తి  ఇంకా అల్పము. ఆకాశ కార్యమైన వాయువు వ్యాప్తి దాని కంటే తక్కువ. అగ్ని వాయువు యొక్క పదవ భాగం చేత ఏర్పడింది. అగ్ని యొక్క పదవ భాగం చేత జలము, జలము యొక్క పదవ భాగం చేత పృధివి ఏర్పడ్డాయి. భూమి యొక్క దశాంశము వలన బ్రహ్మాండము ఇలా ఒకదాని కంటే మరొకటి సూక్ష్మ తరమై ఉన్నాయి.

శ్రుతిలో అత్మనుంచే ఆకాశము మొదలైన సృష్టి ఏర్పడుతోందని చెప్పడం వల్ల జగత్తు బ్రహ్మమున కన్న భిన్నం కాదని తెలుస్తుంది. పృధివి నుంచి మిగిలిన భూతముల వేపుకి విచక్షణ చేస్తే, పోను పోను ఒకో గుణం తగ్గుతూ చివరికి ఒకే గుణం కల్గిన ఆకాశం మిగులుతుంది. దానికి పైన నిర్గుణమైన ఆత్మ తెలియబడుతుంది. ఇలా సృష్టిని తెలుసుకోవడం వల్ల బ్రహ్మమును తెలుసుకో వీలై బంధం నుంచి విడువడి మోక్షానికి దారి తీస్తుంది. 

 

Wednesday, August 29, 2012

ప్రపంచము లేక జగత్తు ఏర్పడ్డ విధానం-5


3) సృష్టి క్రమమును తెల్పు మరో పద్ధతి

ఇది త్రిశిఖి బ్రాహ్మణంలో ఉందని అంటారు. దీని ప్రకారం అవ్యక్తంగా ఉన్న ప్రకృతి యందు, సత్వ రజస్తమో గుణములు సామ్యావస్థలో ఉంటాయి. బ్రహ్మమునకు సృష్టి చెయ్యాలనే సంకల్పం కలగగానే, ఈ గుణములు హెచ్చు తగ్గులై సామ్యావస్థను కోల్పోతాయి. ఇది ఆత్మ సాన్నిధ్యం వల్ల జరుగుతుంది. ముందుగా మహత్తు ఏర్పడి అది  అనేకములు కావలెనని తలచగా, అనేకములై నేను నేనను భావముతో అహంకారముగా అయ్యింది. ఆ తర్వాత పంచతన్మాత్రలు ఏర్పడ్డాయి. సాత్విక అహంకారము నుండి మనస్సు, దశేంద్రియములు కలిగాయి. తామస అహంకారము నుండి పంచ మహాభూతములు కలిగాయి. ఈ విధంగా పది ఇంద్రియములు, పంచ తన్మాత్రలు, పంచ మహాభూతములు, మనస్సు బుద్ది అహంకారముఅనేవి  ప్రకృతితో కలసి ఇరువది నాలుగు తత్వములు ఏర్పడ్డాయి. ఈ ఇరువది నాలుగు తత్వాలలో మణుల యందు, దారము గ్రుచ్చబడినట్లు; పురుషుడు ఆత్మగా కలసి ఉన్నాడని చెబుతారు.
  
సాంఖ్యుల ప్రకారము మూల ప్రకృతి నుండి ముందుగా మహత్తత్వము(బుద్ది), దానివల్ల అహంకారము కలుగగా; సత్వగుణాధిక్యత గల అహంకారము నుండి మనస్సు, జ్ఞానేంద్రియములు కలిగినవంటారు. రజోగుణ ప్రధానమైన ఆహం కారము నుండి కర్మేంద్రియములును, తమోగుణ ఆధిక్యము గల అహంకారము నుండి శబ్దాది పంచ తన్మాత్రలు, వాటి నుండి పంచ మహాభూతములు పుట్టినవి. ఇలా ఇంద్రియములు పది, తన్మాత్రలు పంచభూతములు కలసి పది, మూల ప్రకృతి, మహత్తు, అహంకారము, మనస్సు కలసి ఇరవైనాలుగు తత్వాలు ఏర్పడతాయని చెబుతారు.

{అహంకారం యొక్క సాత్విక భాగం నుండి మనస్సు, పంచ జ్ఞానేంద్రియాలు ఏర్పడతాయని కొందరు చెబుతారు. కొందరు కర్మేంద్రియాలు కూడ సాత్విక అహంకారం నుంచే ఏర్పడ్డాయని చెబుతారు. అంటే రాజసిక అహంకారం నుంచి ఏమీ ఏర్పడక సాత్విక తామసికాలను వాటి కార్యాచరణకు పురికొల్పుతుందని చెప్తారు}. ఇలా భిన్నాభిప్రాయాలు ఉండటం వల్ల మనకు తెలియ వలసిన దేమంటే; ఈ ఇరవైనాలుగు తత్వాలూ ప్రకృతి నుంచే ఏర్పడ్డాయి. వీటికి స్వతంత్రమైన ఉనికి లేదు. ఇవి నశించే స్వభావం కలిగి ఉండేవి. శాశ్వతాలు కావని. 
                                                                    ప్రపంచము లేక జగత్తు ఏర్పడ్డ విధానంసమాప్తం)     

  

Monday, August 27, 2012

ప్రపంచము లేక జగత్తు ఏర్పడ్డ విధానం-4


గుణరహితమైన  అత్మనుండి ఆకాశం కలిగిందని దాని నుండి వాయువు, అలాగే అగ్ని జలము, పృధివి ఇలా ఒకదాని నుంచి ఒకటి కలిగినట్లుగా వేదాంతం చెబుతోంది.  శ్రుతిలో అత్మనుంచే ఆకాశము మొదలైన సృష్టి ఏర్పడుతోందని చెప్పడం వల్ల జగత్తు, బ్రహ్మమున కన్న భిన్నం కాదని తెలుస్తుంది.

బ్రహ్మము నుండి ముందుగా ఆకాశ తన్మాత్ర కలిగినదనీ, దాని యందు మిగిలిన వన్నీ సూక్ష్మ రూపంలో ఉన్నట్లు చెప్ప బడింది. ఈ తన్మాత్ర నుండి ఆకాశము కల్గగా,  ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని,  అగ్ని నుండి జలము,  జలము నుండి పృధివి అనే సూక్ష్మ భూతములు కలిగినట్లు చెప్పబడింది.  ఆకాశము ఇతర భూతములు ఉండటానికి అవకాశమును కలుగ జేస్తుంది.  ఒక్కో సూక్ష్మ భూతమందూ సత్వ రజస్ తమో గుణాలు మూడూ ఉంటాయి. అంటే ఆకాశమునకు సత్వ, రజస్,తమో గుణాలుంటాయి. అలాగే వాయువుకూ, అగ్నికీ, జలమునకూ, పృధివికీ కూడ ఈ సత్వ, రజస్, తమో గుణాలు ఉన్నాయి.

ఇప్పుడు ఒక్కో భూతము యొక్క సత్వగుణాంశములూ రెండు అర్ధ భాగములు అవుతాయి. ఇక్కడి వరకూ వేదాంత పంచదశిలో చెప్పిన సృష్టికి, దీనికీ భేదం. ఇక్కడ నుంచీ రెండూ సమానమే. ఇదివరలో చెప్పిన దాన్లో తమో గుణ ప్రధానమైన ప్రకృతి నుండి అకాశాది పంచభూతములు కల్గినట్లు చెప్పుకున్నాం. దీన్లో గుణరహితమైన బ్రహ్మము నుండి ఆకాశము ఏర్పడిందని చెప్ప బడింది.

పంచీ కరణము

ఇక అపంచీకృత సూక్ష్మ భూతముల పరస్పర కలయికనే పంచీకరణమని చెప్పబడుతోంది. అంటే పంచ భూతాలను కలిపి ఒక భూతముగా చెయ్యడం అన్నమాట. ఇప్పుడు తమో గుణ ప్రధానమైన సూక్ష భూతమైన ఆకాశం రెండు అర్ధ భాగాలు అవుతుంది. అలాగే మిగిలినవీను. వీటిలో మొదటి అర్ధభాగాన్ని వేరుగా ఉంచి, రెండవ అర్ధ భాగాల నొక్కొక్క దాన్నీ నాల్గు భాగాలుగా చేస్తే ఒకోటీ పరక భాగ మవుతుంది. అంటే ఎనిమిదోవంతు.  వేరే ఉంచిన ఆకాశం అర్ధ భాగానికి, ఆకాశం రెండో అర్ధను వదలి మిగిలిన వాట్లో ఒక్కో ఎనిమిదవ వంతును దీన్లో కలిపితే అప్పుడు ఇలా ఏర్పడతాయి.

ఆకాశం 1/2   + వాయువు 1/8, అగ్ని1/8, జలము 1/8, పృధివి 1/8 అవుతాయి = స్థూలాకాశం.

వాయువు 1/2  + ఆకాశం 1/8, అగ్ని 1/8, జలము 1/8, పృధివి  1/8 = స్థూల వాయువు .

అగ్ని 1/2  +  ఆకాశం 1/8 , వాయువు 1/8 , జలము1/8  , పృధివి 1/8 = స్థూల అగ్ని .

జలము1/2  +  ఆకాశం 1/8 ,  వాయువు 1/8  , అగ్ని1/8 , పృధివి 1/8    = స్థూల జలము.

పృధివి 1/2 + ఆకాశం 1/8, వాయువు1/8 , అగ్ని 1/8, జలము 1/8  = స్థూల పృధివి.

అంటే రెండవ అర్ధ భాగంలోవి తీసుకొనే టపుడు మొదటి అర్ధభాగం ఏదుంటే, దానికి సంబంధించిన రెండవ అర్ధభాగాన్ని  వదిలేసి మిగిలిన నాలుగు పరకలనూ కలిపితే అది అర్ధ భాగమవుతుంది. అపుడది ముందు సగంతో కలిసి;  ముందు సగం ఏదో ఆ స్థూల భూతం రెండో సగం కలవడం వల్ల ఏర్పడుతుంది. ఇలా పంచీకరణం పంచ భూతాల యొక్క పరస్పర కలయికల వల్ల జరుగుతుందని వేదాంత శాస్త్రం చెబుతుంది. ఈ పంచ మహాభూతాలూ, ఇంద్రియాలు, అంతఃకరణము, ప్రాణము ఇవన్నీ పరస్పరమూ కలిసి స్థూల భూతములు ఏర్పడుతున్నాయి. ఇలా వివిధ శరీరాలను జీవరాసులను సృష్టించి నట్లుగా చెప్ప బడింది. ఈ స్థూల భూతాలచేత బ్రహ్మాండము, అందలి పదునాల్గు భువనములు, వాటికి తగిన భోగ్య విషయాలు, వాటిని అనుభవించ డానికి తగ్గ శరీరాలను పంచీకృత భూతములచే ఏర్పరచ బడ్డాయి.