కైవల్యం లేక కైవల్యముక్తి అనే పదాన్ని
కొందరు వాడుతారు. కేవలాత్మ స్వరూపమే కైవల్యమని కొందరు చెబుతారు. శరీరం నుంచి
విడుదల పొందిన పిదప లభించే విదేహముక్తినే కైవల్య ముక్తి అని అంటారు. ఇది
తురీయాతీతమైన స్థితి అని చెప్పబడుతోంది.
వివిధ దేవతారాధనలు చేస్తూ తన ఇష్టదేవతా సన్నిధిప్రాప్తిని పొందటం కూడ, పూర్తి మోక్షం కాదని విజ్ఞులు చెబుతారు. సగుణ బ్రహ్మోపాసనచే పొందబడే అత్యున్నత
స్థానం మొదటి జీవుడైన హిరణ్యగర్భుని లోకం - సత్యలోకం. ఐనా ఇది మోక్షం కాదనే
అంటారు. మోక్షమంటే ఎక్కడికో వెళ్లడం కాదు. సర్వ వ్యాపకమైన బ్రహ్మమును
సాక్షాత్కరించు కొన్న ధీరులు, ఆ బ్రహ్మలోనే
ప్రవేశిస్తారు. అనగా ఆ బ్రహ్మగానే ఉంటారఅని శృతి మనకు చెబుతోంది.
సాంఖ్య-యోగ - న్యాయ- వైశేషిక - మీమాంసా దర్శనాలైన ఆస్తిక దర్శనాలే గాక నాస్తిక
దర్శనాలు కూడ మోక్షమంటే మరేదో లోకానికి చేరి అక్కడ భగవత్సేవ మొదలైనవి చెయ్యడం
అనేదాన్ని అంగీకరించరు. జైనులు జీవుడు ఒంటరిగా నిరంతరం అలోకాకాశంలో హాయిగా
పైకి ఎగురుతూ ఉండటమే మోక్షం అంటారు. ఈ దార్శినికుల ప్రకారం ప్రతీ సాధకుడూ ఇక్కడే
మోక్షం పొందుతాడు.
మానవుడు మరణానంతరం తన కర్మలను అనుసరించి ఏవిధంగా వివిధ లోకాలకు చేరతాడో
ఉపనిషత్తులలో చెప్పబడింది. దేవయానమనీ , పితృయానమనీ రెండు మార్గాలు
చెప్పబడ్డాయి. ఉత్తమ సగుణోపాసనలు చేసిన వారిని దేవతలు దేవయానం ద్వారా బ్రహ్మలోకం
చేరుస్తారు. అక్కడ వీరు ఉపాసనలను కొనసాగిస్తూ, జ్ఞానం సంపాదించి చివరకు ఆ
లోకాధీశునితోపాటు ముక్తిని పొందుతారు. దీన్ని క్రమ ముక్తి అంటారు.
ఇక పుణ్యకర్మలు చేసే వారిని దేవతలు పితృయానం ద్వారా చంద్రలోకం చేరుస్తారు.
వీరు అక్కడ చాల కాలం ఉండి , మళ్ళీ భూలోకంలో
జన్మిస్తారు. వారు చేసినది పుణ్యకర్మ ఐతే మంచి జన్మ, పాప కర్మైతే పాపపు జన్మలు కలుగుతాయి. ఇక ఏ ఉపాసనలు గాని, కర్మలు గాని చెయ్యని వారు ఈ భూలోకంలోనే అనేకమైన యోనులలో జన్మిస్తూ, మరణిస్తూ ఉంటారు.
స్థూలశరీర పతనానంతరం వివిధ లోకాల
లోనికి, శరీరాలలోకి పయనించేది సూక్ష్మ శరీరమే. ఈసూక్ష్మశరీరంతో బాటు ఆత్మ కూడా
ఉంటుంది. అక్కడ ఆ శరీరంతో సంబంధపడుతుంది. ఆత్మసాక్షాత్కారాన్ని పొందినవారు
ఇక్కడే ముక్తిని పొందుతారు. శరీరం ఉన్నంత వరకు అది జీవన్ముక్తి. మరణం తర్వాత
ముక్తుని సూక్ష్మశరీరం ఎక్కడకూ వెళ్ళదు. వీరి సూక్ష్మ శరీరం ఇక్కడే విలీనమై
పోతుంది. అది విదేహ ముక్తి. అంటే బ్రహ్మ జ్ఞానం సంపాదించు కున్నవాడు విముక్తుడై
ఇక్కడే మోక్షం పొందుతాడు.
కొందరు సగుణోపాసకులు సత్యలోకం చేరి , అచట చాలాకాలం ఉండి , మహాప్రళయాంతంలో ఆ సత్యలోకమూ విలీనమై పోయేటపుడు , ఆసగుణబ్రహ్మతో కలసి మోక్షం
పొందుతారని చెబుతారు. ఇక్కడ బ్రహ్మలోకం చేరినవారి స్థితులు ఇలా చెప్ప బడ్డాయి .
సాలోక్యం – అంటే బ్రహ్మలోకంలో ఉండటాన్ని సాలోక్యం అంటారు.
సామీప్యం – బ్రహ్మలోకంలో ఉంటూ , ఆలోకంలో ఉండే
హిరణ్యగర్భుని సన్నిధానంలో ఆయనకు
కిన్కరులై ఉండటాన్ని సామీప్యం అంటారు.
సారూప్యం – బ్రహ్మలోకంలో ఉండటమే గాకుండా ఆయనతో సమాన రూపులై ఉండటాన్ని సారూప్యం అంటారు.
సాయుజ్యం – అంటే బ్రహ్మమనే భోగ్య వస్తువును కూడి అనుభవం చెందటం. అంటే బ్రహ్మము, ముక్తపురుషుడూ సమానమైన రసానుభవం కలిగి ఉండటం సాయుజ్యం అనబడుతోంది. అంటే బ్రహ్మ
రూపులై ఉంటూ బ్రహ్మదేవునికి ఉండే అపరిమితమైన శక్తి సంపదలు కలిగి ఉండటం సాయుజ్యం .
వీరికి లోకపాలత్వము, సృష్టి కార్యక్రమము
తప్ప మిగిలనవన్నీ ఉంటాయని అంటారు.
వీటిలో ఉత్తరోత్రా ఒకదాని కంటే మరొకటి ఉత్తమమని అంటారు.
మోక్షం గురించి వివిధ సాంప్ర దాయాలవారు ఇలా అంటారు. మోక్షమంటే కైవల్యం. ఆత్మ జ్ఞాతగా ఉండి,
ప్రకృతి విలాసాలతో ఎలాంటి జోక్యమూ లేకుండ కేవలం చూస్తూ ఉంటుందని
సాంఖ్య, యోగదర్శనాలు ప్రతిపాదిస్తున్నాయి. అంటే వీరిప్రకారం ముక్తి అనేది
వ్యావహారికమే గాని పారమార్ధికం కాదని అర్ధం. పురుషుడు (ఆత్మ) నిత్యముక్తమైనపుడు
ఆత్మకు బంధమే లేదు. మరి ముక్తికి అవకాశం ఎక్కడ ఉంటుంది అనేది వాదం.
పూర్వమీమాంసకులు
ముక్తినే అంగీకరించరు.
ప్రభాకర మతం
ప్రకారం ముక్తి కార్యఫలం. ధర్మాధర్మాలు కార్యాలు కాబట్టి, వాటిని విడిచిపెడితే
కర్మఫలాలకు తావుండదు. ఫలాలు లేకపోతే ఫలాన్ని అనుభవించడానికి జన్మ కలుగదనీ, అదే
ముక్తి అని ప్రభాకరుల మతం. వీరి ప్రకారం దుఖం నివృత్తి అవుతుందే కాని,
సుఖానుభవానికి తావు లేదు.
ముక్తి అనేది దుఖం
లేని స్థితి గాని, సుఖానుభవ రూపం కాదని కుమారిలభట్టు మతం.
బౌద్ధుల జీవిత
పరమావధి నిర్వాణం. అంటే శరీరంతో బాటు అన్నీసమూలంగా నశించడం అని వీరిభావం. అంచేత వీరు ఆత్మ
అనేదే లేదని అంటారు.
జైన మతం ప్రకారం
నిర్వాణం అంటే కర్మశరీరం నశించి, పంచభూతాలలో చేరడం అనేది వీరి భావం.
వేదాంత ప్రకారం,
వేదాంతి జ్ఞాని అయినా , భక్తుడైనా అతనికి ఆత్మస్వరూప అనుసంధానమే ముక్తి అవుతుందని
చెపుతుంది. ముక్తిని జీవితకాలంలో అంటే శరీరుడై ఉన్నపుడే అనుభవించాలి.
వైష్ణవ
సాంప్రదాయంలో జీవుడు పరమాకాశంలో పరమ పురుషుని చేరడమే ముక్తి అని చెబుతారు. జీవన్ముక్తిని
వీరు అంగీకరించరు.
No comments:
Post a Comment