Monday, August 27, 2012

ప్రపంచము లేక జగత్తు ఏర్పడ్డ విధానం-4


గుణరహితమైన  అత్మనుండి ఆకాశం కలిగిందని దాని నుండి వాయువు, అలాగే అగ్ని జలము, పృధివి ఇలా ఒకదాని నుంచి ఒకటి కలిగినట్లుగా వేదాంతం చెబుతోంది.  శ్రుతిలో అత్మనుంచే ఆకాశము మొదలైన సృష్టి ఏర్పడుతోందని చెప్పడం వల్ల జగత్తు, బ్రహ్మమున కన్న భిన్నం కాదని తెలుస్తుంది.

బ్రహ్మము నుండి ముందుగా ఆకాశ తన్మాత్ర కలిగినదనీ, దాని యందు మిగిలిన వన్నీ సూక్ష్మ రూపంలో ఉన్నట్లు చెప్ప బడింది. ఈ తన్మాత్ర నుండి ఆకాశము కల్గగా,  ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని,  అగ్ని నుండి జలము,  జలము నుండి పృధివి అనే సూక్ష్మ భూతములు కలిగినట్లు చెప్పబడింది.  ఆకాశము ఇతర భూతములు ఉండటానికి అవకాశమును కలుగ జేస్తుంది.  ఒక్కో సూక్ష్మ భూతమందూ సత్వ రజస్ తమో గుణాలు మూడూ ఉంటాయి. అంటే ఆకాశమునకు సత్వ, రజస్,తమో గుణాలుంటాయి. అలాగే వాయువుకూ, అగ్నికీ, జలమునకూ, పృధివికీ కూడ ఈ సత్వ, రజస్, తమో గుణాలు ఉన్నాయి.

ఇప్పుడు ఒక్కో భూతము యొక్క సత్వగుణాంశములూ రెండు అర్ధ భాగములు అవుతాయి. ఇక్కడి వరకూ వేదాంత పంచదశిలో చెప్పిన సృష్టికి, దీనికీ భేదం. ఇక్కడ నుంచీ రెండూ సమానమే. ఇదివరలో చెప్పిన దాన్లో తమో గుణ ప్రధానమైన ప్రకృతి నుండి అకాశాది పంచభూతములు కల్గినట్లు చెప్పుకున్నాం. దీన్లో గుణరహితమైన బ్రహ్మము నుండి ఆకాశము ఏర్పడిందని చెప్ప బడింది.

పంచీ కరణము

ఇక అపంచీకృత సూక్ష్మ భూతముల పరస్పర కలయికనే పంచీకరణమని చెప్పబడుతోంది. అంటే పంచ భూతాలను కలిపి ఒక భూతముగా చెయ్యడం అన్నమాట. ఇప్పుడు తమో గుణ ప్రధానమైన సూక్ష భూతమైన ఆకాశం రెండు అర్ధ భాగాలు అవుతుంది. అలాగే మిగిలినవీను. వీటిలో మొదటి అర్ధభాగాన్ని వేరుగా ఉంచి, రెండవ అర్ధ భాగాల నొక్కొక్క దాన్నీ నాల్గు భాగాలుగా చేస్తే ఒకోటీ పరక భాగ మవుతుంది. అంటే ఎనిమిదోవంతు.  వేరే ఉంచిన ఆకాశం అర్ధ భాగానికి, ఆకాశం రెండో అర్ధను వదలి మిగిలిన వాట్లో ఒక్కో ఎనిమిదవ వంతును దీన్లో కలిపితే అప్పుడు ఇలా ఏర్పడతాయి.

ఆకాశం 1/2   + వాయువు 1/8, అగ్ని1/8, జలము 1/8, పృధివి 1/8 అవుతాయి = స్థూలాకాశం.

వాయువు 1/2  + ఆకాశం 1/8, అగ్ని 1/8, జలము 1/8, పృధివి  1/8 = స్థూల వాయువు .

అగ్ని 1/2  +  ఆకాశం 1/8 , వాయువు 1/8 , జలము1/8  , పృధివి 1/8 = స్థూల అగ్ని .

జలము1/2  +  ఆకాశం 1/8 ,  వాయువు 1/8  , అగ్ని1/8 , పృధివి 1/8    = స్థూల జలము.

పృధివి 1/2 + ఆకాశం 1/8, వాయువు1/8 , అగ్ని 1/8, జలము 1/8  = స్థూల పృధివి.

అంటే రెండవ అర్ధ భాగంలోవి తీసుకొనే టపుడు మొదటి అర్ధభాగం ఏదుంటే, దానికి సంబంధించిన రెండవ అర్ధభాగాన్ని  వదిలేసి మిగిలిన నాలుగు పరకలనూ కలిపితే అది అర్ధ భాగమవుతుంది. అపుడది ముందు సగంతో కలిసి;  ముందు సగం ఏదో ఆ స్థూల భూతం రెండో సగం కలవడం వల్ల ఏర్పడుతుంది. ఇలా పంచీకరణం పంచ భూతాల యొక్క పరస్పర కలయికల వల్ల జరుగుతుందని వేదాంత శాస్త్రం చెబుతుంది. ఈ పంచ మహాభూతాలూ, ఇంద్రియాలు, అంతఃకరణము, ప్రాణము ఇవన్నీ పరస్పరమూ కలిసి స్థూల భూతములు ఏర్పడుతున్నాయి. ఇలా వివిధ శరీరాలను జీవరాసులను సృష్టించి నట్లుగా చెప్ప బడింది. ఈ స్థూల భూతాలచేత బ్రహ్మాండము, అందలి పదునాల్గు భువనములు, వాటికి తగిన భోగ్య విషయాలు, వాటిని అనుభవించ డానికి తగ్గ శరీరాలను పంచీకృత భూతములచే ఏర్పరచ బడ్డాయి.


No comments:

Post a Comment