Wednesday, August 15, 2012

అజ్ఞాన భూమికలు


నిత్యమైన బ్రహ్మమే తనైఉండి, తాను బ్రహ్మము కాదనుకోవడాన్ని అజ్ఞానమని శృతి చెబుతోంది. ఈ అజ్ఞానము ఏడు అవస్థలుగా చెప్పబడుతోంది. వీటిని అజ్ఞాన భూమికలు అంటారు.

(1) బీజజాగ్రదావస్థ 
గాఢ నిద్రనుంచి లేచిన వెంటనే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అందు ప్రతిబిబించే చైతన్యం కూడ పరిశుద్ధంగాను నిర్మలంగాను ఉంటుంది. అట్టి స్థితిలో జీవుడనిగాని, మరేదైనా నామంతో గాని చెప్పడానికి వీలుండని కాలం / స్థితి అది. ఆ నిర్మలమైన చైతన్యము నుండే చిత్తము, జీవుడు మొదలైన శబ్దములకు, అర్ధాది విషయాలకు ఆశ్రయం  అవుతుంది. ఇలా శబ్దార్ధ విషయాలకు అంకురార్పణ జరిగి జాగ్రదావస్థకు మూలం అవుతుంది. ఇదే జ్ఞప్తిరూపుడైన జీవునికి ప్రధమావస్థ. అంచేత దీన్ని జాగ్రత్తుకు బీజం అవ్వటంచేత బీజ జాగ్రత్తు అంటారు. ఇదే జ్ఞప్తికి, భావానికి అహంకారమునకు  క్రొత్త అవస్థ. 
 
(2) జాగ్రదావస్థ
బీజజాగ్రదావస్థ నుంచి మొట్టమొదట సూక్ష్మంగా ఉదయించిన  నేను, నాది, యితడు, అతడు, అది, ఇది అనే అజ్ఞానంతో కూడిన అహంకారము కలిగిన స్థితి జాగ్రత్తు అనబడుతోంది. 

(3) మహాజాగ్రదావస్థ
ఈ స్థితిలో పూర్వజన్మ కర్మలవల్ల కలిగిన మెలకువతో, కార్యములయందు ప్రవేశించడానికి ఆసక్తి కలిగి ఉంటుంది. జాగ్రత్తు అని చెప్పే జన్మాంతర సంబంధమగు నేను, నాది, అతడు, యితడు, అది, ఇది అనే వృత్తి స్ఫుటముగా కన్పించే స్థూల జ్ఞానమే మహా జాగ్రత్తు అని చెప్పబడుతోంది.

(4) జాగ్రత్స్వప్నావస్థ
రూఢి గలవి, రూఢి లేనివి (ఖచ్చితంగా ఇది అవును లేదా కాదు అనేది ) అనేవి జాగ్రదవస్థకు సంబంధించిన విషయాలు . జగద్వికార మైనవి, సర్వప్రకార మైనవి, మనస్సుతో కల్పింపబడినవి, ఇలాటి వాటితో కూడిన సృష్టి జాగ్రత్స్వప్నమనబడుతోంది. జాగ్రదవస్థలో తాను చూసిన వస్తువును గాని, చూడని వస్తువును గాని మనస్సున తలంచి, తన్మయత్వం కలిగి ఉండటాన్ని జాగ్రత్స్వప్నము అంటారు. దీన్లో భ్రాంతివల్ల దృశ్యము అనేక విధాలుగా ఉంటుంది.  
ముత్యపుచిప్ప వెండిగను, ఎండమావులను జలముగను కనిపించే భ్రాంతి దీన్లోకే చేరుతుంది.

(5) స్వప్నావస్థ
నిద్రలో కలగని లేచినవాడు, తాను కలలో చూసినదంతా నిజమా, కాదా అని కొద్ది సేపు సందేహం చెందుతాడు. దాన్నే స్వప్నం అని అంటాం. ఈ స్వప్నజ్ఞానం ఎంతోసేపు ఉండకపోవడం వల్ల, చిత్తము నిలకడగా ఉండదు. ఆత్మ యందు కలిగే ఈ దృశ్య సంకల్పమే స్వప్నము. జాగ్రత్తు నందు విషయముల కల్పిత స్వరూపాన్ని చూడడమే స్వప్నమని కొందరు అంటారు. మరికొందరు మన అనుభవాలే, సుషుప్తి యందలి స్వప్నమని అంటారు. 
    
(6) స్వప్నజాగ్రదావస్థ
మరచిన దాన్ని తలచుకోవడం అని కొందరంటారు. మరికొందరు కలలో పెద్దపులి వాత పడినట్లు కలగని, లేచిన పిదప కూడ భయ భ్రాంతులై శరీర కంపనము మొదలైనవి కలిగి ఉండటాన్నిస్వప్నజాగ్రదావస్థ అంటారు. మరొక చోట ఇలా ఉంది.  చాలాకాలము వేదాంత విజ్ఞానము విని, ఆత్మ సాక్షాత్కారము కానందున, పెద్దల బోధలు అర్థము కానివిగా ఉంటాయి. అందువలన ప్రయత్నము చేసి, బహుకాలము మహాత్ములను అనుసరించడాన్ని  స్వప్నజాగ్రత్తు అంటారు. అంతేగాక, జాగ్రదావస్థలో కూడ స్ఫురించే  స్వప్నావస్థను, స్వప్నజాగ్రత్తని చెప్తారు.

(7) సుషుప్త్యావస్థ
ఆత్మ ప్రతిబింబమైన ప్రపంచంలోని విషయ సుఖాలలో మునగటమని, గాఢనిద్ర అనీ అంటారు. దీన్లో అజ్ఞానం తప్ప వేరే ఎమీఉండదు. పై ఆరు అవస్థల పరిత్యాగ రూపమైన జీవుని జడస్థితి. భవిష్యత్తులో దుఃఖానుభవముతో నున్న స్థితిని సుషుప్త్యవస్థ అంటారు. తమో రూపములో నున్న ఈ సుషుప్త్యవస్థలో సర్వజగత్తు లీనమై ఉంటుంది.
ఈ ఏడు అవస్థలు ఒకదానితో మరొకటి కలసి అనేక రూపములుగా పరిణామం చెందుతుందని చెబుతారు.



1 comment:

  1. Quite informative,sir ! Thank u so much.... మీ కృషి మాకు మార్గదర్శకం అయ్యింది, కృతజ్ఞులం !!

    ReplyDelete