బ్రహ్మ విద్య
గ్రహించడానికి అందరికీ అధికారం (యోగ్యత ) ఉన్నట్లుగా స్వామీ వివేకానంద చెప్పేరు. కులభేదము
కాని ,లింగభేదం భేదం కాని లేకుండ
స్త్రీలు పురుషులూ అందరూ అర్హులే. యోగ వాసిష్టంలో చూడాల తన భర్తకు
బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి నట్లు ఉంది. బ్రహ్మవిద్యను పొంది మోక్షానికి అర్హత
సంపాదించు కోడానికి అన్నివర్ణాలవారికీ అర్హత ఉన్నట్లుగా స్మృతి చెబుతోంది. ధర్మమనేది
దేశ, కాలముల ననుసరించి మారుతూ ఉంటుంది. కాని మోక్షధర్మం మారదు.
మారేది సాంఘిక ధర్మమే.
జీవన గమనంలో ఏవో
కోరికలతో, వాటిని తీర్చు కోడానికి అందరినీ అర్ధిస్తూండే వాడికి దేవుడనే వాడొకడున్నాడని,
అతడిని ఆశ్రయించాలని
చెప్పాలి. ఈ ప్రపంచం వెనుక ఉండే పరమార్ధతత్వం అయిన ఆ పరమాత్మ, నువ్వు కూడ ఒక్కటే. అదే నువ్వు అనిచేబితే ఏమీ
అర్ధం కాదు. ఈ విషయాన్ని అర్ధమయ్యేలా చెప్పడానికి కొన్ని పద్ధతులు, దృష్టాంతాలు, ఉపాయాలు చూపాలి. అన్ని సిద్ధాంతాలు లేక ఉపాయాలూ అద్వైత బోధ కోసమే.
జగత్తు, జీవుడు , పరమాత్మల స్వరూప స్వభావాలను , వీటి పరస్పర సంబంధాన్ని చెప్పడానికి అన్ని ఆస్తిక దర్శనాలూ ప్రయత్నం చేశాయి. ఉపనిషత్తులలో
విషయాలను నియమ బద్ధమైన జీవితాన్ని గడుపుతూ మనసును పరిశుద్ధం చేసుకొని సాధన చతుష్టయ
సంపత్తితో ప్రయత్నిస్తే స్వానుభవంలోకి వస్తాయి. అన్ని స్థితి గతులలో ఉండే వారికీ
సరిపడేలా అనేక కర్మలు, ఉపాసనలూ
చెప్పబడ్డాయి. అన్నీ ఒక వ్యక్తి చెయ్యగలిగేవి కావు. వారి అభిరుచిని బట్టి ,యోగ్యతను బట్టి ఆచరించాలి. ఉపనిషత్తులలో పారమార్ధిక
తత్వం అద్వైతమే, మిగిలిన ద్వైత ప్రక్రియ అంతా దాన్ని తెలుసుకోవడానికి
మార్గంగా అందరికీ అర్ధమయ్యే రీతిలో చెప్పిన ప్రక్రియగా తీసుకోవాలి.
మానవజన్మ సార్ధకం
చేసుకోడానికి మనం పరమాత్మను సాక్షాత్కారించు కోవాలని చెబుతారు. మనమంతా ఎప్పుడో
ఒకపుడు ఆ పరమగమ్యాన్ని చేరక తప్పదు. మానవులలో ఉండే గుణభేదాలవల్ల కొందరు ఉత్తమ
అధికారులు కేవలం మోక్షాన్నే కోరే ముముక్షువులు ఉంటారు. ముముక్షువు అంటే
మోక్షమునందు ఆసక్తి గలవాడు.
కొందరు మందబుద్ధులు
ఇహలోక విషయాలయందే ఆసక్తి కలిగి ఉంటారు. వీరికీ అప్పుడప్పుడు మోక్షం మీద ఆపేక్ష
కలుగుతూ ఉంటుంది. వీరు ఈ జన్మలో పుణ్యకర్మలు చేస్తూండగా వారి సంచిత పాపకర్మలు
నశించగా క్రమంగా కొన్ని జన్మల తర్వాత ముక్తిని పొందుతారు.
ఉత్తమ అధికారులకూ, మందబుద్దులకూ మధ్య
ఉండే, మధ్యమాధికారులు
గురు శుశ్రూష, గ్రంధపఠనము
చేస్తూంటారు. వీరికి ఈశ్వరానుగ్రహం వల్ల ఈ
జన్మలో గాని , మరో జన్మలో గాని
ముక్తి కలుగుతుందని విజ్ఞులు చెబుతారు. ఐహిక విషయాల మీద ఆసక్తి ఉంటే ఈ జన్మలో
ముక్తి కలుగక పోవచ్చు.
No comments:
Post a Comment