Sunday, August 5, 2012

జ్ఞానమార్గం-(4)


ఎవరికోసం లోకమంతా వెదికి, వివిధ దేవాలయాల్లో విలపించి ప్రార్ధి౦చామో, ఎవరు మేఘాల చాటున దాగి ఉన్నాడనుకున్నామో; అతడు అన్ని వస్తువులకన్న అత్యంత దగ్గరలో ఉన్నాడు. అది మన ఆత్మయే.
 'తత్వమసి' (అది నీవే)అన్నది, అన్నిఉపనిషత్తుల చివరిమాట. మనం ఆత్మ సహజలక్షణమైన ప్రజ్ఞానాన్ని మళ్లీ ప్రకటించుకోవటమే. అజ్ఞానం తొలగిపోయినపుడు తాను వెదికే దైవం తన ఆత్మయేనని తెలుసుకుంటాడు. అదే 'అహం బ్రహ్మస్మి' అనే ఉపనిషద్వాక్యం. మనం చెయ్య  వలసిన  దల్లా  శాస్త్రవచనం, గురూపదేశాల ద్వారా విన్న విషయాలను బుద్దికుశలతతో మనన౦ చెయ్యాలి. మనస్సు చేతనే మనస్సును జయించిఇంద్రియాలను  వశపరచుకొని, అహంకార మమకారములు, కర్తృత్వ భావమూ లేకుండా, సుఖదుఖాలందు సమభావ౦తో ఉండాలి.  జరిగే పనులను  కేవల౦ సాక్షిగాచూస్తూ, అత్మయందే స్థిరమైన బుద్దికల్గిఆత్మయే తానని తెలిసి ఆనందానుభూతిని పొందటం. 

మనస్సు సూక్ష్మ పదార్ధమైన ఆకాశ పదార్ధం. బ్రహ్మము జ్ఞానాతీతమైనది. దేన్ని తెలుసుకోవాలనుకున్నా బ్రహ్మమందే, బ్రహ్మం మూలంగానే తెలుసుకోవాలి. అన్ని వస్తువుల్లోనూ ఈశ్వరుడుండగా అతనికై, మనం మరో చోటికి వెళ్లడం ఎందుకు? మహత్తర నదీతీరంలో కూర్చొని దప్పికతో చస్తున్నాం. ఆనందమయ జగత్తు ఇక్కడే ఉంది. కాని అది అజ్ఞానం వల్ల మనకు కన్పించడం లేదు. అహోరాత్రాలూ మనం దాన్లోనే నివసిస్తున్నా అది మనకు ఆనందమయంగా తోచడం లేదు.

జ్ఞానయోగి వైరాగ్యం సమస్త అనుభవానికీ నిలయం ఆత్మయే కాని ప్రకృతి కాదని ముందునుంచీ గ్రహించాలి. మనలో ఉండే అంతఃకరణాన్నిమంచీచెడుల విచక్షణా జ్ఞానాన్ని గ్రహించేటపుడు బుద్ది అంటారు. బుద్ది నిశ్చయించిన దాని పూర్వాపరాలను చింతన చేసి, క్రియారూపంలో పెట్టేటపుడు చిత్తము అంటారు. ఇలాంటి అంతఃకరణ శక్తి, బుద్ది రూప వ్యవహారాలనే  కేవలం చేస్తూండటాన్ని జ్ఞానమార్గం అంటారు. అంటే విషయం ఇదీ అని తెలిసికోడం. ఈ మార్గంలో విచారణ ప్రధానం. విషయం ఇదీ అని తెలుసుకొని , దాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించి అనుభవంలోకి తెచ్చుకోవాలి. 

జీవన్మరణాలు శరీరానికే. నీవు పుట్ట లేదు. మరణించవు. ఒకే ఆత్మ ఉఉంది, ఒకే సత్త. మనలో ఉండే ఎన్నో మూఢనమ్మకాలని వదలిపెట్ట వలసి వస్తుంది. ఐనా దీక్షతో సత్యాన్వేషణ చేసేవారు ఈ లోకంలో కొందరే ఉంటారు. జగత్తును ఇంద్రియాల ద్వారా జీవాత్మల సమూహంగా, పారమార్ధిక జ్ఞానంద్వారా బ్రహ్మంగా తెలుసుకుంటున్నాం. జగత్తులో బ్రహ్మం అనబడే ఒకే సద్వస్తువు ఉందనేది అద్వైత సిద్ధాంతం. మిగిలినదంతా అసత్తు. మాయ మహిమతో అంతా బ్రహ్మం నుంచే కల్పితం అవుతోంది. బ్రహ్మంతో ఐక్యం చెందటమే మన పరమగమ్యం. అజ్ఞాన రూపమైన మాయను తొలగించు కోవడమే మన స్వస్వరూపాన్ని తిరిగి పొందటం. 
  
సుఖం ఆత్మలోనే ఉంది. దేశ,కాల, నిమిత్తాలకు లోబడేదంతా మాయ. సుఖ దుఃఖాలు కలిసే ఉంటాయి. ఇది మంచిది, కేవలం ఇది మంచిది అనిగాని, ఇది చెడ్డది , కేవలం ఇది చెడ్డదని చెప్పగలిగే వస్తువేదీ లేదు. ఈరోజు మంచిదిగా తోచేది రేపు చెడుగా తోచవచ్చు. మంచీ చెడులు ప్రత్యేక వస్తువులు కాదు. రెండూ ఒక వస్తువే. ఆ వస్తువు మనకు కనిపించడంలో ఉండే ఎక్కువ తక్కువలకే ఆపేర్లు. ఒకరికి దుఃఖ కారణమైన వస్తువు మరొకరికి సుఖమైనది కావచ్చును. మార్పు అనేది ప్రకృతి సంబంధమైన వాటికే. నిత్యమైన ఆత్మకు ఏ వికారాలూ ఉండవు. ఆత్మ అనంతం. అఖండం. అదే నీ యదార్ధ మైన రూపం. చేసే మంచి పనులవల్ల ఆత్మకూ మనకూ మధ్య గల ప్రకృతి అనే పొర పలుచబడి, నిత్య శుద్ధమైన బ్రహ్మము క్రమాధికంగా సాక్షాత్కరిస్తుంది. అఖండమైన బ్రహ్మము దేశ, కాల పరిస్థితుల ద్వారా జగత్తుగా మారింది. కాలం మనోవృత్తులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి దానికి ఉనికి లేదు. అసలు దేశ, కాల నిమిత్తాలనే వాటికి వస్తు సంబంధం లేని ఉనికే లేదు. 

ప్రతీ కార్యానికీ ఒక కారణం ఉంటుంది. అంటే ఆ కార్యానికి ముందు, దానికి కార్యభూతమైన మరొక కార్యం జరిగి ఉండాలి. ఈ పూర్వపరత్వ సంబంధాన్నే నిమిత్త న్యాయం అంటారు. ప్రపంచంలో ఉండే వస్తువులన్నీ ఒకదాంతో మరొకటి సంబంధాన్ని కలిగే ఉంటాయి. కాని అఖండమైన బ్రహ్మంలో మాత్రం కారణం ఉండదు. ఎందుకంటే అదే సర్వ స్వతంత్ర మైనది గనుక. అనంత వస్తువైన ఆత్మలో మార్పు ఉండదు. మన యదార్ధ తత్వమైన పరిపూర్ణత్వాన్నిచేరుకోవడానికే మన ప్రయత్నమంతా.



No comments:

Post a Comment