Thursday, August 9, 2012

మోక్షతత్వవిచారం -1


అపర విద్య, పర విద్య అని విద్య రెండు విధాలుగా ఉంది. పరమాత్మ ప్రాప్తిని కలిగించేది పర విద్య. పర విద్య కానిదంతా అపర విద్యగా పరిగణించ బడుతుంది. జీవితంపై మమకారం ఉన్నంత వరకూ శాస్త్ర విహిత కర్మలను చెయ్యాలి. కొన్ని కర్మలు ప్రేయస్సును కూర్చేవి, మరికొన్ని కర్మలు శ్రేయస్సును కూర్చేవిగాను ఉన్నాయి. ప్రేయమంటే ప్రపంచ జ్ఞానం. శ్రేయమంటే మోక్ష జ్ఞానం.

ఈలోకంలో యోగక్షేమాలనీ , పరలోకంలో స్వర్గ సుఖాలను కోరి చేసే కర్మలు ప్రేయోమార్గానికి దారితీస్తాయి. అవిద్య వల్ల వీరికి ఈలోకం సత్యమనే భావన ఉంటుంది. మంత్రోపాసన , భక్తి ఉపాసనలచే ప్రకృతి విశేషాలైన అధిష్టాన దేవతారాధనలు ఫలసక్తితో చేస్తూంటారు. ఉత్కృష్టమైన మానవ జన్మను సార్ధకం చేసుకోలేరు. జ్ఞానులైన వారుబ్రహ్మ సత్యం, జగన్మిధ్యఅని తెలిసికొని మోక్షంపైనే దృష్టిని కలిగి ఉంటారు. క్రమంగా దేహాత్మ బుద్ధిని వదలి, పరమాత్మను గూర్చి నిశ్చయమైన అభిప్రాయం గల్గి , గురువులచే సూచించబడిన /బోధించ బడిన మార్గంలో సాధన చేస్తూ క్రమ ముక్తి మార్గంలో పయనిస్తూ మోక్షం పొంద సమర్దులవుతారు. నిత్యమైన మోక్షం బ్రహ్మ జ్ఞానం వల్లనే కలుగుతుంది. జీవులందరూ ఎప్పుడో ఒకపుడు మోక్షం పొందవలసిందే.

బ్రహ్మమును తెలుసుకోవాలనే కోరిక ఎవరికి కలుగుతుందో , అతడే బ్రహ్మ విద్యకు అధికారి. ఈ జిజ్ఞాస అందరికీ కలుగదు. పూర్వకర్మ పరిపాకం వల్ల గాని, ఈశ్వరానుగ్రహం వల్ల గాని కలుగుతుందని పెద్దలు చెబుతారు.  ముముక్షువుకు కామ , క్రోధ, లోభములు ఉండ కూడదు. వీటితో బాటు కుల, విద్యా, ధన గర్వములు ఉండరాదు. కుల, విద్యా, ధన గర్వములలో ఏ ఒక్కటి ఉన్నా బ్రహ్మ సాక్షాత్కారం పొందే అవకాశం ఉండదు. విశిష్టాద్వైతంలో ఈ మూడు గర్వములను విడిచి పెట్టని వానికి తత్వోపదేశం చెయ్యరు.

శ్రీ శంకర భగవత్పాదుల తర్వాత అద్వైతాన్ని బోధించిన వారిలో శ్రీ విద్యారణ్యులు ముఖ్యులుగా చెప్పవచ్చును. వీరు బ్రహ్మజ్ఞానులలో విదేహముక్తులనీ , జీవన్ముక్తులనే భేదం చెప్పారు. (తత్వజ్ఞానమంటే బ్రహ్మజ్ఞానం. నామరూపాలనే నానాత్వమునందు ఏకరూపమై ఉన్న పరమాత్మను దర్శించడం. అపుడు తాను శరీరం కాదని, శరీరమునకన్న విలక్షణమైన ఆత్మనని దృఢ నిశ్చయం కలుగుతుంది). వీరి ప్రకారం తత్వ జ్ఞానం కలిగినంతనే ముక్తుడవుతాడు, కాని వాసనాక్షయ మనోనాశనాలు పూర్తిగా కలుగవు. అంచేత తత్వజ్ఞాని వాసనాక్షయ మనోనాశనాలను సాధించి జీవన్ముక్తిని పొందాలి. తత్వజ్ఞాని జీవన్ముక్తుని కన్న తక్కువ అని మనం అనుకోవచ్చు. తత్వజ్ఞానం వల్ల ఆగామి సంచిత కర్మలు దగ్ధమవడంచేత, పునర్జన్మకు హేతువైన అవిద్య నశించి భవిషత్తులో దేహాన్ని పొందడు. దేహం లేనివాడవడం వల్ల తత్వజ్ఞాని విదేహ ముక్తుడు. పునర్జన్మ లేపోయినా ఇతడికి సుఖదుఖాలు ఉంటాయి.

కాని శంకరులు అనేది జీవన్ముక్తుడైన వానికి ప్రారబ్దకర్మ నశించగానే, సూక్ష్మశరీరం నశించడం వల్ల అప్పుడే వర్తమాన శరీరం నశిస్తున్నందున, ఈ జీవన్ముక్త స్థితినే విదేహముక్తి అంటారు. అంతే కాని జీవించి ఉండగానే విదేహముక్తి కలుగుతుందని చెప్పలేదు.

జీవన్ముక్తుడు దేహపతనానతరం ముక్తి పొందుతాడని శంకరులూ, తత్వజ్ఞానికి భవిష్యత్తులో దేహముండదు కాబట్టి విదేహముక్తుడని విద్యారణ్యులు అంటారు.  తత్వజ్ఞానం కలిగేకా రాగద్వేషాలు ఉండవని విద్యారణ్యులు, ఒకవేళ అవి ఉంటే పునర్జన్మ హేతువులని శంకరాదులు అంటారు. 
 
జీవన్ముక్తుడు, తత్వజ్ఞానీ కూడ ప్రారబ్ద భోగానంతరం పండిన ఆకు చెట్టునుంచి రాలి పడినట్లుగా దేహపతనానంతరం బ్రహ్మ స్వరూపులే. అంటే బ్రహ్మగానే అవుతున్నారు. అంచేత వీరు ముక్తపురుషులే.
జీవన్ముక్తుని దేహం ఎలా ఉంటుందంటే, పాము తన కుబుసాన్ని పుట్టలో విడిచాకా, దానిపై ఎలా అభిమానం ఉంచుకోదో, అలా జ్ఞాని అభిమానం విడువబడిన దేహాన్ని కలిగి ఉంటాడు.

జీవన్ముక్తుడు అంటే జీవించి ఉండగానే ముక్తిని పొందిన వాడని. అలాంటి వానికి తనకంటే వేరుగా ఏదీ లేదని, సర్వత్రా తనే నిండి ఉన్నట్టి నిశ్చయ జ్ఞానం కలిగి ఉంటాడు. అంటే అహం బ్రహ్మస్మినేను బ్రహ్మమునే అగుచున్నాను అనే నిశ్చయ జ్ఞానం కలిగి ఉంటాడు.                   


2 comments:

  1. మీ ప్రయత్నము అభినందనీయము. చక్కగా అర్థవంతముగా వివరిస్తున్నారు. ఇప్పటి వరకు అధ్యాత్మిక విషయాలను ఇంగ్లిష్ లోనే చదివాను. ఇప్పుడు తెలుగులో తెలుసుకునే భాగ్యం కలిగింది. కృతజ్ఞతలు.

    మీరు ఓషో పుస్తకాలు/వీడియోలు వీలైతే చూడగలరు. దాదాపు అన్ని మూలాలపై, చాలా మంది ఆధ్యాత్మిక చరిత్ర కారులపై అద్భుతంగా వ్యాఖ్యానించారు ఓషో. మీకు సహాయంగా ఏ విధంగా నైనా ఉపయోగపడగలను అనుకుంటే నాకు తెలుప గలరు.

    ReplyDelete
  2. శ్రీ విశ్వమిత్ర గార్కి,
    మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు. కొన్ని ఓషో గారి పుస్తకాలు చదివే భాగ్యం కలిగింది.
    మీరు అందిస్తామన్న సహాయ సహకారాలకు ధన్య వాదములు.
    అవుసరమైనపుడు మిమ్మలను సంప్రదించ గలను. నా మెయిల్ అడ్రసు scgolla@gmail.com కు ఒక సారి సంప్రదించ గలరు.
    సూర్య చంద్ర గోళ్ల

    ReplyDelete