Friday, August 3, 2012

జ్ఞానమార్గం-(3)


ఈ ప్రపంచంలో గల వస్తు సముదాయమంతా బ్రహ్మంచేతనే వ్యాపించబడి ఉ౦ది. అభాస అంటే లేనిది ఉన్నట్లుగా కన్పించటం. మీరు , నేను , మనకు కన్పించే వస్తు సమూహమూ కేవలం భ్రాంతి రూపాలు. అఖండమై ఆనంద స్వరూపమై వెలిగే ఒకేవస్తువు తప్ప , వేరే ఏదీ లేదు. అదే ఏకైక సత్పదార్ధమైన ఆత్మ. ప్రకృతి , జగత్తు , భగవంతుడు  విడిగా లేరు.  ఉన్న ఏకైక సత్పదార్ధ౦ ను౦చే నామరూపాల మూలంగా ఇవన్నీ కల్పించబడు తున్నాయి. ఈ భ్రాంతినే మాయఅంటారు. ఇక్కడ స్వామి వివేకానంద మాయను గురించి  చెప్పే ఉదాహరాణతో మరింత బోధపడుతుంది.  సముద్రంపై ఒక కెరటం  ఉంది. అది సముద్రానికన్న భిన్నంగాలేదు కదా. కాని దానిలో కెరటమనే భిన్నత ఉంది . ఈ బేధానికి కారణం నామ రూపాలే . అంటే మనసున గల భావమూ , ఆకారమూ.  కాని తరంగ రూపాన్ని సముద్రం నుంచి వేరుచేసి భావించలేం. కెరటం / తరంగం అణిగిన క్షణం లోనే రూపం నశిస్తుంది. కాని ఆ రూపం భ్రాంతి కాదు. తరంగమున్నంత కాలమూ రూపం ఉంది. కావున దాన్ని చూడక తప్పలేదు. ఇదే మాయ. ఈ విధంగా ప్రపంచమంతా దేశ , కాల , నిమిత్తాలతో కల్పించబడిన ఒక విశేష రూపమనవచ్చు. వీటన్నిటికీ ఆ తరంగమే ఆధారం.  తరంగం అణగగానే అవి అదృశ్య మవుతాయి. ఈ మాయను ఏ మానవుడు దాటుతాడో , వానికది అదృశ్యం అవుతుంది. అపుడు  ముక్తుడవుతాడు.

భగవంతుడు జ్ఞానాతీతుడు. ఏది తెలుసుకోవాలన్నా, ఏది తెలుసుకున్నా, బ్రహ్మం మూలంగానే  బ్రహ్మంనందే  తెలుసుకోవాలి. నీ ఆత్మకు మూలమతడే. అతడేసత్యం. అదే ఆత్మ. నీవే అది. ఉన్నదల్లా ఒకేవస్తువు. రెండవదేదీ లేదు.  ప్రపంచమే దైవం అనేది వేదాంత బోధ . అన్నిటా దైవాన్ని చూడాలి. ఇదే ప్రపంచాన్ని విడనాడటమంటే. జీవన్మరణములు , సుఖ దుఖ్ఖములు వంటి   ప్రతి విషయంలోనూ  దైవం సమానంగా నిలిచి ఉంటాడు. కష్టాలకు మూలం కోరికలే. వాటిని త్యజించండి. త్యజించడం అంటే సత్యం తెలిసికొని ఏ ఒక వస్తువూ మీ స్వంతం అని కాని , దాన్లో మీకూ కొంత భాగం ఉందని కాని, భావించ వద్దు. మీరు ఊహించుకునే రూపంలో జగత్తు ఎప్పుడూ లేదని గ్రహించండి. జగత్తు ఒక స్వప్నదృశ్యం. నిజంగా ఉన్నది దైవమే. సర్వమూ దైవమే ఐనపుడు నేనెవరు , మీరెవరు ? ఇలాంటి భావనతో నిస్స్వార్ధంగా కర్మలు చేయమని వేదాంతం చెబుతోంది .

ఈ విశ్వమంతా బ్రహ్మం వ్యాపించి ఉంది. అభాస అంటే లేనిది ఉన్నట్లుగా కన్పించడం. మీరు, నేను , మనకు కన్పించే అన్ని వస్తువులూ కేవలం భ్రాంతి రూపాలు. అఖండము, ఆనంద స్వరూపమై వెలిగే సత్పదార్ధం తప్ప వేరే ఏమీ లేదు. నామరూపాలనే భేదాలను తొలగిస్తే , విశ్వమంతా ఏకరూపమై ప్రకాశిస్తుంది. ప్రకృతి, జగత్తు , భగవంతుడు విడిగా లేరు. ఉన్న ఏకైక సత్పదార్ధం నుంచే నామ రూపాల మూలంగా ఇవన్నీ కల్పించ బడు తున్నాయి. తాను వెదికే దేవుడు తన అత్మేనని చివరికి తెలుసుకుంటాడు. శాశ్వతానందాన్ని పొందుతాడు.  ఇదంతా ద్వైతంతో ప్రారంభమై, విశిష్టాద్వైతం ద్వారా పరిపూర్ణ అద్వైతంలో ముగుస్తుంది . బ్రహ్మంతో ఐక్య భావాన్ని పొందటమే మన పరమ గమ్యం.

ఈయోగం ఇంద్రియ నిగ్రహ సంబంధ మైనది. ఇంద్రియాలు ఆత్మకు పూర్తిగా  లొంగి మనసుకు వశమైనపుడు యోగం సిద్దించినట్లే.  ఇంద్రియాలు తమవశమై  కోరికలు నశించినపుడు, అమృతత్వాన్ని పొందుతాడు. జనన మరణాలు శరీరానికే. అసలు నీవు పుట్ట లేదు. మరణించవు కూడ. భోగాసక్తి, అహంకార మమకారాలూ ఉన్నంత వరకు పునరావృత్తి పొందుతుంటాం. నిత్యమూత్రిగుణాతీతము, అనాది ఐన సత్పదార్ధాన్ని 
సాక్షాత్కరించుకున్నవాడు జనన మరణాల నుంచి విమోచన పొందుతాడు.  నేను, నాదీ అనే భావనే అన్ని అనర్ధాలకూ మూలం. నేను నాది అనే భావం తొలగినపుడు సర్వం భగవంతునికే అర్పించబడిహృదయం పవిత్రమై భక్తి పుడుతుంది. ఇలా జీవాత్మ పరిశుద్ధి చెందిన తక్షణం, అది భగవంతుని వైపు ఆకర్షించ బడి ఆ సాన్నిధ్యంలో నిలిచి ఉంటుంది.


2 comments:

  1. ఈ రకమైన చర్చలూ వ్యాసాలూ మనం ఇంకా ఎన్నో వ్రాసుకుంటే తప్ప సన్నగిల్లుతున్న మన ఆచార వ్యవహారాలూ , సంప్రదాయాలూ మళ్ళీ వెలుగులోకి రావు .
    పాశ్చాత్య సంస్కృతికి బానిసలమవుతున్న తెలుగు యువతరానికి మీలాంటి వాళ్ళు ఇలాంటి బ్లాగులు మరెన్నో స్తాపించాలి.

    నా హృదయ పూర్వకాభినందనలు

    ReplyDelete
  2. శ్రీ శ్రీధర్ గారికి,
    మీ అభిమానానికి కృతజ్ఞతలు.మీలాంటి వారి ఆదరాభిమానాలు మరింత స్పూర్తినిస్తాయని ఆశిస్తూ.
    సూర్యచంద్ర గోళ్ల

    ReplyDelete