Friday, August 17, 2012

జ్ఞాన భూమికలు


ముక్తిని సంపాదించు కోవడానికి ఏడు సాధనాలు ఉన్నాయని వాటిని జ్ఞానభూమికలుగా యోగ వాసిష్టం చెబుతోంది. 

(1)శుభేచ్చ బ్రహ్మను గూర్చిన జ్ఞానాన్ని తెలుసుకోవాలనే కోరిక వైరాగ్యంతో కూడినదైతే,దాన్నిశుభేచ్ఛ  అంటారు. గతించిన జన్మలలో గాని, ఈజన్మలో గాని చేసుకున్న కర్మల పరిపాకంవల్ల చిత్తశుద్ది కలిగి,  
బ్రహ్మమును తెలుసుకోవాలనే ఇచ్చ కలుగుతుంది. అనాత్మ పదార్ధాలను పరిత్యజించటమే దీనికి మార్గం.

(2) విచారణ వైరాగ్యాభ్యాసం చేత కలిగే సదాచార ప్రవృత్తిని విచారణ అంటారు. అద్వైతాన్ని గురించి తెలిపే శాస్త్రాలను విచారించడం, బ్రహ్మవిదుల శుశ్రూష, సంసారమునందు విరక్తవల్ల సంసారంలో ఉండే దోషాలను లెక్కించడం, సత్పురుషుల నడతయందు ఆసక్తితో ఉండటం అనేవి దీన్లోకి వస్తాయి. అంటే  బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం  అనేవి సాధనాలని తెలుసుకోవడం.

(3) తనుమానస పైన చెప్పబడిన రెండు సాధనలనూ(శుభేచ్చ, విచారణ) అభ్యాసం చేస్తూంటే ; ఇంద్రియ విషయాల పట్ల రాగము నశించి, మనస్సు సూక్ష్మరూపాన్ని పొందే స్థితిని తనుమానస అంటారు. అంటే  ద్వైత భావాన్ని క్రమంగా తగ్గించుకుంటూ మనస్సులో వృత్తి జ్ఞానం లేకుండా చేసుకోవడం. ఇది శృతి యందు చెప్పిన శ్రవణ, మననములతో  కూడిన నిదిధ్యాసన. సాధనా మార్గం తెలుసుకున్నాక, సాధనలో విఘ్నం లేకుండా నిమగ్నులై ఉండడమే తనుమానసం.  ఈ మూడవస్థలూ దాటిన వాడు అద్వైత సిద్ధుడనబడతాడు.

(4) సత్వాపత్తి పై మూడవస్థలను నిరంతరము అభ్యాసం చెయ్యడం వల్ల ఉత్తమవైరాగ్యమేర్పడి, రాగము నశించి చిత్తము శుద్ధసత్త్వమై; తన ఆత్మయందే నిలకడ చెంది ఉండటాన్ని సత్వాపత్తి అంటారు. దీన్లో విషయవాసనలు ఉండక నిర్వికల్ప సమాధిచేత మనస్సు ఆత్మస్వరూపమందే నిలకడ చెంది ఉంటుంది. అద్వైత భావం ఎక్కువగా ప్రకాశిస్తుంది. ఇట్టి వాణ్ణి బ్రహ్మవేత్త/ బ్రహ్మవిదుడు అంటారు.  ఈ స్థితిలో ఇతడు బాహ్యవృత్తులను వదలి , బ్రహ్మైక్య చిత్తుడై  తన ప్రారబ్ద కర్మానుసారంగా లోకకల్యాణం కోసం పాటు పడతాడు. ఇది అపరోక్ష జ్ఞాన రూపం. 

(5) అసంసక్తి పై నాలుగు భూమికలను నిరంతరం అభ్యాసం చెయ్యడం వల్ల విషయవాసనలు నశించిన వాడై, పదార్దములు, వాటియందు వాంఛ పూర్తిగా నశిస్తుంది. దేనియందూ సంసక్తత ఉండక; శరీరము, సంసారమూ తాత్కాలికం అని తెలిసి, అసంగుడై అనాసక్తితో ఉండటాన్ని అసంసక్తి అంటారు. మనస్సున బ్రహ్మ సాక్షాత్కారం గల్గి, అవిద్యా కార్యాల సంసర్గము /సంపర్కము లేనివాడై ఉంటాడు.  సంకల్పాలు, మనోవృత్తులు ఉండవు. ద్వైతభావం అసలు  వాసనామాత్రంగా కూడ ఉండదు. ఇతడిని బ్రహ్మవిద్వరుడనిఅంటారు. దేహముందనే భావంగాని, దాని పట్ల ఆసక్తి గాని ఉండవు.

(6) పదార్ధ భావన దేహభావన ఉండదు. త్రిపుటి జ్ఞానం సైతం ఉండదు. బ్రహ్మభావమే ఉండి, సమాధి స్థితుడై ఉంటాడు. బాహ్యాభ్యంతరాలలో పదార్ధ భావన శూన్యమవుతుంది. ఆత్మ స్థితుడై ఆ అనుభవాన్ని పొందుతూంటాడు. దీన్ని అసంప్రజ్ఞాత సమాధి అంటారు. ప్రయత్నపూర్వకంగా ఈ నిర్వికల్ప సమాధి నుంచి బయటకు రాగలిగే స్థితిని పదార్ధ భావని అంటారు. ఇతడిని బ్రహ్మ విద్వర్యేణుడు/ బ్రహ్మవిద్వరీయుడు అని అంటారు.

(7) తురీయం/ తుర్యగ పైన చెప్పబడిన అన్ని భూమికలను అభ్యాసం చెయ్యడం వల్ల; ప్రపంచ భేదభావం నశించి ఆత్మనిష్ఠతో సస్వరూప స్థితిలో ఉండే అవస్థను తురీయం అంటారు. ఈ స్థితిలో ఉండే యోగి ఇతరుల ప్రయత్నం చేత కాని, తనకు తానుగా గాని మరల ప్రపంచ జ్ఞానం కలుగదు.  ఈ స్థితిలో ఉన్న జీవన్ముక్తుడు బ్రహ్మమే అవుతాడు. పరమ శాంత స్థితిలో ఉంటాడు. ఇది బ్రహ్మానంద స్థితి. ఇతడిని బ్రహ్మ విద్వరిష్టుడు అని అంటారు. ఈ స్థితి జాగృత, స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థలను దాటిన స్థితి. ఇట్టి మహానుభావుడు సుఖదుఃఖాలకు అతీతుడై ఉంటాడు.  వేదాంతం అద్వైత సమాధిని బోధిస్తుంది. ఇట్టి సమాధిలో ఉండేవారికి స్వధర్మం జరుగుతూనే ఉంటుంది. అట్టి వ్యక్తినే ముక్తుడని అంటారు.



1 comment:

  1. చాలా మంచి విషయాలు తెలియ జేశారు. మీకు కృతజ్ఞతలు.

    ReplyDelete