Monday, August 13, 2012

జ్ఞానము – ప్రమాణాలు

దేహేంద్రియాలను నిగ్రహించడం వల్ల, గురూపదేశము, వేదాంత శ్రవణ మనన నిది ధ్యాసనల చేత ; చూడబడే అన్ని పదార్ధాలలో ఉండేది ఒకే చైతన్యమని తెలుసుకునే వివేకాన్ని  జ్ఞానమని చెబుతారు. దేవతలు, పశు పక్ష్యాదులు, మానవులు , స్త్రీపురుషులు , వివిధ వర్ణాశ్రమ ధర్మాలన్నీ కల్పితమైనవి.  అంచేత ఇవన్నీభేదబుద్ధిని కలిగించేవిగా ఉండటం వల్ల అజ్ఞానంగా చెప్పబడింది. ఈ జ్ఞానం కలిగించే వాటిని సాధనాలని / ప్రమాణాలని  అంటారు. అవి ప్రత్యక్షం ,అనుమానం , శబ్దం లేక శృతి ప్రమాణం.
 
ప్రత్యక్ష ప్రమాణమంటే - కంటికి ఎదురుగా ఉండే వస్తువును ఎలా మనం ప్రత్యక్షంగా తెలుసుకుంటామో అట్టి ఇంద్రియ జ్ఞానాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా భావిస్తారు.

అనుమాన ప్రణామమంటే - రెండు పదార్ధాలకు  నియత సంబంధముండి వాట్లో ఒకటి మనకు ప్రత్యక్షంగా కన్పిస్తూ రెండవది కనబడక పోయినా వాటికి గల సంబంధం వల్ల రెండవది అది ఉందని ఊహించుకుంటాము. ఉదాహరణకు దూరంగా ఎక్కడో ఒక కొండపై పొగ  రావడం కన్పిస్తే , ఆ పొగను బట్టి అక్కడ అగ్ని ఉన్నట్లుగా అనుమానిస్తాం . దీన్ని అనుమాన ప్రమాణం అంటారు. 

శృతిప్రమాణం పై రెండు ప్రమాణాల వల్ల తెలియని విషయాలు యదార్ధ వాక్య శ్రవణం వల్ల తెలియబడతాయి. దీనికి ఉదాహరణగా ఎక్కడో ఒక మిత్రుడు మరణించగా, ఆవిషయం ఒక యదార్ధ ఆప్తునివలన విని ఆమిత్రుడు మరణించి నట్లు మనకు నిశ్చయ జ్ఞానం కల్గుతుంది. మానవుని జ్ఞానం పరిపూర్ణం కాదు కాబట్టి , శృతి పైననే ఆధారపడ వలసి ఉంటుంది. ప్రత్యక్షంగా పరమాత్మ ఇదీ అని చెప్పలేరు. ఎంచేతనంటే బ్రహ్మము అవాన్జ్మానస గోచరం గనుక. అంటే వాక్కుకుచేత గాని, మనస్సుచేత గాని తెలియబడేది కాదు కాబట్టి. కాని అనుభవంచేత కూడా తెలియబడుతుందని చెబుతారు. అంచేత బ్రహ్మమును తెలుసుకోడానికి శృతి ప్రమాణమే ఎక్కువగా ఆధారం. 

భగవంతుడిని గూర్చిన  మన ఇప్పటి జ్ఞానం, వేదాలనుండే సంక్రమించింది. వేదాలలో ఉండే విషయాలు గాన రూపంలో  క్రింది తరాలకు వాగ్రూపంలో అందజేసేరు. ద్వాపర యుగంలో వేద వ్యాసుడనే మహర్షి (కృష్ణ ద్వైపాయనుడు) ఈ వేద వాంగ్మయాన్ని నాలుగు భాగములుగా విభజించి రచించేరు. వేదాలను"శృతి"అని అంటారు. "శృతి" అంటే వినేవి . ఇవిగాక రామాయణ మహాభారతములనే ఇతిహాసములు, పురాణములు, ధర్మ శాస్త్రములు, ఆగమములు, దర్శనములనే  పవిత్ర గ్రంధాలను" స్మృతి"అని అంటారు." స్మృతి" అంటే గుర్తుంచుకొనేవి అని చెబుతారు. ఉపమానము, అర్ధాపత్తి , అనుపలబ్ది అనే ప్రమాణాలు  పూర్వమీమాంసా  దర్శనంలో చెప్పబడ్డాయి. మరికొన్ని ప్రమాణాలు చెప్పబడినా పైన చెప్పబడిన మూడిట్లోనే అంతర్గతమై ఉండటం వల్ల ప్రత్యక్షం ,అనుమానం , శబ్ద లేక శృతి ప్రమాణాలనే  పేర్కోవడం జరిగింది. అంచేత బ్రహ్మమును తెలుసుకోవడానికి శృతి ప్రమాణంగా స్వీకరించ బడింది.

ప్రమాణాలచేత తెలుసుకోబడేవి ప్రమేయాలు . అవి ముఖ్యంగా  జీవాత్మ , పరమాత్మ, దృశ్యరూపాత్మకమైన  జగత్తు.


 

No comments:

Post a Comment