దేహము పంచభూత
సంబంధమైనది. ఇంద్రియాలతో సంబంధపడి లోకవ్యవహారాన్ని సాగిస్తుంటుంది. మనస్సే అన్ని
కర్మలకూ మూలం. మనస్సు , ప్రాణముల ఏకరూపమే జీవుడు. అంచేత అన్ని కర్మలకూ
దేహమే కారణమని చెప్పబడుతోంది. తనకు ఇష్టమని అనుకోవడం సుఖబుద్ది. అయిష్టం
అనుకోవడం దుఃఖబుద్ది. జ్ఞానేంద్రియాలు
గ్రహించే శబ్ద స్పర్శ రస రూప గంధాలనే ఇంద్రియ వ్యవహారమంతా సుఖదుఃఖాలకు కారణం. దేహం
మరణించే స్వభావం కలది. ఆత్మకు ఉపాధి(ఆశ్రయం). ఈ ఆత్మ దేహంతో కలసి ఉన్నపుడు ,
అహంకార రూపమైన ఇష్టా ,
అయిష్టాల సంబంధంతో
వ్యవహరిస్తూంటుంది. వాస్తవానికి ఆత్మకు రాగ ద్వేషాదులు ఉండవు. ఐనా దేహాత్మ బుద్ది
వల్ల రాగద్వేషాలు కలుగుతున్నాయి. దేహాత్మ బుద్ది నశిస్తే రాగద్వేషాలు ఉండవు.
దేహాత్మ బుద్ది అంటే - దేహమే ఆత్మ అనుకొనే భావన.
మానవుడు తన
ఇచ్చానుసారంగా కర్మలు చేస్తూ, ఆకర్మలఫలాలను పొందుతూ
ఉంటాడు. మనస్సుకు దేనిమీద ఆసక్తి ఉంటుందో, అదే కర్మకు బీజమవుతుంది. సంసారంలో చిక్కుకొన్న
జీవుడు; ఇష్టప్రకారం చేసిన కర్మ ఫలాలను ఈలోకంలోనే అనుభవించి, మరణ సమయంలో కర్మరూప వాసనలనే బీజములతో కూడినవాడై తిరిగి ఈలోకంలో కర్మ చెయ్యడానికి జన్మిస్తున్నాడు. ఇలా జీవుడు కర్మవశుడై
తనకు తానుగా సంసారంలో పడుతూంటాడు. కాని జ్ఞానం కలిగినవాడు నిషిద్ధమైన కర్మలజోలికి పోకుండా, కర్మఫలాలందు
ఆసక్తిలేకుండా నిష్కామకర్మలను చెయ్యడంచేత ఈలోకంలోనే పరమాత్మను పొందుచున్నాడు.
కాబట్టి బ్రహ్మమును తెలుసుకునే
ఆత్మజ్ఞానం(బ్రహ్మ విద్య) మోక్ష ప్రాప్తికి సాధనంగా ప్రతిపాదించ బడడింది. సృష్టికర్తకు కూడ కారణమైన ఆ పరబ్రహ్మను
దర్శించినవాడు పుణ్యపాపముల నుండి విముక్తుడై బ్రహ్మానందమును పొంది సర్వోత్తమమైన
పదవిని పొందుచున్నాడు. అలా గాక కొంత సందేహము, కొంత అనుభవము ఉండి మనస్సును జయించని
వారికి సమాధానము దొరకక, కర్మ మరియు జన్మలనుండి విముక్తి లభించదు. అట్టి వారు మతము,ధర్మము,
ఆచారముల పేరుతో సగుణ సాకారరూపమైన ప్రకృతి
విషయాలందు సత్యత్వ భ్రమ కలిగి ఉంటారు. అందువల్ల సత్యం తెలియక ఆత్మానాత్మ వివేకము
ఉండదు.
వాస్తవానికి
అజ్ఞానమే దుఖ్ఖానికి కారణం. ఇంద్రియములవల్ల కాని, ఇంద్రియలోలత్వం
వల్ల కాని సుఖించిన వాడెవడూ లేడు. ఈప్రపంచంలో వస్తువులన్నీ పరమాణువుల కలయిక వల్ల
ఏర్పడి, కొంత కాలం తర్వాత మార్పుచెందేవే. అదేవిధంగా మన
భోగములూ, సంపద, జ్ఞానం, అహంకారం అన్నీ మరణించేవే. అనిత్యమైన
వస్తువుల విషయాలలోనే మార్పు ఉండగలదు. అదేవిధంగా మనశరీరమూ, మనస్సూ కూడా నిత్యములు కావు . కాబట్టి మార్పు చెందుతూంటాయి. ఉదాహరణకు మనం ఒకక్షణంలో సంతోషంగా ఉంటె, మరొక
క్షణంలో ఉద్వేగానికి లోనై మనస్సు వికారాలకు లోనౌతుంది. మనశరీరం కూడ వయస్సు
పెరిగేకొద్దీ మార్పులు చెందుతూనే
ఉంటుంది. మన చుట్టూఉండే ప్రపంచమూ మార్పు చెందేదే. అసలు దేశ , కాల , మాన , పరిస్థితులన్నీ
మనస్సు నుండే కల్పించబడుతాయి. అదే విధంగా
భగవంతుడినీ మనమే ఊహించి ఇలా ఉంటాడని సృష్టించు కుంటున్నాం. అంటే మనసు లేకపోతే ఈవ్యక్త ప్రపంచమూ లేనట్లే
గదా.
No comments:
Post a Comment