దీని ప్రవర్తకుడు శ్రీ
రామానుజాచార్యులవారు. వీరు
బ్రహ్మసూత్రాలకు భాష్యం శ్రీభాష్యం అనే పేరుతో రచించారు. మరికొన్ని
విషయాలను పొందుపరుస్తూ వేదాంత దీపం,వేదాంత సారం అనే మరో రెండు రచనలు చేయడం
జరిగింది. వీరిది వైష్ణవసాంప్రదాయంలో శ్రీవైష్ణవం అని చెబుతారు.
వీరు బ్రహ్మము లేక ఈశ్వరుడు అంటే నారాయణుడు లేక విష్ణువు అని
చెబుతారు. ఈశ్వరుడు సర్వోత్కృష్ట మైన వాడు. అత్యున్నతమైన
గుణములన్నీఉన్నవాడు సర్వస్వతంత్రుడు అంటారు. ఆయనకు సాటి వేరెవ్వరూ లేరు. ఆయనే సర్వేశ్వరుడని అన్నిటినీ నియంత్రిస్తాడనీ చెబుతారు. ఈ నారాయణుడే బ్రహ్మను,శివుడినీ సృష్టించి వారి కార్యాలలో
నియంత్రిస్తాడని చెబుతారు. ఈశ్వరుడు ఒక్కడే. వీరు నిర్గుణ బ్రహ్మమును
అంగీకరించరు.
వీరు ఈశ్వరుడు(నారాయణుడు), జీవుడు, జగత్తు అనే మూడు
తత్వాలను అంగీకరిస్తారు. ఈ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఈమూడూ సత్యమే అంటారు. ఈశ్వరునిలో చిత్ , అచిత్
అని రెండు భిన్నమైన తత్వాలు ఉన్నాయి. చిత్ అనేది జీవాత్మ .ఇది శాశ్వతము
చైతన్యవంతమైనది. అచిత్ అనేది జడమైన ప్రకృతి/ జగత్తు. జీవుడు, జగత్తు పరమాత్మలో
ఉండే అంశాలే. వీటికి పరమాత్మ వలె స్వతంత్రమైన ఉనికి లేదు.
జీవాత్మయొక్క స్వభావం పరమాత్మ వలె సచ్చిదానంద స్వరూపమైనది.
కాని జీవాత్మ పరమాత్మపై ఆధారపడి ఉంటుంది.
ప్రపంచం/జగత్తు ఎపుడూ ఒక స్థితి నుంచి మరో
స్థితికి నామరూపాత్మకంగా మారుతూ ఉంటుంది.
కాని దాని ఉనికి ఉంటూనే ఉండటం వల్ల అది నిత్యమైనదిగానే పరిగణించ బడుతుంది. ఆత్మ అణుపరిమాణం
కలది. అనేక అత్మలుంటాయి. ఆత్మకు జ్ఞానం
ఉంటుంది. అంతర్యామి ప్రేరేపించినట్లుగా గాని, తన అభీష్టం మేరకు గాని కర్మలు చేసి
వాటి ఫలితాలను కూడ అనుభవిస్తుంది. కొన్ని ఆత్మలు బద్దమై ఉంటాయి. కొన్ని ముక్తిపొందిన
అత్మలుంటాయి. బద్ధమైన ఆత్మలు భక్తిమార్గంలో ఉండి పరమాత్మ అనుగ్రహంతో ముక్తిని
పొందుతాయి. సర్వేశ్వరుడైన నారాయణునికి, ఆత్మకు, జగత్తుకు భేదం ఉంది. జగత్తు ,
జీవులూ ఈశ్వరుని శరీరమైతే
; ఈశ్వరుడు విశ్వానికే ఆత్మ. జీవులు చేసే కర్మలను
బట్టి , వర్ణాశ్రమ ధర్మాలను బట్టి , భక్తి ప్రపత్తుల వల్ల ముక్తి/ మోక్షం కలుగుతుందని
అంటారు. మోక్షం లభించాక కూడ ఆత్మలు విడిగానే ఉంటూ విష్ణు సేవచేస్తూనో, విష్ణువును ధ్యానిస్తూనో ఉంటాయని చెబుతారు.
ఉపనిషత్తులలో జీవాత్మ
పరమాత్మలకు భేదం తెలియజేసే కొన్ని శ్రుతులున్నాయి. వాటిని భేదశ్రుతులంటారు. కొన్ని
శ్రుతులు భేదం లేవని చెప్పేవి ఉన్నాయి . వాటిని అభేదశ్రుతులంటారు. మరికొన్ని
శ్రుతులలో పరమాత్మకూ, జీవత్మకూ జగత్తుకూ గల సంబంధాన్నిశరీరము , ఆత్మకు గల
సంబంధంగా చెప్పబడటం వల్ల వాటిని ఘటకశ్రుతులని అంటారు. ఈ ఘటకశ్రుతుల ఆధారంగా
శరీరము (జగత్పదార్ధం ), ఆత్మకు గల సంబంధాన్ని బట్టి ఈశ్వరుడే శరీరంలో ఉన్న ఆత్మయొక్క ఆత్మగా (అంతర్యామి) వీరు చెబుతారు. అంతర్యామి అంటే లోపల ఉండి అన్నిటినీ నియంత్రించే వాడని.
మనం ఇలా
చెప్పుకోవచ్చు. రామ అని చెప్పినపుడు రాముని శరీరం , రాముని ఆత్మ అని అర్ధం. పైన చెప్పినట్లు ఇంకా కొద్దిగా విపులీకరిస్తే
రాముని ఆత్మయొక్క ఆత్మను ఈశ్వరుడు(అంతర్యామి) అని చెప్పాలి. జీవుని ఆత్మకు శరీరం ఎలాగో,అలా జీవాత్మను
ఈశ్వరుని శరీరం అని చెప్పాలి. మరోవిధంగా ఈశ్వరుడే జీవాత్మయొక్క ఆత్మ. తేలిందేమంటే
రామ అని అన్నపుడు
1) రాముని శరీరం.
2) రాముని ఆత్మ.
3) రాముని ఆత్మ
యొక్క ఆత్మ (బ్రహ్మము).
ఇప్పడు
తెలిసేదేమంటే బ్రహ్మమే జీవాత్మ యొక్క ఆత్మ. అదే నేను అని మార్పులూ కూర్పులూ
చేసుకొనేది.
విశిష్టాద్వైతం
అంటే ప్రత్యేకంగా రెండు కాదు. ప్రత్యేకంగా ఒక్కటే.
జీవాత్మ
పరమాత్మలు ఎలా వేరైనవంటే – జీవాత్మ శరీరమైతే దీని ఆత్మ పరమాత్మ.
ఆత్మ శరీరం కన్న
భిన్నమైనది. అంచేత జీవాత్మ పరమాత్మ కన్న భిన్నమైనది.
అవి రెండు కాదు,
ఒక్కటే . ఎలా అంటే – శరీరానికీ ఆత్మకూ ఉండే సంబంధం వల్ల .
రాముడు ఒక్కడే
అయినా రాముని శరీరం, రాముని ఆత్మ అని చెప్పుకున్నట్లుగా ; జీవాత్మ శరీరమైతే
పరమాత్మ దానికి ఆత్మగా చెప్పినపుడు ప్రత్యేకంగా ఒక్కటే.
జీవాత్మ
పరమాత్మలు రెండూ వేరు. ఇలా రెండు అని చెప్పేది
ద్వైతం. జీవాత్మ పరమాత్మలు వేరుగా రెండు కాదు, ఒక్కటే అని చెప్పేది
అద్వైతం.
జీవాత్మ ఎప్పటికీ
అన్నివిధాలా పరమాత్మతో సమానం కాలేదు - ఇది ద్వైతం.
కాని జీవాత్మకు
పరమాత్మ ఆత్మగా ఉండటం వల్లను, పరమాత్మకు జీవాత్మశరీరం కావడం వల్లనూ ఆత్మకూ – శరీరానికీ
ఉండే సంబంధం వల్ల ఈ రెండూ ఒక్కటే- ఇది అద్వైతం.
ఇక్కడ ద్వైతానికీ , అద్వైతానికీ మధ్యలో ఉంటూ రెండూ భిన్నమైన వైన ఆత్మకూ శరీరానికీ ఉండే
ప్రత్యేకమైన సంబంధం వల్ల; జీవాత్మ పరమాత్మలు ఒక్కటే అని చెప్పడం వల్ల ఈ విధంగా - విశిష్టాద్వైతం అని
పిలువబడుతోంది. ఒక ఉదాహరణను
తీసుకుందాం.
సముద్రం అంటే దాన్లో తరంగాలు ఉంటాయి.
సముద్రంలో ఉండే
తరంగాలు ఎప్పుడూ సముద్రానికన్న వేరైనవే అని చెప్పేది – ద్వైతం.
తరంగాలు ,
సముద్రం అంతా దాన్లో ఉండే నీరే. తరంగం , సముద్రం అనేవి మనస్సులో
ప్రతిఫలిస్తున్నాయి. వాస్తవానికి అక్కడ ఉన్నది నీరు మాత్రమే అని చెప్పేది –
అద్వైతం.
తరంగాలు
సముద్రానికన్న భిన్నమైనవైనా అవి సముద్రానికన్న వేరు కాదు. ఇదే భిన్నత్వంలో
ఏకత్వం. ఇదే విశిష్టాద్వైతం
thank you
ReplyDelete