సృష్టిలో జీవరాశులు స్థావరములు , జంగమములు అని, రెండు వర్గములున్నాయి. జీవం ఉండి చలనం లేని, స్థిరంగా ఉండేవాటిని స్థావరములని అంటారు. ఉదాహరణకు మొక్కలు , వృక్షాలు మొదలైనవి. ఇవి ఏకేంద్రియ జీవులు. వీటిలో స్పర్శ మాత్రమే ఉంటుంది. చలనం ఉండే జీవరాశులను జంగమములని అంటారు. ఉదాహరణకు క్రిమికీటకాదులు , సర్పములు, పక్షులు, మానవులు మొదలగునవి.ఈ జంగమాల్లో వాటివాటి స్థితినిబట్టి, రెండునుంచి అయిదు జ్ఞానేంద్రియాలవరకూ ఇంద్రియ జ్ఞానాన్నికల్గి ఉంటాయి.వీటిలో స్పర్శ , రుచి తెలిసే రెండు జ్ఞానేంద్రియాలు ఉండేవి - ఉదాహరణకు నత్తలు, క్రిమి కీటకాదులు.స్పర్శ , రుచి , వాసన అనే మూడు జ్ఞానేంద్రియాలు ఉండేవి - జెర్రులు , పేలు మొదలైనవి.స్పర్శ , రుచి , వాసన , దృష్టి అనే నాలుగు జ్ఞానేంద్రియాలు ఉండేవి- ఉదాహరణకు తేళ్ళు , ఈగలు , సాలెపురుగు మొదలైనవి.స్పర్శ , రుచి , వాసన , దృష్టి , శబ్ద గ్రహణం అనే అయుదు జ్ఞానేంద్రియాలు ఉండేవి- ఉదాహరణకు పశుపక్ష్యాదులు, మానవులు , దేవతలు మొదలైన వారు.సృష్టిలో ఎనుబదినాలుగు లక్షల జీవరాసులు ఉన్నట్లు చెబుతారు. ఇలా ఏకేంద్రియముల కన్న, క్రమంగా పంచేంద్రియాలున్న జీవులు అధికమైనవని తెలుస్తుంది. పంచేంద్రియ జీవులలో కూడా; పశుపక్ష్యాదులకు సుఖదుఃఖానుభూతి తప్ప, విచక్షణచేసే బుద్ది లేదు. మనస్సు చెవి,ముక్కు, కన్ను, చర్మం, నాలుక అనే పంచేంద్రియాల ద్వారా గ్రహించిన విషయ జ్ఞానాన్ని బుద్దిముందు ఉంచుతుంది. అలా మనస్సుతెచ్చిన విషయాలలో మంచిచెడులను నిర్ణయించేది బుధ్ధి. ఈబుధ్ధి వల్లనే మానవుడు మిగిలిన జీవరాసులకన్న ఉన్నతమైన వాడు అనవచ్చు. క్రిమికీటకాదులు మొదలు, అన్ని జంతువులలోనూ మనోవ్యాపారం ఉంటుంది. కాని వాటి మనస్సు, బుద్దిరూపాన్ని పొందలేదు. మానవుడిలోనే బుద్దిరూపాన్ని పొందింది. అంచేత సాధనద్వారా, నివృత్తిమార్గాన్ని అవలంబించి, సంసారబంధంలోనుండి విడివడే అవకాశం మానవునికి మాత్రమే ఉంది. మిగిలిన జీవరాశులకు సత్వరమే ముక్తి పొందడానికి సాధ్యం కాదు.ఇక దేవతలు , గంధర్వులు మొదలైన వారు కూడా మనలాగే పంచేంద్రియాలతో బాటు, బుధ్ధి కూడా పరిణతి చెంది ఉంటుంది. వారు గతజన్మలలో చేసుకున్న అధికమైన పుణ్యకార్యాలవల్ల ; వాటి ఫలితాలను అనుభవించడానికి ఆయా దేవతాస్థానాలు కలిగాయి. వారు సుఖానుభవాలలోనే తేలుతుంటారు. తమ పుణ్యఫలం అనుభవించడం పూర్తికాగానే, తిరిగి క్రిందిజన్మలను ఎత్తవలసి ఉంటుంది. అందుచేత దేవతలూ, గంధర్వాదులు కూడా వారి శరీరాలతో మోక్షం పొందలేరనేది స్పష్టం.అందుచేతనే మానవజన్మ లభించడం కడుదుర్లభం అని పెద్దలు చెబుతారు. ప్రతి జీవికీ వాటి క్రమాభివృద్ధిలో ఈ జగత్తులో ఉంటూ మోక్షాన్ని అభిలషించే ప్రయత్నం చెయ్యవచ్చు. కాని మానవశరీరం ప్రాప్తిస్తేనే మోక్షం పొందటం జరుగుతుంది. అందుచేతనే మానవ జన్మ ఉత్తమమైనదిగా చెప్పబడినది. మనుష్యస్థితి ఉత్తమమైనదని చెప్పడంచేత ఇదే ఉన్నత స్థితిఅనుకోవద్దు. నిరాశ, నిస్పృహ లనే ఊబినుంచి బయటపడి, సంసారమనే సముద్రం నుంచి తరించాలి. మేధావులంతా సర్వజ్ఞమైన సహజస్థితిని పొందడానికి మానవజన్మ మనకో సాధనం అని బోధించారు. ఇలాంటి ఉత్కృష్టమైన మానవజన్మ పొందటానికి కారణం, గత జన్మల్లో చేసుకున్న పుణ్యకర్మల ఫలితమే. అందువల్లనే నీచజన్మలు పొందలేదు. బుద్ధిని ఉపయోగించుకొని, ఈ జన్మనెలా సార్ధకం చేసుకోవాలో తెలుసుకోవాలి.తానెక్కడనుండి వచ్చాడో, ఎక్కడకు పోవాలో, ఆ గమ్యాన్నిచేరే మార్గమేమిటో చక్కగా తెలుసుకోవాలి. అమరత్వం, సత్యాన్వేషణ , ఆనందం అనేవి, మానవగమ్యాలని విజ్ఞులు చెబుతారు. ఉపనిషత్తులలోనూ ఇలాగే చెప్పబడింది. బ్రహ్మాన్ని తెలుసుకో కోరేవాడు ఈ విశ్వానికి మూలకారణం ఏమిటి? అది బ్రహ్మమా లేక మరొకటా? మనం ఎక్కడినుంచి వచ్చాం? మనం మరణం తర్వాత ఏమవుతాం? ఎవరి నియమానుసారం మనం ఈసుఖదుఃఖాలకు లోబడి ఉంటున్నాం? అని చర్చ చేసుకుంటారు అని చెప్పబడింది.
good
ReplyDeletegood
ReplyDeleteచాలా మంచి విషయాలు తెలిశాయి
ReplyDelete