Sunday, June 3, 2012

చార్వాక దర్శనం- నాస్తిక దర్శనం

చార్వాక దర్శనం (Charvaka Philosophy)

ముందుగా మనం నాస్తిక దర్శనాలను గురించి తెలుసుకుందాం. 
లోకాయతికులు / చార్వాకులు  వేదప్రమాణాన్ని గాని దైవాన్ని గాని అంగీకరించరు. అంచేత నాస్తికులు అని  అంటారు. ధర్మాధర్మాలను , పాప పుణ్యాలను, స్వర్గ నరకాలను , ఆత్మనూ అంగీకరించరు.  వీరు కేవలం భౌతిక వాదులు. 

ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే అంగీకరిస్తారు. కంటికి ఎదురుగా ఉండే వస్తువును ఎలా మనం ప్రత్యక్షంగా తెలుసుకుంటామో అట్టి ఇంద్రియ జ్ఞానాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా భావిస్తారు. దీన్ని ఆధారంగా చేసుకొని ఆకాశాన్ని ప్రత్యక్షంగా గ్రహించలేని కారణంగా ఆకాశాన్ని అంగీకరించరు. అలా అగ్ని, నీరు, వాయువు, పృథ్వి అనే నాల్గు మహా భూతాల నుండే, మనకు కన్పించే జగత్తు ఏర్పడుతుంది అని చెబుతారు. ఈ భూత చతుష్టయం యొక్క విశిష్ట కలయికవల్ల శరీరము, అందలి చైతన్యము పుడుతోంది అని అంటారు. చైతన్యం శరీర ధర్మమనీ ;  ఆకు వక్క సున్నము కలిపితే తాంబూలంలో ఎరుపు రంగు ఏర్పడిన విధంగా  ఈ చైతన్యం ఏర్పడుతుందంటారు.

జీవులన్నీ సర్వ స్వతంత్ర మైనవని , వాటిని నియంత్రించే వాడెవరో ఉన్నాడని అతని అనుగ్రహానికి కర్మలు ఆచరించటం మూర్ఖత్వం అని నమ్ముతారు. శరీరమే అన్నీ అంటూ , మరణించిన తర్వాత కర్మల ఫలాలను అనుభవించే ఆత్మ లేదు కాబట్టి, చైతన్యం కూడ మరణంతో శిధిలం అవుతుందని అంటారు. పునర్జన్మ లేదనీ, వేరే స్వర్గ నరకాలు కూడ లేవనీ ; ఇక్కడ శరీరంతో అనుభవించే సుఖదుఖాలే స్వర్గ నరకాలుగా భావిస్తారు. మరణానంతరం శరీరానికి కలిగే బంధ విముక్తే మోక్షంగా పరిగణిస్తారు.

దేహం ఉన్నంత వరకూ ఏదో విధంగా భోగ భాగ్యాలు సంపాదించి ఆనందించడమే పరమావధి తప్ప అంతకు మించి ఏదీ లేదని నమ్ముతారు. ఇలాంటి ఇంపైన మాటలు చెప్పేవారు అవడం వల్ల వీరిని 'చారు వాక్కులు' అంటారు. అదే చార్వాకులుగా రూపు దిద్దుకుందని కొందరి అభిప్రాయం. మనకు కన్పించే ఈ లోకం ఒక్కటే ఆయతనం (అంటే నివాస స్థానం ) అందు వల్ల వీరిని లోకాయతులు అని పిలువబడు చున్నారు.

No comments:

Post a Comment