సత్వగుణ
ప్రధానమైన అహంకారం నుంచి స్పర్శ, శబ్ద,రస ,రూప,గంధాలనే వాటిని గ్రహించే
అయిదు జ్ఞానేంద్రియాలు , వాక్, పాణి, పాద,పాయు, ఉపస్థ లనే అయిదు
కర్మేంద్రియాలూ, ఉభాయాత్మకమైన మనస్సు ఏర్పడతాయి. తమః ప్రధానమైన అహంకారం
నుంచి పంచ స్థూలభూతాలకూ కారణమైన సూక్ష్మ భూతాలు పుడతాయి. వీటినే
భూతతన్మాత్రలు అంటారు. వీటినుంచే స్థూలమహాభూతాలైన అగ్ని, నీరు, ఆకాశం,
వాయువు, పృథ్వి అనే అయిదూ ఏర్పడతాయి. ఇలా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ
కర్మేంద్రియాలు, పంచ భూతతన్మాత్రలు, పంచ మహాభూతములూ మనస్సు, బుద్ది,
మహత్తూ ప్రధానంతో కలసి మొత్తం ఇరవైనాలుగు తత్త్వాలను అంగీకరిస్తారు.
భూతజాలమంతా పంచ భూతాలనుంచి పుడుతుంది. ఇలా బ్రహ్మాండము, అందలి లోకాలు ,
వాటికి తగినట్లు అందలి విషయములు, ఆ విషయాలను అనుభవించడానికి తగిన శరీరాలనూ,
పంచీకరణం అనే ప్రక్రియ చేత సృష్టించ బడుచున్నాయి . ఇలా
ప్రధానమే తనలో ఉన్న సత్వరజస్తమో గుణాలను ఆలంబనంగా చేసుకొని సృష్టి
జరుపుతోంది.
బుద్ధికి పురుషుని చైతన్యం వల్లనే విచక్షణా జ్ఞానం కలుగు తోంది. ఇలా
చైతన్యవంతమైన బుద్ధి, అహంకార రూపంగా రూపు దిద్దుకొని నేను, నాది అనేది
ఏర్పడి అవిద్యకు కారణం అవుతుంది. అవిద్యచేత జీవుడు రాగ ద్వేషాలకు, సుఖ
దుఖాలకూ లోనవుతుంటాడు. ఇలా అవిద్యకు లోనైన జీవుడు కర్మలచేత , జనన మరణాల
సంసారమనే చక్రంలో బంధింపబడి తిరుగుతూ ఉంటాడు. ఇలా, ప్రకృతివిషయాలతో
తాదాత్మ్యం చెందటం వల్ల అవిద్యచేత కప్పబడినవాడై ప్రకృతి, పురుషుల వివక్షత
కోల్పోవడం జరుగుతుంది.
సాంఖ్యులు
అంగీకరించే ఇరవైనాలుగు తత్వాలనూ అవగాహన చేసుకుని , తనను ప్రకృతి తత్వాల
నుండి వేరుచేసు కోగల్గితే , విచక్షణా జ్ఞానం కల్గి ప్రకృతికంటే తాను
భిన్నుడని తెలుస్తుంది. ప్రకృతి యొక్క సంబంధం తొలగడమే విముక్తి చెందటం.
ప్రకృతి సంయోగం బంధమైతే, దాని నుంచి విముక్తి పొందటమే మోక్షం లేక కైవల్యం. ప్రతి జీవునిలోను పురుషుడు నిక్షిప్తమై ఉన్నాడు. ఆ ఉన్నత
పురుషుని స్వభావం; జాగరూకత /ఎరుకతో చూడగలిగితే బంధం తొలగి సత్యం అవగతం
అవుతుంది.
సాంఖ్యులు
ద్వైతులు. దైవాన్ని అంగీకరించరు. పునర్జన్మలుంటాయి. వీరి కార్య కారణ
సిద్ధాంతాన్ని - సత్కార్య వాదం అంటారు. వీరు ప్రాణం ఇంద్రియాల రూపాంతరం
వల్ల కలుగుతుందంటారు. కాని వేదాంతంలో వేరే ప్రాణ తత్వం ఉన్నట్లు చెబుతారు.
వీరు దాన్ని అంగీకరించరు.
సాంఖ్యులు
చెప్పేదేమంటే - బాధలుంటే మోక్షానికి కావలసిన సాధనలు చెయ్యలేం. వీరి
ప్రకారం ఆధ్యాత్మిక, అధిదైవిక, ఆదిభౌతికములని మూడు రకాలైన బాధలను
నివారిస్తే , దుఃఖం తొలగిపోతుందని చెబుతారు. అంచేత వీరు చెప్పే ఇరవై
నాలుగు ప్రకృతి తత్వాలనూ తెలిసికోడం వల్ల ఈ మూడు రకాలైన బాధలూ తొలగి మోక్షం
పొందవచ్చు. వీరు జీవన్ముక్తినీ, విదేహముక్తినీకూడా అంగీకరిస్తారు. జీవుడు
శరీరం ఉండగానే జీవన్ముక్తి వచ్చి, ఇంకా కొన్ని దినాలు ప్రారబ్ద కర్మ
పూర్తియ్యేదాక శరీరంతో ఉంటాడు. శరీర పతనానంతరం విదేహముక్తిని పొందుతాడని
నమ్ముతారు.
No comments:
Post a Comment