Wednesday, June 13, 2012

యోగదర్శనం (2) – ఆస్తిక దర్శనం


ఈ చిత్త వృత్తులే - నేను, నాది అనే అహంకారంగా  అవిద్యవల్ల ఏర్పడి ; పురుషునికి క్లేశాలను కల్గించి దుఖానికి కారణం అవుతాయి.  చిత్తవృత్తులను పూర్తిగా అరికట్టడమే యోగం. ఈ వృత్తులన్నిటినీ  అభ్యాస , వైరాగ్యాల ద్వారా నిరోధించ వచ్చును.

ప్రకృతిలో మనకు కన్పించే జ్ఞాన శక్తి అంతా ప్రకృతి యందు పురుషుని ప్రతిబింబమే. ప్రకృతి జడము, అచేతనము.  మనస్సు కూడా అలాంటి ప్రకృతిలోదే. సంకల్పం మొదలుకొని అత్యంత స్థూల భూతాల వరకు అంతా ప్రకృతి లోనివే . అంటే ప్రకృతి వ్యక్తీకరణాలే.  సాంఖ్యులు చెప్పే ఇరవైనాల్గు తత్వాలూ జడప్రకృతి తత్వాలే. ప్రకృతి పురుషుని ఆవరించి ఉంది. పురుషుడు నిత్యుడు. జ్ఞానమే శక్తి. మనం ఒక విషయాన్ని గ్రహించడం మొదలు పెడితే , అది మనకు వశమవుతూ ఉంటుంది. అలా ప్రకృతి తత్వాలను చిత్తంలో గ్రహిస్తుంటే అవి చిత్తానికి వశం అవుతుంటాయి. ప్రకృతి తత్వాలనుధ్యానించటం అంటే ప్రకృతి శక్తులను / రహస్యాలను వశం చేసుకోడానికి విచారణ చెయ్యడం అని చెప్పవచ్చు. 
 సమాధిని పొందిన వ్యక్తికి , ఇంకా సూక్ష్మ శరీర భావన ఉంటుంది. ముక్తిని పొందకుండా లయమయ్యే విదేహులను , ప్రకృతి లయులు అంటారు.
గమ్యంవేపు సాధన సాగించే యోగులు , ముక్తులవుతారు. 

సంప్రజ్ఞాత సమాధిలో నేనుఅనే జ్ఞానం భాసిస్తూ ఉంటుంది. చిత్త వృత్తులు ఇంకా సంస్కార రూపంలో నిలిచి ఉంటాయి. వీటి బీజాలు సరైన సమయం రాగానే వృత్తి  రూపంలో అంకురిస్తాయి. వీటిని కూడ నాశనం చేస్తేనే నిర్బీజ సమాధి సిద్ధిస్తుంది. దాంతో జనన మరణ రూపమైన సంసారం నశిస్తుంది.
ఇదే అతీంద్రియ జ్ఞానావస్థ- అసంప్రజ్ఞాత సమాధి. అపుడు సర్వ వ్యాప్తము, ద్వందాతీతము , స్వయంప్రకాశము అయిన ప్రత్యగాత్మ శేషిస్తుంది .దానితో యోగి తను జన్మ మరణ రహితుడననీ, కేవలం ప్రకృతే వికారం చెందుతోందనీ ఆ వికారమే పురుషునిలో ప్రతిబింబం చెందుతోందని తెలుసు కుంటాడు. వివిధ రూపాలు పొందుతూ చిత్తం చలిస్తుంటే , ఆ రూపాలన్నీ మనమే ఆనుకొని భ్రమ చెందుతాం. అతీంద్రియ జ్ఞానం కలగగానే , ఈ భ్రమలన్నీ తొలగిపోతాయి.

కొంతమంది పరిపూర్ణులైనపురుషులు ఉన్నారు. కాని సిద్ధులను పూర్తిగా వదలక పోవడంవల్ల పరమావధిని పొందక, ప్రకృతితో లయించి కొంత కాలం ఉంటారు. వీరే ప్రకృతికి అధిపతులై దేవతలుగా ఉంటారు. వేదాలలో చెప్పే పరమాత్మ ఇలాంటి వారిలో ఒకడు.  అంతేకాని స్వతంత్రుడు, శాశ్వతుడు అయిన సృష్టికర్త మరొకడు లేడని వాదిస్తారు సాంఖ్యులు. పంచభూతాలను,ఇంద్రియాలు అనే వికృతి తత్వాలను; అవ్యక్తము, మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలు అనే ప్రకృతి తత్వాలను ఆత్మ భావంతో ధ్యానించడం వల్ల జీవులు దేవతా పదవులను ఆక్రమించే వారవుతారు. వీరిలో ఎవరూ పరిపూర్ణులు గాని , ముక్తులు గాని కాదు.  సరైన తత్వ విచారణ వల్ల సమాధి స్థితి కల్గుతుంది.

పురుషులు అంటే వ్యక్తిగతమైన ఆత్మలు. ఆత్మలు అనేకం ఉంటాయి. ఈశ్వరుడు పురుష విశేషుడు . సర్వజ్ఞుడు, సర్వవ్యాపి. ప్రకృతి వికారాలచేత అంటబడని వాడు. సర్వ స్వతంత్రుడు.  'ఓం'- అనే 
ప్రణవం చేత తెలియబడేవాడు. పతంజల యోగం సాంఖ్యంపై ఆధారపడి ఉంది. భగవంతుని సృష్ట్యాది ధర్మాలను అంతగా చెప్పరు. కాని శృతి ప్రమాణ రీత్యా ఈశ్వరుడే జగద్కర్త. విశ్వంలో ఏకత్వం ఉండటంవల్ల ఒకే సంకల్ప శక్తి జగత్తును సృష్టించిందని అంటారు. యోగులు పురుషులందరి కన్నావిలక్షణమైన పురుషుడు ఉన్నాడని, అతడే సృష్టికర్త  , సదా ముక్తుడు, గురువులందరికీ గురువు అని చెబుతారు. వీరు సాంఖ్యులు చెప్పే ప్రకృతి లయులను కూడా అంగీకరిస్తారు. శృతి ప్రమాణం చేత ఈశ్వరుడే సృష్టికర్తగా భావిస్తారు. ఇతరులలో బీజమాత్రంగా ఉండే సర్వజ్ఞత్వం , ఈశ్వరునిలో అనంతంగా ఉంటుందని చెబుతారు.ఈ అనంత జ్ఞానాన్నే యోగులు ఈశ్వరుడంటారు. అతడే త్రికాలాతీతుడవటం చేత పరమ గురువుగా చెబుతారు.

చిత్త చాంచల్యం అరికట్టడానికి మనసును ఒకే విషయం మీద నిలిపి ఏకాగ్రత పొందేలా చెయ్యాలి. 
ఇలా ఏకాగ్రమైన మనస్సు ఇతర సంస్కారాల నన్నిటినీ నిరోధించడంచేత అవాక్మానస గోచరమైన అఖండ సచ్చిదానంద స్థితి కల్గుతుంది. ఇతర సంస్కారాల నన్నిటినీ నిరోధించే ఈ సంస్కారాన్ని కూడ నిరోధిస్తే , అన్నీ నిరోధించబడి నిర్బీజ సమాధి ఏర్పడుతుంది. అపుడు మరణరహితము, నిర్వికారము, అద్వితీయము , స్వయంజ్యోతి అయిన పురుషుడు ప్రకాశించటాన్ని దర్శిస్తాం. ఇదే మన పరమావధి.

మనం ప్రకృతి, మనస్సు, శరీరాలతో ఏకత్వం చెందటం వల్ల పురుషుడిని చూడలేకున్నాం. ఈ ఏకత్వాన్ని కల్గించేవి వివిధ చిత్త వృత్తులే. చిత్త వృత్తుల ఆవరణం చేత పురుషుని ప్రతిబింబం చాయా మాత్రంగా కనబడుతుంది. ఈ వృత్తులు ఆవరించి ఉన్నంత కాలము పురుషుడిని దర్శించ లేము. 
ప్రకృతి తత్వాలను సరిగ్గా అవగాహన చేసుకొని , అవిద్య తొలగించుకొంటే మనకు ప్రకృతికి ఏర్పడిన బంధం తొలగి జీవుడు కైవల్యాన్ని పొందుతాడు.  మనసును ఏకాగ్రం చేయడం వల్ల ఒక విషయం మీద మాత్రమే చిత్తం నిలుస్తుంది. అపుడు ఆఒక వృత్తిని నిరోధించటం సులభమై నిర్బీజ సమాధి కల్గుతుంది.




No comments:

Post a Comment