Friday, June 1, 2012

మానవ ధర్మము - మతము.

ధర్మం అనేది మానవ కుటుంబంలోను, సంఘంలోను, దేశంలోను, మతమందు ఇతరులతో ఉండే సంబంధాన్ని చక్కదిద్దేది . మానవుని ధర్మాచరణ తన బుధ్ధి మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి  మానవుడూ తన జీవనవిధానంలో కొన్ని నైతిక విలువలను ఆచరించవలసి ఉంటుంది. వాటిని పురుషార్ధములు అని అంటారు. అవి ధర్మము, అర్ధము ,కామము, మోక్షము అనే నాలుగూను.

ధర్మం అంటే వేదంలో చెప్పబడిన యజ్ఞయాగాదులు. మనస్సుతోను, వాక్కుతోను , శరీరంతోను శాస్త్రంలో విధించబడిన  కర్మలను చేస్తూ, చెయ్యకూడని కర్మల జోలికి పోకుండా ఉండటం వల్ల సుఖం కల్గుతుంది. ఈ ధర్మాన్ని ఆధారంగా చేసుకునే సకల ప్రపంచమూ నడుస్తోంది. అంటే ఇతరులకు హాని జరగకుండా మనం ప్రవర్తించాలి.

అర్ధము అంటే ధన ధాన్య వస్తు వాహనాలు మొదలైనవి. ఈ ధనాన్ని సంపాదించాలంటే ధర్మానికి లోబడి సంపాదించాలి. అంటే న్యాయ మార్గంలో సంపాదించాలి. అలా సంపాదించిన దానిలో కొంత భాగాన్ని శాస్త్రంలో చెప్పబడినట్లుగా దాన,ధర్మాలకు వినియోగించి , మిగిలిన దాన్ని భార్యా పుత్రులతో ధర్మానికి లోబడి అనుభవించాలి. ఇక మూడవదైన కామం కూడ, ధర్మానికి విరుద్ధం గాని కామాన్ని అనుభవిస్తూ జీవించాలి.( పుట్టిన ప్రతీ వాడూ మూడు రుణాలతో పుట్టడం జరుగుతుంది. వేదాలను చదవటం వల్ల ఋషుల రుణమూ, యజ్ఞయాగాదులు చెయ్యడం వల్ల దేవతల రుణమూ , సంతానాన్ని పొందటం వల్ల పిత్రు దేవతల రుణమూ తీరుతాయని శాస్త్రం). అందుచేత కామం కూడ ఒక పురుషార్ధంగా పరిగణించడం జరిగింది.

ఇక్కడ చెప్పిన ధర్మ, అర్ధ, కామములనే మూడూ ఆనందాన్ని కలుగ జేస్తాయి. కాని అవి శాశ్వతం కాదు. ఇచ్చట చెప్పిన ధర్మం ఎందుకు శాశ్వతం కాదు అంటే - వాటివల్ల కల్గే సుఖాలు శాశ్వతాలు కాదు కాబట్టి. ఇలా ధర్మార్ధకామాలను అనుభవిస్తూ పవిత్రమైన జీవనాన్ని గడిపే వానికి నాల్గవదైన పురుషార్ధం -' మోక్షం' అప్రయత్నంగా లభిస్తుందని విజ్ఞులు చెబుతారు. మోక్షం పొందితే సంసారంలో తిరుగాడే చావుపుట్టుకలనే బంధంనుంచి విడుదల అవుతారు. అంచేత దీన్ని పరమ పురుషార్ధంగా చెబుతారు. దీన్ని చెప్పడానికే వేదాన్తమంతా అనేక శాఖలుగా విస్తరించింది.

ఇలాంటి జీవన విధానాన్ని బోధించేది మతం. భగవంతుడనే వాడున్నాడనీ, జీవరాసులన్నీ ఆయన బిడ్దలనీ, ఆయన ప్రేమమయుడనీ మనం ఆయన్ని ఆరాధించాలనీ, చివరకు అంతా ఆయన గృహానికే పోవాలనే విషయంలో  అన్ని మతాలకూ అభిప్రాయ భేదం లేదు. భగవంతుడు ఒక్కడే అయినా, వేర్వేరు మత ధర్మాలను బట్టి, వారి వారి అభిరుచులను బట్టి అనేకమైన పేరులతో పిలుస్తుంటారు. ప్రతీ మతానికీ ఒక ప్రవక్త గాని, వారిది అని చెప్పుకునే పవిత్ర గ్రంధామో ఉన్నాయి.

కాని హిందూ మతంలో అలాంటి ఒక ప్రవక్త గాని, ఫలానాదే వాళ్ళ గ్రంథమని గాని చెప్పలేం. అందుచేత పండితులు వేదాన్ని ప్రమాణంగా అంగీకరించారు. వేదం అపౌరుషేయం. అంటే మానవ మాత్రులేవరో చెప్పినది కాదు. ప్రాచీన ఋషులు సమాధినిష్ఠలో వారు ప్రత్యక్షంగా సాక్షాత్కరించుకున్న సత్యాలను గ్రహించి, వాటిని శృతి రూపంగా (వాక్కు ద్వారా) తర్వాతి తరాల వారికి అంద జేశారు. అనాదిగా ఇది కొనసాగుతూ వస్తుండటం వల్ల దీనికి సనాతన ధర్మమనీ, వైదిక ధర్మమనీ అంటాం.

                     

No comments:

Post a Comment