Monday, June 4, 2012

జైన దర్శనం - నాస్తిక దర్శనం


జైనదర్శనానికి వ్యవస్థాపకుడు రిషభ దేవుడు. జైనులు ప్రత్యక్షప్రమాణంతోబాటు అనుమాన , శబ్ద ప్రమాణాలను అంగీకరిస్తారు. దూరంగా కన్పించే పొగనుచూచి,  అక్కడ అగ్నిఉందని ఊహించడం లాగ, ఒక కారణాన్నిబట్టి మరొక వస్తువును ఊహించడాన్ని అనుమానప్రమాణం అంటాం. ఆప్తులు చెప్పిన మాటలను శబ్దప్రమాణంగా పరిగణిస్తాం. మహిమాన్వితులైన తీర్థా౦కరుల ఉపదేశాలు శబ్ద ప్రమాణంలోకి  వస్తాయి. ప్రయత్నంతో తీవ్రమైన తపస్సు, ధ్యానముచేసి, సుఖదుఃఖాలను, రాగ ద్వేషాలను జయించి, ప్రశాంతచిత్తంతో తమ ఆత్మగమ్యాన్నిచేరిన వారిని  తీర్థా౦కరులని అంటారు. వీరిని, మానవరూపంలో ఉన్న భగవంతునిగా భావించి  దైవశక్తులు ఉన్నట్లుగా పూజిస్తారు. మహావీరుడు జైనధర్మంలో ఇరువది నాల్గవ తీర్థా౦కరుడు .

వీరు దైవాన్ని  అంగీకరించరు. పంచమహాభూతాలతోబాటు కాలము, ధర్మము, అధర్మము అనే తత్వాలను కూడా అంగీకరిస్తారు. చలనానికి ఉపకరించేది ధర్మము, స్థితికి ఉపకరించేది అధర్మంగాను పరిగణిస్తారు. ఎన్నిశరీరాలుంటే అన్నిజీవాత్మలు ఉన్నాయని చెబుతారు. వివిధజీవుల్లో వాటికుండే జ్ఞానేంద్రియాలనుబట్టి జ్ఞానంలో తేడాలు ఉంటాయని చెబుతారు. తరులతాదులలో ఒక జ్ఞానేంద్రియం ఉంటే,  జీవుల పరిణామక్రమంలో కొన్నిటికి రెండు జ్ఞానేంద్రియాలు , కొన్నిటికి మూడు,  కొన్నిటికి నాల్గు, మరికొన్నిటికి అయిదు జ్ఞానేంద్రియాలు ఉంటాయి. 

అన్నిజీవులకూ ఆనందము, సర్వజ్ఞత్వము పొందటానికి సామర్ధ్యం ఉంటుందని నమ్ముతారు. కాని ఆ సామర్ధ్యం కర్మబంధంచేత ఆవరించబడి ఉంటుంది. చేసే కర్మలవల్ల జీవులకు అచేతన పదార్థంతో సంబంధం ఏర్పడి, తమ సహజమైన సర్వజ్ఞత్వం మరుగున పడిపోవడం జరుగుతుంది. ఏజీవి అయినా స్వప్రయత్నంచేత, ఈ కర్మబంధాన్ని తొలగించుకొని తమ సహజత్వాన్ని పొందగల్గుతుంది.

 కర్మబంధాన్ని  సమ్యగ్ దర్శనం, సమ్యగ్ జ్ఞానం , సమ్యగ్ చరిత్రం అనే రత్నత్రయం ద్వారా తొలగించుకోవచ్చునని  అంటారు. తీర్థా౦కరుల ఉపదేశాలపై విశ్వాసం కలిగి ఉండటాన్ని సమ్యగ్ దర్శనం అంటారు. ఈ సమ్యగ్ దర్శనంచేత క్రమంగా  అజ్ఞానంపోగా కలిగే తత్వజ్ఞానానికి,  సమ్యగ్ జ్ఞానం అని పేరు. వీటితోబాటు  సత్యము, అహింస, అస్తేయము, బ్రహ్మచర్యము, వైరాగ్యము కలిపి సమ్యగ్ చరిత్ర  అనే అయిదు సదాచారాలను ఆచరిస్తే క్రమంగా క్రోధం, మానం, లోభం, మాయ అనే వికారాలు నశించి కర్మబంధం తొలగడానికి వీలవుతుంది. అపుడు తమ సహజమైన సర్వజ్ఞత్వము, సర్వ శక్తిమంతత్వమూ పొందుతారు. దీన్నే వీరు మోక్షం అని పిలుస్తారు.

 ఎలాంటి చిన్న జీవులనైనా దయతో చూడాలనేది వీరిసిద్ధాంతం. పరమత సహనానికి వీరు పెట్టింది పేరు. దీనికి వీరి స్యాద్వాదం ఎంతో ఉపకరించింది. ఒక సమయంలో కొన్ని పరిస్థితులలో ఒక వస్తువును ఒకదృష్టి కోణంతోచూస్తే ఒకవిధంగాను, అదేవస్తువు మరొక సమయంలో వేరేపరిస్థితులలో వేరే దృష్టికోణంతోచూస్తే మరొక విధంగాను కనపడవచ్చు. ఈ సత్యాన్నిబట్టి జైనులు సప్తభంగీనయం అనే స్యాద్వాదాన్ని అంగీకరించారు. వీరు పునర్జన్మలను, పాపపుణ్యాలను, స్వర్గనరకాలను అంగీకరిస్తారు. కాలక్రమేణా భగవాన్ మహావీరుని మరణంతర్వాత జైనధర్మం దిగంబరులనీ, స్వేతాంబరులనీ రెండుశాఖలుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.

సప్తభంగీనయం

స్యాదస్తి - అంటే, ఉండవచ్చును. స్యాన్నాస్తి  అంటే లేకపోవచ్చును. స్యాదస్తిచ నాస్తిచ అంటే ఉండవచ్చును , లేకపోవచ్చును కూడా . స్యాదవక్తవ్యం అంటే వర్ణించ శక్యంగాక పోవచ్చును.  స్యాదస్తిచ  అవ్యక్తవ్యంచ  అంటే ఉండవచ్చును, వర్ణించ శక్యంగాకపోవచ్చును. స్యాన్నాస్తిచ అవ్యక్తవ్యంచ  అంటే   లేకపోవచ్చును , వర్ణించ శక్యంగాక పోవచ్చును. స్యాదస్తిచ, నాస్తిచ,అవ్యక్తవ్యచ అంటే  ఉండవచ్చును , లేకపోవచ్చును,  వర్ణించ శక్యంగాక పోవచ్చును. 

No comments:

Post a Comment